Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య కాలంలో రాజకీయనాయకులకు బొట్టు మీద ధ్యాసెక్కువయ్యింది. బొట్టు పెట్టుకోవడం సహజమే అయినా, ఇప్పుడు అదో సింబాలిక్ పొలిటికల్ బెదిరింపుగా మారింది. ఈ మధ్య ఆర్థికమంత్రి హరీశ్‌రావు బొట్టు లేకుండా బయటకు రావట్లేదు. అసెంబ్లీ సమావేశాలకూ అలాగే వస్తున్నారు. మంత్రిగా ఉన్నన్నాళ్లు బొట్టు మీద దృష్టి పెట్టని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పుడు బొట్టు లేకుండా జనం మధ్యలోకి రావట్లేదు. అదేంటో...అయన బొట్టు పెట్టుకోగానే భూకబ్జా కేసుల విచారణ నిలిచిపోయింది. 37 రోజులుగా జైల్లోనే ఉన్న తీన్మార్ మల్లన్న... తానూ బొట్టు పెట్టుకుంటానని ప్రకటించగానే కేసుల నమోదు నిలిచిపోయి, హైకోర్టులో బెయిల్ పిటీషన్‌పై కదలిక వచ్చింది. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ పాలనపై దుమ్మెత్తి పోస్తున్న మరో జర్నలిస్టు కూడా మల్లన్న అనుభవంతో 'బొట్టు' బ్యాచ్‌కు దగ్గర దగ్గరగా మెసులుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అసెంబ్లీ లాబీల్లో బొట్టుపై చర్చ జోరుగా సాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనం నోళ్లలో నానుతున్న ప్రజాప్రతినిధులు రెగ్యులర్ బొట్టు పెట్టుకున్నా...ముఖాన్ని, బొట్టును మార్చి మార్చి గులాబీ దండు చూస్తున్నదనివాపోతున్నారు. మరికొందరు ఆ దండును ఉడికించేందుకు...తమకూ ప్రత్యామ్నాయం ఉందని చెప్పేందుకు 'బొట్టు'ను సింబాలిక్‌గా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తున్నది. అదేంటో...బొట్టు పెట్టుకోగానే అప్పటిదాకా ఉన్న ఆరోపణలు, కేసులు, కోర్టులు, బెయిళ్లు సహా విమర్శల తీవ్రత కూడా తగ్గుతోంది ఎందుకు అధ్యక్ష్యా!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి