Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1884లో చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతి పాదించాడు. మనిషిని దేవుడు సృష్టించలేదని, ఒక రకమైన కోతి జాతి నుంచి మనిషి పరిణామం చెందుకుంటూ వచ్చాడన్న సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చాడు. కోతుల అవయవాల నిర్మాణం మానవుల అవయవా లకు దగ్గరగా ఉంటాయి. కోతి చేష్టలు కూడా మానవునితో పోలి ఉంటాయి. అందుకే తెలుగునాట కోతి కొమ్మచ్చి అనే ఆట పుట్టుకొచ్చింది. అయితే ఇప్పుడు కోతులతో మానవులకు, పక్షుల సంతతికి ప్రమాదం ముంచుకొస్తుంది. అడవులను, గుట్టలను టధ్వంసం చేయడం వలన కోతులు మైదాన ప్రాంతాలకు వలస వచ్చినవి. మానవుల ఆవాసాలను, పంటపొలాలను చిల్లం కల్లం చేస్తున్నవి. గ్రామాల్లో కోతుల సంచారం వలన కూరగాయలు పండ్లు ఫలాలు కరువైనవి. గుడిసె ముంగట, జాలరి దగ్గర, పెంట బొంద దగ్గర చిక్కుడు, అనపకాయ, పొట్లకాయ గుమ్మడి కాయ కూరగాయ మొక్కలను పెంచుకొని పందిరికి, పొరుక పబ్బులకు, గుడిసెలకు, ఇండ్ల మీదకు పాకించుకొని కూర గాయాలను పండించుకోవడం బంద్ పెట్టారు. పొప్పడి, జామ, అరటి, చింత, కరివేపాకు, సపోట, ఆల్లనేరడి చెట్లను పెంచడం కూడా బంద్ పెట్టారు. గుమ్మడి పువ్వు దొరుకక పసుపు గౌరమ్మతో బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఇండ్ల పైకప్పుగా ఉన్న గూనపెంకులను పెకిలించి చిందర వందర చేస్తున్నందున అప్పులు చేసి స్లాప్ ఇండ్లను నిర్మించుకుంటున్నారు. తాటి, ఈత చెట్ల మొగిని చెడిపేసి కల్లు కుండలో నిండకుండా చేస్తున్నవి. పక్షుల గుడ్లను పగులగొడ్తున్నవి. గూళ్లను పీకేస్తున్నవి. దానితో రామ చిలుకలు, ఊర పిచ్చుకలు, గోరెంకలు, గువ్వలు, పావురాలు, కాకులు, సమురు కాకులు, నల్ల పిట్టలు, పూరేడులు, పాల పిట్టలు మొదలగు పక్షుల పుట్టువడి తగ్గుతుంది. కోతులు ముట్టని పంటలు లేవు. మొక్కజొన్న, వేరుశనగ, మంచి శనగ, పెసరు, బొబ్బెర, కంది, ఉలువ, పొద్దు తిరుగుడు, తెల్ల జొన్న, మిర్చి, కూరగాయ పంటలను పండించడం మానుకున్నారు. కోతులు గర్భధారణతో 164 నుండి 187 రోజుల మధ్య పిల్లలకు జన్మనిస్తాయి. 20 నుండి 45 సంవత్సరాల వయసు వరకు జీవిస్తాయి. ఇప్పుడు వందల సంఖ్యలో ఉన్న కోతులు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. రానున్న కాలంలో వేల సంఖ్యలో పెరిగినట్లయితే భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నది. వన్యప్రాణి (రక్షణ) చట్టం 1972 కింద కోతులకు రక్షణ కల్పించబడింది. అయినప్పటికీ అడవి జంతువులు మనుషుల ప్రాణాలకు ఆస్తులకు నష్టం కలిగించినప్పుడు క్రిమిసంహారకాలుగా (వార్మిన్/Vజు=వీ×చీ) ప్రకటించవచ్చు. చట్టంలోని షెడ్యూల్-5లో చేర్చి నోటిఫికేషన్ను జారీ చేయవచ్చు. అప్పుడు క్రిమిసంహారకాలుగా ప్రకటించిన జంతువులను చంపవచ్చును. అందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్లో కోతులను చంపినారు. 1.36 లక్షల కోతులను నాలుగేండ్ల కాలంలో 33.5శాతంకు తగ్గించినట్లుగా కోయంబత్తూరులోని సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్మిమిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ పరిశోధకులు 2020లో వెల్లడించారు. స్టెరిలైజేషన్(గర్భ నిరోధం), పునరావాసం, అణచి వేయడం, తరలించడం ప్రక్రియల ద్వారా కూడా కోతుల బెడద నియంత్రించవచ్చని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. నిజాంబాద్ జిల్లా యెర్రగట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో నేత రవి ''కోతుల బెడద బాధితుల సంఘం'' పెట్టాడు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి కోతుల బెడద నుండి ప్రజలను రక్షించాలని పోరాటం చేస్తున్నాడు. తెలంగాణలోని అనేక గ్రామాల్లో కోతులను పట్టించి సర్పంచులుగా గెలిచిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా వానలు వాపస్ రావడానికి, కోతులు వాపస్ పోవడానికి మొక్కలు నాటి హరితహారం చేయండని పిలుపునిచ్చాడు. కాని మరోవైపేమో సహజ వనరులైన గుట్టలను అమ్మే ప్రక్రియను వేగిరం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లోని దాదాపు 850 గుట్టలను కొల్లగొట్టుకోవడానికి 290 గ్రానైట్ ఎజెన్సీలకు అనుమతులను ఇచ్చారు. అత్యంత ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో గాని, మానవ శ్రమతో గాని పునరుత్పత్తి చేయలేని, పునర్ సృష్టించలేని సహజసిద్ధమైన గుట్టలను టాన్ బ్రౌన్, మాఫుల్ రెడ్, కాఫీ బ్రౌన్ గ్రైనేట్ రూపకంగా ఇతర దేశాల ఎగుమతులకు అనుమతించారు.2019 - 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.805 కోట్లు ఆదాయాన్ని పొందినట్లుగా తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ (టిఎస్ఎమ్డిసి)తెలిపింది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారంగా భూమికి 550కోట్ల సంవత్సరాల వయస్సు ఉన్నది. భూమి మీద ఉన్న గుట్టలను, అడవులను, పర్యావరణాన్ని, జీవవరణాన్ని, పరిమితంగా మానవాభివృద్ధికి ఉపయోగించుకొని భవిష్యత్తు తరాలకు వారసత్వంగా మిగల్చాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. కాని ప్రభుత్వాలు మాత్రం పబ్బం గడుపుకోవడానికి ప్రకతి వనరులను అమ్ముతున్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా వనరులు మాకు కావాలన్న ఆకాంక్షలతో రాష్ట్రాన్ని సాధించు కున్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గుట్టలను అమ్ముతున్నది. దానితో గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువ అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కోతుల బెడద నుండి ప్రజలకు, ఆస్తులకు, పంట పొలాలకు రక్షణ కల్పించాలి. అందుకు వనరులను కాపాడుకోవడమే కీలకమని గుర్తించాలి.
- ఎం. రాజయ్య
సెల్:9441440791