Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ పాదయాత్ర బృందం కొయ్యలగూడెం నుంచి పోచంపల్లి పోతున్నపుడు సాయికెమ్ కంపెనీ ముందు యాజమాన్యం పెట్టిన బోర్డు కనిపించింది. 'నీ ఏడుపే నా ఎదుగుదల' అని రాసి ఉన్నది. నిజమే... ఆ ఒక్క కంపెనీ మాత్రమే కాదు. ఏ కంపెనీ చూసినా అదే తీరు. కార్మికుల కన్నీరే యాజమాన్యాలకు పన్నీరు. 22రోజుల పాదయాత్రలో ఏ పారిశ్రామిక ప్రాంతం చూసినా మనుషుల రక్తం మరిగిన మృగాలు జాడలే! ఎవరికి పుట్టిన బిడ్డలో తెలియని వలసకార్మికుల గోసలే!
చిన్న, పెద్ద కంపెనీ అన్న తేడాలేదు. పారిశ్రామిక కార్మికులలో 70శాతం వలస కార్మికులే. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి పొట్టచేత పట్టుకుని బతుకుబాట వెతుక్కుంటున్న బాటసారులే! వారి జీవన పరిస్థితులు దుర్భరం. యాజమాన్యాలు నిర్మించి ఇచ్చిన గదులలో నివాసముంటున్నారు. ఒక్కొక్క గదిలో ఆరు, ఏడు మందిని పెట్టారు. పందికొక్కులు తవ్విన మట్టికుప్పల మధ్య వంట, తిండి, పడక గదుల చుట్టూ చెత్తకుప్పలు. అవి మనుషుల ఆవాసాలు అనటం కంటే పందుల దొడ్లు అనటం సరిగా ఉంటుంది. 25 గదులకు ఒక్క బాత్రూమ్ ఉంది. మరుగుదొడ్డి లేదు. బహిరంగ మలవిసర్జనే దిక్కు. ఇవన్నీ పరిశీలిస్తున్న పాదయాత్ర బృందం దగ్గరకు ఒక కార్మికుడు వచ్చాడు. అంగీ తీసి వీపు చూపించాడు. వీపంతా కాలిన గాయాలు. యాజమాన్యం పట్టించుకోలేదని గోడు వినిపించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. మరో దినసరి కార్మికుడు. కంపెనీలో చేతులు, ముఖం కాలింది. యాజమాన్యం ప్రాథమిక చికిత్స చేయించి, ప్రభుత్వ దవాఖానలో చేర్చి వదిలేసింది. మా కార్మికుడే కాదు పొమ్మన్నది. మరో కార్మికుడికి 20ఏండ్లు కూడా నిండినట్టులేదు. తుంటి ఎముక విరిగింది. కుంటుతూ, కర్ర సాయంతో నడవటమే తప్ప పనిచేయటం కష్టం. యాజమాన్యం పనిలోకి రావద్దు పొమ్మన్నది. ఎట్లా బతకాలో అర్థం కావటంలేదని కన్నీరు పెట్టాడు. ఒక కంపెనీలో ప్రమాదవశాత్తూ కార్మికుడు మరణించాడు. మరో కంపెనీలో మంటలు చెలరేగి ఆరుగురు మృతి చెందారు. ఇంకో కంపెనీలో యాజమాన్యం వేధింపులు తాళలేక కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటకు తెలిసిన ఘటనల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. బయటకు పొక్కనివే ఎక్కువ. జైళ్ళను తలపించే ప్రహరీ గోడల మధ్య వలసబతుకులు ఎన్ని ఆహుతి అవుతున్నాయో అంతుపట్టదు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లకు, కార్మికశాఖ అధికారులకు ఇవేవీ పట్టవు. యాజమాన్యాలు విదిల్చే ముడుపుల ముందు ఇవన్నీ దిగదుడుపే. వలస కార్మికులు అత్యధికులు యువతీయువకులే. కుటుంబ జీవితానికి నోచుకోలేదు. ఒంటరి బతుకులు. స్థానికులతో సంబంధాలు లేవు. భాష సమస్య. స్థాన బలం లేదు. కార్మిక చట్టాలేవీ అమలు చేయటంలేదు. ప్రశ్నిస్తే దాడులు, తొలగింపులు. కరపత్రం చేతిలో కనిపించినా కొలువులుండవు. ఊరుకాని ఊరిలో బజారున పడవల్సిందే.
స్థానిక కార్మికులకు ప్రమాదం జరిగితే బయటకు పొక్కకుండా దాచలేరు. యూనియన్లుగానీ, స్థానిక ప్రజలు గానీ పోరాడటంతో ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వలస కార్మికులను పట్టించుకునే దిక్కులేదు. ఇక్కడ ప్రమాదం జరిగిందని తమ బంధుమిత్రులకు తెలుస్తున్నదా లేదా కూడా ఎవరికీ అర్ధం కాదు. అంతా గుట్టు చప్పుడు కాకుండా గడిచిపోతున్నది. ఇప్పటికే రెగ్యులర్ కార్మికులున్న కంపెనీలలో వారిని తొలగించి, సెటిల్మెంట్ చేసి పంపుతున్నారు. వారి స్థానంలో కాంట్రాక్టు కార్మికులను నియమిస్తున్నారు. వేలమందితో పని చేస్తున్న భారీ పరిశ్రమలలో కూడా ఆఫీసు స్టాఫ్ మినహా కార్మికులంతా కాంట్రాక్టు నియామకాలే. వారిలో అత్యధికులు వలస కార్మికులే. దేశంలో ఎక్కడా లేని విధంగా 55 సంవత్సరాలకే రిటైర్మెంట్ వయసుగా నిర్ణయించి తొలగిస్తున్న ఘటనలు కూడా తారసపడ్డాయి. కరోనా పేరుతో మూసివేసిన కంపెనీలలో మళ్ళీ తెరిచినపుడు కాంట్రాక్టు కార్మికులనే నియమిస్తున్నారు.
పెద్దపెద్ద ఫార్మా దిగ్గజాలున్నాయి. కరోనా కాలంలో చితికిన పేదల కుటుంబాలు, దిగజారిన ఆర్థిక వ్యవస్థల మధ్య బ్రహ్మాండమైన లాభాలు సంపాదించింది ఫార్మా పరిశ్రమ. అయినా... కార్మికుల శ్రమకు విలువలేదు. లాభం తప్ప మరొకటి వీరికి కనిపించదు. ఏడాది పొడవునా నదిలో నీటిలాగా ప్రవహిస్తున్నది మద్యం. అలాంటి మద్యం కంపెనీలలో కూడా రోజుకు రు.280లు మాత్రమే వేతనం. కొన్ని కంపెనీలలో కనీస వేతనాలు అడగకుండా పీస్‌రేట్ పద్ధతి ప్రారంభించి అమాయక గిరిజన మహిళలతో పని చేయిస్తున్నారు.
కార్మిక చట్టాలన్నీ యజమానులకు చుట్టాలే. కనీస వేతనం అమలుచేయరు. రూ.6500 నుంచి రూ.12000 వరకు చెల్లిస్తున్నారు. అదేమిటంటే పదేండ్ల కింద ఎప్పుడో నిర్ణయించిన కనీసవేతనం చూపించి, అమలు చేస్తున్నాం కదా అంటున్నారు. ఐదేండ్లకోసారి సవరించవల్సిన కనీసవేతనాలు 10 నుంచి 14 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సవరించకపోవటం యాజమాన్యాలకు వరప్రసాదమైంది. ఒకప్పుడు మధ్యాహ్నం ఫిఫ్టు మారే కార్మికులతో పారిశ్రామిక ప్రాంతాలు సందడిగా ఉండేవి. కానీ ఇప్పుడు సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం వరకు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఎనిమిది గంటల పనిదినం అమలు కావటంలేదు. 12గంటల పనిదినం సర్వసాధారాణమైంది. వారాంతపు సెలవులు కూడా ఇవ్వని కంపెనీలే ఎక్కువ. 30రోజులు పనిచేస్తేనే ఆమాత్రం వేతనం. గంటముందు ఇంటినుంచి బయలుదేరి రావాలి. డ్యూటీ దిగి గంట తర్వాత ఇంటికి చేరుతారు. 14గంటలకు పైగా కంపెనీ పనిమీదనే ఉంటున్నారు. శ్రామిక మహిళల పరిస్థితి దుర్భరం. ఇంటిపని, పిల్లల ఆలనాపాలనా చూడాలి. ఇక నిద్రపోయేదెప్పుడు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం కనుమరుగవుతున్నది. 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి అనే సూత్రం అటకెక్కింది. కార్మికుల బతుకు యంత్రాలకన్నా హీనమైంది. వాటికన్నా సర్వీసింగ్ కోసం విరామం ఇస్తారు. కార్మికులు విశ్రాంతికి నోచుకోలేదు. సమాన పనికి సమాన వేతనం లేదు. ఆధునిక సమాజంలో ఫ్యూడల్ పద్ధతులు అమలుచేస్తున్నారు. పురుషులకన్నా మహిళలకు తక్కువ వేతనం ఇస్తున్నారు. టాయిలెట్లో ఇంతసేపు ఎందుకున్నావని యువతులను వేధిస్తున్నారు. లైంగిక వేధింపులు నిత్యకృత్యం అయినాయి. ఒక కంపెనీలో మహిళలు వేధింపులు తట్టుకోలేక కంపెనీ గోడ దూకి పారిపోయామని కంటతడిపెట్టారు. ''అలాంటి దుర్మార్గుల కాళ్ళూ చేతులు విరగ్గొట్టి గోడ అవతల విసిరేయాలి గానీ, మీరు పారిపోవద్దమ్మా'' అని చెప్పాం. కలిసి కలబడాలేగానీ భయపడొద్దని చెప్పాం. ఇంటిపనీ, కంపెనీ పనితో విరామం లేకుండా ఉండే మహిళలను ఎక్కువమందిని నియమించడం ద్వారా యూనియన్ ఆలోచనలు రాకుండా చేయవచ్చునని యాజమాన్యాల ఎత్తుగడ.
స్థానిక, రెగ్యులర్ కార్మికులకే యూనియన్ వర్తిస్తున్నది. మెజారిటీగా ఉన్న కాంట్రాక్టు, వలస కార్మికులు యూనియన్ వైపు చూస్తే తొలగిస్తారు. యూనియన్ ఉన్నప్పటికీ 25-30శాతంగా ఉన్న స్థానిక కార్మికులకే వేతన ఒప్పందం గానీ, ఇతర పరిమిత సౌకర్యాలు గానీ. అందువల్ల యూనియన్ల సమిష్టి బేరసారాల శక్తి సన్నగిల్లింది. అనేక కంపెనీలలో యూనియన్లలో ఉన్న కార్మికులకు కూడా కనీసవేతనం అమలు కావటంలేదు. అదనపు పనిగంటలు తప్పడంలేదు. ఒక కంపెనీలో కార్మికుడికి కంపెనీ గేటు ముందే ప్రమాదం జరిగింది. ముఖం, కాళ్ళ బొక్కలు విరిగాయి. అయినా ఆదుకునే ఆనవాయితీ తమ కంపెనీలో లేదని యాజమాన్యం తెగేసి చెప్పింది. యూనియన్ల శక్తి బలహీనపడిన ఫలితమిది. ఈమాత్రం యూనియన్లు కూడా అతితక్కువ. రాష్ట్రంలో 52 పారిశ్రామిక ప్రాంతాలు ఉండగా, వాటిలో 42 ప్రాంతాలు హైదరాబాద్ చుట్టూ ఐదు జిల్లాలలోనే ఉన్నాయి. భారీ, మధ్యతరహా, చిన్న పరిశ్రమలు (సూక్ష్మ పరిశ్రమలు కలపలేదు) సుమారు 8,000 ఉండగా వాటిలో కార్మికుల సంఖ్య సుమారు 4,50,000. వీటిలో కేవలం 230కంపెనీలలో మాత్రమే యూనియన్లు ఉన్నాయి. వీటిలో సభ్యుల సంఖ్య కేవలం 20,000 మాత్రమే. ఈ పరిస్థితిలో యాజమాన్యాల ఆగడాలకు, శ్రమదోపిడీకి హద్దూ అదుపూ లేకుండా పోయింది. ఈమాత్రం యూనియన్లు కూడా యాజమాన్యాల అణచివేత చర్యలను తట్టుకుని నిలబడినవీ లేదా యాజమాన్యాలకు అనుకూలంగా నడుస్తున్నవే. ఒక కంపెనీ యాజమాన్యం యూనియన్ ప్రధాన కార్యదర్శితో పాటు ముగ్గురిని డిస్మిస్ చేసింది. అయినా కార్మికులు యూనియన్‌తో గట్టిగా నిలబడటంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2గంటల వరకు షిఫ్టు పెట్టి వేధిస్తున్నది. ఆరాత్రి సమయంలో ఇంటికెట్లా పోవాలో తెలియక దిగివస్తారని వేధిస్తున్నది. టాటా ఎయిరో స్పేస్ కంపెనీలో యూనియన్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడల్లా నాయకులను తొలగిస్తున్నది. ఇప్పటికే మూడు నాలుగుసార్లు యూనియన్ పెట్టే ప్రయత్నంలో వందమందిని తొలగించింది. ఈ కంపెనీ ఆదిభట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నది. పాదయాత్ర బృందాన్ని కూడా ఆ ప్రాంతం నుంచి నడిచేందుకు అనుమతించలేదు. దౌర్జన్యపూరితంగా అరెస్టు చేసి 70కి.మీ దూరంలో నిర్భంధించారు. రాష్ట్రవ్యాపిత నిరసనలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు సందర్శించి వత్తిడి చేసిన తర్వాతనే వదిలారు. శంషాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన పోలీస్ స్టేషన్‌ను జిఎంఆర్ అనే సంస్థ నిర్మించి ఇచ్చింది. పారిశ్రామికవేత్తలకు, పోలీసులకు, ప్రభుత్వానికీ ఎంతటి బహిరంగ బంధమో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు చాలు. యాజమాన్యాల ఆగడాలకు పాలకపార్టీల నాయకులు కూడా అండగా ఉంటున్నారు. ఆయా కంపెనీలలో రకరకాల కాంట్రాక్టులు పొంది, యూనియన్లు ఏర్పడకుండా యజమానులకు సహాయపడుతున్నారు.
తమ ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయంటే స్థానిక ప్రజలు సంతోషించారు. తమ కుటుంబాలలో యువతకు ఉపాధి దొరుకుతుందని ఆశించారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సంతోషించారు. కానీ అనుభవంలో అందుకు భిన్నంగా జరిగింది. పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులతో సహా అందరూ మోసపోయామని ఆలస్యంగా గుర్తించారు. స్థానికులకు ఉద్యోగాలు రాలేదు. చదువూ, నైపుణ్యంలేక కాదు. తాము చేయగల్గిన పనులే... వలస కార్మికులతో చేయిస్తున్నారు. వీరికి ఉద్యోగమిస్తే స్థానబలం ఉంటుంది. హక్కులు అడుగుతారు. వలస కార్మికులైతే బానిసలుగా పడి ఉంటారు. అదీ ఎత్తుగడ. మరోవైపు అనేక కంపెనీలు తీవ్ర కాలుష్యం వెదజల్లుతున్నాయి. పోచంపల్లి చేనేత కేంద్రమే కాదు. పచ్చని పంటలు... ఏడాదికి మూడు పంటలొచ్చే ప్రాంతం. రసాయన పరిశ్రమల కాలుష్యంతో వందల ఎకరాల వరిపంట మాడిపోయింది. వాతావరణ కాలుష్యం వెన్నాడుతున్నది. పంట నష్టపోయిన రైతులను పట్టించుకునే దిక్కులేదు. పాదయాత్ర బృందం, మాడిపోయిన పంటపొలాలను సందర్శించింది. జిన్నారం ప్రాంతంలో ముక్కుమూసుకోకుండా నిలువగల పరిస్థితి లేదు. కంపెనీలలో కార్మికులుగానీ, పరిసర ప్రాంతాల ప్రజలుగానీ ఆ గాలినే పీల్చాలి. భూగర్భ జలాలు కలుషితమైనాయి. ఇంత జరుగుతున్నా పొల్యూషన్ కంట్రోలు బోర్డుకు అంతా బాగానే కనిపిస్తున్నది. వారికి కాలుష్యానికి బదులు యాజమాన్యాలు తడిపే లంచాల మూటలే కనిపిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతాలలో రోడ్ల పరిస్థితి కూడా దారుణం. ఏసీ కార్లలో ప్రయాణం చేసే యజమానులకు కార్మికుల ఇబ్బందులు పట్టవు.
పాదయాత్ర సందర్భంగా అనేక అనుభవాలు వచ్చాయి. దారిలో 10మంది నిర్మాణరంగ కార్మికులు బృందాన్ని ఆపి తమ గోడు చెప్పుకున్నారు. ఒక కార్మికుడిని పనికి తీసుకెళుతున్న కాంట్రాక్టర్ వాహనం ప్రమాదానికి గురైంది. ఇద్దరూ హాస్పిటల్ పాలయ్యారు. కాంట్రాక్టర్ తాను వైద్యం చేయించుకుంటూ, కార్మికుడి బాధ్యత మాత్రం తనది కాదన్నారు. ఈ వివరాలు యాత్ర బృందానికి చెపుతున్న వ్యక్తి టీషర్ట్ మీద 'జైశ్రీరామ్' నినాదం ఉన్నది. ఇప్పుడు మాత్రం ఆయన సహాయం కోసం ఎర్రజెండాను ఆశ్రయించాడు. ఎర్రజెండా తక్షణం ఆదుకున్నది. పాదయాత్ర బృందం ఒకరోజు మునిసిపల్ ప్లంబర్ ఇంట్లో బసచేసింది. ఈ ఊరిలో ఎర్రజెండా రాజకీయాలు లేవు. సామాజికంగా తానేమీ తక్కువ కాదని వ్యక్తం చేయడానికి బిడ్డ పేరు వైష్ణవి అని పెట్టుకున్నాడు. టీవీలో 'కల్వరీ' బోధనలు చూస్తున్నారు కుటుంబమంతా. కానీ ఎర్రజెండానే తమ ఆత్మబంధువుగా భావించి ఆశ్రయమిచ్చారు. ఆప్యాయంగా చూసుకున్నారు. పాదయాత్ర బృందం ఒకరోజు మధ్యాహ్న భోజనానంతరం కాసేపు రేణుగా ఎల్లమ్మతల్లి దేవాలయంలో సేదదీరింది. గుడిపూజారి తన గోడు వినిపించాడు. గుడికి భక్తుల సందడి కొద్దిరోజులు మాత్రమే ఉంటుందట! ఎక్కువ రోజులు కాంట్రాక్టు ఉద్యోగంతో బతుకు బండి లాగుతున్నాడు. రోజూ దేవుడికి నైవేద్యంపెడుతున్నాడు. తన సమస్యలకు పరిష్కారం చూపండని ఎర్రజెండాను వేడుకున్నాడు.
ఈ పాదయాత్ర సాగుతున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు పాదయాత్ర కూడా జరిగింది. హంగూ, ఆర్భాటాలతో కోట్లు ఖర్చుచేసారు. ఏసీలు, పరుపులు, అన్నిరకాల సౌకర్యాలతో సాగిన యాత్ర అది. అధికారం యావతో, పదవీదాహంతో చేసిన యాత్ర అది. సీఐటీయూ నాయకత్వ బృందం యాత్ర ఇందుకు పూర్తి భిన్నమైనది. కార్మికుల కనీసవేతనాల కోసం, కార్మిక హక్కులకోసం జరిగింది. అంతేకాదు, కనీస వేతనాలు నోచుకోని నిరుపేద కార్మికుల ఇండ్లలో ఈ బృందం బస చేసింది. సహజంగానే ఈ కార్మికులలో అత్యధికులు దళితులు, బడుగు బలహీన వర్గాలవారే. వీరి ఇండ్లలో నాయకులు బస చేస్తారనీ, వారు పెట్టింది తింటారనీ, తమతోబాటు చాపమీద పడుకుంటారనీ ఈ కార్మికులూ, వారి కుటుంబసభ్యులూ ఊహించలేదు.
పాదయాత్ర బృందానికి ఆతిధ్యం ఇవ్వడానికి ఒక గ్రామంలో ఇద్దరు పోటీ పడ్డారు. టాస్‌లో గెలిచిన వారి ఇంటికి ఆహ్వానించారు. మరో గ్రామంలో ఈ బృంద సభ్యుల కోసం ఉన్న ఒక్క గదిని కేటాయించి కుటుంబ సభ్యులు పక్కింట్లో సర్దుకున్నారు. మునిసిపల్ స్వీపర్ జయమ్మ తెల్లవారుజామున 4గంటలకు నిద్రలేచి, ఇంటిపని పూర్తి చేసుకుని వీధులూడ్చడానికి పోవాలి. ఒంటరి మహిళ, ఇద్దరు పిల్లలు. మరోరోజు కాంట్రాక్టు కార్మికుల ఇంట్లో బస. భార్యాభర్తలిద్దరూ కాంట్రాక్టు కార్మికులే. మేము నిద్రకు ఉపక్రమించే సమయానికి ఆ ఇల్లాలు పని చేసుకుంటున్నది. ఉదయం 5 గంటలకు మేము నిద్ర లేచేటప్పటికే తాను లేచి పనిలో నిమగమైంది. ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు. అంగన్వాడి ఆయాకు ఇద్దరు ఆడపిల్లలు, అత్త. తాను ఒంటరి మహిళ. ఆయాగా వచ్చే ఆదాయం ఏ మూలకూ చాలదు. ఇంట్లో పని పూర్తిచేసుకుని అంగన్వాడీ సెంటర్ తెరవాలి. అది మూయగానే ఇంట్లో చేనేత మగ్గం మీద పనిచేయాలి. మళ్ళీ రాత్రి ఇంటిపని. ఇంతచేసినా కుటుంబం అతికష్టం మీద నెట్టుకొస్తున్నది. ఈ మహిళల జీవిత చక్రం గడియారం ముల్లులాగా తిరుగుతూనే ఉన్నది. యాంజాల్‌లో ఒక కాంట్రాక్టు లెచ్చరర్ ఇంట్లో బస. భార్య టైలర్. యువజంట. చంటిబిడ్డ ఉన్నది. రాత్రి 12గంటల దాకా బట్టలు కుడుతున్నది ఆమె. ఉదయం 6 గంటలకు మళ్ళీ కుట్టడం మొదలుపెట్టింది. ఇద్దరూ కష్టపడితే తప్ప కుటుంబం నడవదు. ఆ యువజంటకు వినోదం, విరామం గగనకుసుమమే! బృంద సభ్యులు బసచేసిన మరో ఇంట్లో బాత్రూమ్ను కోళ్ళ పెంపకానికి వాడుతున్నారు. వేరే స్థలం లేదు. బహిరంగ స్నానాలే. ఆ కుటుంబ మహిళలకు ఇది ఎంతటి సున్నితమైన సమస్యో అర్ధం చేసుకోవచ్చు. మునిసిపల్ చెత్త సేకరించే కార్మికుడి ఇంట్లో బస చేసినపుడు తలుపులకు గొళ్ళెం లేదు. దొంగల భయం లేదు. ఇంట్లో ఎత్తుకుపోవడానికి దొంగలకేమీ లేదు కదా! భవన నిర్మాణ కార్మికులు శంకరయ్య, మారమ్మల ఇల్లు చూడటానికి భవనమే. కానీ లోపల గదులకు తలుపులు లేవు. తలుపులుంటే గొళ్ళెం లేదు. పాతకాలపు బండలు పరిచారు. 1995 నుంచీ ఆ ఇల్లు కడుతూనే ఉన్నారు. బస చేసిన మరో ఇల్లు కాంట్రాక్టు కార్మికుడిది. నాయకులు తమ ఇంటికి రావడం తన జీవితంలో మరువలేని ఘటన అని సంతోషించాడా యువకుడు. భార్య కోసం నిలువుటద్దం ఉన్నది. అద్దం నిండా మచ్చలే. అందులో చూస్తుంటే మన ముఖం నిండా మచ్చలున్నట్టనిపిస్తుంది. పారేయాలని ప్రయత్నిస్తున్న వారి దగ్గర అడుక్కొచ్చాడు. కాంట్రాక్టు కార్మికురాలు లకిë ఇల్లుగానీ, హెటిరో డ్రగ్స్ మరో కాంట్రాక్టు కార్మికుడి ఇల్లుగానీ బయటినుంచి మంచి భవనాలుగానే ఉన్నాయి. కానీ 30 గజాలలో నిర్మించుకున్నారు. పేద కార్మికుల ఇండ్లలో బస చేయటం వల్ల వారి అప్యాయతలతో పాటు వారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవన స్థితిగతులను అత్యంత సన్నిహితంగా పరిశీలించే అవకాశం లభించింది. కనీస వేతనాల ఆవశ్యకతను మరింత గట్టిగా డిమాండ్ చేయడానికి తోడ్పడింది. కార్మికులకు మరింత దగ్గర కావడానికి ఉపయోగపడింది. సీఐటీయూ మీదా, నాయకుల మీద వారికి విశ్వాసం పెరిగింది. బూర్జువా పార్టీల, సంస్కరణవాద యూనియన్ల నాయకులకు భిన్నంగా ఎర్రజెండా నాయకులను తమవారుగా భావించారు.
కార్మికులు ఇంతటి దుర్భర పరిస్థితులలో ఉన్నప్పటికీ పాలకులకు ఏమాత్రం పట్టదు. లాభం కోసం ఎంతటి శ్రమదోపిడీకైనా సిద్ధపడే పెట్టుబడిదారులవైపే మొగ్గు. చిన్నచిన్న సంక్షేమ పథకాలతో వీరిని మభ్యపెట్టి ఓట్లు దండుకోవచ్చునన్న నమ్మకంతో పాలకులు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటివరకు పదేండ్లకుపైగా కనీస వేతనాలు సవరించలేదు. 73షెడ్యూల్డు పరిశ్రమల పరిధిలో కోటికి పైగా కార్మికులున్నారు. చట్ట ప్రకారం ప్రతి ఐదేండ్లకొకసారి సవరించకపోవడం వల్ల రాష్ట్రంలో కార్మికులు ఇప్పటికే సుమారు 17లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పటికైనా సవరించకపోతే ఇంకా నష్టపోతారు. కార్మిక చట్టాలుండగానే కార్మికుల బతుకులు ఇంత దుర్భరంగా ఉన్నాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేసింది. యాజమాన్యాల దోపిడీకి, ఆగడాలకు ఇక హద్దు ఉండదు. అందువల్ల కనీసవేతనాల సవరణ కోసం, కార్మిక హక్కుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర కార్మికవర్గం అక్టోబర్ 8న సమ్మెకు సన్నద్ధమవుతున్నది.
- ఎస్. వీరయ్య