Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఆగస్టు నెలలో ఐఎంఎఫ్ 650 బిలియన్ల డాలర్ల అప్పుల్ని స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో మంజూరు చేసింది. ఐఎంఎఫ్‌లో సభ్యదేశాలు వారి వారి కోటాలకు అనుగుణంగా ఈ రుణంలో వాటాలను పొందగలుగుతాయి. చాలా దేశాలు కనీసం ఒక ట్రిలియన్ డాలర్ల వరకు అయినా రుణం ఇవ్వవలసిందిగా అభ్యర్ధించాయి. (1000 బిలియన్లు) కాని మంజూరు అయినది అంతకన్నా తక్కువే. ఐనప్పటికీ, బాగా రుణాల ఊబిలో ఇప్పటికే కూరుకుపోయిన మూడో ప్రపంచ దేశాలకు తాత్కాలికంగానైనా ఒక ఊరట లభించనుంది. ఇందులో చాలా భాగం ఆ మూడవ ప్రపంచదేశాలకు అప్పులిచ్చిన ప్రయివేటు ఆర్థిక సంస్థల జేబుల్లోకి పోతుంది. అలా పోయినా, ఇప్పుడున్న ఈ వ్యవస్థలో ఈ రుణం ఆ దేశాలకు ఊరటనిస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఆ రుణాలు ఆయా దేశాలకు నిర్దేశించిన కోటాలకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. అంటే అందులో అత్యధిక భాగం సంపన్న దేశాలకే పోతుంది. మూడో ప్రపంచ దేశాలకు చాలా చిన్న భాగం మాత్రమే దక్కుతుంది. సాపేక్షంగా సంపన్నంగా ఉన్న 55 దేశాలకు 375 బిలియన్లు దక్కితే, వాటితో పోల్చినప్పుడు పేద దేశాలుగా పరిగణింపబడే దేశాలకు 275 బిలియన్లు మాత్రమే లభిస్తాయి. అందులోనూ మరీ పేద దేశాలుగా పరిగణించబడే 29 దేశాలకు కేవలం 27 బిలియన్లు మాత్రమే దొరుకుతాయి. నిజానికి ఐఎంఎఫ్ స్వంత అంచనాల ప్రకారమే వీటికి రానున్న ఐదేండ్ల కాలంలో 450 బిలియన్లు అవసరం!
సంపన్న దేశాలకు వాటాగా లభించే రుణాలను అవి పేద దేశాలకు బదలాయించాలని కొందరు సూచనలు చేశారు. ఆ సంపన్న దేశాలకు ఇప్పుడు ఈ రుణాలు అవసరం లేదు. పైగా అవసరమైనప్పుడు వెంటనే వాటికి అప్పు ఎక్కడైనా పుడుతుంది. అంతే కాదు. ఆ సంపన్న దేశాల కరెన్సీలు బలంగా ఉండడంతో విదేశీ రుణాల ఊబిలో (మూడవ ప్రపంచ దేశాల మాదిరిగా) కూరుకుపోయే ప్రమాదమేమీ వాటికి ఎదురు కాదు. అయితే ఈ సంపన్న దేశాలు తమ వాటాలకు వచ్చే రుణాలను పేద దేశాలకు బదలాయించాలంటే అందుకు వడ్డీ చెల్లించాలని పట్టుబడుతున్నాయి. నిజానికి ఐఎంఎఫ్ రుణానికి (స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కు) వడ్డీ ఏమీ ఉండదు. అది కేవలం ఆయా దేశాల వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలకు అదనంగా తోడవుతుంది అంతే.
ఈ ఐఎంఎఫ్ రుణం వ్యవహారంలోని మొదటి అర్థరహితమైన విషయం ఏమంటే ఆయా దేశాల అవసరాలను బట్టి కాకుండా ఆ యా దేశాలకున్న ఆర్థికస్తోమతను బట్టి (ఏ దేశం ఐఎంఎఫ్‌లో ఎంత వాటా పెట్టుబడి పెట్టింది అన్నదానిని బట్టి) రుణాలను కేటాయిస్తారు. ఎవరికి అత్యవసరంగా రుణం అవసరమో వారికి అతి తక్కువగాను, ఎవరికి రుణం అవసరం అతి తక్కువగా ఉందో, వారికి అతి ఎక్కువగాను ఈ రుణాలు అభిస్తాయి.
ఇక రెండవ అర్థరహిత విషయం : అసలు మూడవ ప్రపంచ దేశాలు అప్పులపాలవడానికి మూలకారణ మేమిటన్నది పట్టించుకోకపోవడం. ప్రస్తుత వ్యవస్థ ఎలాగో ఒకలా కొనసాగడానికి మాత్రమే ప్రస్తుత రుణం తోడ్పడుతుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న దేశాలకు కాస్త ఊపిరి పీల్చుకోడానికి మాత్రమే తోడ్పడుతుంది తప్ప ఆ దేశాల మౌలిక సమస్యను పరిష్కరించదు. అప్పుల్లో చిక్కుకున్న దేశాలకు రెండు అంశాలు అత్యావశ్యకంగా పరిష్కరించబడాలి. అందులో కొట్టవచ్చినట్టు కనిపించేది రుణాల రద్దు. ఆ పని జరగకపోతే ఇప్పుడిచ్చిన రుణం పాత అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతుంది. ఇక వైద్య సేవలందించడానికో, విద్యారంగానికో, ఇతర అత్యవసర సామాజిక సేవలకో ఖర్చు చేయడానికి పేదదేశాలవద్ద ఏమీ మిగలదు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన రుణం తాత్కాలిక ఊరట కలిగిస్తుందే తప్ప ఈ రుణాలను మొత్తంగానే రద్దు చేయాలన్న విషయంపై జరగవలసిన చర్చ యావత్తూ మరుగున పడిపోయింది.
రుణాల రద్దు తక్షణం అవసరమైన చర్య అయినప్పటికీ, దానితోనే మూడవ ప్రపంచ దేశాల రుణ సమస్య తీరిపోదు. మన దేశంలో రైతులకు ఒకసారి రుణ మాఫీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పులపాలైనట్టు మూడవ ప్రపంచ దేశాలు కూడా మళ్ళీ మళ్ళీ అప్పుల పాలవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఆ దేశాలన్నీ చిక్కుకుపోయిన నయా ఉదారవాద విధానాల ఉచ్చులోనుంచి బైట పడాలి.
మూడవ ప్రపంచ దేశాలకున్న మౌలిక సమస్య ఏమిటి? ఇప్పటికే చేసిన అప్పుమీద వడ్డీలను చెల్లించడం అనేది సమస్యే అయినా, దానితో నిమిత్తం లేకుండా ఆ దేశాలకు విదేశీ చెల్లింపుల లోటు సమస్య పదే పదే తలెత్తుతూనేవుంటుంది. ఆ దేశాలనుండి చేసే ఎగుమతుల ద్వారా లభించే విదేశీ మారక ద్రవ్యం కన్నా ఆ దేశాలలోకి వచ్చే దిగుమతుల నిమిత్తం చెల్లించవలసిన విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. ఆ కొరవ పూడ్చుకోడానికే బైట నుండి అప్పులు చేయాల్సివస్తుంది. ఎగుమతుల ఆదాయం పెరగడమో, దిగుమతులను తగ్గించుకోవడమో చేసి ఆ విదేశీ చెల్లింపుల లోటు సమస్య నుండి బైట పడాల్సిందే. ఒకటి, రెండు సార్లు అప్పులను మాఫీ చేసినంతమాత్రాన పరిష్కారం రాదు. మళ్ళీ అప్పు పెరుగతూనేవుంటుంది.
ఈ విదేశీ చెల్లింపుల లోటు ఎందుకు ఏర్పడుతూ వుంటుంది? అవశ్యంగా దిగుమతి చేసుకోవలసిన వాటికే పరిమితమయేలా దిగుమతులను ప్రభుత్వం నియంత్రించడానికి నయా ఉదారవాద విధానం అనుమతించదు. అటువంటప్పుడు ఆ దేశం తన విదేశీ చెల్లింపుల లోటును భర్తీ చేసుకోడానికి తన కరెన్సీ మారకపు రేటును తగ్గించుకోవలసివస్తుంది. అలా గనుక చేస్తే అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ ఉండే దేశానికి, నయా ఉదారవాద విధానం అమలు జరుగుతున్న దేశానికి మధ్య తేడాను ఒక ఉదాహరణ ద్వారా వివరించవచ్చు.
తదేశంలో సంపన్నులు ఉపయోగించే కొన్ని రకాల విలాస వస్తువులను, కార్లను, ఉపకరణాలను ఇక్కడే దేశీయంగానే ఉత్పత్తి చేయడం అంత తేలికగా జరిగేపని కాదు. వాటిని దిగుమతి చేసుకుంటారు. అలా దిగుమతి చేసుకున్న వాటి ధరలు ఎక్కువగా ఉంటే వినియోగించేవారు తగ్గుతారు. అప్పుడు ఆ వస్తువుల దిగుమతులూ తగ్గుతాయి. ఆ వస్తువులను పరిమితంగానే దిగుమతి చేసుకోవాలని ఆంక్షలు విధిస్తే అప్పుడు నేరుగానే దిగుమతులు తగ్గుతాయి. ఆ తరహా దిగుమతులకోసం వెచ్చించాల్సిన విదేశీ మారకద్రవ్యం మనం పొదుపు చేయవచ్చు. ఆ విలాసవస్తువుల ధరలు పెరిగినంత మాత్రాన సామాన్య ప్రజల జీవన ప్రమాణాలేమీ దెబ్బతినిపోవు. అలా జరిగితే దాని ప్రభావం ఎగుమతులపైన కూడా పడదు. అప్పుడు విదేశీ చెల్లింపుల లోటు తగ్గుతుంది. అలా తగ్గినందువలన దేశంలో ఉపాధి అవకాశాలు గాని, కార్మికుల జీతాల స్థాయి కాని తగ్గిపోవు.
అలా కాకుండా, దిగుమతులమీద ఎటువంటి ఆంక్షలూ లేకుండా వదిలిపెట్టి విదేశీ చెల్లింపుల లోటును భర్తీ చేయడం కోసం మన కరెన్సీ మారకపు రేటును తగ్గించుకోడానికి సిద్ధపడితే అప్పుడు దాని ఫలితంగా మనం దిగుమతి చేసుకునే అన్ని రకాల వస్తువుల ధరలూ పెరుగుతాయి. చమురు వంటి అత్యవసర సరుకుల ధరలూ పెరుగుతాయి. దాని వలన ప్రజలు ఉపయోగించే ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. అన్ని రకాల సరుకుల ధరలూ పెరగడంతోబాటు కార్మికుల వేతనాల నిజవిలువలు పడిపోతాయి. ఇలా కార్మికుల నిజవేతనాలను తగ్గించకపోతే కరెన్సీ మారకపు రేటును అలా నిరంతరం తగ్గించుకుంటూనే పోవలసివస్తుంది. ఉదాహరణకి : కరెన్సీ మారకపు రేటును 10శాతం తగ్గించారు అనుకుందాం. అప్పుడు దాని వలన దేశంలో ధరలు 10శాతం పెరుగుతాయి. అప్పుడు కూడా పెట్టుబడిదారుల లాభాల మార్జిన్ గాని, కార్మికుల నిజవేతనాలు గాని తగ్గకుండా కొనసాగాయనుకుంటే దానర్ధం కరెన్సీ మారకపు రేటు వాస్తవంగా తగ్గలేదని భావించాలి. (అక్కడ కరెన్సీ మారకపు రేటు ఎంత తగ్గిందో అదే మేరకు ఇక్కడ ధరలు పెరిగాయి కనుక ఆ మారకపు రేటు తగ్గడమనేది వాస్తవంలో ఎటువంటి ప్రభావాన్నీ చూపదు) అప్పుడు విదేశీ చెల్లింపుల లోటు భర్తీ కోసం మళ్ళీ కరెన్సీ మారకపు రేటును తగ్గించడం, దానివలన మళ్ళీ ధరలు ఆ మేరకు పెరగడం, ఇలా ఎన్ని సార్లైనా కొనసాగుతుంది. దానివలన విదేశీ చెల్లింపుల లోటు సమస్య పరిష్కారమూ కాదు.
అందుచేత ఆ సమస్య పరిష్కారం కావాలంటే కార్మికుల నిజవేతనాలను కుదించడం ద్వారానే అది సాధ్యపడుతుంది. (పెట్టుబడిదారులు తమ లాభాల మార్జిన్ ను తగ్గించుకోడానికి ఎన్నడూ అంగీకరించరు) విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు ఎంత ఎక్కువగా ఉంటే కార్మికుల నిజవేతనాల కుదింపు అంత భారీగా ఉంటుంది.
కరెన్సీ మారకపు రేటుకు ఒక ఉమ్మడి ప్రాతిపదిక ఉండడం, దిగుమతుల మోతాదుపై ఆంక్షలు ఉండడం, దానికి తగినట్టు వివిధ రకాల సరుకులపై వివిధ రేట్ల సుంకాలు విధించడం (దీనినే మల్టిపుల్ ఎక్స్ఛేంజ్ రేట్స్ అంటారు) అనేది మెరుగైన విధానం. దానికి బదులు ఏకైక మారకపు రేటు ఉండడం, ఒకే ఒక దిగుమతి సుంకం రేటు ఉండడం అనేది ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు కోరుతాయి. ఏకీకృత మారకపు రేటు అనేది ఒక షరతుగా మూడవ ప్రపంచ దేశాలపై నయా ఉదారవాద విధానం రుద్దుతుంది.
ఈ విధమైన సమస్యలు తలెత్తకుండా, విదేశీ చెల్లింపుల లోటు సమస్య రాకుండా, ఆ లోటు కారణంగా మోయలేని అప్పులబారిన పడకుండా ఉండే వ్యాపార పద్ధతి ఒకటుంది. 1960-1970 దశకాలలో భారతదేశం సోవియట్ యూనియన్‌తోను, తూర్పు యూరప్ సోషలిస్టు దేశాలతోను ఈ పద్ధతిలో వ్యాపార ఒడంబడికలు చేసుకునేది. ఆ దేశాలనుండి మనకు కావలసిన సరుకులను దిగుమతి చేసుకోవడం, వారికి అవసరమైన సరుకులను ఎగుమతి చేయడం జరిగేది. బ్యాలెన్స్‌ను వెంటనే చెల్లించే పద్ధతిని అమలు చేయకుండా ఆ బ్యాలెన్స్‌ను పుస్తకాలలో చూపించేవారు. ఆ తర్వాత కాలంలో సాగించే ఎగుమతులు, దిగుమతులు ద్వారా ఈ బ్యాలెన్స్‌ను సెటిల్ చేసుకునేవారు. ఇప్పుడు నయా ఉదారవాద విధానాల కాలంలో అటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలను ఎక్కడికక్కడ చేసుకోడానికి వీలు లేదు. అంటే అనివార్యంగా మూడవ ప్రపంచ దేశాలు సంపన్నదేశాల అప్పుల వలలో చిక్కుకోవలసిందే.
ఇప్పటికీ సంపన్న పశ్చిమ దేశాలకు, మూడవ ప్రపంచపు అత్యధిక దేశాలకు నడుమ జరిగే వ్యాపారాల్లో సంపన్న దేశాలు ఉత్పత్తి అయిన సరుకులను అమ్మితే, మూడవ ప్రపంచ దేశాలు ఎక్కువగా ముడిసరుకులను అమ్ముతున్నాయి. (కొన్ని ఆసియన్ దేశాలకు సంపన్న దేశాలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను తరలించాయి. ఆ దేశాలు మాత్రం కొంత మినహాయింపు). సాపేక్షంగా చూసినప్పుడు ముడిసరుకుల ధరలు ఎప్పుడూ తగినంత పెరుగుదల లేకుండా కొనసాగుతాయి. పారిశ్రామిక సరుకుల ధరలు నిరంతరం ఏదో ఒక పేరుతో నిరంతరం పెరుగుతూ ఉంటాయి. ఇది మూడవ ప్రపంచదేశాలకు ప్రతికూల పరిస్థితినే కల్పిస్తుంది. నయా ఉదారవాద విధానాలు ఈ రెండు ప్రపంచాలనూ విడివిడిగా ఉండకుండా కట్టిపడేశాయి. దాంతో మూడవ ప్రపంచదేశాలు తప్పనిసరిగా అప్పుల వలలో చిక్కుకుపోతున్నాయి.
అందుచేత తాజాగా ఐఎంఎఫ్ విడుదల చేసిన రుణం మూడవ ప్రపంచ దేశాలకు తాత్కాలికంగా కొంత ఉపశమనం కల్పించినప్పటికీ, అది మౌలికంగా ఈ అసమాన వ్యవస్థను కొనసాగించే లక్ష్యంతోనే మంజూరు చేసింది. పాతకాలంలో భారతీయ వ్యవసాయానికి సంబంధించి ఒక నానుడి ఉండేది. ''అప్పు రైతును నిలబెడుతుంది. ఎలాగంటే ఉరితాడు ఉరితీయబడినవాడిని నిలబెట్టినట్టు'' అన్నది ఆ నానుడి. నయా ఉదారవాద వ్యవస్థలో మూడవ ప్రపంచ దేశాలదీ ఉరివేయబడిన రైతు పరిస్థితే.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్