Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ ఇంట్లో ఒక గదిలో
మంటలు చుట్టుకుంటే
మరో గదిలో నీవు
నిద్రించగలుగుతావా?
నీ ఇంట్లో ఒక గదిలో
శవాలు కుళ్లిపోతుంటే
మరో గదిలో నీవు
ప్రార్థన చేస్తూ ఉండిపోగలవా?
అవునంటే చెప్పు,
నీకు నేను చెప్పాల్సింది ఏమీ లేదు
దేశం కాగితంపై
వేసిన చిత్రపటం కాదు
ఒక భాగం చిరిగిపోతే మరో భాగం
చెక్కుచెదరకుండా ఉండడానికి
నదులు, పర్వతాలు, నగరాలు, గ్రామాలు
వాటి స్థానంలో అవి ఎప్పటిలా
పట్టించుకోకుండా ఉండడానికి
దీన్ని నీవు ఒప్పుకోకపోతే
నీతో నేను ఒక్క క్షణం ఉండలేను
ఈ ప్రపంచంలో మనిషి ప్రాణం కన్నా
ఏదీ గొప్పది కాదు
దేవుడూ కాడు, విజ్ఞానమూ కాదు,
ఎన్నికలూ కావు
కాగితంపై రాసే ఏ రచననైనా
ముక్కలు ముక్కలుగా
చించి పారేయవచ్చు
భూమి పొరల్లో పాతాళంలో పాతేయవచ్చు
శవాల బలంతో
నిలదొక్కుకున్న వివేకానికి కళ్లు ఉండవు
తుపాకి గొట్టంతో సాగే అధికారం
హంతకుల వ్యాపారం
ఇది నీవు అంగీకరించకపోతే
ఇక ఒక్క క్షణం కూడా
నీ ఉనికిని సహించలేను
గుర్తుంచుకో
ఒక పసివాడి హత్య,
ఒక స్త్రీ మరణం,
బుల్లెట్లతో ఛిద్రమైన
ఒక వ్యక్తి శరీరం
ఒక ప్రభుత్వానిదే కాదు,
మొత్తం రాజ్యం పతనానికి చిహ్నం
ప్రవహించిన ఈ రక్తం
భూమిలో ఇంకిపోదు
ఆకాశంలో రెపరెపలాడే జండాను
వివర్ణం చేస్తుంది
ఏ నేలపై సైన్యం
బూట్ల గుర్తులుంటాయో
శవాలు కుప్పకూలిపోతాయో
ఆ మట్టి నీ రక్తంలో అగ్నిగా మారి
ప్రవహించకపోతే
అర్థం చేసుకో
నీవు బీడుపడిపోయావని
నీకు శ్వాస తీసుకునే అధికారం కూడా లేదు
నీ కోసం ఈ మానవ ప్రపంచమే లేదు
చివరి మాట
స్పష్టంగా చెబుతున్నా
ఏ హంతకుడినీ
ఎప్పుడూ క్షమించకు
వాడు నీకు ప్రేమాస్పదుడే కావచ్చు
నీ మతాన్ని గుప్పిట్లో ఉంచుకున్న వాడే కావచ్చు
లేక ప్రజాస్వామ్య స్వయం ప్రకటిత
పరిరక్షకుడే కావచ్చు .
(హిందీ నుంచి అనువాదం- కృష్ణుడు)
ప్రముఖ హిందీకవి సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా 1948లో మహాత్మాగాంధీ హత్యానంతరం రచించిన ఈ కవిత ప్రాముఖ్యత ఇప్పటికే చెరిగిపోలేదు.