Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాచీన ఈజిప్టు సంస్కృతిలో జాతకాల్ని బలంగా విశ్వసించడం ఉంది. మరణానంతరం జీవితం ఉంటుందని కూడా వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే చనిపోయిన వారి శరీరాల్ని మమ్మీలుగా భద్రపరచాలని, ఆత్మలకు ఆశ్రయం కల్పించాలని ప్రయత్నించారు. ప్రాణానికి, ఆత్మకు వారు రెండు వేరువేరు మాటలు వాడారు. శరీరంలోని ప్రాణాన్ని 'క' (KA) అని అన్నారు. ఆత్మను 'బా' (BA) అని అన్నారు. మనిషి చనిపోయినప్పుడు వెళ్ళిపోయేది ప్రాణశక్తి (క). ఇది కాక, ప్రతి మనిషికి 'బా' (ఆత్మ) వేరుగా ఉంటుంది. ఇది కదులుతుంది, క-ను వదిలి వెళ్ళిపోతుంది - కానీ ప్రతి రోజు రాత్రి క-ను వెతుక్కుంటూ వచ్చి అందులో చేరుతుంది - అని వారి నమ్మకం! చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరపడం ఎందుకంటే... క-ను వదిలి, బా-స్వేచ్ఛగా వెళ్ళడానికీ, మళ్ళీ వచ్చి అందులో చేరడానికీ వెసులుబాటు కల్పించడమన్న మాట! అందువల్ల చనిపోయిన వారి శరీరాల్ని జాగ్రత్తగా భద్రపరచాలన్న ఆలోచన వారికి వచ్చింది. అందుకోసమే శవాలకు గుడ్డచుట్టి మమ్మీలుగా చేసి సిద్ధంగా ఉంచుతారు. అలా మమ్మీలు తయారయ్యాయి. మళ్ళీ వాటిని భద్రపరచడానికి పిరమిడ్లు తయారయ్యాయి. శరీరాలు, ఆత్మలు, జన్మ, పునర్జన్మల గురించి వారి ఆలోచనలు ఎలా ఉన్నా, రసాయనాలు పూసి, మరణించిన వారి శరీరాల్ని దీర్ఘకాలం పాటు భద్రపరచడం వారికి ఎలా సాధ్యమయ్యిందో - ఆధునిక సాంకేతిక పరికరాలేవీ లేని కాలంలో అంత పెద్ద పిరమిడ్లు, అంత ఎత్తుగా ఎలా కట్టగలిగారో ఆలోచిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకే ప్రపంచంలోని వింతల్లో స్థానం సంపాదించుకున్నాయి కూడా!
శరీరం వేరు, ఆత్మవేరు. మరణానంతరం శరీరం కదలదు. కానీ, ఆత్మ కదులుతుంది. స్వేచ్ఛగా తిరుగుతుంది - అనే భావనను ఇక్కడి సనాతనులు ఈజిప్టు సంస్కృతి నుండి తీసుకున్నదేనని అనిపిస్తుంది. ఇక్కడ జంతువుల్ని దేవుళ్ళుగా కొలిచే ఆచారం కూడా అక్కడి నుండి వచ్చిందే అయి ఉంటుంది. వారి ఓఫెట్ (OPET) ఫెస్టివల్ వలెనే ఇక్కడి వైదిక ధర్మ ప్రభోదకులు దేవుడి సేవ పేరుతో, దేవతా విగ్రహాల్ని ఊరేగించారు. అక్కడ వారు మాట్ అన్నదాన్నే ఇక్కడ వీళ్ళు మఠంగా మార్చుకున్నారేమో తెలియదు. పొలికలైతే ఉన్నాయి. ఒసిరిస్‌ను శవపేటికలో ఉంచి అతని సోదరుడు సేత్ నైలు నదిలో పడేసిన ఘట్టాన్ని కొంత మార్చి ఇక్కడ పురాణాల్లో వాడుకున్నారు. పెళ్ళికి ముందే మహాభారతంలో కుంతీకుమారి కొడుకుని కని పెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేయడం మనకు చప్పున గుర్తుకొస్తుంది.
ఈజిప్టు సంస్కృతి ప్రకారం మరణించిన ప్రతి వ్యక్తిని మాట్ దేవత ఒక విశాలమైన సత్యపు హాలులోకి (HALL OF TRUTH) ఆహ్వానిస్తుంది. ఆమె చేతిలో తెల్లని సత్యపు ఈక (FEATHER OF TRUTH) ఉంటుంది. అక్కడ మరణించిన వారి దేవుడు (LORD OF THE DEAD) తన తీర్పు వినిపిస్తాడు. బహుశా డ్యూయెట్ అనేది ఇదేనేమో - మంచీ చెడులను బేరీజు వేసి తుది తీర్పు వెలువడే చోటు. చనిపోయిన వ్యక్తి 'హృదయ భారాన్ని' అక్కడ తూకం వేస్తారు. ఎందుకంటే హృదయ భారమే చనిపోయిన వ్యక్తి జ్ఞాన సంపదను తెలియజేస్తుందని ఈజిప్టు వారి నమ్మకం. దాని ద్వారానే అతను జీవించి ఉన్నప్పుడు చేసిన మంచి పనుల్ని, చెడు పనుల్ని లెక్కగడతారు. మాట్ నిబంధనల ప్రకారం అతను ఎటు వెళ్ళాలన్నది నిర్ణయించబడుతుంది. 1. రా-వెంట ప్రయాణించే అవకాశం లభిస్తుంది. లేదా 2. దిగువలోకంలోకి తొసేయబడొచ్చు. అదీ కాకపోతే 3. మళ్ళీ మానవ జన్మ ఎత్తి లేదా మరో జీవిగా జన్మించి మామూలు జీవితం గడపొచ్చు. ఇక్కడి విశ్వాసాల ప్రకారం నరకంలో యమధర్మరాజు (LORD OF THE DEAD) సన్నిధిలో చిత్రగుప్తుడి చిట్టాలో పాప-పుణ్యాల లెక్కచూసి, శిక్షలు విధించబడతాయని వైదిక ధర్మం చెపుతుంది. చిన్నపాటి తేడాలున్నా పద్ధతి అంతా ఒకటిగానే ఉంది కదా? పరిక్ష హాల్లో ముందు వాణ్ణి చూసి కాపికొట్టి రాసేవాడు ఏదో కొంచెం అటూ ఇటూగా రాస్తాడు కదా? ఇదీ అంతే!
ఇక ఈజిప్టు సంస్కృతిలోని దేవాలయాల గురించి చూద్దాం! దేవీ దేవతల భౌతిక ఆకారాలు తయారుచేసి, ఒక ఇంట్లో పెట్టి పూజించే చోటును అక్కడ 'దేవాలయాలు' అని పిలుచుకున్నారు. ఇవి రెండు రకాలుగా ఉండేవి. ఒకటి - దేవతా మూర్తుల ఆలయాలు. రెండు - చనిపోయిన వారి పరిపాలకుల / ఫరా / రాజుల - ఆలయాలు. ఎందుకంటే అక్కడి ప్రజలకు ఫరా (PHARAOH) అంటే దేవుడితో సమానం! దేవాలయాల్లో మొదట ప్రభుత్వ అధికారులే పూజలు నిర్వహించేవారు. తర్వాతి కాలంలో వృత్తి రీత్యా పూజారుల్ని నియమించారు. క్రమంగా అది వారసత్వ వృత్తి అయిపోయింది. ఫరానే కాకుండా ఎద్దు, పిల్లి, మొసలి వంటి జంతువుల్ని కూడా అక్కడి ప్రజలు పూజించేవారు. టహ్(PTAH) అనే దేవుడి ప్రతి రూపమే ఎపిస్ బుల్ (APIS BULL) కాబట్టి, దాన్ని పూజించే వారు. అలాగే పిల్లలు మొసళ్ళ, ఇంకా కొన్ని ఇతర జంతువులను మమ్మీలుగా మార్చుకుని పూజించేవారు. విశ్వాసాల ఆధారంగా ఈజిప్టు ప్రజలు కొన్ని పండగలు, వేడుకలు జరుపుకునేవారు. కర్నాక్ ప్రాంతంలో జరిగే ఓపెట్ ఫెస్టివల్ అలాంటిదే. అందులో ప్రధానంగా దేవుళ్ళ ప్రతిమల్ని ఊరేగించేవారు. ఆ ఊరేగింపులో ఎవరైనా న్యాయబద్దమైన ప్రశ్నలు లేవదీస్తే, వాటికి అక్కడే పరిష్కారం దొరికేది. అంటే ఊరేగింపులో ఉన్న ఆ భగవంతుడి అనుగ్రహంతో మంచి సూచనలు, సలహాలు, పరిష్కారాలు లభిస్తాయని ప్రజలు భావించేవారు. ఎందుకో గాని, ఈ అంశాన్ని ఈ దేశంలోని మనువాదులు స్వీకరించలేదు. జవాబులివ్వడమైనా, పరిష్కారాలు చూపడమైనా వారితో అయ్యేపని కాదని వారు గ్రహించి ఉంటారు. ఎంతైనా తెలివిగల వాళ్ళు కదా?
ఊరేగింపులోని దేవుడి ప్రతిమ కింది నుండి భక్తులు ఇటు నుండి అటు, అటు నుండి ఇటూ నడిచి వెళ్ళేవారు. ఆ దేవుడిపట్ల తమ భక్తి ప్రపత్తులను అలా చాటుకునేవారు. ఆ దేవుడి దయ లభించి, తమ కుటుంబాలు చల్లగా వర్థిల్లుతాయనీ వారి నమ్మకం. తమ కోర్కెల్ని ఆ దేవుడు తప్పక తీరుస్తాడని వారి ఆశాభావం. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడి వైదిక ధర్మం స్వీకరించింది. జనానికి బోధించింది. అందుకే ఇక్కడ కూడా దేవుడి సేవ కింది నుండి భక్తులు ఇటు నుండి అటు, అటు నుండి ఇటూ తిరిగి తమ భక్తిని చాటుకుంటారు. తమ కోర్కెలు తీరాలని కోరుకుంటారు. ఈజిప్టు సంస్కృతిలో నైలునది వరదల గూర్చి కూడా కొన్ని నమ్మకాలున్నాయి. ప్రతి సంవత్సరం నైలునదికి వచ్చే ఉధృతమైన వరదల వల్ల ప్రపంచం ఎప్పటికప్పుడు తొలిదశకు చేరుకుంటుందనీ, మళ్ళీ ఈ 'దేవుడి దయ'తోనే తాము ప్రపంచాన్ని యధాస్థితికి మార్చుకుంటామని ప్రాచీన ఈజిప్టు ప్రజలు విశ్వసించేవారు. నైలునదికి వచ్చే వరదల వల్ల దాని పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలన్నీ ఊడ్చుకుపోయేవి. సరిహద్దులన్నీ కొట్టుకుపోయేవి. ఎవరి భూమి ఏదో అంతు చిక్కేది కాదు. క్రమంగా సమాజం కొంత ఆధునికత వైపు అడుగిడుతున్న సమయంలో తత్త్వవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు పైథాగరస్ (570-495బీసీఈ) ప్రజలకు ఒక గణిత సూత్రాన్ని అందించాడు. అదే తర్వాతి కాలంలో 'పైథాగరస్ సిద్ధాంత'మయ్యింది. దాని ప్రకారం ఆనాటి రైతులు ఎవరి భూమిని వారు కొలుచుకుని, మళ్ళీ సాగు చేసుకునేవారు. 'దేవుడి దయ' అనేది కేవలం వారి విశ్వాసం మాత్రమే - కానీ, వాస్తవంగా ఉపయోగపడింది - ఒక జ్ఞాని! అతని ఆలోచనల్లోంచి వచ్చిన ఉపయోగకరమైన ఒక గణిత సిద్ధాంతం!! విచిత్రం - అక్కడి విశ్వాసాలకే కాదు, కాలక్రమంలో గ్రీసు, ఈజిప్టుల నుండి వచ్చిన గణితసూత్రాలని కూడా మనువాదులు ఇక్కడ నేర్చుకోక తప్పలేదు. పైథాగరస్ సిద్ధాంతం ఇప్పటికీ క్షేత్రగణితంలో అతి ముఖ్యమైందని మన స్కూలు పిల్లలకి కూడా తెలుసు.
మమ్మీలుగా మార్చే విధానాన్ని మమ్మిఫికేషన్ (MUMMIFICATION) అని అంటారు. దీనికి సుమారు 75 రోజులు పట్టేది. మమ్మీలుగా చేయడానికి ప్రత్యేకమైన నిపుణులుండేవారు. వారికి మానవ శరీర నిర్మాణంపై కొంత అవగాహన ఉండేది. మృతదేహం పొట్ట చీల్చి లోపలి అవయవాలన్నీ తీసి వేరే పెట్టెలో పెట్టేవారు. వాటిని కానోపిక్ జార్స్ (CANOPIC JARS) అని అంటారు. అవి కూడా మమ్మీల పక్కనే సమాధుల్లో పెట్టేవారు. అయితే శరీరంలో ఎడమవైపున ఉండే హృదయాన్ని కదిలించకుండా అలాగే ఉంచేవారు. ఎందుకంటే చనిపోయిన మనిషి జ్ఞానమంతా అందులోనే ఉంటుందని వారి భావన. అప్పటికి ఇంకా - వారికి మెదడు చేసే పనేమిటో, హృదయం చేసే పనేమిటో తెలియదు. జ్ఞానానికి కారణమైన మెదడును ముక్కలు ముక్కలుగా బయటికి తీసి, హృదయాన్ని మాత్రం అలా ఉంచేసేవారు. ముక్కులో నుండి ఒక పరికరం పైకి పొడిచి, మెదడు తీసేవారు. శరీరమంతా డొల్లగా చేసిన తర్వాత అందులో నాట్రాన్ అనే ఉప్పు పాకెట్లు వేసి తేమను లాగేసేవారు. బాగా ఆరిపొయ్యాక, ఉప్పు తీసేసి శరీరం శుభ్రంగా కడిగేవారు. ఆ తరువాత లెనిన్ గుడ్డ మీద వారి ప్రార్థనల చరణాలు రాసి, దాన్ని - శరీర భాగాలకు విడివిడిగా చుట్టేవారు. ఈ ప్రక్రియలో భాగంగా గోరువెచ్చని రెసిన్ (RESIN) శరీరానికి పూసేవారు. ఇక్కడ ఈ పనులు జరుగుతూ ఉండగా మరోవైపు సమాధి తయారయ్యేది. పనివాళ్ళు, మేస్త్రీలు, కళాకారులు ఎవరి పనులు వాళ్ళు చేస్తుండేవారు. ఊరికే మట్టిలో పూడ్చేయడం కాకుండా, చనిపోయిన వ్యక్తి మరణానంతర జీవితం జీవించడానికి ఫర్నిచర్‌తో సహా సమాధిని కళాత్మకంగా తీర్చిదిద్దేవారు.
మమ్మీలుగా చేయడమనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని గనుక, రాచకుటుంబీకులు, ధనవంతులు మాత్రమే చేయించుకునే వారు. అలాంటి వారి మమ్మీలతో పాటు సమాధుల్లో ఉంచడానికి రాజు (ఫరా)తో సహా కొందరు పెద్దవాళ్ళు బహుమతులు పంపేవారు. గురువును మించిన శిష్యుడిలాగా ఇక్కడి వైదిక సంప్రదాయం - ఈజిప్టును మించిపోయింది. అక్కడ శవాల్ని మమ్మీలుగా చేస్తే, ఇక్కడ వీరు 'సతి' పేరుతో మహిళల్ని సజీవంగానే కాల్చి చంపారు. అక్కడ శవాల నుండి తేమను లాగి ఆరబెడితే, ఇక్కడ వీరు మూల వాసుల్ని తిండికి దూరం చేసి ఎండబెట్టారు. అక్కడ శవాలకు మెదడు తొలగిస్తే ఇక్కడ మూలవాసుల మెదడ్లు నిర్వీర్యం చేశారు. దేవుడి పేరుతో భయోత్పాతం సృష్టించారు. ఈ విషయాలు అలా ఉండనిస్తే - శవాలకు స్నానాలు చేయించడం, చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన వంటకాలు చేసి సమాధుల దగ్గర పెట్టడం, ఇష్టమైన వస్తువులు పెట్టడం ఎందుకో ఇప్పుడు అర్థమైంది కదా? మరణానంతరం జీవితంలో మృతులు సంతోషంగా సంతృప్తిగా ఉండాలని కోరుకోవడమే. అక్కడ ఈజిప్టులో మృతదేహాల్ని మాత్రమే మమ్మీలుగా మార్చి భద్రపరిచారు. ఇక్కడి వైదిక సంస్కృతి జనాన్ని సజీవంగానే 'మమ్మీ'లుగా మార్చింది. అధిక సంఖ్యాకులైన ఇక్కడి మూలవాసులకు విద్యనివ్వక, స్వేచ్ఛనివ్వక, ఆర్థిక స్వాతంత్య్ర మివ్వక,దేవుడి పేరుతో కుట్రలు పన్ని బానిసలుగా చేసింది. అక్కడ క్రీ.పూ. ఉన్న సంస్కృతిని ఇక్కడి మనువాదులు ఈ వైజ్ఞానిక యుగంలో కూడా ఇంకా కొనసాగించాలని తాపత్రయ పడుతున్నారు?
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు