Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించిన 133 రకాల పిటిషన్లు సుప్రీంకోర్టులో కొంతకాలంగా పెండింగులో ఉన్నాయి. వాటన్నిటినీ ఒక బంచుగా సెప్టెంబర్ 14న జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీ.ఆర్.గవారులతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఆ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఒకింత ఆసక్తిని, అనుమానాలను రేకెత్తించాయి. ప్రమోషన్లలో రిజర్వేషన్ విషయంలో గతంలో సెటిల్ అయిన విషయాలను తిరగదోడేది లేదని, ఏదైనా పెక్యులియర్ విషయాలు ఉంటే విచారించవచ్చు అని జస్టిస్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ స్పందిస్తూ విచారణకు చేపట్టిన పిటిషన్లలో దాదాపు అన్నీ గతంలో సెటిల్ అయిన విషయాలకు చెందినవేనని, వాటి నేపథ్యాన్ని సవివరంగా కోర్టుకి సమర్పిస్తానని, ఒక్క త్రిపురకు సంబంధించినదే 'పెక్యులియర్' కేసు అని చెప్పారు. వేణుగోపాల్ చెప్పిన ఆ పిటిషన్ల నేపథ్య నివేదికను ఇవ్వడానికి రెండు వారాలు గడువు ఇస్తూ విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. దీని గురించి మీడియాలో వచ్చిన వార్తలు చూసిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఫర్వాలేదనే ధీమాతో ఉండవచ్చు.. కానీ ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు చేసి కొన్ని కొత్త సమస్యలనూ తెరమీదకు తెచ్చే అవకాశం లేకపోలేదు. ఒక్క త్రిపుర 'పెక్యులియర్' కేసు చాలు డొంకంతా కదిలించడానికి!
'తిరగదోడేది లేదు' అని ధర్మాసనం చెప్పిన ప్రమోషన్లలో రిజర్వేషన్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు సెటిల్ (స్థిర పరిచిన) చేసిన అంశాలు ఏమిటి? ఒకటి, రాజ్యాంగం ఆర్టికల్ 16 (4ఏ) ప్రకారం ప్రమోషన్లలో రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ లకు మాత్రమే ఉంది. ఓబీసీలకు లేదు. ఓబీసీలకు వర్తించే క్రీమీ లేయర్ విధానం ఎస్సీ, ఎస్టీలకు వర్తించదు అని చారిత్రాత్మకమైన ఇంద్రా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్.ఎన్. వెంకటాచలయ్య నేతృత్వంలోని 9 మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 1993లోనే తీర్పు చెప్పింది. ఓబీసీ రిజర్వేషన్లు సామాజిక, విద్యాపరమైన వెనుకబాటును అధిగమించడానికి ఉద్దేశించబడినవి కాగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతో పాటు సామాజిక వివక్షను అధిగమించడానికి ఉద్దేశించబడినవి. కనుక రిజర్వేషన్లు ఎందుకు అనేది సెటిల్ అయిన విషయం. అదే తీర్పులో రిజర్వేషన్లు 50శాతం మించకూడదు అనే పరిమితి విధించబడింది. ఆ పరిమితిని తొలగించాలని గడిచిన మూడు దశాబ్దాల కాలంలో వివిధ కేసుల్లో చాలా వాదోపవాదాలు జరిగాయి. ఆ తీర్పు అలా ఉన్నంతకాలం ఆ పరిమితిని అతిక్రమించడం సాధ్యం కాదనే సమాధానమే చెప్పుకోవడం జరిగింది. 9 మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తిరగదోడాలంటే అంతకంటే విస్తృతమైన 11 మంది సభ్యుల ధర్మాసనానికి మాత్రమే సాధ్యమని, అందుకు సిఫార్సు చేయాల్సిన అవసరం కూడా ప్రస్తుతానికి లేదని మరాఠా రిజర్వేషన్ల కేసును విచారించిన జస్టిస్ జె. అశోక్ భూషణ్ నేతత్వంలోని 5 మంది సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. అది రిజర్వేషన్ల విషయంలో మరో చారిత్రాత్మక తీర్పుగా నిలుస్తుంది. ''50శాతం పరిమితిని తొలగించాలంటే అది సమానత్వ ప్రాతిపదికన కాకుండా కుల ఆధారిత సమాజంగానే మిగిలిపోతుంది. రాజకీయ వత్తిళ్లతో రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతే అసమానతలు తగ్గించడం కష్టమవుతుంది. పురోగమనం కాకుండా అందరూ వెనుకబాటుతనాన్ని కోరుకుంటే దేశంలో స్తబ్దత ఏర్పడుతుంది. అది రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధం'' అని ధర్మాసనం పేర్కొంది.
'రిజర్వేషన్లతో ప్రతిభ, సామర్థ్యం దెబ్బ తింటాయి' అనే వాదన తప్పు అని 2019లో జస్టిస్ యు.యు.లలిత్ మరియు జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం తీర్పు చెప్పింది. ''సమాజంలో గల వాస్తవిక విషయాలను చట్టం ఎన్నడూ విస్మరించ జాలదు. అలా విస్మరిస్తే అది అనుభవంలో ఉన్న అసమానతలను మరింత బలపరిచి సంస్థాగతం చేసినట్లు కాగలదు. ఫ్యూడల్ సమాజంలో, కుల వ్యవస్థలో శతాబ్దాలుగా ఎస్సీ ఎస్టీల పట్ల జరిగిన వివక్షను, అమానుషమైన అన్యాయాన్ని అధిగమించడానికే రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లు పొందుపర్చారు. రాజ్యాంగంలోని అలాంటి పరివర్తన ధృక్పథాన్ని కోర్టు బలపరుస్తుంది తప్ప ప్రతిభ, పరిపాలనా సామర్థ్యం అనే భ్రమలకు లోనవదు'' అని వ్యాఖ్యానించింది. ఇంకా ఎంత కాలం ఈ రిజర్వేషన్లు, వీటికి అంతూ పొంతూ ఉండదా అనే అసహనపు వాదనలు కూడా న్యాయస్థానాలు చాలాసార్లు విని వదిలేసినవే. లోక్సభ, శాసనసభ స్థానాల రిజర్వేషన్లకు మాత్రమే రాజ్యాంగం ఆర్టికల్ 334 పదేండ్ల కాలపరిమితిని విధించింది. అయినా ప్రతి పదేండ్లకు ఆ పరిమితిని పెంచుతూ రాజ్యాంగానికి సవరణలు చేయడం జరుగుతోంది. కానీ విద్య ఉద్యోగాల రిజర్వేషన్లకు కాలపరిమితి లేదు. ఆర్టికల్ 16 (4) మరియు 16 (4ఏ) ప్రకారం అడిక్వెసీ (సరిపడినంత) వచ్చే వరకు రిజర్వేషన్లు కొనసాగించాలి. నాలుగవ తరగతి ఉద్యోగాల్లో మాత్రమే ఆడిక్వెసికి మించి ఎస్సీ ఎస్టీ వారు ఉండేవారు. ఇప్పుడు ఆ పోస్టులకు నియామకాలే లేవు. ఔట్ సోర్సింగ్ విధానంతో రిజర్వేషన్లు ఎగిరిపోయాయి. క్లాస్ 3 ఉద్యోగాల్లో సంఘాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో, ప్రభుత్వ శాఖల్లో మాత్రమే ఎడిక్వెసి వరకు భర్తీ అవుతున్నాయి. అయినా ప్రమోషన్ పోస్టుల్లో కొరత కొనసాగుతూనే ఉంది. క్లాస్ 1, క్లాస్ 2 పోస్టుల్లో సగం వరకు ఖాళీగానే ఉంటున్నట్లు పార్లమెంటులో ప్రభుత్వం చెప్పే జవాబులు ద్వారా తెలుస్తోంది.
అసలు రిజర్వేషన్లు హక్కే కాదు పొమ్మని 2020 ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రమోషన్ల కేసు తీర్పులో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ రాష్ట్రంలో ప్రమోషన్లలో రిజర్వేషన్ పాటించని విషయం తప్పో ఒప్పో చెబితే సరిపోయేది. కానీ తీర్పులో న్యాయమూర్తులు రిజర్వేషన్లకే ఎసరు పెట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. రిజర్వేషన్ల విషయంలో అవి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు. అవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నవి. గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో సుప్రీంకోర్టు తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు రిజర్వేషన్ల అమలులో ఎదురైన సమస్యల పరిష్కారానికి తోడ్పడినవి. ఆ తీర్పులు, వ్యాఖ్యానాల మేరకు రిజర్వేషన్ల రక్షణ కోసం కొన్ని సందర్భాల్లో రాజ్యాంగానికి సవరణలు చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ కేసులో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను తాజా ధర్మాసనం సమర్ధిస్తుందా లేక తిరస్కరిస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా ఆర్టికల్ 16 (4) Ê 16 (4ఏ) అదే విధంగా ఉన్నంత కాలం అలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ఆ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇంతకీ ఆ అధికరణాల్లో ఏముంది? ఆర్టికల్ 16 (4)లో ''ప్రభుత్వ సర్వీసుల్లో వెనుకబడిన తరగతుల ప్రాతినిధ్యం తగినంత లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే సంబంధిత తరగతుల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు'' అని ఉంది. ఆర్టికల్ 16 (4ఏ)లో ''ప్రభుత్వ సర్వీసుల్లో ఏ తరగతి పోస్టులకైనా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తరగతుల వారికి ప్రమోషన్లలో తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించవచ్చు'' అని ఉంది. వీటి ప్రకారం ఉత్తరాఖండ్ ప్రమోషన్ల కేసులో ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏముంది అనిపించవచ్చు. కానీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వాల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందా? అంత సింపుల్గా ఉంటే దేశంలో రిజర్వేషన్లు పెద్ద చర్చనీయాంశంగా ఎందుకుంటున్నాయి? కాబట్టి ఏ ప్రభుత్వమైనా రిజర్వేషన్ ఇవ్వొద్దని భావిస్తే సరిపోదు, అందుకు సంబంధించిన ఎడిక్వెసి చూపించాలి. ఎడిక్వెసి లేకపోయినా రిజర్వేషన్ ఇవ్వక్కర్లేదని భావిస్తే చెల్లదు.
- నాగటి నారాయణ
సెల్:9490300477