Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021 జనాభా సేకరణలో కులగణనను చేర్చడం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వంపై సెప్టెంబర్ 23, 2021న సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టంజేసింది. ఇది ఆలోచించి తీసుకున్న విధాన నిర్ణయం అని కూడా పేర్కొన్నది. విస్తృతంగా వ్యక్తం అవుతున్న కులగణన డిమాండ్‌ను మొండిగా తిరస్కరించడానికి ప్రభుత్వం చూపుతున్న కారణాలు డొంక తిరుగుడు గాను, హాస్యాస్పదంగానూ ఉన్నాయి. పైకి ఏమి చెప్పినా తన హిందూత్వ రాజకీయాలకు భంగం కలగకుండా జూసుకోవాలన్న బీజేపీ సంఘపరివార్ దుర్భుద్దే నిరాకరణకు అసలు కారణం.
కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వెనుకబడిన వర్గాల కులగణన చెయ్యడం పరిపాలనా పరంగా చాలా కష్టమైనదని, కష్టపడి చేసినా నమ్మదగిన, సరియైన సమాచారం రాదని, ఆ సమాచారాన్ని అధికారిక అవసరాలకు వాడుకోలేమని ప్రభుత్వం పేర్కొన్నది. కులగణన డిమాండ్‌ను తిరస్కరించడానికి చెప్పిన ఈ వాదనలు అసంబద్దమైనవి, అవాస్తవమైనవి, అసంగతమైనవని అని ఇప్పటి వరకు కులగణన జరిగిన సందర్భాలను పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. స్వాతంత్య్రానికి ముందు 1881 నుంచి 1941 వరకు ప్రతి దశాబ్ధానికొకసారి జరిగిన జనగణనలో కుల వివరాలు సేకరించారు. ఇప్పుడు అందరూ వాడుతున్న కులగణన లెక్కలు 1931 జనగణన లోనివే (రెండవ ప్రపంచ యుద్ధం మూలంగా 1941 కులగణన వివరాలు క్రోడీకరించి ప్రచురించబడలేదు). మండల్ కమిషన్ ఈ గణాంకాలపై ఆధారపడే వెనకబడిన కులాల జనాభాను 52శాతంగా అంచనా వేసింది. బూర్జువా పార్టీలు తమ సోషల్ ఇంజనీరింగ్ కసరత్తులకు ఇప్పటికీ ఈ గణాంకాలనే వినియోగిస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం మొదటి సారి సంపూర్ణమైన, శాస్త్రీయమైన పద్ధతిలో కులగణనను కేరళ రాష్ట్రంలో 1968లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్వహించింది. ఆ సమాచారాన్ని పీడిత ప్రజలకనువైన ఆర్థిక, సమాజిక, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు రిజర్వేషన్ మోతాదులను నిర్ణయించేందుకు వినియోగించింది.
క్రమం తప్పకుండా ప్రభుత్వ సంస్థలు నిర్వహించే నేషనల్ శాంపిల్ సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వ్యవసాయ కమతాల పరిస్థితి అంచనాల ద్వారా కూడా కులాలకు సంబంధించిన సమాచారం సేకరించబడుతున్నది. నిర్ణయాలు జేయడానికి ఆ సమాచారాన్ని వినియోగించుకుంటున్నారు.
2011లో యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో దేశవ్యాపిత కుల గణన జరిగింది. జనగణనలో భాగంగా కాకుండా విడిగా సామాజిక - ఆర్థిక కులగణన (SECC) పేరుతో సమాచారం సేకరించబడింది. మోడీ ప్రభుత్వం చిత్రీకరిస్తున్నట్టుగా ఈ కులగణన వివరాలు అంత నాసికరంగా ఏమీ లేవు. అందులో 98.87శాతం సమాచారం సక్రమంగా ఉందని 2016లో భారత సెన్సెస్ కమిషనర్ గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ కమిటీ ముందు ప్రకటించారు.
118 కోట్ల జనాభా వివరాలలో వ్యక్తమైన లోపాలను రాష్ట్రాల సహాయంతో అత్యధికభాగం సరిదిద్దడం జరిగింది. కేవలం కోటి ముప్పై నాల్గు లక్షల మంది వ్యక్తుల సమాచారంలోని లోపాలను మాత్రమే సరిచేయాల్సి ఉంది. బ్రహ్మాండంగా జరుగుతున్నదనుకుంటున్న జనగణనలోను దొర్లుతున్న తప్పుల మోతాదు కన్నా పై లోపాలు ఎక్కువమేమీ కాదు. ఇప్పటి వరకు వచ్చిన అనుభవాన్ని బట్టి సేకరణ పద్ధతులను మరింత పకడ్బందీగా రూపొందించవచ్చు. 2011 లాగా కాకుండా కులగణనను జనాభా సేకరణలో భాగంగా నిర్వహిస్తే ఆ కొద్ది మోతాదు లోపాలను కూడా నివారించవచ్చు. కానీ ప్రభుత్వం 2011 కులగణనలో జరిగిన కొన్ని సాంకేతిక లోపాలను అవి దిద్దుబాటు చేసుకోగలిగినవే అయినా, భూతద్దంలో చూపి కులగణన అవసరాన్ని తిరస్కరిస్తున్నది.
వాస్తవంగా 98శాతం సరిగా ఉన్న వివరాలను విడుదలజేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. కాని 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ క్రోడీకరించిన వివరాలను వెల్లడించకుండా కాలయాపనజేసింది. ఆ తర్వాత అదికారంలోకొచ్చిన మోడీ ప్రభుత్వం కులగణన ముగిసిందని ప్రకటించి సమాచారాన్ని బుట్టదాఖలుజేసింది. ఆ రకంగా మంచి ఆరంభాన్ని 5000 కోట్లు ఖర్చయిన తరువాత మోడీ ప్రభుత్వం నిరుపయోగంగా ముగించింది.
కులగణనను వ్యతిరేకించడానికి మరికొన్ని వాదనలు చేయబడుతున్నాయి. ఓబీసీ కులాల సమాచారం సేకరించడం కష్టమని, ఒకే కులం వివిధ రాష్ట్రాలలో వివిధ క్యాటగిరీలలో ఉన్నంటున్నదని కులాంతర వివాహాలలో సంతానాన్ని ఏ కులంలోకెయ్యాలనేది సమస్య అని, కులాన్ని తిరస్కరించే వారిని ఎలా నమోదుచెయ్యాలని వంటి డొంకతిరుగుడు వాదనలు కులగణనకు వ్యతిరేకంగా ముందుకు తెస్తున్నారు. ఇటువంటి వివాదాలు అన్ని సామాజిక అంశాలకూ వర్తిస్తాయి. జనగణనలో మతం గురించిన వివరాలు సేకరిస్తున్నారు. మతాంతర వివాహం చేసుకున్నవారు, మతాన్ని తిరస్కరించిన వారు ఉన్నా, మత వివరాలు సేకరించడానికి ఇబ్బందేమీ జరగడం లేదు. కానీ మత వివరాలు సేకరించడానికి అభ్యంతరం లేని బీజేపీ కుల వివరాల సేకరణకు అభ్యంతరం పెడుతున్నది. ఈ ద్వంద్వ ప్రమాణానికి మూలం దాని హిందూత్వ మతోన్మాద రాజకీయంలో ఉన్నది.
ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కులగణనకు వ్యతిరేకం. ఈ విషయాన్ని పలు సందర్భాలలో ఆఎస్ఎస్ ప్రముఖులు స్పష్టంజేశారు. మనుధర్మాన్ని ఆదర్శంగా తీసుకున్నవారు సామాజిక న్యాయానికి నిలబడలేరు. కులవ్యవస్థ బలహీనంగావడాన్ని స్వీకరించలేరు. హిందువులను మతోన్మాదంతో ఐక్యం చేయాలంటే హిందూ సమాజంలో కులాధారంగా కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు, అణచివేతలు / వ్యత్యాసాలు వెల్లడికాగూడదు. హిందూ ఐక్యత ముసుగులో కుల వ్యవస్థ దుర్మార్గపు స్వభావాన్ని మరుగుపర్చాలి. కాని కుల గణన జరిగితే ఆ ముసుగు తొలగిపోతుంది. హిందువులలోని ఓబీసీ తదితర కులాలవారు వనరులలో అసమాన పంపిణీని ప్రశ్నిస్తే తమ హిందూత్వ ప్రాజెక్టే ప్రశ్నార్థకంలో పడుతుంది. అందువలన తన గురు సంస్థను కాదని బీజేపీ కులగణనను చేపట్టడాన్ని వూహించుకోలేం. అందుకే బీజేపీ కులగణనను కోర్కెను అంత ఖరాఖండిగా తిరస్కరిస్తున్నది.
కులగణన జరిగితే కులతత్వ భావాలు పెచ్చరిల్లుతాయన్న మిషతో కొంతమంది కులగణను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అనేక కారణాల మూలంగా సమాజంలో కుల అస్తిత్వ భావాలు వ్యాపించి ఉన్నాయి. బూర్జువా పార్టీలు తమ రాజకీయ అవసరాలకోసం వాటిని పెంచి పోషిస్తున్నాయి. సామాజిక అసమానతలపై స్పృహ పెరిగే కొలది బలహీనవర్గాలలో కుల అస్థిత్వ భావాలు పెరుగుతాయి. ఈ భావాలలో కొంత సంకుచితత్వం ఉన్నా అసమానతను నిరశించే ప్రజాస్వామిక అంశం కూడా ఉన్నది. ఈ ద్వంద స్వభావాన్ని గమనించాలి. కులవ్యవస్థ నుంచి కులభావనను విడదీయలేం. కులవ్యవస్థను నిర్మూలించనంత కాలం ఆ భావనకు పునాది ఉంటుంది. కులగణనను వద్దనడం ద్వారా కుల చైతన్యాన్ని నిరోధించగలం అనుకోవడం పొరపాటు. కుల వ్యవస్థ నాశనం కోసం జరిగే పోరాటం ద్వారానే కుల చైతన్యాన్ని అధిగమించగలం.
కులగణన జరిగితే అదనపు రిజర్వేషన్లకోసం వాటి పంపిణీ కోసం కొత్త కొత్త డిమాండ్లు, వివాదాలు వస్తాయని అంటున్నారు. దీనిలో కొంత వాస్తవం లేకపోలేదు. కానీ ఇప్పుడుకులగణన లేకుండానే అటువంటి డిమాండ్లు వస్తున్నాయి. కొత్త కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్లు సిఫార్సు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు వాగ్దానం చేస్తున్నాయి. ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయాలుజేస్తున్నాయి. కులగణన జరిగితే కనీసం ఇటువంటి నిర్ణయాల సమంజసత్వాన్ని బేరీజు వేయడానికి ఆధారపడదగ్గ సమాచారమైనా అందుబాటులో ఉంటుంది. ఏ కోర్కె, నిర్ణయం సమంజసం, ఏది కాదు అన్నది నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది. సరిజూడగల సమాచారం మీద ఆధారపడి నిర్ణయాలు జరగలేదంటూ కోర్టులు చెబుతున్న అభ్యంతరాలకు అవకాశం లేకుండా పోతుంది. అంతేకాక కులగణన ద్వారా ఆర్థిక సామాజిక, విద్యాభివృద్ధికి కులానికి ఉన్నలంకె ఏ స్థాయిలో ఉందో అర్థంజేసుకోవడానికి, ఇప్పటి వరకు పాలకుల విధానాలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అమలుజేసిన పథకాలు, రిజర్వేషన్ల ఫలితం ఏమిటో మూల్యాంకంనం చేసుకోవడానికి కులగణన సమాచారం తోడ్పడుతుంది. ఇప్పటికీ సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, అత్యధిక ఓబీసీ కులాలు అవకాశాలకు/వనరులకు దూరంగానే ఉన్న వాస్తవ పరిస్థితి కులగణన జరిగితే మరింత స్పష్టంగా వెల్లడవుతుంది. సామాజిక న్యాయాన్ని సాధించడంలో పాలకుల దివాళాకోరు విధానాలు బట్టబయలు అవుతాయి.
అయితే కులగణన కావాలని కోరే కొన్ని పార్టీలు, కొందరు మేధావులు కులగణన జరిగితే సామాజిక న్యాయానికి, ఓబీసీలకు అద్బుతాలు జరిగిపోతాయన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కుల, తెగల గణన సమాచారం, ప్రతి జనగణనలోనూ సేకరిస్తున్నారు. దీని మూలంగా వారి బతుకులేం మారిపోలేదు. అందువలన కులగణన జరిగితే సామాజిక న్యాయానికి దానంతదే పెద్ద మేలు జరిగిపోతుందని భ్రమలుండకూడదు.
పాలకపార్టీలు ముఖ్యంగా మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న సరళీకరణ విధానాలు కొద్దోగొప్పో సామాజిక న్యాయానికి తోడ్పడే రిజర్వేషన్లను, సంక్షేమ పథకాలను నామమాత్రం చేస్తున్నాయి. కేంద్రం అమలుజేస్తున్న ప్రయివేటీకరణ, నగదీకరణ, సబ్సిడీల కోత, సంక్షేమ పథకాల కోత, భూసంస్కరణ చట్టాల నిర్వీర్యం, హానికరమైన కొత్త వ్యవసాయ చట్టాలు, కొత్త లేబర్ కోడ్లు సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. వీటన్నింటికి వ్యతిరేకంగా పోరాడకుండా ఒక్క కుల గణన చేయడం ద్వారానే బలహీనవర్గాల జీవితాలు మెరుగుపడతాయనుకోరాదు.
అంతమాత్రాన కులగణన వృధా అనుకోరాదు. దాని ద్వారా లభించే శాస్త్రీయమైన, సరైన సమాచారం వివిధ తరగతుల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సామాజిక న్యాయాన్ని సాధించుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకునేందుకు తోడ్పడుతుంది. కులచైతన్యం యొక్క పరిమితుల అర్థంజేసుకుని ఉమ్మడి వర్గ చైతన్యంవైపు బలహీనవర్గాలను మళ్ళించే ప్రయత్నాలకు ఉపకరిస్తుంది.
ఇప్పటికి ఆస్తులు అగ్ర ఆధిపత్య కులాలకు చెందినవారి చేతుల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమయివున్నాయి. షెడ్యూల్ కులాలు, ఓబీసీ కులాలలోని అత్యధికులు పేదలుగా, పనివాళ్ళుగా ఉన్నారు. కుల అణచివేత ఇప్పటికీ విశృంఖలంగా కొనసాగుతూ ఉన్నది. భూమి కేంద్రీకరణను బద్దలు కొట్టకుండా, అందరికీ ఉపాధిని సాధించకుండా సామాజిక న్యాయాన్ని సాధించలేం. ఇందుకోసం జరిగే సమరంలో కులగణన ద్వారా అందే వాస్తవ సమాచారం ఒక ఆయుధంగా వినియోగపడుతుంది. అందుకే కులగణన జరగాలని కోరుతున్నాం.
- బి.వి.రాఘవులు