Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దళితులందరినీ సంఘటితం చేయడం, విశాల ఐక్యత సాధించడం అనే చారిత్రక అవసరం కోసం, ఆత్మగౌరవం, సమానత్వం, కులనిర్మూలన అనే విశాల లక్ష్యాల కోసం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం 1998 అక్టోబర్ 2న ఏర్పడింది. ఏర్పడిన తొలినాళ్లలో కులవివక్షపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 11వేల గ్రామాల్లో వందలాది మంది కార్యకర్తలతో సర్వే చేపించడం జరిగింది. ఈ సర్వేల్లో చాలా హదయవిదారక సంఘటనలు వెలుగుచూశాయి. ఊరుమ్మడి బావుల్లో నీళ్లు తోడుకొనియ్యరు, హౌటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి, క్షవరం చేయరు, బట్టలు ఉతకరు. రచ్చబండలపై కూర్చోనివ్వరు, అగ్రకులాల వీధుల్లోకి రానివ్వరు, దొరలు ఎదురొస్తే తలవంచి దండం పెట్టాలి... ఇలా అనేక వివక్షలు వెలుగులోకొచ్చాయి. ఎస్సీ డ్వాక్రా గ్రూప్ వాళ్ళు మధ్యాహ్నభోజనం (పాఠశాలల్లో) వండితే పెత్తందారుల పిల్లలు తినరు. స్మశాన స్థలం ఉండదు. ఇతర కులాల వారిని పెట్టేచోట ఎస్సీల శవాలను పూడ్చుకొనివ్వరు. ఇటువంటి కులవివక్ష అంటరానితనంపై కెవిపిఎస్ దశాలవారి పొరటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. ఈ కులవివక్ష రూపాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని పోరాడింది. నాడు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వేలాది మందితో భారీ ధర్నా జరిగింది. పోలీసులు లాఠీచార్జి బాష్పవాయువులతో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు. అసెంబ్లీలో నాటి సీపీఐ(ఎం) పక్షనేత, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పాటురి రామయ్య ఒత్తిడి చేయడం, బయట జరిగిన ప్రజా ఆందోళనలతో ప్రభుత్వం దిగొచ్చి జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ రాష్ట్రమంతటా తిరిగి 62 కులవివవక్ష రూపాలను గుర్తించి ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. 62కులవివక్ష రూపాలను గుర్తించి, ప్రభుత్వానికి 105 సిఫార్సులు చేసి 17రకాల జీవోలు సాధించింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ సాధించిన ఘనత కూడా కేవీపీఎస్కె దక్కింది.
ఫూలే, అంబేద్కర్ జయంతి వర్థంతుల సందర్బంగా రాష్ట్రవ్యాపితంగా సామాజిక చైతన్య సైకిల్ యాత్రలు, సామాజిక ఆర్థిక సమస్యలపై సెమినార్లు, చర్చాగోష్టులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ దళితుల్లో చైతన్యానికి నిరంతరం శ్రమిస్తోంది. దళితుల దేవాలయాల ప్రవేశం కోసం కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీల నాయకత్వంలో 2007లో రంగారెడ్డిజిల్లాలో 20మండలాలు, 152గ్రామాల్లో 14రోజులు 1200 కిలోమీటర్ల సామాజిక చైతన్య సైకిల్ యాత్ర సాగింది. 69గ్రామాల్లో అనేక రూపాల్లో కొనసాగుతున్న కులవివక్షపై ప్రత్యక్ష ప్రతిఘటనలు జరిగాయి. హౌటళ్లలో ఉన్న రెండు గ్లాసులను ధ్వంసం చేసి ఒకే గ్లాసు పెట్టడడం, ఉరుమ్మడి బావుల్లో నీళ్లు తొడుకోవడం, దేవాలయ ప్రవేశాలు జరపడం, క్షవరం చేపించడం వంటి అనేక ప్రతిఘటనలు యాత్ర నిర్వహించింది. ఈ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా 8336 గ్రామాలలో, 50వేల కిలోమీటర్ల జాతాలు జరిగాయి. 420 కేంద్రాల్లో వివక్షా రూపాలపై ప్రతిఘటనలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో 76రోజులపాటు, 46 మండలాలు, 521 గ్రామాల్లో 2500 కిలోమీటర్ల సైకిల్‌యాత్ర జరిగింది.
స్మశాన స్థలాల జీవో1235 సాధన
గ్రామాల్లోని ప్రతీ దళితవాడకు స్మశానస్థలం ప్రభుత్వమే కేటాయించాలని కోరుతూ దశలవారీగా మండల ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడితో పాటు ''శవపేటికలతో ఛలో అసెంబ్లీ'' నిర్వహించింది. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన స్పీకర్, ఫ్లోర్ లీడర్ మాటతప్పారు. తిరిగి దీని కొనసాగింపుగా 2008 డిసెంబర్ 22న కేవీపీఎస్ అన్ని జిల్లా కలెక్టరేట్లను శవపెటికలతో ముట్టడించింది. ఈ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి ప్రభుత్వ భూమి ఉన్న అన్ని గ్రామాల్లో తక్షణమే కేటాయిస్తామని, ప్రభుత్వ భూమిలేని చోట కొనుగోలు చేసైనా దళితులకు స్మశానస్థలాలు ఏర్పాటుచేస్తామని హామీనిచ్చింది. దీనికోసం జీవో నెం. 1235 విడుదల చేసింది.
బడ్జెట్లో వాటాకై ఆమరణ నిరాహారదీక్షలు
దళిత, గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని, నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఇచ్చిన రుణాలు రద్దు చేయాలని కోరుతూ కేవీపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీవీ రాఘవులుతో పాటు మరో 25 మంది రాష్ట్ర నాయకులు సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. 200పైగా దళిత, గిరిజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి. నిర్బంధాన్ని ప్రతిఘటించి వేలాదిమంది దళిత, గిరిజనులు ఛలో అసెంబ్లీకి తరలివచ్చారు. ప్రతిపక్ష శాసనసభ్యులు అసెంబ్లీని జరగనీయలేదు. ప్రభుత్వం దిగివచ్చి ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్బాడీని, ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలను ఏర్పాటుచేసింది. బడ్జెట్లో మొదటిసారి ఎస్సీలకు 16.2శాతం, ఎస్టీలకు 6.6శాతం నిధులు కేటాయించింది. రుణాల రద్దు కోసం మరోసారి ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వగా ప్రభుత్వం 1350 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ట్రైయిన్డ్ టీచర్ల రెగ్యులరైజ్ తదితర సమస్యలపై కూడా కేవీపీఎస్ పోరాడి విజయాలు సాధించింది.
కెవీపీఎస్ ఏర్పడిన ఈ 22ఏండ్లలో అనేక సంఘటనలు, దాడులు, హత్యలు, అత్యాచారాలపై బాధితుల పక్షాన బాధ్యతగా పనిచేసింది. నేడు కొత్త రాష్ట్రంలోనూ దళితులపై దాడులు, అత్యాచారాలు ఆగలేదు. పైగా మరింతగా పెరిగాయి. ప్రధానంగా రాష్ట్రాన్ని కుదిపేసిన కుల దురహాంకార హత్యలు పెద్దపల్లిజిల్లాలో మంథిని మండలం ఖానాపురం గ్రామంలో మధుకర్ హత్య, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో అంబోజి నరేష్ హత్య, నల్గొండజిల్లా మిర్యాలగూడలో ప్రణరు కిరాతక హత్యలపై రాష్ట్ర వ్యాపితంగా కెవీపీఎస్ అందోళనలు చేపట్టి, నిందితులను అరెస్టు చేపించింది.
రాష్ట్రంలో ప్రతేకించి నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో వీడీపిల ముసుగులో అగ్రకుల ఆధిపత్యంతో దళితులు వెనుకబడిన తరగతుల సాంఘిక బహిష్కరణలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాలు నిర్వహించింది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీ పేట గ్రామములో బీజేపీ ఎం.పి. బండి సంజరు ప్రోద్బలంతో అర్థరాత్రి దళితవాడపై అత్యంత క్రూరంగా కర్రలు, కారంపొడి, రాడ్లు, రాళ్ళతో దాడిచేసిన సంఘటనపై కెవీపీఎస్ పోరాడింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టింది.
కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏడేండ్ల కాలంలో దళితులకు పట్ల అనేక ద్రోహాలకు పాల్పడింది. రాజ్యాంగ సమీక్ష పేరిట రాజ్యాంగ రద్దుకు కుట్రలు చేస్తున్నది. రిజర్వేషన్లను తొలగించడానికి, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని రద్దుచేసింది. బడ్జెట్లో నిధులు తగ్గించింది. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులను పశువుల కంటే నీచంగా చూస్తూ అత్యాచారాలు, హత్యలు, హింసలు పెరిగాయి. ఉపాధి హామి చట్టానికి నిధులు తగ్గించి, నీరుగార్చింది. ఈ పరిస్థితులలో మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతూ కెవీపీఎస్ 22 ఏండ్ల ఉద్యమ ప్రస్థాన వేడుకలు రాష్ట్ర వ్యాపితంగా నిర్వహిస్తున్నది. రాబోయే రోజుల్లో రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ, ప్రభుత్వరంగ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి లక్ష్యాలతో ముందు కు సాగాల్సివుంది.
నేడు కెవీపీఎస్ ఆవిర్భావ దినోత్సం.
- స్కైలాబ్ బాబు
సెల్:9177549656