Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉస్మానియా దావఖాన! హైదరాబాద్ తెలంగాణలకే కాదు, భారతదేశానికే గర్వించదగ్గ చరిత్ర గలది. గత కొన్ని సంవత్సరాలుగా (2015 నుంచి) దీనిపైన ఎంతో చర్చ జరుగుతోంది. ఉస్మానియా దావఖాన పాత భవనాన్ని కుల్చాలా, వద్దా అని. కానీ అసలు చర్చ జరగాల్సినది దవాఖానా విస్తరణ, ప్రజలకు మరింత ఎక్కువగా వైద్యసేవలు ఎలా అందించాలి? అనే దానిపైన. ''పడగొట్టి సర్వహంగులతో బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తాం. తెలంగాణ ప్రజానీకానికి అత్యద్భుతమైన వైద్య సేవలందిస్తాం'' అని ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. ప్రకటించారు. వివిధ ప్రజా సంఘాలు, పౌర సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆందోళన చేస్తున్నాయి. బహుశా ఆ ఒత్తిడి కారణంగా ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. ఈ మొత్తం కేవలం పురాతన భవనాన్ని కాపాడుకోవటం లేదా పడగొట్టడం గురించేకాదు. వారసత్వ సంపద అంటే కేవలం భవనం, దాని నిర్మాణం, నిర్మాణ విశిష్టత మాత్రమే కాదు. ఇక్కడ ఆలోచించాల్సిన ప్రధాన విషయం ఉస్మానియా దవఖాన చరిత్ర గురించి, దాని విశిష్టత గురించి.
హైదరాబాద్ నిజాం సంస్థానంలో 1886లో నిర్మించబడిన అఫ్జల్గంజి దవాఖాన చాలా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ వైద్య చరిత్రలో ఎన్నో ఆవిష్కరణలకు జన్మనిచ్చింది. మలేరియా వ్యాధిపైన పరిశోధనలు చేసి నోబెల్ ప్రైజ్ విజేతగా నిలిచిన సర్ రోనాల్డ్ రాస్ 1897లో తన కీలకమైన పరిశోధనలు ఇక్కడే చేశాడు. దీనికి అనుబంధంగా హైదరాబాద్ మెడికల్ స్కూల్ ఉండేది.
తదుపరి కాలంలో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, ఆ రోజుల్లోనే రెండు లక్షల రూపాయల వ్యయంతో ఈ (హెరిటేజ్) భవనాన్ని నిర్మించాడు. ఆయన పేరుమీద దీనికి ఉస్మానియా దవాఖానాగా నామకరణం చేసి 1925లో అఫ్జల్గంజి దవాఖానాను ఈ భవనంలోకి మార్చారు. హైదరాబాద్ మెడికల్ స్కూల్‌ని కూడా ఉస్మానియా మెడికల్ కాలేజీగా పేరు మార్చి దీనికి అనుబంధంగా కొనసాగించారు. ఆనాటి ఈ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న సర్జన్ - మేజర్, డాక్టర్ ఎడ్వర్డ్ లారీ ఈ వైద్య కళాశాలలోనే అనేక పరిశోధనల అనంతరం క్లోరోఫామ్‌ను ఆపరేషన్లలో అనెస్థీషియాగా వాడొచ్చని కనుగొన్నాడు. తద్వారా ప్రపంచ వైద్య చరిత్రలో ''అనస్థీషియా'' అనే ఒక కొత్త విభాగానికి ఆవిష్కరణ జరిగింది. 1889లో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్లలో మహిళలకు వైద్య విద్యలో ప్రవేశం లేని రోజుల్లోనే, ప్రపంచంలో మొట్టమొదటి మహిళా అనస్థెటిస్ట్, డాక్టర్ రూపాబాయి ఫర్దోంజిని వైద్య రంగానికి అందించిన ఘనత మన ఉస్మానియా వైద్య కళాశాల (హైదరాబాద్ మెడికల్ స్కూల్)ది. ఇంతటి ఘన చరిత్ర /చారిత్రిక వారసత్వం యొక్క అనుభవాలు స్మృతులు ఆ భవనంలో దాగి ఉన్నాయి వాటిని కూల్చేయడం అంటే మన చరిత్ర మనమే చెరిపేసుకోవడం అవుతుంది. ఈరోజు ఉస్మానియా దావఖానాలో పనిచేస్తున్న సిబ్బందికి, మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు, విద్యార్థినీలకు ఈ విషయాలు ఎంతో స్ఫూర్తినిస్తాయి. తమ వృత్తి పట్ల గౌరవాన్ని, బాధ్యతని పెంచుతాయి. మరింత అంకితభావంతో వైద్యసేవలు అందించాలనే ఆలోచనలను కలిగిస్తాయి.
పురాతన భవనం పటిష్టతకు సంబంధించి, జెఎన్టీయూ బృందం, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, హడావిడిగా తయారు చేసిన నివేదిక సరిగాలేదని, ఆ భవనం దృఢంగా ఉందని, అక్కడ పనిచేసే సిబ్బందికిగాని, పేషెంట్లకు గాని ప్రమాద కారకంగా లేదని, కొన్ని మరమ్మతులు చేసుకుని సరైన పర్యవేక్షణ ఉన్నట్లయితే ఇంకా చాలా సంవత్సరాలు దానిని ఉపయోగించవచ్చని నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఐ.ఎన్.టి .సి. హెచ్) అనే స్వచ్ఛంద సంస్థ సాంకేతిక బృందం అధ్యయనంలో వెల్లడైంది అని ఆ సంస్థ హైదరాబాద్ శాఖ కన్వీనర్ అనురాధ రెడ్డి తెలిపారు. అవసరమైన మరమ్మతుల తర్వాత ఆ భవనాన్ని ఒక వైద్య మ్యూజియంగానో, ఒక రీసెర్చ్ సెంటర్గానో, ఒక గొప్ప వైద్య గ్రంథాలయంగానో అభివృద్ధి చేసి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవవచ్చు. ఇక వర్తమానానికి వస్తే, ఈ దవాఖాన ఒక్క తెలంగాణకే కాక, ఇరుగు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర ప్రజానీకానికి కూడా సేవలందిస్తోంది. సగటున సంవత్సరానికి 8లక్షల మందికి ఔట్ పేషెంట్ సేవలు అందిస్తోంది. గత సంవత్సరం కరోనా సేవలకు అదనంగా రెండు లక్షల మంది అవుట్ పేషెంట్లు, 42,663 మంది ఇన్ పేషెంట్లకు సేవలందించింది. 44,705 శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రతి నెల సగటున 150 మేజర్ సర్జరీలు ఇక్కడ జరుగుతున్నాయి.
ఉస్మానియా దవాఖాన సేవలను మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కరోనా మహమ్మారి అనుభవం తర్వాత ఇది మరింత పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల మీద కేంద్రీకరించాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు ప్రభుత్వ ప్రకటనలు తెలుపుతున్నాయి. ప్రకటనలకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్యాచరణ మొదలుపెట్టాలి. మొత్తం 26.5ఎకరాల విస్తీర్ణం గల ఉస్మానియా దవాఖాన ప్రాంగణంలో ఇంకా ఆరు నుంచి ఏడు ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. కనుక కొత్త భవనాలు ఎక్కడ కట్టాలి అనే సమస్య ఉత్పన్నం కాదు. కావాల్సిందల్లా ప్రభుత్వ చిత్తశుద్ధి. పురాతన భవనాన్ని వారసత్వ సంపదగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్మానం చేయాలి. పక్కనే ఉన్న ఖాళీస్థలంలో కొత్తభవనాల నిర్మాణం మొదలుపెట్టాలి. ఆ వైపుగా తెలంగాణ సర్కారు ఆలోచనలు, ఆచరణ ఉంటాయని ఆశిద్దాం.
- యం.రాధేశ్యామ్త
సెల్:9490098688