Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజెందుకో గౌరీశంకర్ తెగ మురిసిపోతున్నాడు. పొద్దున్నే లేచి పేపర్ చూసి గాల్లో తేలిపోతున్నాడు. భార్యామణి పెట్టిన టిఫిన్ను లొట్టలేసుకుంటూ ఆరగించేస్తున్నాడు.
'అబ్బో! ఏమిటో! ఈ రోజు అయ్యగారు అంత ఆనందంగా ఉన్నారు....' అని ఆమె తన సందేహం కాస్తా బయట పెట్టింది.
'ఆనందం కాక మరేమిటి? మన మోడీ గారు అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చారు తెలుసా?...' అంటుండగానే...భార్య కలగచేసుకొంటూ...
'విజయవంతమంటే ఇంకా ఏం అమ్మకానికి పెడతారో?...' అంది వ్యంగ్యం ధ్వనించేలా.
'అబ్బా! నువ్వుండు, నే చెప్పేదింకా పూర్తికాలేదు...' అంటూ కొనసాగించాడు.
'ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజిది. మన మోడీ గారు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో మన దేశ ప్రజాస్వామ్యం మహా గొప్పదని, ప్రజాస్వామ్యాలకే తల్లి వంటిదని ప్రపంచానికంతటికి తెలిపారు. ఆహా! ఏమైనా మోడీ అంటే మోడీయే. మన దేశ ప్రతిష్టను నలుదిక్కులా చాటుతున్నాడు. ఇంకో విషయమమ్మో... ఇంత బిజీ లోనూ 'మన్ కి బాత్' మాత్రం మర్చిపోలేదు చూడు. అదీ ఆయన స్పెషాలిటీ. నువ్వేమైనా అను. ఏదైనా ఆయనకే చెల్లింది....'
'అవునండి. ఆయనకే చెల్లింది. మన ప్రజాస్వామ్యం నిజంగా తల్లి లాంటిదే. అయితే ఆ ప్రజాస్వామ్యాన్ని ఇన్నాళ్లూ వద్ధి చేసిందెవరు? ఆయన కాదు కదా! అవునండీ. మోడీ గారి ప్రభుత్వం పార్లమెంటులో ఏ చర్చా లేకుండానే అనేక చట్టాలు చేసేస్తోందని, ఇది అనేక అనర్ధాలకు దారి తీస్తోందని, న్యాయ స్థానాల మీద కూడా ఒత్తిడి పెంచుతోందని ఒక పెద్దాయన ఇటీవల మొట్టికాయలు వేసినట్లు ఎక్కడో చదివాను. ఏమిటది?...'
'అబ్బ. నువ్వూరుకుందూ. నీకేం చేసినా నచ్చదు. ఆయనకు పాపం, ఎప్పుడూ దేశాభివద్ధే మనసులో ఉంటుంది. ఎక్కడుకు వెళ్ళినా రండి, రండి. మా దేశంలో పెట్టుబడులు పెట్టండని తెగ ప్రాధేయపడుతున్నాడు. అంతెందుకు. ఇప్పుడు కూడా అమెరికా వెళ్ళిన వెంటనే ఆ దేశాధ్యక్షుడి కంటే ముందే అక్కడి పారిశ్రామికవేత్తలను కలిశాడు తెలుసా? దేశం మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలా చేస్తాడు?...'
'అవునండీ. ఆయన ఇంతకు ముందు 'హౌడీ మోడీ' పేరుతో ట్రంప్ ప్రచారానికి అక్కడకు వెళ్ళి ఇదే విధంగా వారిని తెగ ప్రాధేయపడ్డాడు. అయినా ఏం లాభం? డబ్బులు దండగ. ఆ ట్రంపూ గెలవలేదు. పిసినారులు, ఒక్కడూ పెట్టుబడులతో ముందుకు రాలేదు. తిరిగి ఒక యజమాని ఆయననే అడిగారట కదా! మీ దేశం వచ్చి నేను కార్లు తయారు చేస్తే, అక్కడ నువ్వు అమ్మి పెడతావా అని. వన్ వే ట్రాఫిక్ లా ఎపుడూ చెప్పడమే కానీ వినడం అలవాటు లేని మోడీ గారు దానితో ఉలిక్కి పడ్డారట! ఎందుకంటే అప్పటికే దేశంలో వాహనాలు అమ్ముడుబోక ఆ రంగమే గోల పెడుతోందని ఆయనకు కూడా తెలుసు కదా! అయితే వెంటనే తేరుకుని, అందుకే కదా వాహనాలపై పన్ను తగ్గించామని సమాధానమిచ్చి, అమ్మయ్య ఈ గండం నుండి బయటపడ్దాననుకున్నాట్ట. అయితే, ఈలోగా ఇంకొకాయాన, ఏమండీ మోడీ గారూ! జనాల దగ్గర డబ్బులుంటే కొనుక్కుంటారు కానీ, పన్ను తగ్గించినంత మాత్రాన ఎలా అమ్ముడు పోతాయండీ, ఈ మాత్రం మీ ఆర్థిక మంత్రికి తెలియయకపోతే ఎలా అని ప్రశ్నించాడట! పాపం మోడీ గారికి ఏం చెప్పాలో పాలుపోక, మా ఆర్థిక మంత్రికి ప్రభుత్వ ఆస్తులు అమ్మడమే కానీ, ఇలాంటివేవీ తెలియయదని, బయటకు అనలేక మనసులోనే అనుకున్నాట్ట....'
'డామిట్. కథ ఆడ్డం తిరిగింద'ని గ్రహించిన గౌరీశంకర్ 'పోన్లెద్దు. ఎవరి గోలో మనకెందుక'ని మాట మార్చే ప్రయత్నం చేశాడు.
'పోనీలెండి. నా ఈ చిన్న సందేహం మాత్రం తీర్చేయండ'నడంతో, పోన్లే దీనితో పోతుంది కదాని, 'సరే ఏమిటో చెప్పు' అన్నాడు.
'మరేం లేదు. ప్రజాస్వామ్యమంటే భిన్నమైన అభిప్రాయాలను ఆహ్వానించడం అని నేను చిన్నప్పుడు చదువుకున్నాను. ఈయనేమో ఎవరు తనకు భిన్నంగా మాట్లాడినా బ్రిటిష్ వారిని మించి రాజద్రోహం నేరం మోపి జైల్లో కుక్కుతున్నాడు. మరోపక్క ఇన్కం టేక్స్, సిబిఐ, ఇ.డి వంటి రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగపరుస్తూ, తనకు నచ్చని వాళ్లపై దాడులు చేయిస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యమేనంటారా? ఒక పక్క వీటిని ధ్వంసం చేస్తూ, మరో పక్క బరితెగించి ప్రపంచాధినేతల ముందే కోతలు కోయడం ఆయనకే చెల్లిందండోరు...'
'ఇక చాల్లే. ఇంతకీ సందేహమేమిటో చెప్పు' అనడంతో చల్లగా చెప్పింది.
'ఏం లేదు. నవ్వి పోదురు గాక, నాకేటి సిగ్గు. అన్నట్లుగా అలా మాట్లాడడానికి ఆయనకేం అనిపించలేదా?'
పాపం. గౌరీశంకర్ ఇక వొప్పేసుకుని, 'ఇదే మోడీ మార్కు ప్రజాస్వామ్యమంటే. మరేమనుకున్నావు? అలా మాట్లాడడానికి కూడా చాలా ఖలేజా ఉండాలి. అది మోడీ గారికి మస్తుగా ఉంది. తెలుసా!' అన్నాడు.
'ఆహా! మీరెంత నిజాయతీపరులండీ!' అని భార్య మెచ్చుకుంటుంటే మరలా మురిసిపోయాడు గౌరీశంకర్.
- సీతారాం