Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచాయి. రాష్ట్రాన్ని ఏలుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రాష్ట్రంలోనూ, పాత ఆంధ్రప్రదేశ్ కాలంనాటి జీఓలనే కొనసాగిస్తున్నది. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో దశాబ్ధ కాలం గడిచినా కొత్త జీఓలు విడుదల చేయకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నది. 2015లోనే టి.ఎస్.ఐపాస్ చట్టం తెచ్చి పారిశ్రామికాధిపతులకు భూములు, రాయితీలు ఇచ్చి సకల మర్యాదలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలనే సోయి మాత్రం లేదు. ఇంకా మాయ మాటలతో, గారడీ వాగ్దానాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత వందేండ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగులేబర్ కోడ్లుగా మార్చి, కార్మికవర్గాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు ఒడిగట్టింది. దేశ సహజ వనరులను, ప్రజా సంపదైన ప్రభుత్వరంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తెగనమ్ముతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు, 73షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీఓలు సాధించుకునేందుకు పోరాటం తప్ప మరో మార్గం లేదు. అందుకే 2021 అక్టోబర్ 8న రాష్ట్రవ్యాప్త సమ్మెకు సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో యూనియన్ అనుబంధాలతో నిమిత్తం లేకుండా యావత్ తెలంగాణ కార్మికవర్గం ఐక్యంగా సమ్మె కదనరంగంలోకి దూకేందుకు సన్నద్ధమౌతున్నది.
రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో సుమారు కోటీ ఇరవై లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. బీడీ, నిర్మాణ రంగం, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ రంగంలోని ఇంజనీరింగ్, కాగితం, ఫార్మా తదితర పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్‌లు, హౌటల్స్, రెస్టారెంట్లు, పవర్లూమ్, చేనేత, ప్రయివేట్ నర్సింగ్ హౌంలు, ప్రింటింగ్ ప్రెస్‌లు, సెక్యూరిటీ సర్వీసులు, ఇంటి పనివారలు, ఇటుక, సున్నం బట్టీలు, రైస్, ఆయిల్, జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్స్, సినిమా హాళ్ళు, ప్లాంటేషన్లు, ప్రభుత్వ సంస్థల్లోని కాంట్రాక్ట్ కార్మికులు, ప్రాజెక్టులు, డ్యామ్‌లు, స్టోన్ బ్రేకింగ్, స్టోన్ క్రషింగ్ తదితర రంగాలన్నీ షెడ్యూల్డ్ పరిశ్రమల జాబితాలో ఉన్నాయి. ఈ రంగాల కార్మికులకు కనీస వేతన చట్టం - 1948 ప్రకారం ప్రతి ఐదేండ్లకొకసారి పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీస వేతనాలు సవరిస్తూ, కొత్త వీడీఏ పాయింట్లతో కనీస వేతనాల జీఓలను రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ చేయాలి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి పాత జీఓలే ఇంకా తెలంగాణలో కొనసాగుతుండటం ప్రభుత్వానికి సిగ్గుచేటైన విషయం. 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం నుండి ఈ షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికుల వేతనాలు పెంచాలని సిఐటియు, ఇతర కార్మిక సంఘాలు పదే పదే విజ్ఞప్తులు చేసినా టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల గోస పట్టించుకోలేదు. 2014-2016 సంవత్సరాల్లో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చేసిన సిఫారసులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఈ ఏడేండ్ల కాలంలో కనీస వేతనాలు సవరించి, అమలు చేయనందున ఒక్కో కార్మికుడు లక్షలాది రూపాయలు ఆర్థికంగా కోల్పోయాడు. ఇంతటి ఘోర అన్యాయం మరెక్కడా లేదు. ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పిఆర్సిని ఇచ్చింది. 2018 జూలై 1 నుండి అమలయ్యే పిఆర్సిలో కనీస వేతనం రూ.19,000లుగా నిర్ణయించింది. పిఆర్సి నిర్ణయించిన వేతనాలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండే చెల్లించాలి. అదే షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికుల వేతన భారం ప్రభుత్వ ఖజానాపై నయా పైసా ఉండదు. ఈ పరిశ్రమల్లో వేతనాలను ఆయా యాజమాన్యాలే చెల్లించాల్సి ఉన్నది. అయినప్పటికీ ఇదే రూ.19,000లు కనీస వేతనాన్ని షెడ్యూల్డ్ పరిశ్రమల్లో నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరమేమిటి? ఇది పెట్టుబడిదారులు - యజమానులతో లాలూచీ పడి కార్మికవర్గానికి ద్రోహం చేయడం కాదా? ఇటీవల జూన్ నెలలో 5 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనం రూ.18,029లుగా నిర్ణయించి, ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. 3 నెలలు గడిచినా వాటిని గెజిట్‌లో ప్రకటించడానికి ప్రభుత్వం కుంటి సాకులు చెబుతున్నది. ఇది సిఐఐ, ఎఫ్టిసిసి లాంటి యాజమాన్య సంఘాల ఒత్తిడికి తలొగ్గి, కార్మికుల కనీస వేతనాలను ఎగ్గొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప మరొకటి కాదు. ఈ చర్యలను ప్రతిఘటించేందుకే అక్టోబర్ 8 రాష్ట్రవ్యాపిత కార్మిక సమ్మె జరగనున్నది.
కనీస వేతనాల జీఓల సాధన, నాలుగు లేబర్ కోడ్ల రద్దు లక్ష్యంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ''కార్మిక గర్జన'' పాదయాత్ర సెప్టెంబర్ 8న రంగారెడ్డి జిల్లా కొత్తూర్ పారిశ్రామిక ప్రాంతంలో ప్రారంభమైంది. సీఐటీయూ రాష్ట్ర నాయకులు కామ్రేడ్స్ ఎస్. వీరయ్య, భూపాల్, పాలడుగు భాస్కర్, పి. జయలక్ష్మి ఈ పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. దీనితో పాటు సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో కార్మిక పోరుయాత్ర సాగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో స్థానికంగా పాదయాత్రలు చేస్తున్నారు. కార్మిక గర్జన యాత్ర సందర్భంగా హైదరాబాద్ చుట్టుప్రక్కల పారిశ్రామిక క్లస్టర్లలోని కార్మికులు తాము ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్న వలస కార్మికుల జీవితాలు అత్యంత దయనీయంగా ఉన్నాయి. పందికొక్కులు, ఎలుకలు, దోమలతో ఉండే ఇరుకు గదుల్లోనే కట్టుబానిసలుగా ఉంటున్నారు. చాలా పరిశ్రమల్లో కనీస వేతనాల జాడ లేదు. పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, సెలవులు లాంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయడంలో యాజమాన్యాలు దగా చేస్తున్నాయి. అనేక సంస్థల్లో పనిచేస్తున్న శ్రామిక మహిలకు కనీసం టాయిలెట్ సౌకర్యాలే లేవు. చాలా సంస్థల్లో 10 నుండి 12 గంటల పనివిధానం నిర్భంధంగా అమలు చేస్తున్నారు. ఓవర్ టైం అలవెన్స్ ఎగ్గొడుతున్నారు. కార్మికులు సంఘటితమై యూనియన్లు ఏర్పాటు చేసుకున్న దగ్గర మాత్రమే అరకొర సౌకర్యాలు తప్ప, యూనియన్లు లేనిదగ్గర యాజమాన్యాల దోపిడీ యదేఛ్ఛగా సాగుతున్నది. అక్రమ తొలగింపులు, వేతనాలు ఎగ్గొట్టడం, బకాయి పడటం, వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా కార్మిక శాఖకు చీమ కుట్టినట్టు లేదు. కనీస తనిఖీలు లేవు. చివరికి కార్మికశాఖ కూడా యాజమాన్యాలకే కొమ్ము కాస్తుండటం ఆదిభట్ల క్లస్టర్లో టాటా ఏరో స్పేస్ పరిశ్రమలో నగంగా కనపడింది. యూనియన్ పెట్టుకున్నందుకే సుమారు 100 మంది కార్మికులను యాజమాన్యం టెర్మినేట్ చేసినా, కార్మికశాఖ పరిస్థితి దున్నపోతు మీద వర్షం కురిసిన మాదిరిగా ఉంది. ఈ పరిస్థితులను ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తూ ''కార్మిక గర్జన యాత్ర''లు కార్మికులను అక్టోబర్ 8న రాష్ట్రవ్యాపిత సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం కోవిడ్ కాలంలో అప్రజాస్వామికంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక సంఘాల, కార్మికుల హక్కులు కాలరాయబడ్తాయి. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన యూనియన్ పెట్టుకునే హక్కు, సమిష్టి బేరసారాల హక్కులపై దాడి జరగనున్నది. కనీస వేతనాల నిర్ణయంలో 1957 ఇండియన్ లేబర్ కాంగ్రెస్ 15వ సమావేశం తీర్మానం సిఫారసులు, 1992 సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను ప్రక్కన నెట్టి, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తున్నది. కనీస వేతన నిర్ణయంలో ఆదర్శంగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం ఫ్లోర్ లెవల్ మినిమమ్ వేజెస్‌ను రోజుకు రూ.178లుగా నిర్ణయించడం సిగ్గుచేటైన విషయం. ఇంత దారుణమైన వేతనం దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఎక్కడా లేదు. నిత్యావసర సరుకులు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు ఎడాపెడా పెంచుతూ, కార్మికుల జీవన ప్రమాణాలు దిగజారి, కొనుగోలు శక్తి పడిపోతున్నా కార్మికులను ఆదుకోవాలన్న ఇంగిత జ్ఞానం దేశాన్ని ఏలుతున్న పాలకులకు లేదు. యాజమాన్యాలకు గరిష్ట లాభాలు కల్పించి, కార్మికుల శ్రమను కారుచౌకగా కొల్లగొట్టడమే ఈ నాలుగు లేబర్ కోడ్ల పరమార్థం. చివరికి కార్మిక సంఘాల గుర్తింపును కూడా యాజమాన్యాలకే అప్పజెప్పింది. కార్మికుల తొలగింపు, పరిశ్రమల లే-ఆఫ్‌లు, లాకౌట్లకు యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979ని రద్దు చేసింది. స్థూలంగా ఈ నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను నిరాయుధులను చేసి, యాజమాన్యాల దోపిడీని మరింత పెంచేందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం తెగబడుతున్నది. ఈ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించకపోతే కార్మిక సంఘాలకు మనుగడ ఉండదు. కార్మికులకు జీవించే హక్కుండదు.
కార్మికులు ఐక్యం కాకుండా, సంఘటితం కాకుండా ఈ సవాళ్ళను ఎదుర్కోలేరు. కార్మికవర్గం పోరాడకుండా గతంలో ఏ హక్కులూ, ప్రయోజనాలూ పొందలేదు. 8గంటల పనిదినం కోసం కార్మిక యోధులు పోరాడిన 'మేడే' త్యాగాల చరిత్ర అందరికీ తెలిసిందే. స్వాతంత్య్రం కంటే ముందూ, ఆ తర్వాత కార్మికులు నిర్వహించిన పోరాటాల మూలంగానే ప్రస్తుత కార్మిక చట్టాలు వచ్చాయి. నేడు కనీస వేతనాల జీఓల సాధన కోసం కూడా సమ్మె పోరాటమే సరైన మార్గమని సిఐటియు తెలియజేస్తున్నది. కేవలం విజ్ఞప్తులు, రాయబారాలు, ధర్నాల తోటే కోర్కెలను అంగీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర పాలకులు సిద్ధంగా లేరన్నది ఈ ఏడేండ్ల అనుభవం చెబుతున్నది. కనుక సమ్మె పోరాటంతోనే ఈ విధానాలను ప్రతిఘటించాలి. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల జీఓలను సాధించుకోవాలి. అందుకే అక్టోబర్ 8 రాష్ట్రవ్యాపిత సమ్మెలో అన్ని షెడ్యూల్ద్ సంస్థల కార్మికులు సమరోత్సాహంతో పాల్గొనాలి.
-ఎం. సాయిబాబు
సెల్: 9490098030