Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 24 నుండి 26వ తేదీ వరకు సూర్యాపేటలో ఐద్వా రాష్ట్ర 3వ మహాసభలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. మహాసభల ప్రాంగణానికి అరుణనగర్ అని పేరు పెట్టడం జరిగింది. మహాసభ ముందురోజైన 23వ తేదీన మహిళా ఉద్యమ ఛాయాచిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్‌ను గాంధీపార్కులో తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అక్కడ జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ, మహిళల సమస్యల పరిష్కారానికి ఐద్వా చేస్తున్న కృషిని అభినందించారు. ఎక్కడ మహిళల సమస్యలుంటే అక్కడ ఐద్వా ముందుండి పనిచేస్తోందనీ, ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలను, సూచనలను ఐద్వా నిరంతరం అందిస్తోందని చెప్పారు. ఉద్యమాలే కాక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను నడుపుతూ ఐద్వా ప్రజల మన్ననలను అందుకోవడం సంతోషదాయకమని చెప్పారు. కుటుంబంలో, సమాజంలో మహిళల పట్ల సమదృష్టి పెంపొందించేందుకు అందరం కృషి చేయాలన్నారు.
24వ తేదీన సూర్యాపేటలో వేలాదిమందితో జరిగిన ర్యాలీ, అనంతరం గాంధీ పార్కులో జరిగిన బహిరంగ సభ ప్రజలను ఆకర్షించాయి. కోలాటం, డప్పు నృత్యాలు, కళాకారుల చైతన్యగీతాలు మహిళలను ఆకట్టుకున్నాయి. ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం థావలే సభలో ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వ విధానాలతో ప్రజాజీవితం అస్తవ్యస్తమయిందనీ, నిత్యావసరాల ధరలు పెరిగి మహిళలు తీవ్ర ఇబ్బందులెదుర్కుంటున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కార్మిక, కర్షక, మహిళా హక్కులను రక్షించాలని చెప్పారు. అందుకు అందరం పోరాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించారు. మాయమాటలతో మభ్యపెడుతూ ప్రజల నడ్డివిరుస్తున్న కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఎదిరించాలని చెప్పారు. సభలో కేంద్రకమిటీ సభ్యులు ఎస్ పుణ్యవతి, టి జ్యోతి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కెఎన్ ఆశాలత, మల్లు లకిë, ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి, ఐద్వా రాష్ట్ర ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.
25వ తేదీన ప్రారంభమైన ప్రతినిధుల సభలో ముందుగా తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం ఐద్వా జెండా ఆవిష్కరించారు. 90ఏండ్ల వయసులో కూడా కంచు కంఠంతో ఆమె మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చడమే కాక మహిళల్లో చైతన్యస్పూర్తిని నింపింది. మహిళలపై దేశవ్యాప్తంగా పెరుగుతున్న దాడులను, ఎదిరించే పద్ధతులను ఆమె వివరించారు. బుగ్గవీటి సరళ ఆల్ఇండియా నాయకులను, అద్యక్ష వర్గాన్ని వేధికపైకి ఆహ్వనించారు. బి.హైమావతి, బి. సరళ, ఆశాలత, జ్యోతి, అనురాధ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. అనంతరం సమీనా అఫ్రోజ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభలో పాల్గొన్న మాజీ ఎంఎల్‌సి ప్రొఫెసర్ కె నాగేశ్వర్, మహిళల సమస్యలు, వాటి పరిష్కారాలకు పలు సూచనలు చేశారు. రాజకీయాలలో మహిళల ప్రాతినిద్యం పెరిగినపుడే సమాజంలో అసమానతలు పోతాయని ఆయన అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని చెప్పారు. మహిళల అభివృద్ధి దేశాభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు.
ఐద్వా జాతీయ అధ్యక్షులు మాలినీ భట్టాచార్య ప్రారంభ ఉపన్యాసం చేసారు. దేశంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయనీ, మనువాద పురుషాధిపత్య విధానాలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని చెప్పారు. అంబానీ, అదానీల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న మోడీ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు నష్టం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి మల్లు లకిë, ఐద్వా గత నాలుగు సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టారు. ఐద్వా జాతీయ నాయకులు పి.కె. శ్రీమతి పాల్గొని ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విద్యా, వైద్యం అందించడంలో తీవ్ర వైఫల్యం చెందాయని ఈ విధానాలకు వ్యతిరేకంగా మహిళలు సంఘటితంగా పోరాడాలని చెప్పారు. ఐద్వా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి ప్రసంగిస్తూ దేశంలో, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింస, అత్యాచారాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించి పోరాడాల్సిన అవసరం మరింత పెరిగిందని చెప్పారు. ఎన్.ఎఫ్.ఐ. డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.సృజన పాల్గొని ప్రసంగించారు. ఉద్యమ నిర్మాతలు మల్లు స్వరాజ్యం గారికి సన్మానం చేసి, ఉద్యమ నాయకులు ఎనిమిదిమందికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఐద్వా నాయకురాలు టి. జ్యోతి ప్రసంగిస్తూ.. మహిళల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయనీ, వివిధ రకాల మహిళా సమస్యలపై ఐద్వా క్షేత్రస్థాయిలో కృషి చేసి మహిళలకు భరోసానూ, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మహాసభలో గిరిజన అటవీ ప్రాంతాల్లో పోడుభూముల పోరాటాల్లో పాల్గొంటున్న ఆదిలాబాద్, కొమరంభీం ప్రాంతాల ఆదివాసీ మహిళలు పాల్గొని, ప్రభుత్వం తమ భూములను ఏవిధంగా అక్రమంగా స్వాధీన పరచుకుంటుందో చెప్పారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న గిరిజన మహిళలను వివస్త్రలను చేసి అవమానాలకు గురిచేస్తూ పసిపిల్లలతో సహా ప్రభుత్వం జైలుపాలు చేస్తోందని చెప్పారు.
మహాసభలకి ప్రజాసంఘాల నాయకులు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం సాయిబాబు, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవినాయక్, వృత్తిదారుల సంఘం కన్వీనర్ యం.వి.రమణ, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, రైతు సంఘం సాగర్, వ్యకాస సంఘం వెంక్రటాములు, అఖిలభారత మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన పాల్గొని సౌహార్థ్ర సందేశం ఇచ్చారు.
మూడు రోజుల మహాసభలో మహిళల సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మహిళా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలనీ, మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ బిల్లు వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలనీ, మహిళలు, బాలికలపై లైంగిక హింస, హత్యలను నివారించాలనీ, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలనీ, ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలనీ, మద్యాన్ని దశలవారీగా నియంత్రించాలనీ, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలనీ, పెండింగ్‌లో ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళల పింఛన్లు విడుదల చేయాలని తీర్మానాలు చేశారు.
మహాసభ చివరి రోజున 79మందితో ఐద్వా నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఆర్ అరుణజ్యోతి, ప్రధాన కార్యదర్శిగా మల్లు లకిë, కోశాధికారిగా రత్నమాల, ఉపాధ్యక్షులుగా టి. జ్యోతి, బి. హైమావతి, కెఎన్ ఆశాలత, బుగ్గవీటి సరళ, సమీనా అఫ్రోజ్, ఇ.అహల్య, యం. లక్ష్మమ్మ, యం.జ్యోతి, శాంతకుమారి సహాయ కార్యదర్శులుగా మహేశ్వరి, కె నాగలకిë, ప్రభావతి, భారతి, లత, ఇందిర, వినోద, గీత, అనురాధలను ఎన్నుకున్నారు.
మహాసభలో పాల్గొన్న ప్రతినిధులలో నూతన ఉత్సాహం, మహిళా ఉద్యమాల పట్ల ఆసక్తి, పోరాట స్ఫూర్తి నెలకొన్నాయి.
- కె. నాగలక్ష్మి
సెల్:9440952110