Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కొండలు పగలేసినాం బండలనే పిండినాం, మా నెత్తురును కంకరుగా ప్రాజెక్టులను కట్టినాం.., శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరో'' అనే పాట ఎంత నిజమో! భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు కూడా అంతే నిజం. అందమైన అద్దాల మేడలు, నీటి పారుదల ప్రాజెక్టులు, పార్లమెంట్, అసెంబ్లీ వంటి పరిపాలనా భవనాలు, న్యాయ స్థానాలు, రోడ్లు, వంతెనలు, పుణ్యక్షేత్రాలు, గుడులు, బడులు నిర్మించి ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులు. కానీ వారికి మాత్రం ఉండటానికి ఇల్లు, తినడానికి సరైన తిండి, బట్ట ఉండవు. ఊరు చివరిలో, మురికి వాడలో, ఇరుకు గదుల్లో వీరు జీవిస్తున్నారు. తాపీ మేస్త్రీలు, పార కూలీలు, ఇటుక బట్టి కార్మికులు, కార్పెంటర్లు, పెయింటర్లు, ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్ తదితర 54 వృత్తులు చేసే కార్మికులు శ్రమిస్తేనే సమస్త నిర్మాణాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 10కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు.
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి భవన నిర్మాణ కార్మికుల జీవితాలను అతలాకుతలం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు, హెచ్చరికలు లేకుండా ఆకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించడంతో పనులు లేక, తిండి దొరక్క, సొంత గ్రామాలకు వెళ్ళడానికి రవాణా సౌకర్యంలేక కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళిన వలస కార్మికుల బాధలు, వర్ణణాతీతం. వలస కార్మికుల్లో ఎక్కువమంది భవన నిర్మాణ కార్మికులే. కరోనా లాక్‌డౌన్‌తో చేయడానికి పనులు లేక, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తట్టుకోలేక, సంక్షేమ బోర్డు నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందక, కనీసం వెల్ఫేరు బోర్డులో పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాలకు నిధులు విడుదల చేయక బడుగు జీవులైన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు అర్ధాకలితో విలవిల్లాడుతున్నాయి.
నిధులు ఫుల్ అమలు నిల్
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి సెస్సు ద్వారా వెల్ఫేర్ బోర్డుకు 2,800 కోట్ల నిధులు జమ అయినాయి. ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణకు రావాల్సిన వాటా రూ.400 కోట్లు బ్యాంకులో మూలుగుతున్నాయి. భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో కోట్ల రూపాయల నిధులు ఉన్నా కార్మికులను ఆర్థికంగా ఆదుకోకుండా, బోర్డులో పెండింగ్‌లో 36వేలకు పైగా ఉన్న నష్టపరిహారాలకు నిధులు విడుదల చేయకుండా, భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటున్నది. కార్మికశాఖను సరైన మార్గంలో నడిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ''కంచే చేను మేసిన'' విధంగా కార్మిక సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన బోర్డులోని రూ.1,005 కోట్ల నిధులను దొడ్డి దారిన అక్రమంగా పౌర సరఫరాల శాఖకు దారి మళ్ళించి నిర్మాణ కార్మికుల నోట్లో మట్టికొట్టింది.
సంక్షేమ బోర్డు నుండి ఖర్చు పెట్టే ప్రతి పైసా అడ్వైజరీ కమిటీ నిర్ణయం మేరకు ఖర్చు చేయాలని సెస్సు యాక్ట్-1998 చెపుతుంది. కానీ కార్మికశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, వారి ఇష్టానుసారంగా దుబారా చేస్తున్నారు. ఆఫీసులో ఫర్నీచర్, సెల్ఫోన్లు, లాపీలు, కంప్యూటర్లు, ట్రైనింగ్లకు తోడు ఆర్భాటపు ప్రచారాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. 2014 నుండి హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధిలో నిర్మించే ప్రభుత్వ, ప్రయివేటు నిర్మాణాల నుండి సెస్సు వసూలు చేయకుండా కార్మికశాఖ, జీహెచ్ఎంసీ శాఖలు ఒకరిపై ఒకరు నెపం వేస్తూ సుమారు రూ.3 వేల కోట్లు నిధులు జమ కాకుండా చేసారు. యజమానులు చేతులు తడపగానే డిమాండ్ నోటీసులు ఇవ్వకుండా, సెస్సు వసూలు చేయకుండా గమ్మునుంటున్నారు. సెస్సు వసూలు చేయని అధికారులపై ఎలాంటి చర్యలు లేవు. ప్రయివేటు యజమానులే కాదు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీమ్‌లు, ప్రగతి భవన్, మంత్రుల, ఎంఎల్ఏల నివాసాలు వంటి నిర్మాణాల నుండి కూడా సెస్సు వసూలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.
సంక్షేమ పథకాలకు ఆటంకాలు
2009 ఆగస్టు 15 నుండి సంక్షేమ బోర్డు (ఉమ్మడి) రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 20లక్షలకు పైగా భవన, ఇతర నిర్మాణ కార్మికులుంటే గత 12ఏండ్లుగా 12.5లక్షల మంది పేర్లనే బోర్డులో నమోదు చేయించారు. వాటిలో 10.7లక్షల మంది కార్మికులు మాత్రమే రెన్యూవల్ చేయించుకున్నారు. ఇంకా 9.5లక్షల మంది కార్మికులకు వెల్ఫేర్ బోర్డు కానీ దానిలో ఉన్న సంక్షేమ పథకాలు కానీ దరిదాపుల్లోకి చేరలేదు. భవన నిర్మాణ అడ్డాలు, కార్మికుల పని ప్రదేశాలకు వెళ్ళి నమోదు చేయించాల్సిన కార్మికశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వెల్ఫేర్ బోర్డు కార్డు నమోదుకు రేషన్‌కార్డు తప్పకుండా ఉండాలనే నిబంధన పెట్టారు. గత 15ఏండ్లుగా ప్రభుత్వాలే రేషన్ కార్డు ఇవ్వకపోతే కార్మికులకు కార్డు ఎక్కడనుండి వస్తుంది. కరోనా వ్యాధిసోకి 3, 4 నెలలు ఇంట్లో నుండి బయటికి రాక, మీ-సేవలు కూడా పనిచేయక లేబర్ ఆఫీసర్లు ఆఫీసులకు రాకపోవడం కారణంగా అనేకమంది కార్మికులు వెల్ఫేర్ బోర్డు కార్డును రెన్యూవల్ చేయించుకోలేదు. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని రెన్యూవల్ కాలేదని నష్టపరిహారాలు నిలిపివేయడం అన్యాయం.
2009 నుండి 2015 వరకు నమోదు మాన్యువల్‌గా చేసిన కార్డులు ఆన్లైన్ కంప్యూటర్లో ఎక్కలేదని రెన్యూవల్ చేయడం లేదు. నష్టపరిహారాల కోసం అప్లై చేసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఫ్యామిలీ సర్టిఫికెట్ తెమ్మంటున్నారు. దానికి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీ ఇవ్వమంటున్నారు. ఆ ష్యూరిటీ పేరుతో 10వేల రూపాయల వరకు లంచాలు ఉద్యోగులకు ఇవ్వాల్సి వస్తున్నది. కార్మికశాఖ అధికారులు గ్రామాలు, మండలాల్లో కొందరు బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని భవన నిర్మాణ కార్మికులను కాకుండా ఇతరుల పేరు నమోదు చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కార్మికశాఖ కార్యాలయాలు బ్రోకర్లకు నిలయాలుగా మారాయి.
కార్మికశాఖ ఖాళీలు భర్తీ ఎప్పుడు
10జిల్లాలను 33జిల్లాలుగా విభజన చేసిన ప్రభుత్వం, పెరిగిన జిల్లాలు, మండలాలకు అనుగుణంగా కార్మికశాఖకు ఏఎల్ఓ, ఏసీఎల్, డీసీఎల్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులకు సిబ్బందిని నియమించలేదు. అన్ని జిల్లాల్లో ఏఎల్ఓ, ఏసీఎల్, డీసీఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్మికులు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఒక్కో ఏఎల్ఓ, రెండు-మూడు జిల్లాలకు ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు. డీసీఎల్లు పాత ఉమ్మడి జిల్లాలకు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, ఉన్న అరకొర సిబ్బందికి కూడా ఇతర బాధ్యతలు పెట్టి పని భారం పెంచడం కారణంగానే వేలాది క్లైమ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కార్మికుల సమస్యలు పట్టించుకునే నాధుడే లేడు. కరోనాతో అనేక ఇబ్బందులు పడుతున్న కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించకుండా, నష్టపరిహారాలు అందించ కుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ కార్మికుల కడుపులు మాడుస్తున్నది.
రాష్ట్రంలో కేంద్ర చట్టంలోని స్కీమ్‌ల అమలేది?
1996 కేంద్ర చట్టం దశాబ్ధాల పోరాటాల ఫలితంగా వచ్చింది. కేంద్ర చట్టంలో ఉన్న స్కీమ్‌లను రాష్ట్రంలో అమలు చేయడం లేదు. 60ఏండ్లు పైబడిన కార్మికులకు పెన్షన్, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్లు, కార్మిక అడ్డాలో షెడ్ల నిర్మాణం, మంచినీరు, మరుగుదొడ్లు, పనిముట్లు కొనుగోలు, సొంత ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం వంటి అనేక కొత్త స్కీంలను ప్రభుత్వం పెట్టకుండా, ఉన్న స్కీమ్‌లకు నిధులు పెంచకుండా, కరోనా సహాయంలో పైసా కూడా భవన నిర్మాణ కార్మికులకు అందించకపోవడం అన్యాయం. కరోనా కాలంలో పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి నెలకు రూ.7,500 ఆర్థిక సహాయం అందించాలి. పెండింగ్‌లో ఉన్న క్లైమ్స్‌కు వెంటనే నిధులు విడుదల చేయాలి. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో నియమించాలి. బోర్డు నుండి అక్రమంగా దారి మళ్ళించిన 1,005 కోట్ల రూపాయలు తిరిగి వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలి. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఈ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కార్మిక శాఖామంత్రికి, కార్మిక శాఖ కమిషనర్‌కు, వెల్ఫేర్ బోర్డు కార్యదర్శికి పలుమార్లు వినతిపత్రాలు అందించి వేడుకున్నా ఏఎల్ఓ, డీసీఎల్, జిల్లా కలెక్టరేట్లు, లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద అనేకసార్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసనలు తెలిపినా ప్రభుత్వం, కార్మికశాఖ అధికారులు ''చెవిటి వాని ముందు శంఖం ఊదిన'' చందంగా వ్యవహరిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన లేని కారణంగానే, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 4న ఛలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో నిర్మాణ కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలి. లేదంటే పోరాటం మరింత ఉధృతం చేయడమే కార్మికుల ముందున్న మార్గం.
- వి. రాములు
సెల్: 9490098247