Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బల్దేవ్ సింగ్ మన్, పంజాబ్ ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమానికి బలైన ఓ కమ్యూనిస్టు. అన్నం పెట్టే రైతన్నల కోసం అహర్నిశలు ఉద్యమించిన రైతాంగ ఉద్యమ నేత. అక్షరాలను ఆయుధాలుగ చేసి దోపిడీ పాలకవర్గంపై ప్రయోగించిన ''హీరావాల్ దస్తా'' పత్రిక సంపాదకుడు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వేర్పాటువాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న బల్దేవ్ సింగ్కు ఆడబిడ్డ పుట్టిందన్న వార్త తెలుస్తుంది. ఆడబిడ్డ పుట్టిందన్న ఆనందంతో, బిడ్డను చూడాలన్న కుతూహలంతో ఉద్యమ కేంద్రం నుంచి ఊరికి బయలుదేరుతాడు. పది రోజుల బిడ్డ పాలబుగ్గలను ముద్దాడాలని, లేత పాదాలతో తన గుండెలపై ముగ్గులేయించాలని ఆశపడతాడు. అయితే బల్దేవ్ బిడ్డను చూడకుండానే మరణించాడు. 1986 సెప్టెంబర్ 25 అర్థరాత్రి బిడ్డను చూడటానికి అమృత్సర్ జిల్లాలోని తన ఊరు చిన్న బగ్గాకు వెళుతుండగా దారి కాచిన ఉగ్రవాదుల చేతుల్లో దారుణహత్యకు గురై అమరుడయ్యాడు. అంతకు ముందు బిడ్డ పుట్టినరోజున ఆ వార్త తెలుసుకున్న బల్దేవ్ తన బిడ్డకోసం డైరీలో ఓ లేఖ రాసాడు. కూతురు ఎదిగిన తర్వాత ఆ లేఖను తనకు అందించాలని ఆశించాడు. స్వతహాగా రచయిత కాబట్టి ఆ లేఖలో నాటి సామాజిక స్థితిగతులను రాశాడు. మహిళల పట్ల సమాజంలో ఉన్న చిన్నచూపు భావనలను తెలిపాడు. తాను ఎందుకోసం పోరాటం చేస్తున్నానో, ఎవరి కోసం జీవిత కాలాన్ని వెచ్చిస్తున్నానో ఆ లేఖలో లిఖించాడు. కరుడుగట్టిన కమ్యూనిస్టులోని సున్నిత భావావేశాలను, ఉన్నత ఆశయాలను తన బిడ్డకు చెప్పే ప్రయత్నం చేశాడు. జనం కోసం జీవితాలను అర్పిస్తున్న కమ్యూనిస్టు నాన్నలందరూ, ఆ నాన్నల బిడ్డలందరూ ఖచ్చితంగా ఆ లేఖను చదవాలి. ఆ నాన్నల, బిడ్డల మధ్య నిలబడి మనమంతా ఆ లేఖను తప్పకుండా చదవాల్సిందే. అందుకోసమే ఆ లేఖను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ అమరుని లేఖ ఇలా కొనసాగుతుంది... ఇక చదవండి.
''ఓ నా ప్రియ పత్రికా!
ఈ మా ప్రపంచానికి స్వాగతం. నువ్వు పుట్టావన్న విషయం సెప్టెంబర్ 18, 1986న మీ నాయనమ్మ ద్వారా నాకు తెలిసింది. నీ పుట్టుక విషయాన్ని నాకు చెబుతున్నప్పుడు మీ నాయనమ్మ ఎలాంటి సంతోషాన్ని వ్యక్తం చేయకపోగా, విచారంగా కనిపించింది. నీ స్థానంలో మగబిడ్డ పుడతాడని తాను భావించింది. ఆడపిల్లవి కాబట్టి నువ్వు పుట్టడం వలన మా ఇంటికేమీ ఆనందం లేదని మీ నాయనమ్మ, అత్తయ్యలు అనుకుంటున్నారు. మీ మామయ్య అయితే కనీసం నీ గురించి నాతో మాట్లాడలేదు. వారి గొంతులు విచారంతోనే నీ విషయాన్ని నాకు తెలిపాయి. అయితే నాతో ఏకీభవించే నా మిత్రులు, నా భావజాలాన్ని అంగీకరించే నా ప్రియమైన కామ్రేడ్స్ తప్పకుండా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తా రనుకుంటున్నాను. నీ రాకను ఉద్దేశించి నన్ను మిఠాయిలు తినిపించమని కోరుతారని అనుకుంటున్నాను. మీ అమ్మ తరుపు వాళ్ళు నువ్వు పుట్టావని శుభాకాంక్షలు చెప్పడం మీ నాయనమ్మకు ఆశ్చర్యం కలిగించింది. ఆడపిల్ల పుడితే శుభాకాంక్షలు ఎలా చెబుతారన్నది. మగబిడ్డ పుడితే స్థాయి పెరుగుతుందని, ఆడబిడ్డ పుట్టడం వలన చిన్నబోవాల్సివస్తోందని మీ నాయనమ్మ విచారం వ్యక్తం చేసింది. ఓ నా ప్రియ పుత్రకా! ఆడపిల్ల పుడితే రుణ భారమని భావించే సామాజిక వ్యవస్థలో, నీ పట్ల వారి స్పందనలు నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఈ సామాజిక రుగ్మతల గురించి నిత్యం నేను వింటూనే ఉన్నాను. చదువుతున్నాను కూడా. కాకపోతే ఇప్పుడు ఆ అనుభవం నాకే ఎదురైంది. బహుశా మీ నాయనమ్మ దృష్టిలో నేను నిరుద్యోగిని. పనికిరానివాడిని. అందుకే కనీసం నువ్వు కాస్త స్థోమత కలిగిన కుటుంబంలో పుట్టి ఉండాల్సిందని భావించింది. మీ నాయనమ్మ లాగే ఈ సమాజం కూడా శతాబ్దాల నాటి నుండి ఇలానే ఆలోచిస్తోంది. స్త్రీ బానిసత్వం అనేది కేవలం మన ఇంటి సమస్య మాత్రమే కాదు, అది భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ అంతర్భాగం.
అందుకే ఓ నా ప్రియ పుత్రికా!
ఆడపిల్ల పుడితే సంతోషం కాక, బాధను వ్యక్తం చేసే సామాజిక వ్యవస్థను మార్చే పోరాటంలో మీ నాన్న తీరిక లేకుండా ఉన్నాడు. అభ్యుదయ ఆలోచనలు ఉన్న కొంతమంది, మార్గదర్శకులమని మహా నాయకులమని భావించే కొంతమంది వారి ఆచరణాత్మక జీవితంలో మహిళలపట్ల, ఆడపిల్లల పట్ల కరుడుగట్టిన సాంప్రదాయవాదుల లాగానే ఆలోచిస్తారు. కానీ మీ నాన్న మాత్రం మాటకు చేతకు మధ్య తేడా లేకుండా జీవించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ నా ప్రియ పుత్రికా! బహుశా చాలా కాలం తర్వాత నువ్వు పెరిగి పెద్దదానివి అయ్యాక నా జీవిత ఆదర్శాలను, నేను మమేకమైన పోరాట స్వభావాన్ని తప్పకుండా అభినందిస్తావు. నేను సమయాన్ని వృధా చేయడం లేదని, ఉన్నత ఆశయాల సాధన కోసం వెచ్చిస్తున్నానని మీ అమ్మకు వివరించడంలో విఫలం అయ్యి ఉండవచ్చు. అయితే బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని, ఎక్కడైతే పీడితులు స్వాంతన పొందుతారో అలాంటి సామాజిక వ్యవస్థ కోసం నేను పోరాడుతున్నాను. ఈ నా పోరాటం ఆకలితో అలమటిస్తున్న పిల్లల కోసం. పొట్ట నింపుకోవడం కోసం శరీరాలను అమ్ముకుంటున్న మహిళల విముక్తి కోసం. రొట్టె ముక్కల కోసం రక్తాన్ని చిందిస్తూ కష్టం చేస్తున్న కార్మికుల కోసం. అప్పుల భారంతో నలిగి మూలుగుతున్న రైతన్నల కోసం. ఓ సరికొత్త ప్రపంచం కోసం సాగే ఈ సమరంలో మీ నాన్న ఓ గౌరవప్రదమైన పాత్ర పోషిస్తున్నాడు. అందుకు నువ్వు గర్వపడాలి.
నువ్వ పుట్టిన ఈ సమయంలో పంజాబ్ మత ప్రాతిపదికన విభజించబడింది. కొన్ని ప్రాంతాలలో జుట్టు ఎక్కువగా పెంచారని, మరికొన్ని చోట్ల జుట్టు తక్కువగా పెంచారని మనుషుల్ని మత ఉన్మాదులు చంపుతున్నారు. మతం పేరు మీద మానవత్వం వధించబడుతోంది. మనుషుల మధ్య విభజన తెచ్చి, రక్తంతో హౌలీ ఆడేలా ప్రోత్సహించి కొన్ని దుష్ట శక్తులు దూరం నుండి ఆనందిస్తున్నాయి. ఓ నా బిడ్డా! నువ్వు పుట్టిన సమయంలో మీ నాన్న చీకటి శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో నిమగమైనాడు. ఈ ప్రపంచానికి వెలుగుల్ని మోసుకొచ్చే సూర్యున్ని నిషేధించాలని ఆ శక్తులు కదులుతున్నాయి. ఓ నా ప్రియ పుత్రికా! మన జీవితాలను ఫణంగా పెట్టైనా అలాంటి దుష్ట శక్తుల కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వెలుగుల్ని వెతికే పోరాటానికి దూరంగా నేను ఉండలేను. ఈ పోరాటంలో నాకేం జరిగినా దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడిన నాన్న కడుపులో పుట్టినందుకు ఎప్పుడూ గర్వపడుతూ ఉండు. నాన్నగా నీకు అవసరమైన సౌకర్యాలను, సంపదలను అందివ్వలేకపోవచ్చు. కానీ వారసత్వంగా నేను వదిలి వెళ్ళేవి చాలా విలువైనవి. వెల కట్టలేనివి. నువ్వు వెలుగుల కోసం తనువును అర్పించే కడుపున పుట్టిన కాంతిపుంజానివి. మానవత్వం పేరు మీద పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని, దుష్టశక్తులు కుట్రలు పన్నుతుంటాయి. మా దారిలోకి రమ్మని ఆహ్వానిస్తుంటాయి. జాగ్రత్త బిడ్డా! దారి తప్పకు.
బిడ్డా! పోరాటం, నా ప్రజల పోరాటం విజయంతో ముగుస్తుంది. ఈ రోజు ప్రజలు ఏ చీకటి యుగంలో అయితే జీవిస్తున్నారో అది అంతరిస్తుందని ఆశించు. ఈ రోజు మేము నాటుతున్న త్యాగాల విత్తనాలు రేపు స్వేచ్ఛా గాలులను అందించే ఉద్యానవనాలకు జన్మనిస్తాయని ఆశించు. ఒకవేళ ఈ పోరాటంలో మేము విజయం సాధించకపోతే, సత్యం కోసం సాగే ఈ సమరంలో నువ్వు కూడా ముంది పీఠిన నిలబడు. హిందూ, ముస్లిం, సిక్కు వంటి అస్ధిత్వాలకు అతీతంగా ఓ మనిషిగా ఉండు. అలాంటి అస్థిత్వాలు నీలో మానవత్వం లేకుండా చేస్తాయి. ఓ నా ప్రియ పుత్రికా! నీ పుట్టినరోజు సందర్భంగా నేను నీకు అందించే సందేశం ఇదే. ఈ మాటలను నువ్వు అంగీకరిస్తావని, వాటిని అనుసరిస్తూ ఆచరించే ప్రయత్నం చేస్తావని భావిస్తున్నాను. ఈ కొద్ది మాటలు నీ కలల్ని నిర్మించుకోవడానికి, నీ జీవిత పునాదులు అవుతాయి.
ఇట్లు..ప్రేమతో నాన్న.
కామ్రేడ్ బల్దేవ్సింగ్ మన్ కూతురికి ఇప్పుడు 34 సంవత్సరాలు. ఆమె పేరు సోనియా మన్. హిందీ, పంజాబీ, మరాఠీ, మళయాళీ, తెలుగు తదితర భాషా చిత్రసీమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. డీ అంటే డీ, డాక్టర్ చక్రవర్తి అనే తెలుగు సినిమాలలో నటించింది. తండ్రి ఆశయబాటలో నడుస్తూ సామజికసేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటోంది. తనవంతు సామాజిక బాధ్యతలను నెరవేరుస్తోంది. ఇక అసలు విషయం... తండ్రి కలలు కన్నట్టుగా ఇప్పుడు ఆమె ఢిల్లీ రైతాంగ పోరాటంలో ముందు పీఠిన నిలబడుతోంది. దేశ యువతకు ఆదర్శంగా పోరు దారిన పయనిస్తోంది. కార్పొరేట్ చీకటి శక్తులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న సమరంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ కన్న తండ్రికి నిజమైన నివాళి అర్పిస్తోంది.
- బండారు రమేష్
సెల్:9490098251