Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 24, 2021 సాయంత్రం - ఢిల్లీలోని ఒక ఆసుపత్రి ఐసీయూ బెడ్‌మీద నుంచి ఒక పేషంట్, ఆన్లైన్ లెక్చర్ ఇస్తూ బయటి వారితో మాట్లాడారు. ఇంతలో డాక్టరు, నర్సులు ఆ పేషంట్ బెడ్ చుట్టూ గుమిగూడారు. ఆ పేషంట్ పేరు కమలాభాసిన్. కొద్ది నెలల క్రితం ఆమెకు లంగ్ కేన్సర్ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. తను మళ్ళీ కనెక్ట్ అవుతానని చెప్పి, ఆన్లైన్ లోంచి ఆమె డిస్కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందో బయటి ప్రపంచానికి తెలియదు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటం వల్లనే ఐసీయూలో ఉంచారు. అక్కడి నుండి ఆ పరిస్థితుల్లో కూడా ఆమె మానవ హక్కులు, మహిళా సాధికారత, లింగ సమానత్వం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. విషాదమేమంటే ఆ రాత్రే అంటే సెప్టెంబర్ 25, 2021 శనివారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు.
లింగ సమానత్వం గురించి జీవితకాలం పోరాడిన ధీరవనిత కమలాభాసిన్, మంచి వక్త, కార్యకర్త, కళాకారిణి, ఉద్యమకారిణి మాత్రమే కాదు, కవయిత్రిగా, రచయిత్రిగా కూడా ప్రసిద్ధురాలు. ముప్పయి అయిదు పుస్తకాలు ప్రచురించిన ఈమె, పిల్లల కోసం కూడా ఎనిమిది పుస్తకాలు ప్రచురించారు. 'మేం చదువుకోవాలి!'' అనే ఆమె కవిత అత్యంత ప్రజాదరణ పొందింది. ఒక దశాబ్దం క్రితమే నేను ఆమె కవితలు తెలుగు పాఠకులకు అందించాను. ఆమె ఉపన్యాసాలు, ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి. అభిరుచి ఉన్నవారు నెట్లో వెతుక్కోవచ్చు. ఆమె వేదిక మీద ఉన్నారంటే పాటలు, ఆటలు, నినాదాలు మాత్రమే కాదు, కబుర్లు, హాస్యోక్తులు, వ్యంగ్యాస్త్రాలు, తీవ్రమైన చర్చ, వాడీ వేడీ అన్నీ కలగలిపి ఉంటాయి. కరుడుగట్టిన మనువాదులైనా సరే తలలూపాల్సిందే! ఆమె పాట పాడాల్సిందే... గొంతులో గొంతు కలపాల్సిందే.. అదీ ఆమెలో ఉన్న ప్రత్యేకత, నిబద్ధత! దేశపు ఎల్లలు దాటి, చుట్టూ ఉన్న దక్షిణాసియా దేశాలను బలంగా ప్రభావితం చేయగలగడం మామూలు విషయం కాదు గదా? ఎక్కడైనా సెమినార్లకు వెళ్ళినప్పుడు నిర్వాహకులు 'పవర్ పాయింట్ ప్రజంటేషన్' కోసం పరికరాలన్నీ అమరుస్తూ హడావుడి చేసేవారు. ఆమె వారిని వారించి, ఓ మాట చెప్పేవారు. తనే ఒక పెద్ద పవర్ పాయింట్నని.. మళ్ళీ ఇంకో పవర్ పాయింట్ అక్కరలేదని - తన మీద తనే జోకులేసుకుని, సభికుల్ని నవ్వుల్లో ముంచేవారు. బీజింగ్‌లో 1995లో జరిగిన మహిళా మహాసభల్లో కమలా భాసిన్ ఉపన్యాసం, అంతర్జాతీయ శ్రోతల్ని ఉర్రూతలూగించింది. ఆడిటోరియం హర్షధ్వానాలతో మారుమోగింది. ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిలబడి, ఆమె పట్ల తమకు ఏర్పడ్డ గౌరవభావాన్ని వ్యక్తపరిచారు.
'అండర్ స్టాండింగ్ జెండర్', 'ఉమెన్ అండ్ మీడియా', 'టువర్డ్స్ ఎంపవర్మెంట్' 'బ్రేకింగ్ బారియర్స్' వంటి గ్రంథాలతో స్త్రీవాద రచయిత్రిగా ప్రపంచ ప్రసిద్ధురాలు కావడమే కాదు, పలు అంతర్జాతీయ సంఘాలకు, సమాఖ్యలకు లెక్కలేనన్ని చీ+ఉలకు ఆమె వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. సౌత్ ఏసియన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ూAన=) ఉమెన్ ఇన్సియేటివ్ ఫర్ పీస్ ఇన్ సౌత్ ఏసియా (ఔ×ూూA) పాక్ ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ డెమాక్రసీ అండ్ పీస్ (ూ×ూఖీణూ) వంటివి కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా, జాతీయంగా పెద్ద పెద్ద కాన్ఫరెన్స్‌లలో మాట్లాడటమే కాదు, చిన్న చిన్న గ్రామాల్లో ఆటవికుల గూడాల్లో కూడా తిరిగి వారిని చైతన్యపరిచేవారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్యకర్తలకు కమలాభాసిన్ ఒక ముఖ్యమైన, సున్నితమైన అంశం చెప్పారు. ''గ్రామీణులకు, ఆటవికులకు మీరు ఏదో చెప్పాలని, ఏదో నేర్పించాలని, కొన్ని విషయాలలో వారికి కనువిప్పు కలిగించాలని వెళతారు. నిజమే! మీ పథకం, మీ ప్రణాళిక మీకు ఉంటుంది. కా....నీ, వారు అక్కడ చెప్పేది జాగ్రత్తగా విని, వారి అనుభవాలు తెలుసుకుని వారి నుండి మీరు కొన్ని విషయాలు నేర్చుకునేందుకు సిద్ధపడకపోతే - మీ ప్రయత్నం అంతా వృధా!'' చదువుకున్న వారు, నగరాలలో ఉండేవారు అన్నీ తమకే తెలుసుననే అహం భావంతో ఉండకూడదు. మారుమూల పల్లెజనం నుండి అడవుల్లో ఉండే ఆటవికుల నుండి కూడా నేర్చుకునే విషయాలుంటాయి. ''నేర్చుకోవడానికి సిద్ధపడ్డప్పుడే - వారికి బాగా బోధించగలవు'' అన్నది కమలా భాసిన్ భావన!
కమలా భాసిన్ పంజాబ్‌లోని శాహిదన్వాలి అనే గ్రామంలో ఒక డాక్టర్ కుటుంబంలో 24 ఏప్రిల్ 1946న పుట్టారు. రాజస్థాన్‌లో పెరిగారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ తీసుకుని, స్కాలర్‌షిప్‌పై జర్మనీ వెళ్ళారు. అక్కడి మ్యూనెస్టర్ యూనివర్సిటీలో సోషియాలజీ చదివారు. అక్కడ స్థిరపడే అవకాశం వచ్చినా, కాదని తన సర్వశక్తులూ దేశంలోని స్త్రీ జనాభ్యుదయానికి అంకితం చేయాలని - ఒక ధ్యేయంతో తిరిగి వచ్చారు. మనువాదుల ప్రభావంతో దేశంలోని మహిళలంతా బానిసల్లా ఎలా బతుకులీడుస్తున్నారో ఆమెకు తెలుసు. స్త్రీ పురుష సమానత్వం సాధించి, ఆరోగ్యకరమైన సమాజానికి రూపకల్పన చేయాలనే దృఢ సంకల్పంతోనే తిరిగి వచ్చారు. మొదట కొంత కాలం ఉదయపూర్ కేంద్రంగా నడిచే ఒక సేవా సంస్థలో పనిచేశారు. ఆ సంస్థ గ్రామాల్లో, నగరాల్లో పేదల అభ్యున్నతికి పాటు పడేది. ఆ సంస్థలో ఉన్నప్పుడు ఆమె ఆలోచనలు మరింత పదునెక్కాయి. అప్పుడే యునైటెడ్ నేషన్స్ సంస్థ -ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)లో ఉద్యోగం వచ్చింది. 1976-2001 మధ్య అందులో పనిచేస్తూ, పలు దేశాలు పర్యటించారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతగా ఆహార సమస్యలు తెలుసుకుంటూనే, తన అభిరుచి మేరకు మానవహక్కుల గురించి, మహిళా సాధికారత గురించి కూడా అధ్యయనం చేస్తుండేవారు. ఎదగడానికి, సమానత్వం సాధించడానికి పోరాడుతూనే ఉండాలని ఆమె తరచూ ఆడపిల్లలకు చెపుతుండేవారు. ప్రేమల్లో పడి, బానిస మనస్తత్వం అలవర్చుకుని, అస్థిత్వాన్ని కోల్పోవద్దని - వారిని హెచ్చరిస్తూ ఉండేవారు. దేశ సరిహద్దుల్లో ఉన్నవి కాదు, గోడలు - ఇక్కడ లింగ వివక్షతో మగవారికీ, ఆడవారికీ మధ్య ఉన్న గోడల్ని పగలగొట్టండి అన్నది ఆమె సందేశం!
2012లో కమలా భాసిన్ ఒక పెద్ద కార్యక్రమం చేపట్టారు. దానిపేరు 'వన్ బిలియన్ రైజింగ్ (ఓబిఆర్) నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి - లైంగిక హింసకు, అఘాయిత్యాలకు నిరసనగా ఒక బిలియన్ మంది మహిళలు గొంత్తెత్తి నినదించాలని పిలుపునిచ్చారు. 'జాగోరి', 'సంగత్' వంటి సంఘాలు ఏర్పరచి, స్త్రీవాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి కవిత్వం, పాటలు, కళారూపాలు, పోస్టర్లు, డైరీలు వగైరా అన్ని రకాలుగా ప్రయత్నించారు. సంగత్ - అంటే సౌత్ ఆసియా నెట్ వర్క్ ఫర్ జెండర్ ట్రైయినింగ్ అండ్ ఆక్టివిజం - అని అర్థం! దీని ద్వారా కార్యక్రమాలు ఎక్కువగా ఢిల్లీ, జైపూర్లలో చేసేవారు. అవసరమైనప్పుడు మోటారు సైకిల్ మీద ఒంటరిగా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వస్తుండేవారు. జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినప్పుడు భయాలు, బిడియాలు ఉండవు. 'మోటార్ సైకిల్ వాలీ' అని అక్కడివారు ముద్దుగా పిలుచుకునే వారు. మారుమూల ప్రాంతాల్లో జరిగిన గృహహింస, లింగ వివక్ష, మహిళలపై జరిగే శారీరక దోపిడీలు - ఆమె దృష్టికి వచ్చిన విషయాల్లో బాధితురాళ్ళ పక్షాన ఆమె తప్పక నిలబడి న్యాయం కోసం పోరాడేవారు. దేశంలో సంచలనంగా మారిన శాబానుకేసుతో సహా పెద్దవీ, చిన్నవి అన్నీ ఆమె చేపట్టినవే. నిజానికి ఆ లిస్టు చాలా పెద్దది. అవన్నీ చెప్పుకోవడానికి మనకిక్కడ వీలుకాదు. మహిళా ఉద్యమాలకు ఊపిరిలూదిన ఆమె శ్రమ, కృషి చెప్పుకోవడానికి ఈ వ్యాసం పరిధి చాలదు. అయితే ఆడపిల్లలు విద్యావంతులు, వివేకవంతులు కావాలని ఆమె ఎంతగా తపించారో ఆమె కవితాపంక్తుల ద్వారా కొంత తెలుసుకోవచ్చు. సులభంగా, సరళంగా చెపుతూ, ఆలోచింప జేయడం కమలా భాసిన్ కలంలోని గొప్పతనం! ఆమె కవితా చరణాలకు నా స్వేచ్ఛానువాదం ఇలా ఉంది..
నేను రాయడం నేర్చుకుం టున్నాను / ఎందుకంటే నా తల రాతను నేనే రాసుకోవడానికి / నేను చదవడం నేర్చుకుంటున్నాను / ఎందుకంటే జీవితాన్ని చదవగలగడానికి / నేను లెక్కలు నేర్చుకుంటున్నాను / ఎందుకంటే నా అధికారాల లెక్కలు తెలుసుకోవడానికి / తెంపుకుని దాస్యపు బంధనాలని / అక్క చెల్లెళ్ళు వస్తారు / హింసను - గృహ హింసను నాశనం చేస్తారు.
'అమ్మాయిలం కాబట్టే చదువుకోవాలి' - అనే ప్రసిద్ధ కవితలోని భావం ఇలా ఉంది - అనాదిగా మా హక్కు మాకు ఇవ్వడం లేదు గనక చదువుకోవాలి / మాలో బుద్దికుశలత వికసించాలి గనక చదువుకోవాలి / స్వప్నాలు మా వయసు ముంగిట ఆడుతున్నాయి గనక చదువుకోవాలి / ఆ ఆధారమూ లేక ఈ ఇల్లూ, ఆ ఇల్లూ తిరగదల్చుకోలేదు గనక చదువుకోవాలి / మా కాళ్ళమీద మేం నడవాలనుకుంటున్నాం గనక చదువుకోవాలి / మేం మా బిడియాలతో భయాలతో పోరాడాలి గనక చదువుకోవాలి / మేం అమ్మాయిలం కాబట్టే చదువుకోవాలి / హింసల నుండి పరాభవాలనుండి మమ్మల్ని మేం రక్షించుకోవాలి గనక చదువుకోవాలి / చట్టాన్ని, న్యాయాన్ని విజ్ఞతతో అర్థం చేసుకోవాలి గనక చదువుకోవాలి / కొత్త ఆలోచనలు, కొత్త విధి విధానాలు రూపొందించుకోవాలి గనక, చదువుకోవాలి / కుళ్ళిపోయి ఉన్న ఈ వ్యవస్థను మార్చుకోవాలి గనక చదువుకోవాలి / అంధ భక్తులు పాడే భజనల సారాంశం తెలుసుకోవాలి గనక చదువుకోవాలి / వాటి శ్రుతులూ, రాగాలూ, భావాలూ, అర్థాలూ అన్నీ మార్చుకోవాల్సి ఉంది గనుకే చదువుకోవాలి / శతాబ్దాల దుమ్మూ, ధూళీ ఊడ్చేయడానికైనా చదువుకోవాలి / స్త్రీ జాతి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి / స్త్రీలు ఏ ప్రపంచానికి చెందుతారో ''ఆ ప్రపంచాన్ని'' రూపొందించుకోవడానికి చదువుకోవాలి / మేం అమ్మాయిలం కాబట్టే చదువుకోవాలి!'
'మెరె బహెనే మాంగే ఆజాదీ' లాంటి 200 పాటలకు కమలా భాసిన్ రూపకల్పన చేశారు. ఈమె పాటనే మార్చి జేఎన్‌యూ నేత కన్హయ్యకుమార్ వాడుకున్నాడే మోబహుశా - ఆమె అంత్యక్రియలు ఆమె సోదరి బీనా నిర్వహించారు. అనంతరం అక్కడ చేరిన వందలాది కార్యకర్తలు కమలాభాసిన్ పాటలు పాడి - దాన్ని ఒక హక్కుల పోరాట సభగా మార్చుకుని శ్రద్ధాంజలి ఘటించారు. ''కావాలీ కావాలీ అక్కా చెల్లెళ్ళకు ఆజాదీ!'' అని గొంతెత్తి పాడే కమలా భాసిన్ గొంతు నిరంతరం గాలిలో గింగురుమంటూనే ఉంటుంది!
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు