Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అమ్మా గుడాలు ఎలా తయారు చేయాలి'' అమెరికా నుండి అమ్మాయి ప్రశ్న
''వేటితో తయారు చేస్తావే'' అమ్మ ఇండియా నుండి
''వేటితో అంటావేమిటి?'' పెద్ద కొచ్చెన్ మార్క్ ఫేసు, అది వీడియో కాల్ కాబట్టి సమఝయింది అమ్మకు.
''సెనగలతో చేయొచ్చు, పెసలు, అలసందలు ఇలా వాటితో కూడా చేయొచ్చు''
''అవన్నీ ఇక్కడ దొరుకుతా యంటావా''
''ఏమో తల్లీ, వద్దూ అంటే వినలేదు అమెరికా, అమెరికా అంటూ ఎగిరిపోయారు. సరే మీ తంటాలు మీరు పడండి''
''తంటాలేమీ లేవులే అమ్మా, కరోన తగ్గిపోతే మిమ్మల్నిద్దరినీ రమ్మంటున్నాడు మీ అల్లుడు. పెళ్ళి చూపులప్పుడు నీవు గుడాలు చేసిపెట్టావంట. అడుగుతున్నాడు. ఆ గుడాలే మా పెళ్ళి కుదిరించాయని నా ఫీలింగు''
''సరే చెబుతా రాసుకో'' అమ్మ చెప్పడం షురూ చేసింది.
అమ్మ గుడాలు చేస్తున్నప్పుడు మనకు వచ్ఛే ఘుమఘుమలు మాత్రం ఈ గూగుల్ గుడాలకు ఉండవని తెలుసుకోవాలి.
గూగుల్ తల్లిని పెట్టుకొని అందులో చూడకుండా అసలు తల్లికి ఫోన్ చేసి గుడాలు ఎలా తయారు చేయాలో చెప్పించుకుంటుందేమి, అదీ అమెరికాలో ఉండే తనకి ఆమాత్రం తెలీదా అనుకోవచ్చు ఎవరైనా. గూగుల్ తల్లికంటే అసలు తల్లి ఎన్నో విషయాల్లో బెటరని తెలిసిన అమ్మాయి కాబట్టి అలా చేసింది. గుగ్గిళ్లు చేయడానికి కూడా గూగులే దిక్కు అన్నట్టు రోజులు మారిపోయాయి. వంటలు పిండి వంటలు అన్న పుస్తకాలు ఇప్పుడు పురానా జమానా. అంతా కొత్త. అంటూ గూగుల్ తల్లి దీవెనలతో ముందుకు సాగుతున్న రోజులు. టీ పెట్టుకోవడం దగ్గర నుండి బిర్యానీ వయా గుడాలు, ఏదైనా మనకు రెడీగా దొరికేది గూగుల్ లోనే. అందుకే చేతిలో ఓ సెల్లు, అందులో ఓ డేటా కార్డు లేదా వైఫై కనెక్షను ఉంటె చాలు ప్రపంచం నీ గుప్పెట్లో ఉన్నట్టే, సారీ దునియా తేరి ముట్టీమే అన్నట్టు. కానీ మనమే దాని గుప్పిట్లో ఉన్నామా అన్న అనుమానం చాలా సార్లు వస్తుంది. అది అనుమానమే ఎందుకంటే ఒక దాని గుప్పెట్లో ఒకటి ఉన్నాయవి.
అసలు ఈ గూగుల్ లేనప్పుడు ఎలా ఉండేది, అంతవరకెందుకు ఈ సెల్లు ఫోనులు లేనప్పటి పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే తమాషా విషయాలు బయట పడతాయి. పాత సినిమా తీసుకుందాం, అక్కడ హీరో చావు బతుకుల్లో ఉంటాడు, మొదట అతన్ని పెళ్లి చేసుకుందామనుకున్న హీరోయిన్ కొన్ని సినిమా కారణాల వల్ల దూరం పోయి, తిరిగి అతడి కోసం వస్తుంటుంది కారులో. సినిమా కాబట్టి హీరో పాడుతుంటాడు, అక్కడ ఏడుస్తూ వాళ్లొస్తుంటారు. మనకు రెండూ మార్చి మార్చి చూపుతారు. మామ మహదేవన్ పాట పక్కన సౌండు బాక్సుల్లోంచి మన చెవులను బద్దలు చేస్తుంటుంది. సినిమా హాలంతా ఒకటే టెన్షన్. దాన్నే టీవీలో ఊహించుకోండి అదీ ఈ తరం మన పిల్లల దగ్గర. సెల్లులో ఓ కాల్ చేస్తే ఐపోయే దానికి ఇంత గొడవా అన్నట్టు చూస్తారు. అదే టెక్నాలజీ మహత్యం. ఆ కోవలోనే గూగుల్ తల్లి వచ్చిందని గమనించాలి మనం.
ఇప్పుడు కారు డ్రయివింగ్ కూడా రోడ్డు మీదికి ఎక్కకుండానే నేర్చుకోవచ్చును. దాన్నే సిములేషన్ అంటారు. మొత్తం కారులాంటి సెటప్ అంటే స్టీరింగ్, గేర్లు, బ్రేకు, యాక్సిలరేటరు అన్నీ ఉంటాయి. ఎదురుగ్గా రోడ్డూ ఉంటుంది. వాహనాలూ పోతుంటాయి. కానీ అవన్నీ ఉత్తిత్తివే. అదంతా తెర పైన. వీడియో గేములాగా మనం ముందుకు పోతుండాలి. తరువాత నిజమైన రోడ్డు మీదకొస్తాము. అప్పుడెప్పుడో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాదు బేగంపేట విమానాశ్రయానికొచ్చి విమానం నడిపాడని, ఇప్పటికీ ఆ పాత పైలట్ విమానం నడిపే విధానాన్ని మరచిపోలేదని పేపర్లు మస్తు మస్తుగా రాశాయి. తీరా చూస్తే అది ఆకాశం అనే తెరపైన. టెక్నాలజీ ఇదంతా చేయిస్తుంది.
ఇక గూగుల్ తల్లిలో రాజకీయాలను కూడా చూడొచ్చు మనం. అన్నీ ఆలోచన అనే తెరపైన చూపిస్తారు. అదీ కలర్లో, హెచ్డీ క్లారిటీతో. ప్రజలు అన్నీ నమ్మేస్తారు. తెరపైన తమ జీవితాలు ఎంతగా మారిపోయాయి అని ఆశ్చర్యపోతారు కూడా. కారులో దూసుకొని పోయినట్టు తమ జీవనం కొత్తగా సరికొత్తగా ఉరుకులు పరుగులు పెడుతుంటుంది. బ్రేక్ వేసినా ఆగదు ఆ కారు. ఇంకో పక్కన ఫ్యాను గిర్రున తిరుగుతుంటుంది. కానీ గాలి మాత్రం రాదు. నాయకుల మాటల్లో ఉన్న గాలి ఫ్యాను తిరిగినప్పుడు, కారు దూసుకుపోయినప్పుడు రాదు. ఆదో ఊపిరాడని స్థితి. అభివృద్ధి మొత్తం మనసనే తెరపై ఆగకుండా చూపుతారు. నిజంగానే ఇంతలా మన జీవితాలు మారిపోతే అంతకన్న ఏమి కావాలి అనుకుంటారు. ఇంతలో బండ విజరు అనే లీడరు రాష్ట్రమంతటా దుమారం లేపుతూ తిరుగుతాడు. అసలు వాళ్ళ సినిమా చూడడం ఇక ఆపండి, మా సినిమాకూ అవకాశం ఇవ్వండి అని వాపోతాడు. బంగపోతాడు. మాది నిజమైన సినిమా అని నమ్మబలుకుతాడు. ఇతర రాష్ట్రాల్లో చూసాము మీ కథ అంటే అది వేరే సినిమా అంటాడు. ఇక్కడ నిజమైన సినిమా అంటాడు. పిల్లలని ఎత్తుకుంటాడు, పెద్దోళ్ళని పలకరిస్తాడు, పేదోళ్ళని చూసి బాధ పడతాడు. కన్నీరు పెట్టుకుంటాడు. అమెరికా ప్రెసిడెంటు వచ్చినప్పుడు తమ రాష్ట్రంలో కూల్చేసిన తోపుడు బండ్ల విషయం అడిగితే మాత్రం సమాధానమివ్వడు. మురికివాడలు కనబడకుండా గోడలెందుకు కట్టారు అంటే మౌనంగా ఉంటాడు. ఇలా ఉంటాయి స్క్రీను పైన ఉండే సినిమాలు.
అందుకే పైన చెప్పుకున్న గూగుల్ తల్లి గుడాలకంటే అసలు తల్లి నేర్పే గూడాలే కమ్మగా ఉంటాయని తెలుసుకోవాలి. అలాంటి నిజమైన గుడాలు మనకందరికీ తినిపించే వాళ్లెవరు అని తెలుసుకోవాలి. వాళ్లకు అవకాశం ఇవ్వాలి. రాళ్లు వేసి ఉడకబెట్టి గుగ్గిళ్ళు తయారు చేస్తామని నమ్మించేవాళ్లను ఇక నమ్మకూడదు. గూగుల్ తల్లి దగ్గర అన్ని నేర్చుకుంటాం కానీ అందులో అన్నీ ప్రపంచంలో నేర్చుకున్న వాళ్ళు పెట్టినవే ఉంటాయని తెలుసుకోమెందుకు? ఇకనుండయినా ఆ పని చేద్దాం. గూగుల్ గుడాలు రుచికరంగా ఉంటాయా అమ్మ చేసినవి ఉంటాయా అన్న విషయం ఇప్పుడు అర్థమయిందనుకుంటాను. ఆ విషయం కూడా గూగుల్లో చూడాలంటారా...
- జె. రఘుబాబు
సెల్:9849753298