Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ ఇంటికొస్తే ఏమిస్తావ్... మా ఇంటికొస్తే ఏం తెస్తావ్... అన్నట్టే ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశాల తీరు. ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని భావిస్తే దాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారు. అదే ఏదైనా సందిగ్ధత ఉంటే దాన్ని అధికారులపైకి తోసేస్తారు. ఉదాహరణకు సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటనను ప్రగతిభవన్ నుంచి నేరుగా ప్రకటించినట్టు ఆయన కార్యాలయం ప్రకటన పంపుతుంది. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికీ, టీఆర్ఎస్ పార్టీకి లబ్ది చేకూరుతుంది. అలాకాకుండా కరెంటు, ఆర్టీసీ చార్జీలను పెంచాలనుకుంటే ప్రజల్లో నెగటివ్ షేడ్స్ రాకుండా, అధికారులు, మంత్రులు అడిగారు... పరిశీలిస్తానని సీఎం చెప్పారు.. అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన పంపిస్తుంది. అసలు ఆ సమీక్షల్లో ఏం జరుగుతుందో, ఎవరేం మాట్లాడుతున్నారో... శాఖలకు సంబంధంలేని మంత్రులు, అధికారులు అక్కడెందుకు ఉంటున్నారో... ఎవ్వరికీ అర్థం కాదు... నిజంగానే అధికారులు ముఖ్యమంత్రి ఎదుట నోరు విప్పి మాట్లాడుతున్నారా లేక... బెబ్బెబ్బె... అంటున్నారో కూడా తెలీదు. ఉమ్మడి రాష్ట్రంలో సమీక్షా సమావేశాల్లోకి మీడియాను అనుమతించేవారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ప్రగతిభవన్ గడీలోకి... సారు దయతలిచి పిలిస్తే నఖశిఖ పర్యంతం సెక్యూరిటీ పరీక్షలు దాటుకుంటూ వెళ్లాలే తప్ప, స్వతంత్రించి వెళ్లేందుకు అనుమతి లేదు. ప్రగతిభవన్‌లో ఏది జరిగినా ఊరు, పేరు లేకుండా సీఎమ్ఓ వాట్సాప్ గ్రూప్‌లో ఓ మెసేజ్ పడేస్తారు...గతంలో మాదిరి ముఖ్యమంత్రి కార్యాలయ లెటర్ హెడ్లు, సంతకాలు వంటివి ఏమీ దానిలో ఉండవు. వాళ్లు చెప్పింది స్టెనోగ్రాఫర్ల లెక్క జర్నలిస్టులు రాసుకోవాలే తప్ప, క్రాస్ చెక్, క్రాస్ ఎగ్జామిన్‌కు ఎలాంటి అవకాశం లేదు. ఊరు, పేరు లేకుండా వచ్చే ఆ ప్రకటన కోసం వాట్సప్‌ను వేయికళ్లతో అర్థరాత్రుళ్లు వరకూ చెక్ చేసుకోవడమే 'జర్నలిస్టు'ల పనిగా తయారైంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అంతటి గోప్యత, అభద్రతాభావం ఎందుకో? ఇన్ని అపసోపాలు...అష్టకష్టాలతో సీఎం సమీక్షలు ఏమిటో, పరాన్నభుక్కులుగా జర్నలిస్టులకు ఈ కష్టాలు ఏమిటో అర్థమైతే ఒట్టు!
- ఎస్.ఎస్.ఆర్. శాస్తి