Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యం బరితెగించింది. రైతు ఉద్యమంపై యుద్ధానికి సిద్ధమయింది. సెప్టెంబరు 27 ''భారత్ బంద్'' రైతాంగ ఉద్యమానికి అనూహ్యమైన మద్దతునిచ్చింది. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఏడాది కాదు పదేండ్లయినా ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని ఉద్యమ నిర్వాహకులు తెగేసి చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు అనుకూలంగా తీసుకువచ్చిన ఈ నల్ల వ్యవసాయ చట్టాల అమలుకు సుప్రీంకోర్టు స్టే విధించినా, ఉద్యమం నానాటికీ ఉధృతం అవుతున్నదే తప్ప నీరుకారడం లేదు. భేషరతు సాగుచట్టాల రద్దే లక్ష్యంగా ఉద్యమం సాగుతోంది. చావో రేవో తప్ప గత్యంతరం లేని స్థితి అంతకంతకు రైతులకు అర్థమవుతున్నది. అనుభవంలోకి వస్తున్నది. రైతు భవితతోనే దేశ భవిత ముడిపడి ఉన్నదని మిగతా ప్రజానీకం అవగాహన కూడా చేసుకుంటున్నది.
నా బతుకు రైతు పెట్టిన బిక్షే. నేను ముప్పుటలా అన్నం తింటున్నాను. నేను కృతఘ్నుడ్ని కాను, రైతు రక్తమే నా రక్తం. నాలో ప్రవహిస్తుంది నా రక్తం కాదు రైతు రక్తం, 'నో యువర్ ఫుడ్ - నో యువర్ ఫార్మర్' (నీ ఆహారం తెలుసుకో - నీ రైతును తెలుసుకో మన రైతు గౌరవమే మన ఆత్మగౌరవం, రైతు భారతమే జీవ భారతం ఇలాంటి నినాదాలు ఎక్కడికక్కడ ఉద్యమలోగిళ్ళలో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకు వస్తున్నాయి. ప్రజానీకాన్ని చైతన్య పరుస్తున్నాయి. ఆందోళనలను రగలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారంనాడు యూపీలో హర్యానాలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యవాదుల్ని కల్లోల పరుస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో తికూనియా గ్రామం. ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ హాజరవుతున్నారు. అయితే రైతులు తమ ఉద్యమంలో భాగంగా నల్లచట్టాలను వ్యతిరేకిస్తూ మంత్రి ఎదుటే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయడానికి నల్లజెండాలను చేబూనారు. ఇదే సందర్భంలో ముఖ్యఅతిథిని స్వాగతించేందుకు కేంద్రమంత్రి అజరుమిశ్రా కుమారుడు ఆశిష్‌మిశ్రా అక్కడికి చేరుకున్నాడు. వందలాది మార్బలంతో కార్లలో వచ్చాడు. రైతులు ఈ మిశ్రాను కూడా అడ్డుకున్నారు. సాధారణంగా అయితే ఎవరైనా కారుదిగి ఉద్యమకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది ఉద్యమం సాధించుకున్న సత్సంప్రదాయం. కాని మిశ్రా అందుకు విరుద్ధంగా తన కారును శరవేగంతో రైతులపైకి ఉరికించాడు. ఈ హఠాత్ పరిణామానికి రైతులు వివశులయ్యారు. తృటిలో అక్కడిక్కడే ఇద్దరు రైతులు మృతిచెందారు. నేలంతా రక్తసిక్తమయింది. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో రైతులు మూడు వాహనాలకు నిప్పుపెట్టారు. అమాంతం చెలరేగిన ఘర్షణలో మొత్తం తొమ్మిది మంది అశువులు కోల్పోయారు. ఈ ఘటనపై తక్షణం న్యాయ విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
జరిగిందొక రాక్షస చర్య. జలియన్ వాలాబాగ్లోని క్రూర డయ్యర్ దురంతాన్ని గుర్తుకు తెస్తున్నది. అయినా పాలకులు ఇంకా మౌనంగా ఉంటున్నారంటే చచ్చినవారితో సమానమని రాహుల్‌గాంధీ ఆక్షేపించారు. వామపక్షాలు ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టమని పిలుపునిచ్చాయి. ఇది రైతు హంతక ప్రభుత్వం కాదా..? అని సీపీఐఎం నేత బృందాకరత్ ఆక్రోశంతో ప్రశ్నించింది. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఈ దుర్మార్గ ఘటనను దునుమాడాడు. తీవ్రంగా ఖండించాడు. రైతులపైకి కారును ఉరికించడమే కాకుండా ఆందోళనా కారులపై ఆశిష్ మిశ్రా కాల్పులు కూడా జరిపాడు. ఆ కాల్పులవల్ల కూడా ఒక రైతు మరణించాడని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.
రైతులు తమ ప్రాణత్యాగాలతో, సకల్ప బలంతో ఇంతటి మహత్తర ఉద్యమం నడపడాన్ని బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదనీ, రైతుల ఆందోళనలను ఎలాగైనా తొక్కిపెట్టాలన్న నీచమైన కుట్రలో భాగంగానే ఈ విపత్కర ఘటనను చూడాలనీ, ఇందులో కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా హస్తం కూడా ఉంటుందనీ రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి విమర్శించారు. లవ్ప్రీతిసింగ్ (20), దల్జీత్‌సింగ్ (35), నచత్తార్ సింగ్ (60), గుర్వీందర్ సింగ్ (19) అనే రైతులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కేంద్ర మంత్రి అజరుమిశ్రాను తక్షణం క్యాబినెట్ నుండి తొలగించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని సంయుక్త కిసాన్ మోర్చా వర్చువల్ మీడియా ద్వారా డిమాండ్ చేసింది.
ఇది ఇలా ఉండగా, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అత్యంత ప్రమాదకరమైన ఉన్మాద ప్రసంగం చేశారు. 'మీరందరూ 500, వేయి మందిగా గుంపులు గుంపులు విడిపోండి. కర్రలు, ఆయుధాలు తీసుకుని యుద్ధానికి సిద్ధం కండి. జైలు కెళ్ళినా ఇబ్బంది లేదు. జైల్లో మీరు ఆరు నెలలు మించి ఉండరు. తర్వాత మీరు పెద్ద నాయకులు అవుతారు' ఇలా రైతు ఉద్యమ కారులపై భౌతికదాడికి రెచ్చగొడుతూ ఆ ప్రసంగం సాగింది.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రే ఈ విధంగా మాట్లాడితే ఇంతకన్నా పెద్ద నేరం ఏముంటుందని కాంగ్రెస్ నేత సూర్జేవాలా విమర్శించారు. ఈ మాటలు దేశద్రోహ నేరం కంటే తక్కువేమీ కాదనీ, మోడీ నడ్డా వంటి బడా బీజేపీ నేతల మద్దతుతోనే ఖట్టర్ ఆ విధంగా మాట్లాడుతున్నారనీ ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలకు పై ఘటనలోని ఘాతుక చర్యలకు అంతర్గత సంబంధం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి అవగతమవుతున్నది.
యూపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజా ఉద్యమకారులపై భౌతికదాడులు, దౌర్జన్య చర్యలు పెరుగుతున్నట్టు పరిస్థితి తెలుపుతున్నది. ఎందుకంటే ఉద్యమకారులు ఎప్పుడూ పాలక నియంతలకు ముచ్చెమటలు పట్టిస్తూనే ఉంటారు. ఉద్యమకారులు మనకెందుకులే అని సాధారణ జనంలా ఊరుకోరు. సత్యం పట్ల సమధర్మం పట్ల అచంచల విశ్వాసంతో, త్యాగాలతో, బలిదానాలతో సదా ముందుకు సాగుతూనే ఉంటారు. ఉద్యమం ఎప్పుడూ సజీవ ప్రవాహమే. ప్రభావ శీలమే.
- కె. శాంతారావు
సెల్:9959745723