Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భగత్ సింగ్‌ను 23ఏండ్ల యవ్వన ప్రాయంలో ఆంగ్ల పాలకులు ఉరి తీశారు. అయితే వారు తీసింది ఆయన ప్రాణాలు మాత్రమే. ఆయన ప్రాణం కంటే మిన్నగా భావించిన భావజాలం కోట్లాది మంది భారతీయుల గుండెల్లో నేటికీ పదిలంగానే ఉంది. లాలా లజపతిరారుని క్రూరంగా హింసించి ఆంగ్లేయులు చంపడాన్ని నిరసిస్తూ బ్రిటిష్ పోలీస్ అధికారిని కిరాతకంగా కాల్చి చంపినందుకు, నాటి పార్లమెంటులో బాంబు విసిరినందుకు భగత్‌సింగ్ ఆయన అనుచరులను ఉరితీసే ముందు రోజు ''సర్దార్ మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందుకు మీరు ఏమీ బాధపడడంలేదా'' అని జయదేవ్కపూర్ భగత్‌సింగ్‌ని ఉద్దేశించి అడిగినప్పుడు అందుకు భగత్‌సింగ్ విఫ్లవ పంథాను నేను ఎంచుకున్నప్పుడే భరతమాత బానిస సంకెళ్ళు తెంచేందుకు నా ప్రాణాలు అర్పించాల్సి రావొచ్చు అని నాకు తెలుసు. అనుకున్నట్లే నా తల్లి నుదుట నెత్తుటి తిలకం దిద్దాలని విప్లవం వర్థిల్లాలి అనే నినాదాన్ని వ్యాపింప చేయగలిగానంటే జీవితం ధన్యమైపోతుందని అనుకుంటున్నాను. ఈ నా నినాదం స్వతంత్ర సంగ్రామాన్ని చైతన్యవంతం చేసే శక్తిగా సామ్రాజ్యవాదులను చివరి వరకూ పతనం చేసేందుకు తోడ్పడుతుందని నమ్మకం నాకుంది. ఇంత చిన్న జీవితానికి ఇంతకంటే మరేం కావాలి'' అని భగత్‌సింగ్ చెప్పిన సమాధానం నేటి యువతరానికి నిత్యస్ఫూర్తి. ఆనాటి సమాజంలో పాటించబడుతున్న కుల వివక్షను ప్రశ్నించిన విప్లవ జ్యోతి భగత్‌సింగ్. మన దైనందిన జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఆయనది. స్వరాజ్య పోరులో వీరమరణం పొందిన ప్రముఖులలో భగత్‌సింగ్ ప్రాతఃస్మరణీయుడు. ఆయన పోరాటం స్వాతంత్య్రోద్యమ స్వరూప స్వభావాలను నిర్దేశించడమే కాకుండా లౌకిక జాతీయ వాదాలకు నిర్దిష్టమైన విధానాలను నిర్దేశించింది. కమ్యూనిస్టులు అప్పటికి దేశంలో బలపడలేదు. కాంగ్రెస్ ఒక్కటే స్వరాజ్య పోరులో ముందుంది. అలాంటి పరిస్థితులలో సంపూర్ణ స్వరాజ్యం కోసం ఆయన ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. సామ్రాజ్య వాదులను దేశం నుంచి వెళ్ళగొట్టడం, బూర్జువా శక్తులు పెత్తందార్ల నుంచి దేశ ప్రజలను విముక్తుల్ని చేయడం స్వతంత్య్రోద్యమ లక్ష్యం కావాలని ఈ యువ యోధుడు ఆకాంక్షించాడు. దాని కోసమే తాను విప్లవ పంథాను ఎంచుకున్నాడు. ఆయన దృష్టిలో విప్లవం అంటే ప్రజల ద్వారా, ప్రజల కోసం స్వీయ రాజకీయాధికారాన్ని సాధించడమే. ప్రజలను సంఘటితపర్చడం, సిద్ధాంతాలకు నిబద్ధులను చేయడం ద్వారానే అది సాధ్యపడుతుందని భగత్‌సింగ్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. తుపాకీ గొట్టం ద్వారా, బాంబుల ద్వారా విప్లవాన్ని తీసుకురాలేమనే విషయం కూడా ఆయనకు బాగా తెలుసు. ఒకరకంగా విప్లవం, శ్రామిక రాజ్యం, సమానత్వ సిద్ధాంతాల మీద ఆధారపడిన సామ్యవాద వ్యవస్థను స్థాపించే కార్యక్రమాన్ని భారతదేశ ప్రజలకు పరిచయం చేసిన గొప్ప యువ మేథావి భగత్‌సింగ్ అని చెప్పవచ్చు. అలాగే మతం, మతతత్వం, ఆనాటి నిమ్నకులాల స్థితిగతుల గురించి వారి విశ్లేషణలు కూడా నేటి సమాజానికి ఎంతో ఉపయుక్తం. 1928 జూన్‌లో కీర్తి మ్యాగజైన్లో అస్పృశ్య సమస్య అనే శీర్షికతో భగత్‌సింగ్ రాసిన వ్యాసం చాలా ప్రముఖమైనది. దేశంలో నిమ్నకులాల దయనీయ స్థితికి దారితీసిన చారిత్రక సామాజిక అంశాలను లోతుగా అధ్యయనం చేయుటంతో పాటు అంటరానితనం నిర్మూలనకు పరిష్కారాలను కూడా ఈ అమరవీరుడు ఆ వ్యాసంలో చూపారు. ఈ వ్యాసం రాసినప్పుడు భగత్‌సింగ్ వయస్సు కేవలం 20ఏండ్లే. స్వరాజ్య పోరుతోపాటు నిమ్నకులాల సమస్యను కూడా పరిష్కరించాలనే ఆలోచన ఆ పిన్న వయస్సులో రావడం భగత్‌సింగ్ సిద్ధాంత పరిపక్వతను ఆవిష్కరింపజేస్తుంది. నిమ్నకులాల దయనీయ పరిస్థితులకు హిందూమత ఛాందసవాదులే కారణమని ఆయన స్పష్టం చేశారు. మదన్మోహన్ మాలవ్యా దయానంద సరస్వతి లాంటి వారు ఎన్ని ఉద్యమాలు నడిపినప్పటికీ సాటి భారతీయుల పట్ల వివక్షను (అస్పృశ్యత పాటించడం) దూరం చేయలేకపోవడానికి మనువాద మనస్తత్వంలో వారు కూరుకుపోవడమే ప్రధాన కారణమని భగత్‌సింగ్ అభిప్రాయం. బ్రాహ్మణవాద ఫ్యూడల్, బూర్జువా, భూస్వామ్య శక్తుల నిర్మూలనలోనే నిమ్నకులాల సమస్యకు శాశ్వత పరిష్కారముందని భగత్‌సింగ్ భావించారు. ఇటువంటి వివక్షాపురిత వ్యవస్థపై తిరుగుబాటు కోసం యువకులతో కూడిన సామాజిక విప్లవ సంస్థను స్థాపించే ప్రయత్నం చేశారు. సామాజిక ఉద్యమంతో విప్లవాన్ని పుట్టిద్దాం. రాజకీయ, ఆర్థిక విఫ్లవం కోసం నడుం బిగిద్దాం. దేశానికి పునాదులు నిజమైన శక్తి మీరే అని ఆయన ఇచ్చిన పిలుపు స్ఫూర్తిదాయకం. భగత్‌సింగ్ మరో 20ఏండ్లు జీవించి ఉంటే ఈ దేశ స్వరూప స్వభావాలే మారిపోయి ఉండేవని చెప్పడం అతిశయోక్తి కాదు.
(భగత్‌సింగ్ జయంతి సందర్భంగా)
డా||యస్.బాబూరావు
సెల్:9573011844