Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రి సమీక్షలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు, మరింత నిర్ధిష్ట ప్రతిపాదనలు పంపినట్టయితే మరోసారి కాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆర్టీసీ చార్జీలు పెంచడం ఖాయమైనట్టు కనపడుతున్నది. ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యకు చార్జీల పెంపుదలే నిజమైన పరిష్కారమా? ఇప్పుడున్న పరిస్థితులలో చార్జీలు పెంచితే జరగబోయే పరిణామాలు ఏమిటి? అనే అంశాల గురించి అందరూ ఆలోచించాలి.
గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీని పరిరక్షించాలంటూ కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలలో కొన్ని మార్పులు కూడా ఆ పోరాటాలు సాధించాయి. అయినా నష్టాల పేరుతో ఆర్టీసీని నిర్వీర్యం చేసే పని నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. ఇందుకు ఏ పాలక పార్టీ మినహాయింపు కాదు. ఆర్టీసీని ప్రజా రవాణా సంస్థగా చూసి, ఆర్థికంగా వెసులుబాటు కల్పించాల్సిన ప్రభుత్వాలు దానిని నష్టాల ప్రాతిపదికన చూస్తుండటమే ప్రధానమైన సమస్యగా ఉంది. ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని, వాటిని అధిగమించాలంటే టిక్కెట్టు చార్జీలు పెంచాలం టున్నారు. సాధారణంగానే ఆర్టీసీల నిర్వహణ ఖర్చుకు వస్తున్న ఆదాయానికి మధ్య వ్యత్యాసం పెరుగుతూ వస్తున్నది. ఆ పరిస్థితికి తోడు 'కరోనా' మహమ్మారి తోడయింది. మునుపెన్నడూ చూడని విధంగా మనమంతా లాక్డౌన్లను చూశాం. ఈ కరోనా పరిస్థితి వల్లనే 2019-2020, 2020-21 ఆర్థిక సంవత్సరాలలో సుమారు 2,200 కోట్లు టీఎస్ ఆర్టీసీకి నష్టం వచ్చిందని యాజమాన్యం ప్రకటించింది. కరోనా పరిస్థితులు, లాక్డౌన్లు ప్రయాణికుల భయం వల్ల పడిపోయిన ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతూ నేటికి 58శాతానికి చేరింది. గత సంవత్సరాల ఆక్యుపెన్సీ రేషియో 70శాతం కంటే 12శాతం వెనుకపడి ఉంది. అది పెంచుకోగలిగితే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది.
ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెంచితే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా? పెంచిన టిక్కెట్టు చార్జీల వల్ల వచ్చిన ఆదాయం కంటే, చార్జీలు పెరగడం వల్ల ఆర్టీసీకి దూరమయ్యే ప్రయాణీకుల వల్ల కోల్పోయే ఆదాయమే ఎక్కువగా ఉందని గత అనుభవాలన్నీ తెలియజేస్తున్నాయి. మరి ఇప్పుడు అది పునరావృతం కాదన్న భరోసా ఏదైనా ఉందా? లేదు. అందుకని ఆర్టీసీని లాభనష్టాల ప్రాతిపదికన కాకుండా సామాజిక సంస్థగా చూసి, ఆర్థిక సహాయం అందించకుండా చార్జీల పెంపుతోనే పరిష్కారం దొరుకుతుందని భావించడం పొరపాటే అవుతుంది.
కోవిడ్ వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి?
భారతదేశంలో కరోనా పరిస్థితుల వల్ల భారతదేశంలో బస్ ఆపరేషన్స్ ప్రభావంపైన వరల్డ్ బ్యాంక్, రవాణా రంగంలో అంతర్జాతీయంగా పనిచేస్తున్న యుఐటిపి కలిసి చేసిన అధ్యయనం 2020 మే 27న ప్రచురించారు. మొత్తం 27 బస్ ఆపరేటింగ్ సంస్థలను ఆధ్యయనం చేశారు.
ప్రభుత్వాల కోర్కె మేరకు వైద్య, అత్యవసర సర్వీసులలో మాత్రమే సేవలందించామని 67శాతం మంది ఆపరేటర్స్ చెప్పారు. కరోనా ముందున్న ప్రయాణీకులలో 90శాతం కోల్పోయామని, 81శాతం ఆపరేటర్స్‌కు అసలు ప్రయాణీకులే లేరని చెప్పారు. కరోనా కంటే ముందున్న పరిస్థితులలో కేవలం 50శాతం మాత్రమే పునరుద్ధరించబడుతుందని 60శాతం మంది ఆపరేటర్స్ తెలిపారని, 12శాతం మంది ఆపరేటర్స్ మాత్రం 75శాతం నుండి 100శాతం వరకు చేరవచ్చునని, పూర్తిస్థాయికి చేరుతుందని కేవలం 4శాతం ఆపరేటర్స్ మాత్రమే చెప్పారని ఆ వరల్డ్ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిస్థితి ఇప్పుడు టీఎస్ఆర్టీసీలో కూడా స్పష్టం అవుతూనే ఉంది. అందుకని ఇప్పుడు ప్రయాణీకు లకు నమ్మకం కలిగించడం, ఆర్టీసీ బస్లలోకి ఎక్కేలా చూడటం ప్రధానమైన అంశంగా అర్థం అవుతుంది. టికెట్ చార్జీలు పెంచితే ఆ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది.
చార్జీలు పెంచితే ప్రజలు భరించగలరా?
కరోనా మహమ్మారి వల్ల భారతదేశంలోని ఆర్టీసీలకే కాకుండా ప్రపంచంలోని ఆర్టీసీలన్ని కూడా ప్రయాణీకులు లేక / రాక తీవ్రమైన నష్టాలకు గురై బలహీనపడ్డాయి. బస్ రవాణా (ఆర్టీసీలో) బలహీనపడటం అనేది ప్రజలపైన హానికరమైన ప్రభావం చూపుతుంది. కరోనాతో ఆర్థికంగా కుదేలైన కుటుంబాలు ఇప్పుడు బస్ చార్జీలు పెంచితే వారు భరించగలరా అనేది కూడా ఆలోచించాలి. 'సెంటర్ ఫర్ సైన్స్ Ê పర్యావరణం' అనే సంస్థ ఢిల్లీలోని ప్రజల పరిస్థితిని స్టడీ చేసిన నివేదిక ప్రకారం ఆర్టీసీ ల కనీస మొత్తం టిక్కెట్టు చార్జీలను కూడా ప్రజలు భరించగలిగే స్థితిలో లేరని తేల్చిందని 'డౌన్ టు ఎర్త్' వెబ్సైట్ ఆర్టికల్‌లో ప్రచురించింది. ఈ పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం కూడా మినహాయింపు కాదు.
ప్రపంచ అనుభవం ఏమిటి?
ప్రపంచంలోని అనేక దేశాలు ప్రజా రవాణా సంస్థలకు 'బెయిలవుట్' ప్యాకేజిలను అందించాయి. అనేక దేశాలు ఉచిత బస్ ప్రయాణాన్ని అనుమతించి ప్రజలలో నమ్మకం పెంచే ప్రయత్నం చేశాయి. ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, హాంగ్‌కాంగ్, న్యూజిలాండ్, అజర్బైజాన్ వంటి దేశాలు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రజా రవాణా సంస్థలను ఆదుకొనే కృషి చేశాయి. చైనా, సింగపూర్, కజికిస్తాన్, టర్కీ వంటి దేశాలు పన్ను రాయితీలు, ఇతర రాయితీలు కల్పించి ప్రజా రవాణా సంస్థలను ఆదుకున్నాయి. 'ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్' అనేది లండన్‌లో ప్రభుత్వ నిర్వహణలతో పనిచేస్తున్న సంస్థ. మార్చి 2020 నుండి డిసెంబర్ 2021 వరకు వర్తించేలా మూడు ఆర్థిక ప్యాకేజీల ద్వారా 4 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు 36,000 కోట్లు) బెయిలవుట్ ప్యాకేజిని పొందింది. అభివృద్ధి చెందిన దేశాలలోనే బెయిలవుట్లు, పన్ను మినహాయింపులు ఇస్తుంటే మన రాష్ట్రంలో టిక్కెట్ చార్జీల పెంపు రూపంలో ప్రజలపై భారం మోపడం ఎలా సరైందో ఆలోచించాలి.
కేంద్ర ప్రభుత్వ బాధ్యత లేదా?
కరోనా మొదటి వేవ్‌లో 'నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ యాక్ట్' కిందనే కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. కాబట్టి దానివల్ల ఏర్పడిన నష్టాలను కూడా కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలి. ఆ విధంగా చూసినప్పుడు కరోనా లాక్డౌన్ల వల్ల టీఎస్ ఆర్టీసీకి వచ్చిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలి. కానీ అలా భర్తీ చేయాలని ఒత్తిడి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. 18,000 కోట్లు ఖర్చు పెట్టి 20,000 బస్‌లను కొని పీపీపీ మోడల్లో ఇస్తామని 2021-22 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు తప్ప ఒక్క రూపాయి కూడా ఆర్టీసీలకు కేటాయించలేదు. పైగా డీజిల్ ధరలను రోజువారీ సమీక్ష పేరుతో పెంచుతూ పోవడంతో పాటు, పెంచిన ఎక్సైజ్ డ్యూటీ వలన ఆర్టీసీలు తీవ్ర ఆర్థిక భారం మోసేలా చేసింది. అలాగే టూరిస్ట్ పర్మిట్లలో సరళతరం చేసి ఆర్టీసీలకి పోటీగా స్టేజి కారేజిగా నడుపుకొనే అవకాశం కల్పించింది.
మెట్రోకేనా ఆర్టీసీకి ఎందుకు ఇవ్వరు?
కరోనా కాలంలో తీవ్రమైన నష్టాలు వచ్చాయని, అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆ నష్టాన్ని భర్తీ చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్‌ను నిర్వహిస్తున్న ఎల్ Ê టి సంస్థ కోరిక మేరకు ఉన్నత స్థాయి కమిటీని వేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా పనిచేస్తున్న ఆర్టీసీకి మాత్రం కరోనా వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఎటువంటి చొరవ ప్రభుత్వం నుండి రాకపోగా, ఆ భారాన్ని ఛార్జీల రూపంలో ప్రజల పైకి నెట్టాలని ప్రయత్నించడం అన్యాయం.
ఏమైనా ఆర్టీసీని ప్రజా రవాణా సంస్థగా పరిగణించి ప్రభుత్వమే నిధులు ఇచ్చి ఆదుకోవాలి. ఆర్టీసీ నిర్వహణలో వస్తున్న తేడాను ప్రభుత్వమే భర్తీ చేయాలి. తప్ప ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతుందని గమనించాలి. అందుకని ఆర్టీసీ పరిరక్షణకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది.
- పుష్పా శ్రీనివాస్