Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కైలాసంలో తన నివాసం ముందు పార్వతీదేవి ఎదురు చూస్తోంది. వినాయక చవితికి భూలోకం వెళ్ళి తన ముద్దుల కొడుకు గణేషుడు ఇంకా ఇంటికి రాలేదు. నిమజ్ఞనం కూడా అయిపోయి రెండు రోజులైంది. అయినా ఇంకా రాకపోవటంతో పార్వతీదేవికి ఆందోళన ఎక్కువైంది. ముందే భూలోకంలో పరిస్థితులు ఏమీ బాగాలేవు! అని తల్లి మనసు పరిపరి విధాల్లో ఆలోచిస్తోంది. భర్తకు చెబుదామంటే ఆయనేమో ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఇంట్లోకి బయటకు తిరుగుతోంది.
తన చీరవద్ద ఏదో కదిలినట్లైతోంది. కాని పార్వతి పట్టించుకునే పరిస్థితిలో లేదు. గణేషుడి గురించే ఆలోచిస్తోంది! ఏదో మూలుగుతున్న శబ్దం వినిపించి కిందికి చూసింది. గుమ్మం వద్ద ఏదో బురద అంత ముద్దలాగా కనపడుతోంది. ఈ బురద ఇక్కడికెలా వచ్చిందో అనుకుంటూ చీపురుతో శుభ్రం చేయబోయింది. ఆ బురద ముద్ద నుండి తొండంపైకి లేచింది. ''అయ్యో గణేషుడిలా ఉందే!'' అనుకుంటూ నీళ్ళు తెచ్చి బురద మీద పోసింది. బురదలో నుండి నెమ్మదిగా గణేషుడు బయటపడ్డాడు.
''నాయనా గణేశా ఏమిటిదంతా?'' అంటూ ఆందోళనగా ప్రశ్నించింది పార్వతిదేవి.
''ముందు స్వామి వారికి శుభ్రంగా స్నానం చేయించండి'' తల్లీ అన్నది ఇంకో చిన్న మురికి ముద్ద, అంటే మూషికమన్నమాట. అని అనుకుంది పార్వతీదేవి.
''గణేషుడిని లోపలికి తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి, పట్టుబట్టలు కట్టించింది. కాని స్నానం చేస్తుంటే వచ్చే బురద వాసనకు పార్వతిదేవి ఇబ్బంది పడింది.
''అమ్మా! ఆకలేస్తోందే?'' అన్నాడు బొజ్జ పట్టుకుని గణేషుడు.
గణేషుడి కోసం చేసిన ప్రత్యేక ఉండ్రాళ్ళ పాయసం తెచ్చిపెట్టింది పార్వతి. పాయసం గిన్నె పట్టుకుని తల్లి ఒళ్ళో కూచ్చున్నాడు వినాయకుడు.
''ఏమి నాయనా! వినాయక చవితిలో కూడా నీకు ఆకలేమిట్రా... ఈ మధ్య మరీ ఎక్కువ తింటున్నావు'' అన్నది పార్వతి.
''అయ్యో! తల్లీ పేరుకే వినాయక చవితిగాని నా ఆకలి ఎవరు పట్టించుకున్నారు?'' అన్నాడు వినాయకుడు.
''తప్పు నాయనా! నీకోసం ఒక పండగ చేసుకుని, రకరకాలుగా విగ్రహాలు పెట్టి నిన్ను పూజిస్తున్న భూలోకవాసులను అలా అనకూడదు!'' అని హితవు చెప్పింది పార్వతి.
''అమ్మా! నీవు ఇంకా పాతకాలంలోనే ఉన్నావు. నన్ను భక్తి శ్రద్ధలతో పూజించేవారు బాగా తగ్గిపోయారమ్మా! ఇప్పుడు నాపేరు మీద చందాలు వసూలు చేయటం, నా భారీ విగ్రహాలు, అందునా రకరకాల రూపాల్లో ప్రతిష్టించటం నా మీద భక్తితో కాదు! తమ ఆడంబరాన్ని ప్రదర్శించటం కోసమే చేస్తున్నారు. నాది ఆరుపలకల దేహమన్నట్లు, నేను కరోనా టీకా పట్టుకున్నట్టు, కరోనా వైరస్‌ను కాలికిందేసి తొక్కుతున్నట్లు విగ్రహాలు చేశారు. వీటికి నాకు ఏమైనా సంబంధం ఉన్నదా? నీవే చెప్పమ్మా!'' అడిగాడు వినాయకుడు.
లేదన్నట్లు తలాడించింది పార్వతి.
''ఒకప్పుడు నా ముందు పుస్తకాలు, నోటుబుక్కులు పెట్టి చదువురావాలని కోరుకునే వారు! కాని ఇప్పుడలాంటివి ఏమీ లేవు. పైగా అశ్లీల పదాలతో కూడిన పాటలు పాడుతున్నారమ్మా ఈ భూలోక వాసులు'' అంటూ గణేషుడు ఫిర్యాదు చేశాడు.
అది విని పార్వతికి చిరాకు కలిగింది.
''అమ్మా! మరీ ముఖ్యమైన విషయం విను! నన్ను కూడా మతప్రచారానికి వాడుకుంటున్నారు కొందరు. మనకు ఈ కులాలు మతాలు లేవు కదమ్మా! మనషులు ఏర్పాటు చేసుకున్న ఈ రొంపిలోకి నన్నెందుకు లాగుతున్నారమ్మా! మానవత్వాన్ని పెంచాల్సింది పోయి ఉన్మాదాన్ని వెదజల్లుతున్నారమ్మా! మళ్ళీ నాకు భూలోకం వెళ్ళాలని లేదమ్మా!'' అన్నాడు బాధగా గణేషుడు.
''మనను కొందరు తమ అవసరాలకోసం వాడుకుంటున్నారు నాయనా! అవునూ! అంత బురద ఎలా అంటింది నాయనా!'' అడిగింది పార్వతి.
''అయ్యో! అమ్మా ప్రతిసారీ నీకు కొత్తే! ఈసారి కూడా నన్ను హుసేన్సాగర్లోనే నిమజ్ఞనం చేశారు!'' నిష్టూరంగా చెప్పాడు గణేషుడు.
''అదేమిటి నాయనా! హుస్సేన్‌సాగర్‌లో వేస్తే కాలుష్యం పెరుగుతుందని, అందువల్ల నిన్ను అందులో నిమజ్ఞనం చేయవద్దని హైకోర్టు ఆదేశించిందని నీ తమ్ముడు కుమారస్వామి చెబితే విని సంతోషించాను! హైకోర్టు ఆదేశించినా నిన్ను హుస్సేన్‌సాగర్‌లో ఎలా నిమజ్ఞనం చేశారు?'' ప్రశ్నించింది.
''ముందే చెప్పాను కదమ్మా. నన్ను కొందరు మత ప్రచారానికి వాడుకుంటున్నారని. వారంతా సుప్రీం కోర్టుకెళ్ళారు. అక్కడ అడ్డగోలు వాదనలు చేశారు. దాంతో ఈసారి కూడా నన్ను హుసేన్సాగర్లోనే నిమజ్ఞనం చేయమని ఆదేశించారు. విసుగ్గా అన్నాడు గణేషుడు.
''అడ్డగోలు వాదనలు ఏమి చేశారు?'' అడిగింది పార్వతి.
''తాము ఎక్కడ నిమజ్ఞనం చేయాలో తామే నిర్ణయించుకుంటామని, ఎన్నో ఏండ్లుగా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్ఞనం చేస్తున్నందున ఈసారీ అక్కడే చేస్తామని, అది తమ భక్తికి నిదర్శనమని, తమ నమ్మకాలను ఎవరూ ప్రశ్నించరాదని వాదించారు! పైగా హుస్సేన్‌సాగర్ ఎప్పుడో కలుషితమైపోయిందని, కొత్తగా ఖరాబైపోయేదేమీ లేదని, అందువల్ల అక్కడే నిమజ్ఞనం చేస్తామని వాదించారు!'' అన్నాడు గణేషుడు.
''ఇదేం విడ్డూరం వినాయకా! హైదరాబాద్‌లోని మురికి అంతా హుస్సేన్‌సాగర్‌లో కలుస్తుందని అందరికీ తెలుసు. అయినా నిన్ను అదే మురికి కూపంలో నిమజ్ఞనం చేస్తామని వాదిస్తున్నవారికి నిజంగా నీపై భక్తిలేదు. ఆ పేరుమీద ప్రజల్లో సెంటిమెంటు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్న మాట. పాలకులు కూడా హుస్సేన్‌సాగర్‌ను శుభ్రపరుస్తామని ఎన్నో ఏళ్ళ కింద చెప్పి యథావిధిగా మర్చిపోయారు. అంతా కలిసి నా ముద్దుల కొడుకును తీసుకెళ్ళి ఆ మురికి కూపంలో నిమజ్ఞనం చేస్తారా? చక్కటి మట్టి విగ్రహాలు పెట్టుకోవచ్చుకదా! ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో, రంగులతో ఆ భారీ విగ్రహాలు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారు. కాలుష్యాన్ని పంచుతున్నారు'' అంటూ ఆగ్రహం చెందింది పార్వతి.
''అలాంటి వారందరికీ విజ్ఞానం రావాలని దీవిస్తున్నానమ్మా! నా పండగే కాకుండా ఏ పండుగ వచ్చినా కుల, మతాల పేరిట కొట్టుకోకుండా, కాలుష్యం పెంచే పనులు చేయకుండా ఉండే బుద్ధిని ప్రసాదిస్తున్నాను. అది స్వీకరించితే మంచిది. ఆపై వారిష్టం!'' అంటూ దీవించాడు వినాయకుడు.
-ఉషాకిరణ్