Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలపరిమితి ముగిసిన షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్స్ జీఓను సవరించాలి. బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.21,000లు, కరువుభత్యం ప్రతి పాయింట్ రూ.10.50 పైసలు నిర్ణయించాలని, బీడీ కార్మికులకు కనీస వేతనాల జీఓను సవరించాలని, నెలకు 26 రోజులు పనిదినాలు కల్పించాలని, బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే Copta చట్టం-2003 సవరణను ఉపసంహరించు కోవాలనే డిమాండ్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు 2021 అక్టోబర్ 8న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7లక్షల మంది బీడీ కార్మికులు సమ్మె తలపెట్టారు.
బీడీ కార్మికుల బతుకులు మారందే బంగారు తెలంగాణ రాదు
తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి 7లక్షల మంది బీడీ కార్మికులు జీవిస్తున్నారు. ఇందులో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. నూటికి 90శాతం మంది మహిళలు బీడీలు చుట్టడం తప్ప మరొక బతుకు లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు కనీస వేతనాల విషయంలో చేసిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. బీడీ పరిశ్రమ, కనీస వేతనాల పరిశ్రమ, షెడ్యూల్ పరిశ్రమ క్రిందకి వస్తుంది. ఇందులో అన్ని క్యాటగిరీ కార్మికులకు ఎంత వేతనం ఇవ్వాలనేది జీఓ ద్వారా నిర్ణయించాలి. ఇది బీడీ కార్మికులకు ఉన్న చట్టబద్ధమైన హక్కు. 2010లో బీడీ కార్మిక సంఘాలు అన్నీ (జెఏసి) ఆధ్వర్యంలో 32 రోజులు సమ్మె చేసిన ఫలితంగా 2012 ఫిబ్రవరి 3న కనీస వేతనాలు జీఓ41 వచ్చింది. నాడు బీడీ కంపెనీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాల జీఓ41ని నిలుపుదల చేస్తూ, మరో జీఓ81ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా అబియాన్స్లో పెట్టిన జీఓ 81ని రద్దు చేస్తారని, కనీస వేతనాల జీఓని టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసి అమలు చేస్తుందని బీడీ కార్మికులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఈ జీఓ 41 అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై పైసా భారం పడదు. బీడీ కార్మికుల జీఓ అమలు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నుండి ఉలుకూ పలుకూ లేకుండా ''చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా'' రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వం ఉపేక్ష వల్ల ఆ జీఓ అమలు కాకుండానే (9ఏండ్లు) కాలపరిమితి ముగిసింది.
కనీస వేతనాల చట్టం-1948 ప్రకారం ప్రతి ఐదేండ్ల కొకసారి సవరించాలని ఉంది. తొమ్మిదేండ్లు గడిచినప్పటికి కనీస వేతనాల జీఓని సవరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. కార్మికులకు తీవ్ర నష్టం కల్గుతున్నది. దీంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాని స్థానంలో మరొక కొత్త జీఓ ఇవ్వాల్సిన సమయం కూడా దాటిపోయింది. అయినప్పటికీ పాత జీఓ అమలు లేదు. కనీస వేతనాల జీఓ పునరుద్ధరణకు దిక్కులేదు.
బీడీ కార్మికులకు జరుగుతున్న నష్టం
కనీస వేతనాల జీఓ ప్రకారం కనీస వేతనం బేసిక్ 1,000 బీడీలకు కరువు భత్యం విడిఏ పాయింట్లతో కలిపి బేసిక్ + విడిఏ 1,000 బీడీలకు రూ.273లు ఇవ్వాలి. ప్రస్తుతం 1,000 బీడీలకు ఇస్తున్న వేతనం రూ.211.52పైసలు, ఒక కార్మికురాలు రోజుకు నష్టపోతున్న డబ్బు రూ.62లు, నెలకు 62 × 7,00,000 × 26 రోజులకు = 112,84,00,000 నెలకు 112 కోట్ల 84 లక్షల రూపాయలు, సంవత్సరానికి 1,354 కోట్ల 8 లక్షల రూపాయలు, 10 సంవత్సరాలకు గాను 7 లక్షల మంది కార్మికులు నష్టపోతున్న డబ్బు సుమారు 13,540 కోట్ల 80 లక్షల రూపాయలు. కార్మికుల నుండి దోపిడీ చేసిన ఈ డబ్బుంతా బీడీ కంపెనీల యజమానులకు కోట్ల రూపాయలు మిగిల్చింది. ఇందులో పెద్ద వాటానే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులకు కమిషన్ రూపంలో అందుతుంది. బహుశా ఇంతటి ఘరానా దోపిడీ ఏ రంగంలో కూడా ఉండదేమో? బీడీ కార్మికుల నిరక్షరాశ్యత, వెనుకబాటుతనాన్ని అసరా చేసుకొని పట్టపగలే ఇంత పెద్దఎత్తున దోపిడీ జరుగు తుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది.
హక్కును కాలరాసి - బిక్షమేస్తారా?
కనీస వేతనాల జీఓ అమలు చేయకపోవడం అంటే కార్మికుల హక్కులను కాలరాయటమే. బీడీ కార్మికులకు కనీస వేతనం జీఓ అమలు చేస్తే రూ.6,000లు వస్తాయి. వీటి గురించి మాట్లాడ కుండా బీడీ కార్మికులను ఆదుకుంటామని, వారి సంక్షేమం కోసం పాటుపడతా మని చెప్పడం విడ్డూరం. జీవన భృతి రూ.1,000లు ఇస్తామని చెప్పి అనేక షరతులు పెట్టి ఇంటికో ఫించన్ విధిలిస్తున్నారు.
జీఎస్టీ నుండి బీడీ పరిశ్రమను మినహాయించాలి
కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై 18శాతం ఉన్న పన్నును 28శాతానికి పెంచింది. పన్నుల భారం పెరగడంతో యాజమాన్యాలు ఉత్పత్తిని తగ్గించారు. దీంతో పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళింది. ఫలితంగా కార్మికులకు పని రోజులు తగ్గాయి. గతంలో నెలకు 26 రోజులు దొరికిన పని ప్రస్తుతం 10రోజులు కూడా లభించడంలేదు. రూ.1,000 బీడీల పని ఇవ్వమంటే కేవలం 500కి మాత్రమే ఇస్తున్నారు. దీంతో పరిశ్రమపై ఆధారపడ్డ 7లక్షల మంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులనెదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు బీడీ కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది.
Copta చట్టం-2003 ప్రతిపాదించిన సవరణల ప్రకారం బీడీ కట్టలపై ఉత్తర్వుల గురించి ఉత్పత్తిదారులు ప్రచారం చేసుకోరాదు. బీడీ కట్టలు పబ్లిక్‌గా దుకాణాల్లో ఉండరాదు. 20ఏండ్లు కంటే తక్కువ వయసున్న వారికి బీడీలు అమ్మడానికి వీలులేదట. కానీ 18ఏండ్లు వయస్సున్న వారు ఓటు మాత్రం కావాలట. లూజు బీడీలు అమ్మడానికి వీలులేదట. కట్టలు మాత్రమే అమ్మాలట. బీడీ కట్టలలో బీడీల సంఖ్యను ప్రభుత్వం నిర్ధేశిస్తుంది. ఈ సవరణలు అమలు జరిగితే బీడీ అమ్మకాలు తగ్గి, కార్మికులకు ఉపాధి పోతుంది. ఇది పెద్ద సంక్షోభానికి దారి తీస్తుంది. అందుకే బీడీ పరిశ్రమలో పనిచేసే అన్ని కేటగిరీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. అప్పుడే ఈ సవరణలు అమలుచేయాలి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెద్దాం! కనీస వేతనాల జీఓను సాధించుకుందాం!! 2021 అక్టోబర్ 8న జరిగే రాష్ట్ర వ్యాపిత సమ్మెను జయప్రదం చేద్దాం!!!
- ఎస్.వి. రమ
సెల్:9490098899