Authorization
Mon Jan 19, 2015 06:51 pm
20వ శతాబ్ధం మహాత్మా గాంధీ, లెనిన్, మావో లాంటి ఎందరో మహనీయు లకు జన్మచ్చింది. వీరంతా తమ ఆలోచనలతో, కార్యాచరణతో కోట్లాదిమంది ప్రజలను ప్రభావితం చేసి ముందుకు నడిపించారు. నేటికీ వారి ప్రభావం తక్కువేమీ కాదు. ఆంగ్లేయుల పాలననుండి భారత దేశానికి స్వాతంత్య్రం సాధించిన వారిలో గాంధీ అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. శాంతి, అహింస గాంధీ నమ్మిన సిద్ధాంతాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అతని పోరాట ఆయుధాలు. ప్రజలకు పిలుపునిచ్చిన ప్రతి కార్యాచరణను తాను ఆచరించి, ప్రజలను ఆచరించమని కోరాడు. సూటు, బూటు వదిలి కొల్లాయి కట్టి, రాట్నంతో నూలు వడికి విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చాడు. సేవాగ్రామ్‌లో మరుగుదొడ్లు కడిగి మీరు కూడా అలా చేయాలని కోరాడు. తాను చెప్పాలనుకున్న దానిని ముందు తాను చేసి చూపించడం గాంధీజీ ఎంచుకున్న పద్ధతి. ఈ పద్ధతి ఆయన రాజకీయ అభిప్రాయాలతో విభేదించేవారు కూడా ఆచరించదగినది.
భారత ఉపఖండంలోని సామాజిక, సాంస్కృతిక జీవన వైవిధ్యం, విభిన్న మతాలకు చెందిన ప్రజలు పరస్పరం అర్థం చేసుకొని, ఒకరినొకరు గౌరవించికుంటూ జీవించే పద్ధతి ఆయనపై గాఢమైన ముద్ర వేశాయి. అందుకే ఆయన. ''రఘుపతి రాఘవ రాజారామ్.. పతిత పావన సీతారామ్.. ఈశ్వర్, అల్లా తేరేనామ్.. సబ్ కో సమ్మతి దే భగవాన్'' అని మనస్ఫూర్తిగా పాడుకో గలిగాడు. అన్ని మతాలలోని మంచిని గ్రహించాలని, ఏ మత అనుయాయులపై ద్వేషం ప్రదర్శించాల్సిన అవసరం లేదన్నాడు.
హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శికులు వేల సంవత్సరాలుగా ఇరుగుపొరుగులుగా ఉన్న దేశాన్ని విభజించి పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. వల్లభారు పటేల్ సహా కాంగ్రెస్ నాయకత్వం అంతా తీవ్ర ఒత్తిడి చేసిన తర్వాతనే అంగీకరించాడు. విభజన ఆలోచన సామాజికంగానూ, నైతికంగానూ, ఆధ్యాత్మికంగా కూడా గాంధీ తత్వానికి పూర్తి వ్యతిరేకం.
సంఫ్‌ుపరివారం మాత్రం దేశ విభజనకు గాంధీనే కారణం అని దుష్ప్రచారం చేసింది, నేటికీ చేస్తూనే ఉన్నది. వాస్తవానికి దేశ విభజనకు కారకులు మతోన్మాద సంస్థలు, వాటి నాయకులు. రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్ఎస్ఎస్), ముస్లింలీగ్‌లు, వాటి నాయకులు సావర్కర్, హెగ్డేవార్, గోల్వాల్కర్, మహమ్మద్ అలీ జిన్నాలు నిరంతరం ప్రజలలో మత విద్వేషాలు రెచ్చగొట్టారు. సామరస్య వాతావరణం లేకుండా చేసారు. ఈ సంస్థలు ఏర్పడిన నాటినుంచి దేశంలో ఏదో మూల మత కలహాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాయి.
ఒకవైపు ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నుండి మొదలై 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేక పోరాటం, 1919 ఖిలాపత్ ఉద్యమం, సహాయనిరాకరణ ఉద్యమం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం, సుభాష్ చంద్రబోస్ ప్రారంభించిన ఆజాద్ హింద్ ఫౌజ్, వివిధ ప్రాంతాల్లో జరిగిన రైతాంగ, కార్మిక పోరాటాలు ఇలా ప్రతి ఉద్యమంలో మత విశ్వాసాలకు అతీతంగా ఐక్యంగా పాల్గొన్నారు. స్వాతంత్య్రమే ప్రధాన ఎజెండాగా కదిలారు.
మరోవైపు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సంకలో చేరిన మతోన్మాద సంస్థలు మాత్రం ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనవద్దని కోరాయి. గోల్వాల్కర్ స్వయంగా తాను స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొననని, ప్రజలు కూడా ఉద్యమంలో పాల్గొని సమయం వృదా చేసుకోవద్దని పిలుపునిచ్చాడు. సావర్కర్ బ్రిటిష్ సామ్రాజ్యానికి విధేయుడిగా ఉంటానని, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని, క్షమాపణ లేఖలు రాసాడు. జైలు నుండి బయటకు వచ్చి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెన్షన్ తీసుకుని, స్వాతంత్య్ర ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. మత విశ్వాసాలు నమ్మకాలులేని మహమ్మద్ అలీ జిన్నా కూడా తన రాజకీయ లబ్దికోసం కోసం మతాన్ని పావుగా వాడుకున్నాడు.
రెండు మతాలలోని మతోన్మాదులు విద్వేష ప్రసంగాలు, అసత్య ప్రచారాలతో దేశాన్ని అగ్ని గుండంలోకి నెట్టారు. దేవుని పట్ల, మతం పట్ల ప్రజలలో ఉన్న విశ్వాసాలను తమ స్వార్థ రాజకీయ ఎజెండాకు వాడుకున్నారు. మతోన్మాదుల ఉచ్చులో పడి ఐక్యంగా ఉద్యమిస్తున్న ప్రజలు1946 నాటికి మతాలవారిగా విభజించబడ్డారు. ప్రతి చిన్న విషయం మతకలహాలకు దారితీసింది. మత హింసను ఆపడం కోసం గాంధీ నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది.
బ్రిటిష్‌వారిపై పోరాడటానికి వాడిన సత్యాగ్రహాన్ని దేశంలో మత హింసను ఆపడం కోసం వాడాల్సిన స్థితిలోకి గాంధీ నెట్టబడ్డాడు. దీనిని కూడా మతోన్మాదులు వక్రీకరించి ప్రచారం చేశారు. మత కలహాలు ఆగిపోయి, ఇరు మతాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి ఉంటే వారి రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయి కదా!
ఉన్మాదం విచక్షణను, హేతువును చంపేస్తుంది. భావోద్వేగ అంశాలు విచక్షణను మొద్దుబార్చి, గుడ్డిగా అనుసరించే ధోరణిని పెంచుతాయి. 1950వ దశకంలో అదే జరిగింది. మతమౌఢ్యం పెచ్చరిళ్ళింది, రాజకీయాలు విషపూరితం అయ్యాయి. మతోన్మాదం ఉచ్చస్థితికి చేరి విభజనకు కారణం అయింది. గాంధీ హత్యకు దారితీసింది.
దేశ స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, విజయవంతంగా స్వాతంత్య్రం సాధించిన నాయకుడిని సంవత్సరం గడవకముందే దారుణంగా హత్య చేసుకున్న దేశంగా ప్రపంచ చరిత్రలో భారత్ మిగిలిపోయింది. ఇందులో ఇంకోక దుర్మార్గమైన కోణం ఏమిటంటే గాంధీ హంతకులకు గుడికట్టాలని వాదించేవారు కొందరైతే, గాంధీ హంతకులే నిజమైన దేశ భక్తులని పార్లమెంటులో చెప్పే ఎంపీలు కూడా ఉన్నారు. గాంధీ హత్యకు సూత్రధారిగా విచారణ ఎదుర్కొన్న వారి ఫొటో పార్లమెంటు సెంట్రల్ హల్లో ప్రతిష్టించబడటం నైతిక విలువల పతనానికి నిదర్శనం.
గాంధీ హత్యకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మతరాజ్యంగా దేశాన్ని మార్చాలనే సంఫ్‌ుపరివార్ విధానానికి, మత ప్రమేయంలేని రాజ్యం ఉండాలని, అన్ని మతాలవారు కలిసి సహజీవనం చేయాలనే గాంధీ విధానం పూర్తి వ్యతిరేకం. ఆ విధంగా గాంధీ ఆదునిక భారతదేశంలో మతసామరస్యానికి, శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలిచాడు. ఇది వారికి రుచించలేదు. గాంధీజీది అహింసా సిద్ధాంతం. సంఫ్‌ుపరివారానికి దానిపై ఏమాత్రం నమ్మకం లేదు. హింసాత్మకంగానే మతరాజ్యం స్థాపించాలి కాబట్టి ఈ సిద్ధాంతం వారికి గిట్టదు.
కాంగ్రెస్‌లోని అనేక మంది ప్రధాన నాయకులు సంఫ్‌ుపరివారానికి లోపాయికారిగా మద్దతు ఇచ్చారు. ఈ విషయం గాంధీ హత్యానంతరం విచారణన నుండి సావర్కర్‌ను, సంఫ్‌ుపరివారాన్ని కాపాడడానికి వారు వ్యవహరించి తీరు చూస్తే అర్థమవుతుంది. గాంధీ వారికి లోంగలేదు. ఆయన సిద్ధాంతాలు తమ లక్ష్యానికి ఎప్పుడైనా ఆటంకం అవుతాయని, ఆయన బతికితే ఈ సిద్ధాంతాలు మరింత బలపడుతాయని భయపడ్డారు. పథకం ప్రకారం హత్యచేశారు.
నేడు దేశంలో మతోన్మాదం పైచేయి సాధించి 1950వ దశకం నాటి స్థితికి దేశాన్ని తీసుకెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. మత రాజ్యంగా మార్చాలనే తమ ఎజెండాను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. సీఏఏ పేరుతో పౌరసత్వానికి మత కొలమాణం పెట్టారు. ఎన్ఆర్సీ పేరుతో దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీశారు. వివిధ మతాల ప్రజల మధ్య పరస్పర అపనమ్మకాలు అపోహలు పెంచారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై ఉన్మాదంతో ఊగిపోతూ ఢిల్లీలో పోలీసుల సమక్షంలో కాల్పులు జరిపారు.
దేశంలో ఇప్పటికే పెరుగుతున్న అసహన ధోరణులు, ఉన్మాదపు పోకడలు సరిపోనట్లు, 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోడీ మరో కోత్తవాదన ముందుకు తెచ్చాడు. దేశవిభజన జరిగిన ఆగస్టు14ను 'భయానక విభజన స్మృతి దినం'గా ప్రకటించారు. ప్రతీ సంవత్సరం విభజన గాయాలను గుర్తుచేసి ప్రజలలో విద్వేషాలు చల్లారకుండా చూడడానికి ఇదో ఎత్తుగడ. విభజనకు కారణమైన తమ సిద్ధాంతాన్ని దాచిపెట్టి, విభజన కాలంలో జరిగిన హింసగురించి మాట్లాడటమంటే మూలాలు వదిలేసి, తప్పు చేసిన వారిని తప్పించి, తప్పు చేయని వారిని ముద్దాయిలుగా నిలబెట్టే ప్రయత్నం.
మత సామరస్యం, శాంతియుత సహజీవనం గురించి ఉచ్చరించలేని పరిస్థితి ఏర్పడింది. మతం రాజకీయాలు దాదాపు కలిసి పోయాయి. అసత్యాలు, అర్థసత్యాలు, వక్రీకరణలు తప్ప నిజాల ఊసే లేదు. సాటి మనిషి తన మతానికి చెందనివారైతే నడి బజారులో మూక హత్యలకు పాల్పడే స్థితికి దేశం దిగజార్చబడింది. శాంతి, అహింస, సత్యం వంటి గాంధీ ప్రవచిత విలువలు గాలిలొ కలిశాయి. ఇలాంటి స్థితిని గాంధీ కలలో కూడా ఊహించి ఉండడు. ఆయన మతసామరస్యం పునాదిగా దేశనిర్మాణం జరగాలని కోరుకున్నాడు. సర్వ మతాల సహజీవనాన్ని కలగన్నాడు. వివిధ మత విశ్వాసాలు గల వారందరికీ కూడా మంచి ఆలోచనలు చేసే బుద్ధిని ప్రసాదించమని రోజు ప్రార్థనలు చేసాడు. ఆయన ప్రార్థనలు సంఫ్‌ుపరివారానికి మాత్రం మంచి ఆలోచనలు చేసే బుద్ధిని ప్రసాదించలేక పోయాయి. ఆయనను దారుణంగా హత్య చేసారు. ఇప్పటికీ దబోల్కర్, పన్సారే, కాల్బుర్గి, గౌరీ లంకేశ్ లాంటి వారిని చంపుతూనే ఉన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ల వద్ద ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఎజెండా లేదు. ఆ పరిజ్ఞానం, పరిణితి కూడా వారికి లేదు. వారి వద్ద ఉన్నది ఒక్కటే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలులేని మధ్య యుగాల నాటి కల్పిత కథలు. వాటినే నిజాలని ప్రజలని నమ్మించాలని చూస్తున్నారు. దేశం నిజమైన అభివృద్ధి సాధించాలంటే ప్రజల మధ్య శాంతియుత సహజీవనం, సామరస్య పూర్వక ఐక్యత ఉండాలి. ప్రజలు హేతుబద్ధంగా ఆలోచించి, శాస్త్రీయ పద్ధతిలో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత నిర్మూలనకు ఉద్యమించాలి. లౌకిక, ప్రజాస్వామిక వాతావరణం లేకుండా ఇది సాధ్యం కాదు. వాటిని రక్షించుకోవడమే మన ముందున్న అతి పెద్ద సవాల్. ఆ సవాల్‌ను లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం ప్రాణాలర్పించిన గాంధీ స్ఫూర్తితో ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. అదే గాంధీజీకి నిజమైన నివాళి అవుతుంది.
- మహమ్మద్ అబ్బాస్
సెల్:9490098032