Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షర కన్నీటి ప్రవాహంలో
పదాలు, వాక్యాలు కరిగి విరిగి పోతున్నాయి
గుండెలను చిదిమేసిన దాష్టీకం
కలం గొంతులో మంటలై ఎగసి పడుతోంది
కవనం చితి జ్వాలావరణాన్ని ఆలింగనం చేస్తోంది
పంట కంటిలో మిన్నంటిన సెగ
నాగటి చాళ్ళలో నెత్తుర ధార
మెతుకులు ముద్దగా మారిన ప్రతిసారీ
కార్లు తొక్కేసిన కాయాలే దర్శనమిస్తున్నాయి
కలలకూ ఆశలకూ కాలం చెల్లిందా?
కర్కశమూకల స్వామ్యం రెక్కలు విప్పిందా?
కరకు కత్తులూ, తుపాకులూ పొలాలపై విహారాలు
బ్రాండెడ్ కంపెనీల ట్యాగ్లు మోస్తూ పాలకులు
లేవు ఇక దాపరికాలు లేవు షుగర్ కోటెడ్ మాటలు
మారో గోలీ... పకడో లాఠీ...
రాజ్యాంగాన్ని కాగితపు బొమ్మగా మార్చి
గూండాగిరీతో హింసకు పురుడు పోసి
కార్పొరేట్ కాపలా కుక్కగా మారిన నాయకా! నువ్వింకా
కన్నీళ్ళ ఉప్పెనలు కనలేదు... కనలేదు
కదిలే పాదాలు ఆయుధ ధ్వని వినలేదు
గాలిలో కలసిన ప్రాణవాయువులు
యుద్ధరావాలై దండెత్తుతాయి! దండెత్తుతాయి!!
- కె. ఆనందాచారి