Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఎన్నికల్లో సర్వసాధారణంగా వినిపిస్తున్న మాట డబ్బు. 'సొమ్ముల్లేకుండా సోకులు చేసుకోలేం...సొమ్ముల్లేకుండా రాజకీయాలు చేయలేం' అంటూ మాజీ ఎంపీ జేసీి దివాకర్‌రెడ్డి ఇటీవల సెటైర్లు వేశారు. ఎన్నికల్లో డబ్బు ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదో చెప్పేందుకు ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. 1979లో సమితి ప్రెసిండెంట్‌గా పోటీ చేస్తే...ఆయనకు అయిన ఖర్చు పదివేలు... 2018 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే రూ 50 కోట్లు ఖర్చయింది. డబ్బుల్లేకుండా రాజకీయాలు చేయలేమన్నది నేటి చర్చ. ఈ క్రమంలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు మాత్రం 'ఓటర్లు అవినీతిపరులయ్యారు. ఎంత డబ్బు ఇచ్చినా ఎవరికి ఓటేస్తారో తెలియడంలేదు. ఓటర్లు చాలా తెలివిమీరిపోయారు. దీంతోనే అత్యధికంగా ఖర్చు అవుతుంద'ంటూ బీరాలు పలుకుతున్నారు. నిజంగా ఓటర్ అవినీతిపరుడా, కాదా అన్న సంగతి అటుంచితే, ఈ అవినీతి నియంత్రణకు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నమేంటి? ప్రజాప్రతినిధిగా గెలిచేందుకు నేను డబ్బులు పంచను అని ప్రతిజ్ఞ చేస్తున్నారా? లేదు. పక్కపార్టీవోడు ఓటర్‌కు వెయ్యి ఇస్తే..అతవలి పార్టీవోడు రెండువేలు, రెండున్నరవేలు ఇస్తున్నారు. తప్ప నేను ఐదొందలే ఇస్తానడం లేదు. పైగా ఓటర్లు చాలా కాస్ల్లీ అయిపోయారంటూ నెపం వారి మీద నెడుతున్నారు. అమాయక ఓటర్లకు సారాప్యాకెట్లు ఇచ్చి తొలిరోజుల్లో ఓట్లు వేయించుకున్నారు. ఏ రోజు కూడా ఓటర్లు సారా కావాలని అడగలేదు. కానీ తర్వాత లోలోపల పదో, పరకో ఇచ్చే అలవాటు చేశారు. నాడు బ్రిటిషు వారు భారతీయులకు ఛారు అలవాటు చేసినట్టు.. మన రాజకీయ నాయకులు ఓటర్లకు ప్రలోభాలు అనే మత్తును ఎక్కించేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో డబ్బు తారాస్థాయికి చేరింది. వెయ్యి కోట్లు ఉంటే, సీఎం కావచ్చు. పదివేల కోట్లు ఉంటే పీఎం కావచ్చు అంటూ సినిమాలే వచ్చేశాయి. ఇప్పుడేమో ఓటర్లదే తప్పయినట్టు రాజకీయ నాయకులు గగ్గొలు పెడుతున్నారు. అప్పనంగా, అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఓటును సరుకుగా మార్చిందెవరు? ముందుగా అక్రమ సంపాదనను కట్టడి చేస్తే అన్ని సర్దుకుంటాయని ఓటర్ల టాక్.
- గుడిగ రఘు