Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయనో ప్రజా ప్రతినిధి. అందునా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడు. దీనికితోడు అసెంబ్లీలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీకి చైర్మెన్. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలను కాపాడుకోవటం, వాటిని అభివృద్ధి పరచటానికి సంబంధించి మేధోమదనం చేయటం ద్వారా ప్రభుత్వానికి సలహాలు, సూచనలివ్వాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉంటుంది. ఎప్పటికప్పుడు సంబంధిత అంశాలపై ఆ గులాబీ నాయకుడు గొంతు విప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయన మూడు రోజులకోసారి అసెంబ్లీ ప్రాంగణంలో గొంతు విప్పుతుంటారు. ఆ సందర్భంగా మినిమం అరగంటకు తక్కువ కాకుండా స్పీచ్ దంచికొట్టటం సదరు నేతకు రివాజుగా మారింది. ఇంతకీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి చైర్మెన్ హోదాలో ఆయన వాటి గురించే మాట్లాడుతున్నారనుకుంటే అది మీ పొరపాటే. ఎందుకంటే ఆయనకు ఆనందమొచ్చినా.. ఆవేశం కలిగినా దానికి అసెంబ్లీ ప్రాంగణం వేదిక కావాల్సిందే. అక్కడ మైకు పట్టుకుని ఊగిపోవాల్సిందే. కాకపోతే ఆయన హోదా, స్థాయికి తగ్గట్టుగా కాకుండా విపక్షాలపై విరుచుకుపడటానికో.. వ్యక్తిగత దూషణ భాషణలు చేయటానికో.. తద్వారా తమ అధినేతలను ప్రసన్నం చేసుకోవటానికో ఆయన విలేకర్ల సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్పితే... ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటానికి తామేం చేస్తున్నామనే విషయాన్ని చెప్పరు గాక చెప్పకపోవటం విడ్డూరంగానూ, అంతకుమించిన వింతగానూ గోచరిస్తున్నది. ఇదే విషయాన్ని ఆయన అనుయాయులను అడిగితే... 'అసలు మా మీటింగుల్లో ప్రభుత్వ రంగ సంస్థల గురించి చర్చిస్తే కదా..? ఏమైనా చెప్పటానికి...?' అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. అతడికి దగ్గరగా ఉండే మరో నాయకుణ్ని కదిలిస్తే... 'మా సారుకు పేపర్లలో ఫొటోలు రావాలి, టీవీల్లో ఆయన మాటలు వినబడాలి... ఆఖరుకు ఛానళ్లలో చిన్న స్క్రోలింగ్ వచ్చినా ఆయనకు చాలు...' అంటూ ముక్తాయింపునివ్వగా, ఆయన వాక్కులు విన్న తర్వాత అవాక్కవటం విలేకరుల వంతైంది.
-బి.వి.యన్.పద్మరాజు