Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గత నెల 23న ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ పైప్‌లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు 2021-22 బడ్జెట్టులో ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా 'నిటి ఆయోగ్' ఆస్తుల నగదీకరణకు సంబంధించి రెండు సంపుటాలతో కూడిన ప్రతిపాదనలుజేసింది. ఇందులో రోడ్లు, విద్యుత్తు, సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పైపులైన్లు, గోడౌన్లు, రైల్వే ఆస్తులు, టెలికాం టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, విమనాశ్రయాలు, ఓడరేవులు, స్టేడియంలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను 2021తో ప్రారంభించి నాలుగు సంవత్సరాలలో నగదీకరణ చేస్తారు. దీని మూలంగా రూ.6లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని, ఆ మొత్తాన్ని మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తామని, నిరర్థక ఆస్తులను ఉపయోగంలోకి తేవడానికి వీలవుతుందని, ప్రయివేటురంగ పెట్టుబడులు తరలివస్తాయని, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన జరుగుతుందని ప్రకటించారు.
నగదీకరణను సమర్థించుకుంటూ ఆర్థికమంత్రి చెప్పినవన్నీ ప్రజలను మభ్య పెట్టటానికి ఉద్దేశించిన కల్లబొల్లి కబుర్లు. నగదీకరణ అనేది ''ప్రయివేటీకరణ''కు మరొక రూపం మాత్రమే. కాకపోతే చేదు మాత్రకు తీపిపూయడం లాంటిది. నగదీకరణ అంటే ఆస్తులను అమ్మడం కాదని, ఆస్తుల యాజమాన్యం ప్రభుత్వం వద్దే ఉంటుందని బీజేపీ చెబుతున్నది. 20, 30, 50 సంవత్సరాలకు లీజుకిస్తూ, లీజు కాలం అయిపోయిన తర్వాత మరల లీజును పొడిగిస్తూ ఉంటే ఆస్తుల యాజమాన్యం నామక: ప్రభుత్వం పేరుతో ఉన్నా వాస్తవంలో అవి ప్రయివేటు పరమైనట్టే. అందుకే నగదీకరణ ప్రయివేటీకరణకు ముద్దు పేరు అంటున్నాం.
'నగదీకరణ' కార్యక్రమం ద్వారా రూ.6 లక్షల కోట్లు వస్తాయని గొప్పలు చెప్పుకోవడం పెద్ద మోసం. 'నగదీకరణ' చేయదల్చుకున్న ఆస్తుల విలువ ఎంత, వాటి నుండి ఆదాయం ఇంత వరకు ఎంత వస్తున్నది, ఇప్పుడు మార్కెట్టులో ఆస్తులను లీజుకిస్తే ఎంత రాబడి వస్తుంది అన్న వివరాలు బహిరంగ పర్చలేదు. ఎంతో రాబడి రాగల ఆస్తులను కారుచౌకగా పెట్టుబడిదారులకు అప్పగించి, తమ అనుంగు మిత్రులకు దోచిపెట్టే స్కీమ్ కాబట్టే ఇంత గోప్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ స్కీమ్ గురించి పార్లమెంటులో చర్చించలేదు. నిపుణులతో అధ్యయనం చేయించలేదు. ఏ మాత్రం పారదర్శకత లేకుండా ప్రభుత్వం ముందుకు పోతున్నది.
ఈ పథకం మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం చెబుతున్నది. ఆస్తులను లీజుకు తీసుకున్న ప్రయివేటు సంస్థలు భారీగా పెట్టుబడులను పెడతాయని, తద్వారా నిరర్థకంగా, నిరుపయోగంగా ఉన్న ఆస్తులు పూర్తిగా వినియోగంలోకి వస్తాయని, వాటి నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నది. కాని పెట్టుబడిదారులు లాభం కోసం వస్తారు. ఆస్తుల నుండి ఎంత లాభం, ఎంత తొందరగా గ్రహిద్దామా అని ఆలోచిస్తారు. లాభం పిండుకుని ఆస్తులను నిరర్ధకం చేసి, ఆ తర్వాత వాటిని వదిలేస్తారు. అన్ని దేశాల అనుభవం ఇదే.
నగదీకరణ ద్వారా వచ్చే డబ్బును మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనకు రూ.111లక్షల కోట్లు కావాలి. అందులో రూ.6లక్షల కోట్లు ఏ మూలకు చాలవు. ఈ పేరుతో 'నగదీకరణ'ను సమర్థించుకోవడం 'హాస్యాస్పదం'. ఉన్న మౌలిక సదుపాయాలను ప్రయివేటు పెట్టుబడికి అప్పగించి, కొత్త మౌలిక సదుపాయాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. వాటిని కూడా ప్రయివేటుకు అప్పగించడానికైతే ప్రభుత్వం నిర్మించడమెందుకు? ప్రయివేటు రంగాన్నే మౌలిక సదుపాయాలను నిర్మించమని అడగవచ్చు కదా!
వాస్తవం ఏమిటంటే మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రయివేటు రంగం ముందుకు రాదు. కాని ఈ రంగంలో కూడా దానికి లాభం కావాలి. అందుకు ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నిర్మించి సిద్ధం చేస్తే బరువు బాధ్యత లేకుండా ప్రయివేటు సంస్థలు లాభం చేసుకోవచ్చు. ఇదే నగదీకరణ అసలు స్వరూపం. ప్రభుత్వం 'నగదీకరణ' కిందకు తెచ్చిన ఆస్తులను 'బరువు బాధ్యతలు లేని' (రిస్క్ ఫ్రీ) ఆస్తులని పేర్కొనడంలో ఆంతర్యం ఇదే. లీజుకు తీసుకున్న తర్వాత ప్రకృతి విపత్తుల కారణంగా (తుఫాను భూకంపాలు, వరదలు, పెనుగాలులు, లాక్డౌన్లు) మౌలిక సదుపాయాలకు నష్టం జరిగితే ఈ ప్రయివేటు సంస్థలు బాధ్యత తీసుకోవు. వాటిని అత్యవసరంగా పునరుద్ధరించే పని ప్రభుత్వం మీద పడుతుంది. అంటే ఖర్చు ప్రభుత్వానిది, సంపాదన పెట్టుబడిదార్లది.
పై రంగాలు తరతమ భేదాలు లేకుండా ప్రజలందరికీ అవసరమైన సేవలు అందించేవి. సామాన్య ప్రజలకు కూడా నిత్యం అవసరమైనవి. వీటిని కూడా వదిలి పెట్టకుండా లాభాలు చేసుకోవడానికి ఈ రంగాలలోని అత్యంత లాభదాయకంగా ఉండే భాగాలను మోడీ ప్రభుత్వం ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగిస్తున్నది. ఈ రంగాల స్వభావం రీత్యా గుండుగుత్తగా కొనడానికి ప్రయివేటు పెట్టుబడి ముందుకు రాదు. కాబట్టి దొడ్డిదారిన 'నగదీకరణ' పేరుతో పెట్టుబడిదార్లకు ధారాదత్తం చేస్తున్నది.
మౌలికసదుపాయాల విస్తరణకు 'నగదీకరణ' అవసరం అని కొంతమంది మేథావులు ప్రభుత్వంతో గొంతు కలుపుతున్నారు. విమర్శకులను మౌలిక సదుపాయాల అభివృద్ధికి, దేశ ప్రయోనాలకు వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చైనాతో పోలిక చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో చైనా ఎంతో ముందుకు పోయిందని, చైనాను అధిగమించాలంటే మౌలిక సదుపాయాల నగదీకరణ అవసరమని వాదిస్తున్నారు. ఈ వాదన బోడిగుండుకు మోకాలిచిప్పకు ముడి పెట్టడంలా ఉంది. మౌలికంగా దేశం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరం అనేదాంట్లో సందేహం లేదు. కాని దానికి 'నగదీకరణ' పరిష్కారం కాదు. చైనాలో మౌలిక సదుపాయాలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో, వాటి పెట్టుబడులతో అభివృద్ధి చెందాయి. ప్రయివేటురంగ ప్రమేయం నామ మాత్రం. చైనాయే కాదు, ప్రపంచంలో అనేక దేశాలు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేశాయి. ఉన్న ప్రభుత్వ రంగాన్ని కూడా మన పాలకులు 'నగదీకరణ' పేరుతో వదిలించుకుంటున్నారు. ఇది ఆత్మహత్యా సదృశం.
రంగాలవారీగా నగదీకరణ
ఇప్పుడు నగదీకరణ ప్రతిపాదనలను రంగాలవారీగా క్లుప్తంగా పరిశీలిద్దాం. 26 వేల కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్లను లీజుకిస్తున్నారు. ఆంధ్రాలో విజయవాడ- చిలకలూరిపేట, తెలంగాణలో హైదరాబాద్-బెంగళూరు, కడ్తల్ - ఆర్మూర్, అడ్లూరు -ఎల్లారెడ్డి, చేగుంట- బోయినపల్లి రోడ్లు లీజుకిస్తున్న వాటిలో ఉన్నాయి. లీజుకు తీసుకున్నవారు ఎన్ని టోల్గేట్లు అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎంతైనా రుసుం వసూలు చేసుకోవచ్చు. దానిపై ప్రభుత్వానికి ఎటువంటి అదుపు ఉండదు. రోడ్లన్నీ ప్రజలవని మనం అనుకుంటాం. కాని ఇప్పుడు ప్రజల ఆస్థిని ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా లాభం చేసుకోవటానికి ప్రయివేటు వారికి ఇస్తున్నారు.
29వేల కిలోమీటర్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లను ప్రయివేటీకరిస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలతో విద్యుత్ ప్రయివేటీకరణ సంపూర్ణమవుతుంది. ప్రజలపై విపరీతమైన భారాలు పడతాయి. చెల్లించలేని వారు విద్యుత్‌కు దూరమై పాతకాలంలో వలె దీపాలు పెట్టుకొని, పొద్దుగూకగానే పడుకొనే పరిస్థితి వస్తుంది.
600 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుదుత్పత్తి కేంద్రాలను కూడా ప్రయివేటీకరణ చేస్తామంటున్నారు. జల విద్యుత్ ఉత్పత్తికి ఖర్చేమీ ఉండదు. కాబట్టి ఆ కేంద్రాలను ప్రయివేటు వారికిస్తే వారికి విపరీతమైన లాభాలొస్తాయి. కాని మన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రయివేటు వారి చేతిలోకి వెళితే వ్యవసాయ అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా, తమ లాభాల కోసం జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నీటిని కిందికి వదులుతారు. సాగర్, పులిచింతల నిండుగా ఉన్నపుడు శ్రీశైలంలో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, నీటిని కిందికి వదిలితే నీరంతా సముద్రం పాలవటమే కదా! ఆ విధంగానే సాగర్‌లో కూడా చేస్తే జలాశయాలు ఖాళీ అవుతాయి. ఉదాహరణకు సాగర్, శ్రీశైలం ఖాళీ అయిన తర్వాత వ్యవసాయ అవసరాలకు నీరు లేకుండా పోతుంది. ఆ విధంగా ఇది కేవలం విద్యుత్ సమస్య మాత్రమే కాకుండా వ్యవసాయం, రైతాంగ సమస్య కూడా అవుతుంది.
పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే 3,930కి.మీ పైప్లైన్లను, 8,154 కి.మీ సహజవాయు పైప్లైన్ల్ను లీజుకు ఇస్తున్నారు. ఆంధ్రలోని ఐదు వందల కిలో మీటర్ల పైప్లైన్లు కూడా దీనిలో ఉన్నాయి. వీటిలో నుండి పెట్రోలు, గ్యాస్‌ను తీసుకెళితే ప్రయివేటు వారికి ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్, గ్యాస్ తదితరాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనితో మరింతగా పెరుగుతాయి.
400 రైల్వేస్టేషన్లను ప్రయివేటీకరిస్తున్నారు. 90 పాసింజరు రైళ్ళు, 265 గూడ్స్‌షెడ్లు ప్రయివేటువారికి ఇవ్వబోతున్నారు. ప్రతి పట్టణంలోనూ రైల్వే కాలనీలను గుర్తించి, డెవలప్మెంట్ పేరుతో వాటిని తీసుకొని, ఉద్యోగులను అక్కడ నుండి పంపివేస్తారు. రైల్వే స్టేడియంలను ప్రయివేటువారికి ఇస్తారు. వారికిచ్చిన తర్వాత రైల్వే ఉద్యోగులతో పాటు సాధారణ పౌరులకు కూడా డబ్బు ఇస్తేనే ప్రవేశం ఉండవచ్చు. లేదా వాటిని మాల్స్‌గా తయారు చేయవచ్చు. దురంతో, శతాబ్ది, రాజధాని లాంటి బాగా లాభాలొచ్చే 90 రైళ్ళను ప్రయివేటీకరిస్తున్నారు. లాభాలొచ్చేవన్నీ ప్రయివేటు వారికి వెళ్ళిన తర్వాత నష్టాలొచ్చేవి ప్రభుత్వం వద్ద మిగులుతాయి. కాబట్టి క్రాస్ సబ్సిడీ ఇవ్వగలిగిన శక్తి రైల్వేలకు ఉండదు.
మూడు లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫౖౖెబర్ నెట్‌వర్క్‌ను 14,917 టెలికాం టవర్లను లీజుకు ఇవ్వబోతున్నారు. జియో వారు వాటిని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. 25 విమానాశ్రయాలను, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలను ప్రయివేటువారికి ఇవ్వబోతున్నారు. నాలుగు వేల టవర్లను కూడా లీజుకు ఇవ్వబోతున్నారు. 9 పెద్ద ఓడరేవులలో 31 బెర్తులను, అందులో విశాఖ పోర్టులో తొమ్మిది బెర్తులను లీజుకు ఇవ్వబోతున్నారు.
తర్వాత 2కోట్ల 10లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన ఎఫ్‌సీఐ, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ల గోడౌన్లను ప్రయివేటీకరిస్తున్నారు. గోడౌన్లు ప్రయివేటు పరమైతే ప్రభుత్వం ఆహారధాన్యాలను సేకరించటం ఉండదు. ప్రభుత్వం వద్ద ఆహారధాన్యాలు ఉండవు కాబట్టి ప్రజలకు తక్కువ ధరలకు అందించటం ఉండదు. ఒకవేళ ప్రజలకు అందించాల్సి వస్తే ప్రభుత్వం పెట్టుబడిదారుల నుండి కొనుగోలు చేసి, పంపిణి చేస్తుంది. అప్పుడు ప్రజలకు పంపిణి చేసినట్లూ ఉంటుంది. పెట్టుబడిదారులకు లాభాలూ వస్తాయి. ఇప్పుడు ప్రజలకు పంపిణీ అవుతున్నా, పెట్టుబడిదారులకు లాభాలు రావటం లేదు. ఈ గోడౌన్లన్నింటినీ తీసుకోవటానికి అదాని వంటివారు సిద్ధంగా ఉన్నారు. వారు వ్యవసాయ రంగం, వ్యవసాయ మార్కెట్లలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. గోడౌన్లు నిర్మించే శ్రమ లేకుండా ఇవన్నీ వారి చేతిలోకి వెళ్ళిపోతాయి. వీటిలో పనిచేస్తున్న హమాలీలు, రైల్వేలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఉపాధికి ప్రమాదం వస్తుంది.
త్వరలో జాతీయ భూ నగదీకరణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల వద్దవున్న ఖాళీ భూమిని ఈ కార్పొరేషన్ తీసుకుంటుంది. ఈ భూమిని రియల్ ఎస్టేట్ ఇతర అవసరాలకు ప్రయివేటు సంస్థలకు, వ్యక్తులకు అమ్ముతుంది లేదా లీజుకిస్తుంది. ఈ సంస్థ సేవలను కేంద్రమే కాకుండా రాష్ట్రాలు కూడా వినియోగించుకోవచ్చు. టెలికాం కంపెనీలు, హెచ్.ఎం.టిల వద్ద ఉన్న 2,000 ఎకరాల భూమితో ఈ కార్పొరేషన్ పని ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
నగదీకరణ కార్యక్రమాన్ని కేంద్ర స్థాయికే పరిమితం చెయ్యాలని మోడీ ప్రభుత్వం అనుకోవడం లేదు. తమతమ రాష్ట్రాలలో నగదీకరణ చేపట్టమని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్లను నియమించాలని కోరింది. ఇప్పటికే రాష్ట్రాల నోడల్ ఆఫీసర్లకు నిటిఆయోగ్ వారు 'నగదీకరణ'పై ఒక కార్యశాలను కూడా నిర్వహించారు.
రాష్ట్ర స్థాయితో ఆగకుండా, పంచాయతీ స్థాయిలో వనరుల నగదీకరణను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రామ సభల సంవత్సర పని క్యాలెండర్ వివరిస్తూ ఒక సూచన పత్రాన్ని పంపింది. ఆందులో గ్రామ స్థాయిలో పంచాయతీ ఆధీనంలో ఉన్న ఆస్తులను నగదీకరించు కోవడానికి పూనుకోవాలని కోరింది. పైన వివరించిన అంశాలను గమనిస్తే బీజేపీ ప్రభుత్వం ప్రయివేటీకరణ, నగదీకరణ పేరుతో దేశంలో అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పెట్టుబడి వశం చేయడానికి సాధ్యమైనంత వేగంగా అన్ని రంగాలలో ప్రభుత్వ పాత్రను ఉపసంహరించడానికి పూనుకున్నదని విదితం అవుతున్నది.
నగదీకరణ పర్యవసానాలు
ఇవన్నీ ప్రయివేటు వారికి ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మొదటిది ధరలు విపరీతంగా పెరుగుతాయి. ప్రయివేటు వారు లాభం కోసం లీజుకు తీసుకున్నారు కాబట్టి యూజర్ ఛార్జీలు వేస్తారు. అందువలన ధరలు పెరుగుతాయి. రెండవది వీటిలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రయివేటు వారు ఉద్యోగులను ఉంచుతారని గ్యారంటీ లేదు. పదిమందికి ఉద్యోగాలు పోతే ఇరవై మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి చెబుతున్నాడు. అంటే ఉద్యోగులను ప్రయివేటు వారు ఉంచరని స్పష్టమౌతున్నది.
మూడవది ఇప్పటి వరకు ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు జరిగాయి. ప్రయివేటు వారి చేతిలోకి పోతే రిజర్వేషన్లు ఉండవు. పర్మినెంటు ఉద్యోగాలు ఉండవు. అన్నీ కాంట్రాక్టు ఉద్యోగాలే ఉంటాయి.
ఈ అమ్మకం ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు? సాధారణ పౌరులు, మనలాంటి వారు వీటిని లీజుకు తీసుకోవటం, కొనటం చేయగలరా? కార్పొరేట్ సంస్థలు మాత్రమే వీటిని కొనగలవు. వీటిని కొనుగోలు చేసిన తర్వాత ప్రతి రంగంలోనూ కొద్ది మంది గుత్తాధిపత్యం సాధించటానికి అవకాశం ఏర్పడుతుంది. టెలికాం రంగంలో జియో, ఎయిర్ టెల్ ఉన్నాయి. పోర్టులు అదాని తీసుకొంటున్నాడు. విమానాలు టాటాలు తీసుకోవచ్చు. ప్రయివేటైజేషన్, మానిటైజేషన్ తదితర కార్యక్రమా లతో సంవత్సరాల తరబడి ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ రంగాన్ని నాలుగు సంవత్సరాలలో మాయం చేస్తున్నారు. మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లు తెచ్చారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చారు. 370 అధికరణాన్ని రద్దుచేశారు. రాష్ట్రాల హక్కులను నాశనం చేస్తున్నారు. ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నపుడు ప్రజలు చూస్తూ ఊరుకోరు. పోరాటాలలోకి వస్తారు. రైతులు పోరాటాలు చేస్తున్నారు. కార్మికులు పోరాటాలు చేస్తున్నారు. ఉద్యోగులు సమ్మె చేశారు. వీటిని అణచివేయటానికి తీవ్రమైన నిర్బంధాన్ని పాలకులు అమలు చేస్తున్నారు. మరీ వ్యతిరేకిస్తున్నవారిని దేశద్రోహి అని ముద్ర వేస్తున్నారు. గతంలో ఎమర్జెన్సీ అని ప్రకటించి నిర్బంధాన్ని ప్రయోగించారు. ఈనాడు ప్రకటించకుండానే ఎమర్జెన్సీకి మించిన నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ప్రయివేటీకరణ, నగదీకరణల ద్వారా సంపదలను పెట్టుబడిదారులకు అప్పగించాలంటే ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలి. ప్రశ్నించే వారిని జైళ్ళలో నిర్బంధించాలి. జైళ్ళలో ఉండటం, బతికి ఉండటం కూడా ప్రమాదం అనుకుంటే పైకి పంపాలి. పన్సారేను, మరికొందరిని అలాగే హత్యలు చేశారు. అందుకే ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటంలో భాగంగా ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం కూడా సాగాలి.
బి.వి. రాఘవులు