Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చట్టసభల్లో ప్రజల పక్షాన నోరు విప్పేందుకు ప్రతిపక్ష సభ్యులకున్నంత స్వేచ్ఛ అధికార పార్టీల సభ్యులకుండదు. ఆంక్షలు, పరిమితుల మధ్యే వారి ప్రసంగాన్ని కొనసాగిస్తుంటారు. అందులోనూ ఎక్కువగా అమాత్యులను పొగిడేందుకే సమయం కేటాయించాల్సి వస్తుంది. అదే సమయంలో తమను ఎన్నుకున్న ప్రజల సమస్యలను ఏకరువు పెట్టకతప్పని పరిస్థితి. అసలేం మాట్లాడకపోతే ప్రజల వద్దకు మళ్లీ పోయేందుకు పూర్తిగా దారులు మూసుకుపోతాయి. దీంతో అటు అధికార పార్టీ పెద్దలకు ఇబ్బంది కలగకుండా... ప్రజలకు తాము సమస్యలు లేవనెత్తుతున్నామని చెప్పేందుకు నానా తంటాలు పడుతుంటారు. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు ప్రజా సమస్యలను ఎక్కువగా లేవనెత్తుతుండటంతో వారితో పోటీ పడ్డామని చూపించుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కొన్ని సార్లు సమస్యల విషయంలో ఎంత చెప్పినా పరిష్కారం కాకపోతే ప్రతిపక్ష సభ్యుల మాదిరిగానే అసహనానికి గురై బయపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవటం గమనార్హం. కౌన్సిల్లో గత నాలుగేండ్ల నుంచి పదే పదే కోరుతున్న అవర్లీ బేస్డ్ టీచర్ల సమస్య పరిష్కారం కావటం లేదనీ, తాను పక్షిలా అరుస్తూనే ఉన్నానని అధికార పార్టీ సభ్యుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయనీ, అందరూ సంతోషంగా ఉన్నారని అధికార పార్టీ పదే పదే సమర్థించుకుంటున్నా చిత్రంగా అధికార పార్టీ సభ్యుల ఆవేదనతోనే అది నిజం కాదని బహిర్గతం అవుతున్నది.
-కె.ప్రియకుమార్