Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 23న కేంద్ర కార్మిక సంఘాలు, దేశవ్యాప్త పెడరేషన్ల ఉమ్మడి సమావేశం జరిగింది. భారతదేశాన్ని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తే 'నేషనల్ మోనిటైజేషన్ పైన్ లైన్'ను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని ఈ సమావేశం కార్మికవర్గానికి పిలుపునిచ్చింది. దసరా, దీపావళి మధ్య కాలంలో దేశవ్యాప్త కన్వెన్షన్ జరిపి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలనీ, ఎన్ఎంపి ద్వారా నేరుగా ప్రభావానికి గురయ్యే రంగాలలో జరిగే ఆందోళనలు అన్నింటిని బలపర్చాలని సమావేశం నిర్ణయించింది. ఇది దేశభక్తియుత పోరాటమనీ, కార్మికవర్గం తమ పోరాటాల ద్వారా ఈ విధానాన్ని త్రిప్పికొట్టాలనీ పిలుపునిచ్చింది. ఈ వెలుగులో అక్టోబర్ 7న నిరసన దినం పాటించాలని, ఆ రోజు మొదటి డ్యూటీ నుండే 'నల్ల రిబ్బన్' ధరించి విధులకు హాజరు అవ్వాలని, సెప్టెంబర్ 26న సమావేశమైన టిఎస్ ఆర్టీసీ జాయింటు యాక్షన్ కమిటీ కూడా నిర్ణయించింది. దేశ సంపద, ఆర్టీసీ ఆస్తుల రక్షణ కోసం జరుగుతున్న ఈ నిరసన దినంలో జేఏసీకి వెలుపల ఉన్న సంఘాలు కూడా భాగస్వాములవ్వాలని జేఏసీ కోరింది.
ఎందుకీనిరసన?: భారతదేశ కార్మికవర్గం తమ శ్రమ ద్వారా సృష్టించిన సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను ఈ రోజు ప్రయివేటు పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారు. ఆ సంపద సృష్టికి కారణమైన కార్మికులు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలతో ఒక్కసారి చర్చించడం కోసం సమయం లేదు. కానీ గ్లోబల్ ఇన్వెస్టర్స్‌తో మాత్రం ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు.
ఏమేమి అమ్ముతున్నారు?: నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న 1,32,499 కిలో మీటర్ల రోడ్లో 26,700 కి.మీ. కట్టబెట్టడం ద్వారా 1.6 లక్షల కోట్లు సంపాదిస్తారు (మొత్తం జాతీయ రహదారులలో ఇది 22శాతం). భారత రైల్వేస్ ఆధ్వర్యంలో 7325 స్టేషన్లు, 67956 కి.మీ. రూట్ లెంత్‌లో 1,26,366 కి.మీ. ట్రాక్ నెట్వర్క్, 13,169 పాసింజర్ ట్రైన్లు, 1246 రైల్వే గూడ్స్ షెడ్స్, 5 పర్వత రైల్వేస్, అనేక రైల్వే స్టేడియంలు, కాలనీలు 2843 కి.మీ. సరుకు రవాణా కారిడార్ కలిగి ప్రపంచంలోనే పెద్ద రైల్వేగా ఉంది. దీనిలో 400 స్టేషన్లు, 90 ప్యాసింజర్ ట్రైన్స్, ఒక రూట్లో 1400 కి.మీ. రైల్వే ట్రాక్, కొంకర్ ట్రైన్స్‌లో 741 కి.మీ., 15 రైల్వే స్టేడియంలు, గుర్తించబడిన రైల్వే కాలనీలు, 265 గూడ్స్ షెడ్స్, 4 పర్వత రైల్వేస్‌ను ప్రయివేటు వారికి ఇవ్వడం ద్వారా 1,52,496 కోట్లు సంపాదిస్తారు. 137 మేజర్ ఎయిర్ పోర్టులలో 25 ఎయిర్ పోర్టుల ద్వారా 20,782 కోట్లు, విద్యుత్ ట్రాన్సిమిషన్ ఆస్తుల ద్వారా 45,200 కోట్లు, 160 బొగ్గు బావులు ద్వారా 28,747 కోట్లు, టెలికం వ్యవస్థ అమ్మకం ద్వారా 35,100 కోట్లు, 6 గిగా వాట్ల జలవిద్యుత్ అమ్మకం ద్వారా 39,832 కోట్లు, గ్యాస్ పైప్‌లైన్ 17,432 కి.మీ., 3930 కి.మీ. పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్ ద్వారా రూ.22,503 కోట్లు సంపాదించాలని నిర్ణయించారు. భారతదేశంలో ఎఫ్‌సీఐ, సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న గిడ్డంగులలో 210 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన (మొత్తం గిడ్డంగులలో 39శాతం) అమ్మకం ద్వారా 28,900 కోట్లు సంపాదించాలని నిర్ణయించారు.
సాధారణ ప్రజలు భరించగలరా?: ఈ పాటికే భారత ప్రభుత్వం రోడ్ల ప్రయివేటు భాగస్వామ్యాన్ని ముందుకు తెచ్చింది. 'టోల్ - ఆపరేట్ - ట్రాన్స్ఫర్' పద్ధతిలో ఎన్.హెచ్.ఎస్.లో కోల్‌కతా - చెన్నై ప్రధాన రహదారిలో ఆంధ్రప్రదేశ్‌లోని 682 కి.మీ. రోడ్‌ను ఆగస్టు 2019లో రూ.9682 కోట్లకు అమ్మివేసింది. దీని అమ్మకానికి 'ఇనీషియల్ ఎస్టిమేటెడ్ కన్వెన్షన్ వాల్యూయేషన్' క్రింద రూ.6258 కోట్లుగా ప్రతిపాదిస్తే, 9682 కోట్లుకు పాడి బిడ్‌ను సంపాదించారు. 3424 కోట్లు ఎక్కువగా పాడినట్లు అనిపిస్తున్నది. కానీ భారతదేశ రోడ్లలో సగటు కమర్షియల్ ట్రాఫిక్ 75శాతం ఉంటే, ఈ రూట్లో 85శాతం ఉంది. అంటే ఈ రూట్ ఎంత లాభదాయకమైనదో అర్థం అవుతుంది.
నిజానికి ప్రభుత్వం ప్రకటించిన విలువ మొత్తం తక్కువగా చూపించబడినదేననేది అర్థం చేసుకోవాలి. రోడ్ల అమ్మకాన్ని పరిశీలిద్దాం. 26,700 కి.మీ. ద్వారా 1.6 కోట్లు గా నిర్థారించారు. మినిగ్రే ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ 2019 లెక్కల ప్రకారం రెండు లైన్ల హైవే నిర్మాణానికి 11 నుండి 12 కోట్లు ఖర్చవుతుందని, 4 లైన్ల రోడ్ నిర్మాణానికి 30కోట్లు ఖర్చవుతుందని ప్రకటించింది. 2019-21 మధ్యలో పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఆ ధరలలో 30శాతం పెరుగుదల ఉంటుంది. ఆ అంచనా ప్రకారం 25,700 కి.మీటర్లు 4 లైన్ల హైవే విలువ 8లక్షల కోట్ల రూపాయలు. దానిపై 30శాతం పెరుగుదల లెక్క వేస్తే రూ.2,40,300 కోట్లు ఉంటుంది. మొత్తంగా ఆ రోడ్ విలువ 10లక్షల 41వేల 300కోట్లుగా ఉంటుంది. కానీ దానిని 1.6కోట్లకే అప్పనంగా కట్టబెట్టడానికి సిద్ధపడ్తున్నారు. ప్రతిపాదించినది కూడా నిలబడకపోవచ్చు. రేపు బిడ్‌లో పాల్గొనే సంస్థలు ఒత్తిడి చేస్తే దీనిని కూడా తగ్గించుకోవచ్చు.
ఈ రోడ్లపైన ఎన్ని టోల్ ప్లాజాలు పెట్టాలి, ఎంత టోల్ వసూలు చేయాలనేది ఆ ప్రయివేటు సంస్థ ఇష్టమే తప్ప ప్రభుత్వ నియంత్రణకు అవకాశం ఉండదు. ఈ మొత్తం పరిశీలించినప్పుడు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే 70శాతం-80శాతం ఆదాయాన్ని ప్రయివేటు వాళ్ళే ఆర్జిస్తారు. దేశ ప్రజల పన్నుల నుండి నిర్మించిన మౌలిక వసతులు అన్నీ పెట్టుబడిదార్ల లాభాల కోసం కట్టబెట్టి, ప్రజలపై మాత్రం యూజర్ ఛార్జీల భారం మోపడమే అవుతుంది. దీనిని ఖచ్చితంగా నిలువరించాలి.
ఇప్పుడు ప్రకటించిన 26,700 కి.మీటర్లలో దక్షిణాది రాష్ట్రాలలోని 28 జిల్లాల్లో 1931 కి.మీ. ఉంటే అందులో మన తెలంగాణ రాష్ట్రంలోని ఆరు రూట్లలోని 365 కి.మీ. ఉంది.
1. కడ్యల్ - ఆర్మూర్ - 31 కి.మీ. 2. అడలూరు ఎల్లారెడ్డి - చేగుంట - 52 కి.మీ. 3. చేగుంట-బోయినపల్లి - 62 కి.మీ. 4. ఆర్మూర్ - కడలూరు - ఎల్లారెడ్డి - 59 కి.మీ. 5. కడలూరు ఎల్లారెడ్డి - గుండ్లపోచం పల్లి - 86 కి.మీ. 6. హైదరాబాద్ -బెంగుళూరు - 75 కి.మీ. మొత్తం : 365 కి.మీ.
ఆర్టీసీ భూములను కాపాడుకోవాలి : ఆర్టీసీకి 74,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములున్నాయని సంస్థ ఛైర్మన్ ప్రకటించారు. అంతటి విలువైన భూములు ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా కాపాడుకోవాలి. ఇంతటి నికర ఆస్తులను సంపాదించడంలో ప్రజల సహకారంతో పాటు ఏడు దశాబ్దాలుగా కార్మికుల శ్రమతోనే అన్నది గమనించాలి. అంతటి విలువైన భూములను అమ్మబోమని, లీజుకు ఇస్తామని కూడా ఛైర్మన్ చెప్పారు. ఇప్పటికే అనేక భూములు 30 నుండి 60 సంవత్సరాల లీజు పేరుతో కట్టబెట్టారు. అనేక పదుల కోట్లలో బకాయి ఉన్నట్లు సమాచారం. అందుకని ఆర్టీసీ భూములను లీజుకి ఇవ్వడం కాకుండా వాటిలో నిర్మాణాలు జరిపి, వాటిని లీజుకిచ్చే ఆదాయం పొందాలి. అందుకోసం ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం చేసి, అందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే ప్రజల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా భూమి మన సంస్థ వద్దనే ఉంటుంది.
అందుకని జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆందోళన, పోరాటంలో ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొనాలి. టిఎస్ ఆర్టీసీ జాయింటు యాక్షన్ కమిటి సరైన నిర్ణయమే చేసింది. జేఏసీలో చేరకుండా బయట ఉన్న కార్మిక సంఘాలు కూడా ఈ పిలుపులో భాగం అయి, ఈ రోజున జరుగనున్న నిరసన దినాలలో పాల్గొనాలి. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవ్వాలి.