Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకుల ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకుల పద్దుల పుస్తకాలను 'ప్రక్షాళన' చేయడానికి మోడీ ప్రభుత్వం మరో ప్రణాళికను రచించింది. రూ.2 లక్షల కోట్ల రుణాలను పారు బకాయిలుగా పేర్కొంటూ బ్యాంకులు వాటిని వదిలించుకోవడంలో సాయపడుతోంది. ఇందుకోసం రెండు సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో మొదటిది, 'నేషనల్ అసెట్ రీ కనస్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్' (ఎన్.ఎ.ఆర్.సి.ఎల్) లేదా వాడుక భాషలో చెప్పాలంటే 'బ్యాడ్ బ్యాంక్'. ఈ బ్యాంకులకు చెందిన నిష్ఫలమైన ఆస్తులను (బ్యాడ్ అసెట్లు) స్వాధీనం చేసుకుంటుంది. ఇక రెండవది ఇండియన్ డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఐడిఆర్సిఎల్). ఈ ఆస్తుల నిర్వహణా బాధ్యతలను చూస్తూ, బ్యాంకులకు బకాయి ఉన్న మొత్తాల్లో కొంతైనా రికవరీ చేసేందుకు గాను సాధ్యమైనంత మంచి ధరకు ఆ ఆస్తులను విక్రయించడానికి చూస్తుంది. ఈ సంస్థకు అవసరమైన నిపుణుల సాయం కూడా అందిస్తారు. పెద్ద మొత్తాలుగా వున్న పారుబకాయిల సమస్యను పరిష్కరించేందుకు ఇదొక వినూత్నమైన పద్ధతిగా ప్రభుత్వం తీసుకువచ్చింది. తన స్వంత విధానాలు సృష్టించిన సంక్షోభాన్ని చెరిపివేసేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
వాస్తవానికి బడా వ్యాపార సంస్థలకు పెద్ద మొత్తంలో అవాంఛనీయమైన బదిలీలు జరిపేందుకు ఒక సాధనంగా బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. అందువల్ల భారతదేశంలో పారుబకాయిల సమస్య చాలా తీవ్రంగా ఉంది. వీటిలో చాలా భాగం అనుకూలమైన కార్పొరేట్లకు పెద్ద మొత్తాల్లో ఇచ్చిన రుణాలే. వాటిని రుణ గ్రహీతలు తిరిగి చెల్లించరాదని భావిస్తారు. పైగా ఇలా రుణాలు చెల్లించలేకపోవడానికి ఊహించని రీతిలో నష్టాలు వచ్చాయంటూ బహిరంగంగా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ చాలా కేసుల్లో, బ్యాంకులు చట్టబద్ధంగా తమకు రావాల్సిన బకాయిలు రాక నిస్సహాయంగా ఉండిపోతే, మరోపక్క ప్రమోటర్లు మరింత సంపన్నులై తప్పించుకుంటున్నారనడానికి చాలా స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. రుణాలు చెల్లించలేకపోయిన కంపెనీల నుండి గానీ వారి ప్రమోటర్ల నుండి గానీ వారిచ్చిన హామీ పత్రాల ఆధారంగానే డబ్బును వసూలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ ఆస్తులను కొనుగోలు చేసే వారు దొరకడంపైన లేదా వాటిని మొత్తంగా విక్రయించడంపైనే ఈ రికవరీ ఆధారపడి ఉండటమనేది ఆందోళన కలిగించే అంశంగా ఉంది. చాలా కేసుల్లో ఈ క్రమం స్తంభించిపోతోంది. మరికొన్ని కేసుల్లో చాలా సంవత్సరాలు పడుతోంది. ఒకవేళ విక్రయించినా నిరాశాజనకమైన రీతిలో చాలా తక్కువ మొత్తం వస్తోంది.
ఈ చెల్లింపుల అధ్యాయాన్ని ముగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కనిపిస్తోంది. మరింత పెద్ద నష్టాలను సూచించేలా, ఎంత ధర వస్తే అంతకే ఈ బ్యాడ్ అసెట్లను విక్రయించేందుకు బ్యాంకులను నెట్టివేయడానికే కొత్తగా బ్యాడ్ బ్యాంక్ వ్యవస్థ రూపొందించబడింది. మొదటి దశలో రూ.90 వేల కోట్ల వరకు గల చెడ్డ రుణాలను ఎన్.ఎ.ఆర్.సి.ఎల్.కి బదిలీ చేసినప్పుడు, నష్టాలు లెక్కించబడినందున బ్యాంకులు తమకు ఎంత వస్తే అంతే తీసుకోవడానికి సుముఖంగా ఉంటాయి. ఆ తర్వాత, వ్యక్తిగత రుణాలను విక్రయించే రాయితీపై చర్చించాల్సి ఉంటుంది. ఆ రాయితీ విలువలో 15 శాతాన్ని బ్యాంక్ నగదుగా పొందుతుంది. ఆస్తుల అమ్మకం పూర్తయిన తర్వాత మిగిలిన 85శాతాన్ని సెక్యూరిటీ రసీదుల రూపంలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
ఇక రెండవ దశలో రూ.లక్ష కోట్లకు పైగా ఉన్నవాటిని విక్రయించేలా బ్యాంకులను ఒప్పించేందుకు ప్రభుత్వం ఒక హామీని ప్రతిపాదించింది. అదేంటంటే ముందుగా రుణాల మొత్తాలకు, వాస్తవంగా ఆస్తులను విక్రయించిన మొత్తాలకు మధ్యగల తేడాను భర్తీ చేస్తామన్నదే ఆ హామీ. ముందుగా చర్చించుకున్న రాయితీలను ప్రతిబింబించే ధరలకే సెక్యూరిటీ రసీదులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. స్పష్టంగా లేనటువంటి ఏవో కొన్ని గణాంకాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ హామీ లేదా గ్యారంటీ కింద రూ.30,600 కోట్ల మేరకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిజాయితీతో కూడినట్లయితే, బ్యాంకులు డిమాండ్ చేసి, మెరుగైన ధరను పొందగలుగుతాయి. తక్కువ మొత్తాల్లోనే నష్టపోతాయి. ఈ గ్యారంటీని దృష్టిలో పెట్టుకుంటే సెక్యూరిటీ రసీదులను పారు బకాయిలు కలిగిన చెడ్డ ఆస్తులుగా వ్యవహరించరాదు. వాటికి సదుపాయం కల్పించాల్సిన అవసరం లేదు కాబట్టి బ్యాంకులు పాక్షికంగా తాత్కాలిక పరిహారాన్ని పొందుతాయి. అయితే, రుణాల కోసం నిర్దేశించిన ధరను మార్కెట్ ధృవీకరించకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు లేదా గ్యారంటీలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ బ్యాంక్ నష్టాలను భరించినా తిరిగి పెట్టుబడులను కూడా సమకూర్చకపోతే, అప్పుడు అసలైన ప్రమాదం ఉంటుంది. సామాన్యుడైన డిపాజిటర్ బడా వ్యాపార సంస్థలకు బదిలీ చేసిన మొత్తాల మేరకు నష్టాల భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం తన హామీల ద్వారా ఈ నష్టాలను భర్తీ చేసినట్లైతే, పన్ను చెల్లింపుదారుడు, సామాన్య పౌరుడు ఆ ప్రభుత్వ వ్యయం తాలుకూ ప్రయోజనాన్ని కోల్పోతారు. మొత్తానికి ఏ రకంగా చూసినా కూడా పారు బకాయిలు, వాటిని ఎదుర్కొనే పథకాలు... అన్నీ కూడా ఇతరులను పణంగా పెట్టి... కొద్ది కార్పొరేట్ సంస్థలకు సంపదను బదలాయింపు చేసే మార్గాలే తప్ప మరొకటి కాదు.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం