Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతటి గొప్ప వ్యక్తులకైనా కొన్ని బలహీనతలు, లోపాలూ ఉండటం సహజం. అంత మాత్రం చేత వారి కీర్తి ప్రతిష్టలకు వచ్చిన ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఇదే క్రమంలో బయటకు గంభీరంగా కనిపించే వారికి సైతం కొన్ని కొన్ని భయాలు, ఫోబియాలూ ఉండటం కూడా అంతే సహజం. వీటిని చూసి ఆ వీరాధివీరుల శౌర్య పరాక్రమాలను చిన్నవిగా చేసి చూడలేం. ఘనత వహించిన మన 'రాష్ట్ర ప్రభుత్వ పెద్దలది...' కూడా ఇదే పరిస్థితి అంటున్నారు వారికి సన్నిహితంగా ఉండే పెద్ద తలకాయలు. కరోనా విజృంభణ తర్వాత... సోషల్ మీడియాకు కొన్ని కొత్త కథా వస్తువులు దొరికాయి. కరోనా రాకుండా ఉండాలంటే ఆ కషాయం తాగండి, ఈ కషాయం తాగండి, ఆ మందులు వేసుకోండి, ఈ మందులు వేసుకోండంటూ అధికారిక, అనధికారిక వైద్య వీరులు మొన్నటిదాకా సామాజిక మాధ్యమాలను హోరెత్తించగా.. ఇప్పుడు ఆ గోల మరో కొత్త రూపాన్ని సంతరించుకున్నది. ప్రతొక్కడూ మాస్కు లేకుండా ఒక సెల్ఫీ, మాస్కు పెట్టుకుని మరో సెల్ఫీ, వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నాక ఒక ఫొటో, రెండో డోసుకు మరో ఫొటో, ఆఖరుకు కరోనా ఐసోలేషన్ సెంటర్లో ఉన్నా, ఆస్పత్రిలో చేరినా, వదలకుండా ఛాయా చిత్రాలు తీసి, ఫేస్‌బుక్‌కు, వాట్సాప్‌ల్లో వదిలి తెగ సంబరపడిపోతున్నారు. సామాన్యుడి దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ఇదే పరిస్థితి. మంత్రుల నుంచి ముఖ్యమంత్రుల దాకా అందరిదీ ఇదే వరస. ఈ క్రమంలో వ్యాక్సిన్లను విధిగా వేయించుకోవాలంటూ రాష్ట్ర ప్రజలకు నొక్కి వక్కాణించిన మన 'పెద్దా సారు...' ఇప్పటి వరకూ వ్యాక్సిన్ వేయించుకోలేదా..? అనే సందేహాలు జనాల బుర్రలను తొలిచేస్తున్నాయి. ఒకవేళ వేయించుకుంటే పొరుగు రాష్ట్రం సీఎంలాగా మన సారు ఫొటోగూడ పేపర్లలో రావాలి కదా..? అని మరికొందరు కొంటెగా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుసుకోవటానికి ఇటు గులాబీ నాయకులను, అటు అధికారులను గోకగా... 'ఆయనకు సూది మందంటే భయం...' అంటూ గుసగుసలాడారు. ఇది నిజమో..? కాదో.. ? తెలియదు గానీ ఆయన వ్యాక్సిన్ వేయించుకున్న వార్తలు మాత్రం ఇప్పటి వరకూ వచ్చిన దాఖలాల్లేవు.
-బి.వి.యన్.పద్మరాజు