Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ ఏడు సంవత్సరాల పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించిందనీ, ఇప్పుడీ ''బంగారు తెలంగాణ''లో పాలూ తేనే ప్రవహిస్తున్నాయని, గిట్టనివారికి మాత్రమే అవి కనబడడం లేదని తెలంగాణాధీశులు, వారి అనుయాయులు పదే పదే ప్రవచిస్తుంటారు. తెలంగాణలో సమస్యలే లేవని అంటుంటారు. అన్ని ప్రచార సాధనాలనూ తమ గుప్పెట్లో పెట్టుకున్నారు గనుక, ఇటువంటి విషయాల మీద ప్రజలకు నిజాలు చెప్పే బాధ్యత ఉన్న సామాజిక వ్యాఖ్యాతలలో అత్యధికులను రాగ్ దర్బారీలో భాగం చేశారు గనుక, మరికొందరిని నిర్లిప్తతలోకి, మౌనంలోకి, భయంలోకి పంపించారు గనుక ఇప్పుడిక పాలక కథనానికి భిన్న కథనం వినిపించడమే కష్టమై పోయింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన నడవడం లేదు. నిధులు కొందరి కైంకర్యమై పోయాయి. నీళ్లను సెంటిమెంటుగా మార్చి వేల కోట్ల దోపిడీని ప్రవహింపజేశారు. నియామకాలు లేవు. తెలంగాణలో కోరుకున్న స్వపరిపాలన ఏర్పడిన ఏడు సంవత్సరాల తర్వాత కూడ అంతకు ముందరి జనజీవన సమస్యలు తగ్గకపోగా పెరిగిపోతున్నాయి. పోలీసులకు అపరిమిత అధికారాలు, విపరీతంగా వనరులు ఇచ్చి రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చినప్పటికీ, నేర వాతావరణం పెరుగుతున్నది. పాలనలో విపరీతమైన అవినీతి, ప్రజాధన దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం సాగుతున్నాయి. రుణభారం, నిరుద్యోగం, ఆర్థిక అంతరాలు, అవిద్య, అనారోగ్యం వంటి పాత సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగ ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి మీద సెంటిమెంట్ ముసుగు కప్పి కనబడకుండా చేస్తున్నారు.
అయితే ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని మూసివేయడమో, కనబడకుండా చేయడమో కొద్ది కాలమే సాధ్యమవుతుంది గాని, ఎల్లకాలానికి ఈ మూసివేత వ్యవహారం సాగదు. ఆ సమస్య గురించి వాస్తవాలను ఎప్పటికప్పుడు బైట పడనిస్తే, ఆ సమస్య మీద లోపలనే విమర్శలను కూడ ఆహ్వానించి సకాలంలో సర్దుబాటు ప్రయత్నాలు చేస్తే సమస్యలు కొంతలో కొంత పరిష్కారం అవుతాయి. అలా కాక మూసిపెడితే, చిన్నమెత్తు పరిష్కారం కూడ కాదు సరిగదా, మురిగిపోయి మన ఖ్యాతి దేశాంతరాలకు వ్యాపిస్తుంది. ఇది తరతరాలుగా మనుషులకు తెలిసిన వివేకమే గాని తెలంగాణ పాలకులు మాత్రం మూసిపెట్టే, భిన్నస్వరం వినబడనివ్వని మార్గమే ఎంచుకున్నారు. లేదా ఎక్కడెక్కడో ఎవరెవరో వాళ్ల ప్రయోజనాల కోసం చేసిన పొగడ్తల దండలు వేసుకుని ఊరేగుతూ, మా ఘనతను ఎందరు గుర్తిస్తున్నారో చూడండి అని నిజమైన తెలంగాణ శ్రేయోభిలాషులను దబాయించడం మొదలుపెట్టారు. అటు సమస్యలను మూసిపెట్టినా, ఇటు అరువు పరిమళాలు అద్దుకుని ఊరేగినా, లోపల సమస్యలు సమసిపోవు. ఇప్పుడు మన నిర్వాకం గురించి వెలువడుతున్న నివేదికలే సాక్ష్యం.
గత రెండు మూడు వారాలలోనే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన వేరువేరు నివేదికలు, చర్యలు, అంతర్జాతీయ పరిణామాలు, తెలంగాణ సమస్యలను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బైటపెట్టాయి. ఆ నివేదికల వెల్లడింపులు తెలంగాణ ప్రభుత్వ పనితీరు మీద ఆశావహమైన, సంతృప్తికరమైన పద్ధతిలో మాత్రం లేవు.
కేంద్ర ప్రభుత్వంలోని గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ గణాంక కార్యాలయం నిరంతరాయంగా జాతీయ శాంపిల్ సర్వేలు జరుపుతుంది. ఒక్కొక్క రౌండ్ సర్వేకు ఒక్కొక్క ప్రత్యేక అంశాన్ని ఎంచుకుంటారు. సెప్టెంబర్ రెండోవారంలో వెలువడిన 77వ రౌండ్ నివేదిక అఖిలభారత రుణభార, మదుపు సర్వేకు సంబంధించినది. అది 2019 జనవరి నుంచి డిసెంబర్ వరకు సమాచారాన్ని సేకరించింది. ఆ నివేదికలో పొందుపరిచిన సమాచారమంతా 2018 సంవత్సరానికి సంబంధించినది.
ఆ నివేదిక ప్రకారం విపరీతమైన రుణభారం ఉన్న రైతు కుటుంబాల నిష్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిన ఘనత సాధించింది. అలా ఊరికే రెండో స్థానం అంటే కూడ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో తెలియదు. రాష్ట్రంలోని మొత్తం రైతు కుటుంబాలలో 91.7 శాతం రుణభారంతో కునారిల్లుతున్నాయి. తెలంగాణ కంటే పైన ఉన్నది 93.2శాతం కుటుంబాల రుణభారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే. ఈ మాత్రంతో కూడ సమస్య తీవ్రత పూర్తిగా తెలియదు. దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల సగటు అప్పు రూ.74,121 కాగా, తెలంగాణలో అది రూ.1,52,113. ఈ సగటు అంకెలు వాస్తవ స్థితికి స్థూల సూచిక మాత్రమే అనుకున్నా, దేశవ్యాప్తంగా రైతు కుటుంబపు సగటు అప్పు కన్న తెలంగాణ రైతు కుటుంబపు సగటు అప్పు రెట్టింపు కన్న ఎక్కువ ఉందనేది ఒప్పుకోక తప్పని చేదు వాస్తవం. అదీ ''బంగారు తెలంగాణ'' అసలు దృశ్యం.
ఈ అంకెను ఇంకాస్త లోతుగా పరిశీలించవలసి ఉంది. తెలంగాణ రైతులు పొందిన మొత్తం రుణాలలో 42.5శాతం మాత్రమే సంస్థాగత రుణాలు. అంటే ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ ద్రవ్య సంస్థలు, సహకార సంస్థలు తక్కువ వడ్డీ రేట్లతో ఇచ్చిన రుణాలు. ఇదే గణాంకాన్ని బ్యాంకుల వైపు నుంచి చూస్తే, దేశవ్యాప్తంగా సగటున బ్యాంకులు 44.5శాతం రైతు కుటుంబాలకు రుణాలు ఇస్తుండగా, తెలంగాణలో మాత్రం అది 24.8శాతం రైతు కుటుంబాలకు మాత్రమే అందుతున్నది.
ఆ నివేదిక రైతుల రుణ వనరులను మరింత వివరంగా కూడ నమోదు చేసింది. మిగిలిన 57.5శాతం రుణగ్రహీత రైతులలో 9.1శాతం బంధు మిత్రుల దగ్గర రుణాలు తీసుకోగా, 41.3శాతం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకున్నారు. రైతులు ఎంతెంత అధిక వడ్డీలకు రుణాలు తీసుకున్నారో, అసలు, వడ్డీ చెల్లించలేక ఏయే ఇబ్బందులకు గురవుతున్నారో, ఏ విషవలయాల ఊబిలోకి దిగజారి స్థిర, చరాస్తులను అమ్ముకోవలసి వస్తున్నదో, ఎందరు రైతులు కూలీలుగా, బిచ్చగాళ్లుగా మారుతున్నారో ''బంగారు తెలంగాణ''కు లెక్కలేదు.
ఇలా తీసుకున్న రుణాలను రైతులు వినియోగ, వివాహ, శుభకార్యాల, వైద్య, ఆరోగ్య అవసరాలకు వాడి దుబారా చేస్తుంటారని ఒక అపోహ చాలమంది పరిశీలకులకు ఉంటుంది. కాని ఈ నివేదిక అది నిజం కాదని, రుణాలలో దేశ స్థాయిలో 57శాతం రుణాలు వ్యవసాయ అవసరాలకే వినియోగ పడుతున్నాయని చెప్పింది. తెలంగాణలోనైతే అది ఇంకా ఎక్కువగా 66శాతంగా ఉంది.
ఈ రుణభార గణాంకాలన్నీ కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందరివి. కోవిడ్‌తో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినతర్వాత ఈ రుణభారం మరెంత పెరిగి ఉంటుందో ఊహించడానికే భయం వేస్తుంది.
ఇక ప్రతి సంవత్సరం దేశంలో జరిగిన నేరాల గణాంకాలను ప్రకటించే నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2020 నివేదిక కూడ సెప్టెంబర్ రెండోవారం చివరిలోనే వెలువడింది. ఆ నివేదిక తెలంగాణను మానవ అక్రమ రవాణా (యువతులను వ్యభిచార గృహాలకు అమ్మివేయడం అనే అమానుష నేరానికి ముద్దు పేరు అది!)లో రెండో స్థానంలో పెట్టింది. అక్కడ తెలంగాణ కంటె ముందున్నది మహారాష్ట్ర ఒక్కటి మాత్రమే. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 29రాష్ట్రాలలో కలిసి 900కేసులు నమోదు కాగా, ఒక్క తెలంగాణలోనే 104 కేసులు నమోదయ్యాయి. తప్పనిసరిగా, ఈ నేరానికి సంబంధించి జరిగిన నేరాలలో సగమో పావో మాత్రమే నమోదవుతాయనే వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని, అందులోనూ తెలంగాణ ముందుందని గుర్తించాలి.
ఈ నివేదిక ప్రకారం తెలంగాణ గృహ హింస నేరాలలో దేశంలో ఐదో స్థానంలో, చిన్నారులపై లైంగిక నేరాల కేసులలో ఏడో స్థానంలో, దళితులపై నేరాలలో ఏడో స్థానంలో, ఆదివాసులపై నేరాలలో నాలుగో స్థానంలో, ఆర్థిక నేరాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. అన్ని రంగాలలోనూ మొదటి పదిలో ఉన్నామన్నమాట. మానవాభివృద్ధి సూచికలలో రావాల్సిన స్థానాలు, అందుకు విరుద్ధ పరిణామాలలో వస్తున్నాయన్నమాట.
అలాగే, ఐటి రంగంలో హైదరాబాద్ ఉరుకులు పరుగులతో ముందుకు సాగుతున్నదని తెలంగాణాధీశులు పదే పదే చెపుతుంటారు. నిజంగానే, తెలంగాణలో సైబర్ నేరాలు 2018తో పోలిస్తే నాలుగురెట్లు పెరిగాయి. సైబర్ నేరాలు 2018లో 1205 ఉండగా, 2019లో 2691, 2020లో 5,024 నమోదయ్యాయి. మొత్తంగా నేరాల ''వృద్ధి రేటు'' అన్ని అభివృద్ధి సూచికల, సంక్షేమ సూచికల వృద్ధి రేటు కన్న చాలా ఎక్కువగా 12శాతంగా ఉన్నది.
సాధారణంగా నేర విచారణా ప్రక్రియలో ఆస్తి, పేదరికంతో పాటు ప్రధానమైన నేరకారణాల జాబితాలో మద్యపానం, మాదక ద్రవ్యాల ప్రభావం అన్నిటికన్న ముందు పరిశీలిస్తారు. జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలనూ, రాష్ట్ఱంలో విచ్చలవిడిగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న, ఎక్సైజ్‌శాఖకు టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్న ప్రభుత్వ వైఖరినీ కలిపి చూడవలసి ఉంది. ఒకవైపు మద్యం అమ్మకాల విషయంలోనే గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వ వైఖరి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ వైఖరికన్న ఏమీ మారలేదని తెలుస్తుండగా, తెలంగాణలో మాదకద్రవ్యాల వినియోగం గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. హైదరాబాద్ పరిసరాలలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఫామ్ హౌజులు, రిసార్టులు, గెస్ట్ హౌజులు మాదకద్రవ్యాల వినియోగానికి నిలయాలుగా మారాయని కనీసం మూడు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌లో, ప్రభుత్వ కాంట్రాక్టుల అవినీతిలో విపరీతంగా పోగవుతున్న నయాసంపన్న వర్గపు అక్రమధనం మద్యం వ్యాపారంలోకీ, మాదకద్రవ్యాల వ్యాపారంలోకీ ప్రవహిస్తున్నది. ఈ మాదకద్రవ్య వ్యాపార మాఫియాను అరికట్టవలసిన ప్రభుత్వ పెద్దలే మాదకద్రవ్య వినియోగదారులనో, వ్యాపారులనో, బ్రోకర్లనో రక్షిస్తున్నారని కూడ తెలంగాణ కోడై కూస్తున్నది. మాదకద్రవ్యాల సంగతే తెలియని శుద్ధ అమాయకులు అని రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కితాబు పొందిన సినిమానటులు, రాజకీయ నాయకులు, సంపన్నులు కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తుకు లక్ష్యం కావడం చూస్తుంటే ఏది సత్యం, ఏదసత్యం అని అనుమానించవలసి వస్తున్నది.
ఇటువంటి లుకలుకలను, అక్రమాలను మూసిపెడుతూ, ''మమ్మల్ని వాళ్లు పొగిడారు, వీళ్లు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు, లేదురా ఇటువంటి భూమి ఇంకెందు'' అని జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు చూపుకోవడం తెలంగాణాధీశులకు ఆనవాయితీగా మారింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాంకులలో ఏడాదికేడాదికీ పైపైకి పాకిపోతున్నాం అని ప్రగల్భాలు పలుకుతుండేవారు. స్వయంగా ప్రపంచ బ్యాంకే, ఆ డూయింగ్ బిజినెస్ నివేదికల్లో రాంకులు అక్రమాల వల్ల, ఆ నివేదికలు తయారుచేసిన నిపుణుల అవినీతి వల్ల తారుమారు అయ్యాయని, అందువల్ల ఇక నుంచి అసలు ఆ నివేదికనే రద్దు చేస్తున్నామని ఈ వారమే ప్రకటించింది. ఇప్పటికి చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాల రాంకులు అక్రమంగా ప్రకటించామని ఒప్పుకున్నారు గాని, తవ్వుతూ పోతే మరెన్ని కంకాళాలు బైటపడతాయో?!
ఈ వ్యాసం రాస్తుండగానే, రాష్ట్రప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ ఒక బహుళ జాతి వ్యాపార ప్రకటనల సంస్థతో కుంభకోణం జరిపి, తెలంగాణ ప్రజాధనం ఎట్లా కొల్లగొట్టిందో వార్తలు వస్తున్నాయి. అబ్బ, ఏమి బంగారు తెలంగాణ!!
- ఎన్. వేణుగోపాల్
సెల్: 9848577028