Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో పోడు భూముల సమస్య తీవ్రంగా ముందుకొచ్చింది. రాజకీయ అజెండాగా మారింది. గత నెలరోజుల నుండి అఖిలపక్ష పార్టీలు, గిరిజన, ప్రజాసంఘాలు కలిసి పోడు రైతు పోరాట కమిటిగా ఏర్పడి ''పోడు రైతు పొలికేక'' పేరుతో ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. అక్టోబర్ 5న రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడున్నరేండ్లుగా నాన్చుతూ వస్తున్న సమస్యకు ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపేదేలేదని పోడు రైతు పోరాట కమిటీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హరితహారంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు సమస్యపై మాట్లాడిన మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ''పోడు భూములకు హక్కు పత్రాలిస్తామని గతంలో వాగ్దానం ఇచ్చాం. తప్పకుండా ఆ సమస్యను తేల్చేస్తాం. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక త్వరగా ఇవ్వాలని చెప్పాను. అక్కడక్కడా అటవీశాఖ సిబ్బంది అత్యుత్సాహంతో గిరిజనులపై దాడులు చేస్తున్నారు. అనవసరంగా దాడులు చేయవద్దని అటవీశాఖకు ఆదేశించాం. యూపీఏ ప్రభుత్వం అటవీ హక్కుల గుర్తింపుచట్టం చేసింది. దాని ప్రకారం పోడు భూములకు హక్కులు కల్పిస్తాం'' అంటూనే చట్టం అమలునే ప్రశ్నార్థకం చేసే ప్రకటన చేశారు. చట్టంలో ఉన్న 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉన్న వారికి 10ఎకరాలలోపు హక్కు పత్రాలివ్వాలన్న సెక్షన్ను సవరించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్2గా మార్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి అఖిలపక్షపార్టీలను తీసుకెళతానని చెప్పారు. ఈ ప్రకటనే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. చట్ట సవరణ అంత త్వరగా అవుతుందా? ఇంతకాలం చట్టం ప్రకారం హక్కులిస్తామని హామీలిచ్చుకుంటూ వచ్చి అకస్మాత్తుగా చట్ట సవరణ చేసిన తరువాతనే హక్కులిస్తామనడంలో ఆంతర్యం ఏమిటి? ఈపని ఏప్పుడో చేయవచ్చు. చేయడానికి ఎవరు అడ్డుపడ్డారు. ఉధృతంగా సాగుతున్న పోడు రైతు ఉద్యమాన్ని నీరుగార్చడానికే ఈ ప్రకటన చేశారా? ఇప్పట్లో చట్ట సవరణ చేయడం సాధ్యంకాదు కాబట్టి ఇది 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు జాప్యం చేసి రాజకీయ లబ్ది పొందాలనే ఎత్తుగడలో భాగమా? 10శాతం సమస్య పరిష్కారం కోసం 90శాతం మంది ఎదురుచూడాలా?
చట్టంలో ఏముంది?
వామపక్షాల వత్తిడి మేరకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2006లో పార్లమెంట్లో అటవీహక్కుల గుర్తింపు చట్టంను ఆమోదించింది. భారతదేశ వ్యాపితంగా అడవులు ఎక్కడుంటే అక్కడ (జమ్ముకాశ్మీర్ మినహా) చట్టం అమల్లోకి వచ్చింది. చట్టంలో ముందుమాటగా ఇలా చెప్పారు. బ్రిటిష్ వలస పాలనలోగానీ స్వాతంత్య్రానంతరం వచ్చిన భారత ప్రభుత్వంగానీ శతాబ్దాలుగా అడవుల్లో అంతర్భాంగా ఉన్న గిరిజనులు పేదలకు భూమిపై హక్కులు కల్పించడంలో చారిత్రాత్మక తప్పిదం జరిగింది. దీనిని సరిచేయడం కోసమే ఈ చట్టం అని గొప్పమాట చెప్పారు. అటవీ భూములపై హక్కులు కల్పించినంత మాత్రాన వారు ఓనర్లు కారని పెడర్థాలు తీసే కేసీఆర్ ఆ చట్టాన్ని మరొక్కసారి చదువుకుంటే మంచిది. ఈ చట్టాన్ని వ్యతిరేకించే శక్తులు చట్టం ఆమోదం పొందకుండా అనేక ఆటంకాలు కల్పించారు. భూమిపై హక్కులు ఇస్తే అడవులు అంతరించి పర్యావరణం దెబ్బతింటుందన్నారు. సుప్రీంకోర్టులు, హైకోర్టుల్లో కేసులుసైతం వేశారు. ఏడాదిపాటు వాదోపవాదాలు, చర్చోపచర్చలు జరిగాయి. వాటన్నింటినీ పార్లమెంట్లో నివృత్తిచేసిన తరువాతనే చట్టం ఆమోదం పొందింది. చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉన్న గిరిజనులకు హక్కులు కల్పించాల్సి ఉంటుంది. గిరిజనేతరులైతే మూడు తరాలు అంటే 75సంవత్సరాలుగా భూములపై ఆధారపడి ఉన్నవారికి హక్కులు కల్పించాలి. 10ఎకరాల లోపు హక్కుపత్రాలివ్వాలి. చట్టం అమలులో భాగంగా గ్రామ కమిటి, సబ్ డివిజనల్ కమిటి, జిల్లా కమిటి, రాష్ట్ర కమిటి ఇలా నాలుగుదశల్లో కమిటీలు వేశారు. గ్రామసభల్లో పోడు సాగుదారుల నుండి వ్యక్తిగతంగా దరఖాస్తులను, గ్రామ అవసరాలకోసం సామూహిక దరఖాస్తులను ఆహ్వానించారు. ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలపై చట్టం ప్రకారం హక్కులు కల్పించవచ్చు అని 2007లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. అధ్యక్షతన జరిగిన చట్టం అమలు కమిటీకి అటవీశాఖ నివేదిక ఇచ్చింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలో 13 లక్షల ఎకరాలుగా ఉన్నది. హక్కులు ఎలా కల్పించాలన్న విషయాలు స్పష్టంగా చట్టంలో పేర్కొన్నారు.
పోడు సాగుదారులపై దాడులు ముఖ్యమంత్రికి తెలియదా?
పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ఉమ్మడి పాలకులు మోసం చేశారని, కొత్త రాష్ట్రంలో ఆ సమస్యను పరిష్కరించేందుకు వందకు వందశాతం బాధ్యత తీసుకుంటామన్నారు. మొత్తం మంత్రివర్గాన్ని, అధికార యంత్రాంగాన్ని జిల్లాలకు తీసుకెళ్ళి కుర్చీవేసుకుని, ప్రజాదర్బార్లు పెట్టి అక్కడికక్కడే హాక్కుపత్రాలిచ్చి ముగింపు పలుకుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 నుండి ఇప్పటివరకు డజనుకు పైగా సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు ప్రస్తుత అసెంబ్లీలో మాట్లాడుతూ అటవీశాఖ సిబ్బంది గిరిజనులపై దాడులు చేస్తున్నారని, అనవసరంగా దాడులు చేయొద్దని అటవీశాఖకు చెప్పినట్లు చెప్పారు. ఇది కేవలం అటవీశాఖను ముద్దాయి చేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నమే. 2014 నుండి ఇప్పటివరకు ప్రతి వర్షాకాల సీజన్ ప్రారంభం నుండి అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు చేస్తూనే ఉన్నారు. సమస్యను పరిష్కారిస్తామని ముఖ్యమంత్రి చెప్పిన తరువాత కూడా దాడులు కేసులు గతం కంటే పెరిగాయి. 2014 నుండి సగటున ప్రతి ఏటా రెండు వేల మందికిపైగా అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్నారు. దేశంలో ఎక్కడా పోడు రైతులపై దేశద్రోహ కేసులు, హత్యానేరం కింద కేసులు మోపలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మోపారు. 2015లో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్లో భూక్యావీరభద్రం మరో ఆరుగురిపై దేశద్రోహం కేసులు పెట్టి 6 నెలలపాటు చర్లపల్లి జైలుకు పంపారు. అదే ప్రాంతంలో 25మంది పోడు రైతులపై హత్యానేరం కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇందులో 7 నెలల పాప నుండి 70ఏండ్ల వృద్ధులు ఉండటం గమనార్హం. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాదవనిపల్లిలో పోడు భూములను సాగుచేస్తున్న 8మంది చెంచు గిరిజనులపై హత్యానేరం కేసులు పెట్టి జైళ్ళకు పంపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్, మంఠంపల్లి, ఆదిలాబాద్ జిల్లా జైనూర్, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో ఇప్పటికీ వేలాది మందిపై అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. పోడు భూముల్లో వేసుకున్న పచ్చటి పంటలను జేసీబీలతో నాశనం చేస్తున్నారు. కందకాలుతవ్వడం, స్ట్రంచర్లు కొట్టడం ద్వారా బలవంతంగా భూములను అటవీ శాఖ ద్వారా లాక్కుంటూనే ఉన్నారు. అన్యాయం అని అడ్డుకున్న గిరిజనులు, పేదలపై పోలీసు నిర్భంధం ప్రయోగించి గ్రామాలు, గూడేలు, తండాలలో భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ సంఘటనలు ప్రతిరోజు పత్రికలు, మీడియాలో పతాక శీర్షికన వచ్చినా ముఖ్యమంత్రికి తెలియనట్టు అసెంబ్లీలో మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఒకవైపు ఓదార్చుతూనే మరోవైపు పోడు సాగుదారులపై దాడి చేస్తోంది?
చట్ట సవరణ లాభమా? నష్టమా?
చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉన్న అటవీ పోడు భూములపై దరఖాస్తులను గిరిజనులు, పేదల నుండి 2008లో నాటి ప్రభుత్వం ఆహ్వానించింది. అటవీశాఖ వత్తిడితో గ్రామకమిటీలలో దరఖాస్తులను కూడా పెట్టనీయకుండా నాటి ప్రభుత్వం వన సంరక్షణ సమితుల ద్వారా అడ్డుకున్నది. చట్టం పట్ల అవగాహన లేకపోవడం, దరఖాస్తులు ఎలా పెట్టుకోవాలో ప్రభుత్వం అవగాహన కల్పించకపోవడంతో వేలాది మంది దరఖాస్తులు పెట్టుకోలేకపోయారు. అయినా ఆనాడు ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం తెలంగాణ పరిధిలో 2,12,173 వ్యక్తిగత దరఖాస్తులను స్వీకరించింది. ఆ దరఖాస్తుల ప్రకారం 7,61,061 ఎకరాలపై హక్కులు ఇవ్వాలని పెట్టుకోగా కేవలం 93,639 మంది దరఖాస్తులకు 3,00,284 ఎకరాలకు మాత్రమే హక్కులు ఇచ్చి మిగిలిన 1,18,534 దరఖాస్తులను కారణాలు చూపకుండా తిరస్కరించారు. రాష్ట్రంలో మొత్తం 13 లక్షల ఎకరాలల్లో పోడు సాగుదారులు ఉన్నట్టు 2007లో అటవీశాఖ వై.ఎస్.ఆర్. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 3 లక్షలపై ఆనాడు కల్పించిన హక్కులు పోనూ ఇంకా 10 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించాల్సి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఇప్పటివరకు ఒక్క ఎకరాపై కూడా హక్కుపత్రం ఇవ్వకపోవడం బాధాకరం. ఇప్పుడు ముఖ్యమంత్రి అకస్మాత్తుగా 2005 డిసెంబర్13ను 2014 జూన్ 2 కు పొడింగించడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని అంటున్నారు. అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని చెపుతున్నారు. తేదీని పొడిగించే సవరణ మంచిదే. కానీ అది ఇప్పట్లో సాధ్యంకాని అంశం. ఈ వంకతో 2005 కంటే ముందు సాగులో ఉన్న లక్షలాది మందికి న్యాయంగా దక్కాల్సిన హక్కులను నిరాకరించడం సమంజసంకాదు. జాప్యం చేయడం కోసమే ఓ ఎత్తుగడగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది! చట్ట సవరణ చేసి 2014 జూన్ 2వ తేదీ వరకు పోడు భూములను సాగుచేస్తున్న సాగుదారులకు హక్కులను ఇస్తామంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇంతకాలం జాప్యంచేసి తీరా హక్కుపత్రాలు ఇవ్వడం కొరకు షెడ్యూల్ ప్రకటించాల్సిన సమయంలో చట్టసవరణ పేరుతో హక్కు పత్రాలు ఇవ్వకుండా ఆపడం అన్యాయం.
- ఆర్. శ్రీరాం నాయక్
సెల్:9440532410