Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా నేపథ్యంలో సంప్రదాయ మీడియా మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగావుందని వైర్ పత్రిక వ్యవస్థాపకులలో ఒకరైన ఎంకె వేణు ఇటీవల పతాక కథనం రాశారు. పత్రికలు, టీవీఛానళ్లు కష్టనష్టాలలో మునిగి పాలకులకు సన్నిహితులైన కార్పొరేట్ల ్గగుప్పిట్లోకి పోతున్నాయని ఆయన ఉదాహరణలతో సహా చెప్పారు. లేదంటే పైకి చెప్పని సబ్సిడీ దాతలు వాటిని నడిపిస్తున్నారు. దేశంలో మీడియాను మోడియాగా మారుస్తున్నారనే కథనాలు, కల్పిత వార్తల కలవరం, టీఆర్పి స్కామ్‌లలో అరెస్టులు సుప్రీం కోర్టుదాకా వెళ్లగా, మీడియా సంస్థలపై దాడులు మరోవైపు సాగుతుండగా ఈ పరిణామక్రమం ఆందోళనే కలిగిస్తున్నది. ఇదే సమయంలో సోషల్ మీడియా డిజిటల్ మీడియా విస్తరించడం, అందులోనూ అధికభాగం అధికారపార్టీల స్పాన్సర్డ్ తరహాలో నడుస్తుండగా ప్రత్యామ్నాయ ప్రజాశక్తుల ప్రయత్నాలు కూడా చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే సోషల్‌మీడియాను తనకు వ్యతిరేకంగా వాడుతున్నారని ట్రంప్ ఆరోపణలు చేయడం, మోడీసర్కార్ కూడా తమ మంత్రుల ట్వీట్లను తొలగించారని తగాదా పెట్టుకోవడం, పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ సంస్థల ప్రతినిధులు రావడానికి నిరాకరించడం చూశాం. ఏపీలో ఎల్లో మీడియా బ్లూమీడియా ఆరోపణలు, తెలంగాణలో మీడియా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలేదనే ఫిర్యాదులు వింటున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శచేసే కొన్ని మీడియా శక్తులు బీజేపీ విషయంలో గప్‌చుప్‌గా ఉండటం, లేదంటే నామకార్థంగా సరిపెట్టడం ఇంకోవాస్తవం. వీరంతాకూడా పాలక పార్టీలమధ్య గిరిటీలు కొట్టడం తప్ప ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామిక లౌకిక విలువలవంటి అంశాలను ఉపేక్షించడమే జరుగుతోంది. ఈమధ్యలో పత్రికలు, చానళ్ల సిబ్బంది జీవితాలు తలకిందులు కావడం మరో కఠోర వాస్తవం. వామపక్ష పత్రికలు మాత్రమే సమరశీల ఉద్యమాలను బలపరుస్తూ సమతుల్యంగా ఉండే ప్రయత్నం చేస్తున్నా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
పడిపోయిన ఆదాయాలు, సాంకేతిక మార్పులు
దేశంలో అత్యగ్రస్థానాన ఉండే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురణ కర్త బెన్నెట్ కాల్మన్ కంపెనీతో సహా సంక్షోభంలో చిక్కాయి. టైమ్స్ సర్క్యులేషన్ 2020లో సగానికి సగం తగ్గి తర్వాత కొద్దిగా కోలుకుంది. ఏడాదికి ఏడువేల కోట్ల వ్యాపారం జరిగిన గతానికి చేరుకునే అవకాశం ఎక్కడా లేదట. దక్షిణ భారతంలో ప్రతిష్టాత్మకమైన హిందూ, ఉత్తరాదిన హిందూస్తాన్ టైమ్స్ వంటివి కూడా దెబ్బతిన్నాయి. ఇదంతా కేవలం కరోనా కారణంగానే కాదు. కరోనా పత్రికల క్షీణతను వేగిరపర్చిందే గాని ఏకైక కారణం కాదు. మొదట టీవీ ఛానళ్లు తర్వాత డిజిటల్ మీడియా తెచ్చిన సాంకేతిక మార్పులు ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు యువతలో నలభైశాతం మొబైల్ ఫోన్లలో లాప్‌టాప్‌లలో తప్ప పత్రికలు పట్టుకుని చదవడానికి ఇష్టపడటం లేదని రాయిటర్స్ సర్వేలో తేలింది. కరోనావల్ల పంపిణీ నిలిచిపోవడం దీన్ని అలవాటు చేసింది. ఉధృతి తగ్గాక పంపిణీ పున:ప్రారంభమైనా పాత పరిస్థితి రాలేదు. పశ్చిమ దేశాల్లో పత్రికల వ్యాప్తి తర్వాత కొన్ని దశాబ్దాలకు టీవీలు వచ్చాయి. కాని ఇండియాలో డెబ్బయ్యవ దశకానికి అటూ ఇటుగా పత్రికలు టీవీలు కూడా విస్తరించాయి. 2000 సంవత్సరం మొదటి దశాబ్దంలో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టారు. అంతర్జాతీయంగా అప్పటికే పత్రికలు మూతపడే ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ విభజన ఉద్యమం మీడియానూ ప్రభావితం చేసింది. 2014 ఎన్నికల తర్వాత ఈ మార్పులన్నీ ఒక కొలిక్కి వచ్చాయి.
మోడీ సర్కారు దాడులు వత్తిళ్లు
మోడీ ప్రభుత్వం కొద్ది కాలంలోనే మీడియా స్వేచ్ఛపై దాడులు చేయడం, హేతువాద రచయితలు, సంపాదకులపై ప్రజాపక్ష మేధావులపై దాడులు పెంచడం, ఆర్నాబ్ గోస్వామి వంటివారిని ఆకాశానికెత్తడం ప్రగతిశీల మధ్యేవాద మీడియాకు విఘాతంగా పరిణమించింది. వాటిపై నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీని, ఆదాయపు పన్ను శాఖను ఉసిగొల్పి నిబంధనలు మార్చి ఆంక్షలతో వేధించడం పెరిగింది. ఎన్డీటీవీ, వైర్, న్యూస్స్కాన్ వంటివాటిపై దాడులను ఇందుకు ఉదాహరణలుగా చూడొచ్చు. అసలు ప్రధాని ఏడేండ్లలో ఒక్కసారి కూడా పూర్తి స్థాయి మీడియా సమావేశం జరపకపోవడం తూష్ణీభావాన్ని వెల్లడించింది. రాష్ట్రాలలో పాలకులు చాలామంది అదే వరవడిని అమలు చేశారు. ఎడిటర్లుగా యాంకర్లుగా తాము చెప్పినవారిని పెట్టి తమకు అనుకూలంగా కథనాలు ఇవ్వకపోతే ప్రసారాలు ప్రకటనలు నిలిపివేయడం పరిపాటిగా మారింది. మామూలుగానే పాలకవర్గాలలో ఎవరో ఒకరికి కొమ్ముకాసే అలవాటు అవసరం ఉన్న మీడియాధిపతులు, వారివెనక రాజకీయార్థిక శక్తులు స్వంత ఎజెండాలను మరింత బలంగా రుద్దడమూ పెరిగింది.
డిజిటల్ మొగ్గుకు వెనక..
మీడియా సంస్థలకు పాఠకులు లేదా ప్రేక్షకుల ద్వారా వచ్చే ఆదాయం పరిమితం. అడ్వర్టజ్మెంట్ల్లు అతి కీలక ఆర్థిక వనరు. అందులోనూ ఎఫ్ఎంసిజిలు(ఫాస్ట్మువింగ్ కన్స్యూమర్ గూడ్స్) యాడ్స్, ప్రభుత్వాల ప్రకటనలు ముఖ్యం. దేశంలో రాజకీయ విభజన తీవ్రమైన తర్వాత వ్యాపార ప్రకటనల ఆదాయం దారుణంగా పడిపోయింది. కరోనాలో యాడ్ప్ చాలా కాలం నిలిచిపోవడమే గాక నలభైశాతం రేటు తగ్గించారు. చేతికి పట్టనన్ని పేజీలు వేసిన పత్రికలు ఇప్పుడు పలచగా వస్తున్నాయి. వాటిలోని ఉద్యోగులను ఊచకోత కోశాయి. అన్నీబాగుంటేనే వార్తాఛానళ్లకు పత్రికలకు యాడ్ ఆదాయంలో ఎనిమిదిశాతం మాత్రమే వస్తుంది. అధికభాగం వినోదపు ఛానళ్లకు వెళుతుంది. డిజిటల్ మీడియా చౌకగా అందుబాటులోకి రావడమే గాక తమ చెప్పుచేతల్లో ఉంటుంది గనక యాడ్స్ అటు మళ్ళుతున్నాయి. పత్రికల సర్క్యులేషన్, టీవీల రేటింగ్స్ కన్నా డిజిటల్ మీడియాలో వీక్షకుల సంఖ్య పారదర్శకంగా ఉంటుందని అడ్వర్టయిజర్లు అంటున్నారు. అన్ని చానళ్లకూ డిజిటల్ విభాగాలు ఆదాయవనరుగా మారాయి. వాటిప్రసారాలు కూడా అందుకు తగినట్టే మలచబడుతున్నాయి. ఈ ఆదాయంపై కమిషన్ గూగుల్, యూట్యూబ్, ట్విట్లర్ వంటివాటికి ఎక్కువగా పోతుంది. వాటిలోనే వార్తలు కథనాలు చూస్తుండటంతో యాడ్స్ కూడా అటు వైపు మరలాయి. సినిమాలు కూడా ఓటిటి పేరిట నెట్‌ప్లిక్స్, అమెజాన్ వంటి వాటిలో ప్రసారమవుతుండటంతో సినిమా థియేటర్ల ప్రాభవం కొడిగట్టింది.
వీటన్నిటి ఫలితంగా పత్రికలు ఎడిషన్లు మూసివేయడం, ఇతరులకు ఇవ్వడం, వెబ్లోకిమారడం జరిగిపోతున్నది. జీ నెట్‌వర్క్‌తో సహా అమ్మకానికి పెట్టబడు తున్నాయి. లోలోపల అమ్ముడుపోయిన సంస్థలు మరెన్నో. అందుకు నిరాకరించే వాటిపైనా ఒత్తిళ్లు. ఎన్డీటీవీని అదానీ కొన్నట్టు ప్రచారం జరిగి, దాని వాటాల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. అయితే అదేమీ జరగలేదని ఆసంస్థ అధినేతలైన ప్రణరురారు, రాధికారారు ప్రకటించారు. న్యూస్‌క్లిక్‌ను లేనిపోని దాడులతో లొంగదీసుకోవాలని ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఏదో సర్వే నాటకం నడిపిస్తున్నారు. అంబానీకి తెలుగులో అతిపెద్ద మీడియా గ్రూపుతో సహా దేశవ్యాపితంగా చాలా సమాచార సామ్రాజ్యం ఉంది. బిర్లాలు అంతకుముందే రంగంలోవున్నారు. ఇప్పుడు అదానీ గ్రూపు కాలూనడంతో మీడియాలో కార్పొరేట్ పట్టు మరింత బిగుస్తుంది. ట్విటర్ వంటివి కూడా లాభాల కోసం ఆయా దేశాల పాలకవర్గాలతో ఎలాగూ అవగాహనకు వస్తాయి. అందుకే అవి డీ మానిటైజేషన్ నుంచి ఇప్పటి మానిటైజేషన్ వరకూ లోతుపాతులు విప్పిచెప్పకపోగా సానుకూలంగా చిత్రించడం, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలలో ప్రజాస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా కథనాలు వెల్లడించడం ఈ క్రమంలో మరింత పెరుగుతున్నాయి. కనుకనే మీడియా స్వేచ్ఛను కాపాడుకోవడంతో పాటు ప్రజాస్వామిక వాణిని వినిపించే కర్తవ్యం ఇంకా కష్టతరమవుతుంది.
- తెలకపల్లి రవి