Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో అతి పురాతన సంస్కృతుల గురించి చెప్పుకోవాలంటే మొదట మెసపటోమియా సంస్కృతి (3500-500 బిసిఈ) గురించి చెప్పుకోవాలి. ఇది ఇరాక్, సిరియా, టర్కీ ప్రాంతాల్లో విలసిల్లింది. తర్వాత పశ్చిమ భారతదేశం, పాకిస్థాన్, తూర్పు అప్ఘనిస్తాన్ ప్రాంతాల్లో సింధూ నాగరికత (3300-1900 బిసిఈ) విలసిల్లింది. ప్రాచీన ఈజిప్టు సంస్కృతి ఈజిప్టులో 3150-30 బిసిఈ మధ్య కాలంలో వర్థిల్లింది. గ్రీస్‌లో గ్రీక్ సంస్కృతి 2700-479 బిసిఈ మధ్య, మాయా సంస్కృతి 2600 బిసిఈ నుండి 900 సి.ఈ మధ్య కాలంలో విలసిల్లాయి. ఆ తర్వాతే చైనా, పర్షియా, రోమన్ సంస్కృతులు వర్థిల్లుతూ వచ్చాయి. సింధూ నాగరికత భారతదేశపు మూలవాసుల నాగరికత. అది ఆర్యుల నాగరికతో, వైదికుల సనాతన నాగరికతో కాదు. ఎందుకంటే వారు ఏర్పరుచుకున్న దేవుళ్ళు, ఆ దేవుళ్ళ గురించి రాసుకున్న పురాణాలు అన్నీ బుద్ధుడి తర్వాత రాసుకున్నవే - అని నిర్ధారణ జరిగింది. ఒకరకంగా జైన, బౌద్ధ ధర్మాల్ని నాశనం చేసే పనిలో భాగంగానే వారి కట్టడాల్ని కూల్చి ఆలయాలుగా మార్చుకోవడం జరిగింది. బుద్ధుడి ప్రత్యేకతని దెబ్బతీయడానికే అతణ్ణి దశావతారాల్లో ఒకడిగా చేసుకోవడం, అతని స్ఫూర్తితో అతని రూపురేఖలతో రాముడనే దేవుణ్ణి సృష్టించుకోవడం జరిగింది. ఇవన్నీ కొత్త విషయాలేమీ కాదు. పరిశోధకులు, చరిత్రకారులు, నరశాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు అధ్యయనం చేసి, ఆధారాలు చూపుతూ స్థిరపరిచినవే. ఇప్పుడు వాటి గూర్చి మాట్లాడుకోవల్సిన పనిలేదు. కానీ, వైదిక ధర్మ ప్రభోదకులు తమ దేవుళ్ళ 'తయారీ'కి మత విశ్వాసాలకు మోసపటోమియా, ఈజిప్టు, గ్రీక్ సంస్కృతుల నుండి ఏయే విషయాలు తీసుకున్నారు, ఎలా కూర్చుకున్నారో గమనించాలి. జ్యోతిషం, వాస్తు ఇక్కడివి కావు, అవి పురాతన బాబిలోనియన్లవని అందరూ తెలుసుకుని, తేల్చేసినవే. ఇకపోతే ప్రాచీన ఈజిప్టు నాగరికత వివరాల్లోకి వెళితే - అవి మనదేశంలో వైదిక ధర్మ స్థాపనకు ఎలా ఉపయోగపడ్డాయో తెలుసుకోవచ్చు-
అతి పురాతన సంస్కృతుల్లో ఈజిప్టు సంస్కృతి కూడా ఒకటి అని చెప్పుకున్నాం. అక్కడి గిజా (GIZA) లోని పిరమిడ్లు, మమ్మీలు ఇప్పటికీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈ సంస్కృతి మూడు వేల బి.సి.ఇ నాటిది. మతాలలో ఒకే దేవుణ్ణి ఆరాధించే మతాలు (MONO THEISTIC) కొన్నయితే, అనేకమంది దేవుళ్ళను పూజించే సంస్కృతి (POLYTHEISTIC) కొందరిది. ఈజిప్టులో మొదటి నుంచీ పాలిథీస్టిక్ విధానమే కొనసాగుతూ వచ్చింది. దీన్నే వారు 'మాట్' అని పిలుచుకున్నారు. ఈ మాట్ ద్వారానే వారు ప్రకృతిని, తమ ఆధీనంలో ఉంచుకోగలమని భావించారు. సత్యం, సమన్వయం, క్రమపద్ధతి, సుహృద్భావం, చట్టం, నైతికత, న్యాయం మొదలైనవన్నీ జీవితంలో అత్యవసరమని వారు గ్రహించుకున్నారు. అక్కడి మాట్ ఇక్కడ మఠంగా మారిందా? ఏమో- తెలియదు.
ఈ భూమి మీద సాగించే జీవన యానం కొంత కాలమేననీ, ఆ తర్వాత, మరణానంతరం కూడా మరో లోకంలో జీవితం ఉంటుందని వారు భావించారు. ఎక్కువ మంది దేవుళ్ళను ప్రార్థించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందనీ అనుకున్నారు. భగవంతుడి అభీష్టం మేరకు భూమి మీద మనుషులు ఒకరిపై ఒకరు ఆధారపడుతూ, నిర్దేశించిన లక్ష్యాల్ని చేరుకోవాలి. అలాగే మనుషులకు దేవుళ్ళకూ మధ్యవర్తిగా ఫరా (PHARAOH)ఉంటాడని, అందుకే అందరూ రాజుకు విధేయులుగా ఉండాలని అనుకుంటారు. ఈ విశ్వంలో ఒక క్రమ పద్ధతి, గతి నెలకొని ఉండాలంటే అది ఫరాతోనే సాధ్యమని, ఆయనే దేవుళ్ళను శాంతింపజేస్తాడని.. వారి విశ్వాసం. 3150 బి.సి.ఈ నుండి 30 బిసిఈ ఈమధ్య కాలంలో ఈజిప్షియన్లు సుమారు రెండు వేల మంది దేవతల్ని ప్రార్థించేవారు. ఆ తర్వాత కాల క్రమంలో జనం కొంత మంది దేవీ దేవతల్ని మరిచిపోయారు. కాళాకృతుల్లో నిలుపుకున్న వారి వివరాలు మాత్రం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.
కొంతమంది దేవీ దేవతల విధులు, కర్తవ్యాలు ఒకే విధంగా ఉన్నాయి. అందుకు రెండు కారణాలు 1. ఈజిప్టు సంస్కృతి సంక్లిష్టంగా ఉండడం 2. కాల గమనంలో వచ్చిన పరిపాలకుల (ఫరా) రాజకీయ ఆలోచనా ధోరణులను బట్టి దేవీ దేవతల గుణగణాలు, సామర్థ్యాలు, ప్రాముఖ్యతలు మారిపోతూ కొనసాగడం. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారి వారి ప్రాంతీయ దేవీదేవతలు కూడా పూజలందుకున్నారు. వేల వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఈజిప్టు సంస్కృతి ఇప్పటికీ ఒక 'ఏకీకృత' సంస్కృతిని ఏర్పరుచుకోలేక పోయింది. సంక్లిష్ట సంస్కృతిగానే మిగిలిపోయింది. అయినా, విషయం సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అతి ముఖ్యమైన దేవీ దేవతలు ఈ విధంగా ఉన్నారు. అమున్-రా (AMUN-RA) అంటే సూర్యదేవుడు. ఇతర ఈజిప్టు దేవతల కన్నా శక్తి సంపన్నుడు, ముఖ్యమైనవాడు. ఆకాశమార్గాన తన పడవలో ప్రయాణిస్తాడు. ప్రతీరాత్రీ కింది లోకాలకు వెళ్ళి 'ఎపోఫిస్' అనే సర్పదేవుణ్ణి ఓడించి మరునాటి ఉదయం జన్మిస్తుంటాడు. ఉదయించడాన్ని ఈజిప్షియన్లు జన్మించడంగా భావిస్తారు. భూమి మీద గల రాజులంతా 'రా'ను ఆదర్శంగా తీసుకుంటారు. ఈజిప్టు సంస్కృతిలో దేవీ దేవతలకు స్థాయీ భేదాలున్నాయి. కింది వరుసలో అంటే, నాలుగవ వరుసలో ఉన్న వారు ఒసిరిస్ (OSIRIS -ఫరా) ఐసిస్ (ISIS-ఆయన రాణి), సేత్ (SET- విధ్వంస దేవుడు) నిఫ్తిస్ (NEPHTHYS -స్వర్గానికి యజమానురాలు) - వీరు నలుగురు. వీరికి పై మెట్టుమీద అంటే మూడో వరుసలో ఇద్దరుంటారు. వారు జెబ్ (GEB- భూమి దేవుడు) నట్ (NUT - ఆకాశదేవత). ఇక్కడ భూమిని ఆకాశాన్ని ఒకే స్థాయిలో ఉంచుకోవడం జరిగింది. వీరికి పై స్థాయిలో షు (SHU - వాయుదేవుడు), టెఫ్నట్ (TEFNUT - వర్షదేవత) ఉంటారు. ఈ స్థాయిలో కూడా ఒక దేవుణ్ణి ఒక దేవతను కలిపి ఒకే స్థాయిలో ఉంచుకున్నారు. ఇది రెండో వరుస. 2, 3, 4 స్థాయిల్లో ఉన్న దేవీ దేవతలకు సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చారు. ఇక వీళ్ళందరి మీద 4+2+2=8 మంది దేవీ దేవతలకు పైస్థాయిలో అంటే మొదటగా ఉన్నవాడు రా (RA)- సూర్యుడు). ఇతను సర్వశక్తి సంపన్నుడు. స్వయంభువు- అంటే తనను తానే సృష్టించుకున్న వాడు.
ఇక ఈ దేవీ దేవతల గూర్చి క్లుప్తంగా పరిశీలిద్దాం! నాలుగ వరుసలో ఉన్నవాడు ఒసిరిస్. అతనే ఫరా (రాజు) ఒసిరిస్ భార్య ఐసిస్. ఒసిరిస్ సోదరుడు - సేత్ విధ్వంస దేవుడు. సేత్, ఒసిరిస్‌ను కుట్రపూరితంగా ఒక శవపేటిక (COFFIN) లో బంధించి నైలు నదిలో పడేస్తాడు. ఎంతకూ క్రోధం చల్లారకపోగా శవపేటికను ఖండ ఖండాలుగా నరుకుతాడు. ఐసిస్ భర్త శవం కోసం దీర్ఘకాలం పాటు వెతుకుతుంది. చివరకు బైబ్లోస్ (BYBLOS) లో దొరికించుకుని, ఈజిప్టుకు తీసుకొస్తుంది. ఈ పనిలో ఐసిస్‌కు నెఫ్తైస్, అనుబిస్ (ANUBIS) ల సహకారం లభిస్తుంది. అందరూ కలిసి ఒసిరిస్ శరీర భాగాల్ని వెతికి తెచ్చి, పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే, రాణి ఐసిస్ భర్త మరణానికంటే ముందే గర్భవతి. భర్త మరణానంతరం ఆమె హౌరస్ (HORUS) కు జన్మనిస్తుంది. హౌరస్ యువకుడై తన తండ్రిని చంపిన సేత్తో పలుమార్లు యుద్ధం చేస్తాడు. చివరకు సేత్‌ను చంపి, హౌరస్ ఈజిప్టుకు రాజవుతాడు. ఇక్కడ విధ్వంసం సృష్టించే వాణ్ణి - ఒక పద్ధతి ప్రకారం ఉండే నిజాయితీ పరుడు చంపేశాడు. అంటే చెడుపై మంచి సాధించిన విజయంగా ఈజిప్టు ప్రజలు భావిస్తారు. అప్పటి నుండి రాజ్యాధికారం చేజిక్కించుకున్న వాడే 'ఫరా' అని - అతను ప్రజలకు - 'రా'కు మధ్య సంధాన కర్త అని ప్రజలు భావించేవారు. అయితే ఇక్కడ కూడా ఒక పోలిక ఉంది. పిల్లణ్ణి పెట్టెలో పెట్టి నదిలో వదిలేయడం - ఇక్కడి పురాణ రచయితలు వాడుకున్నట్లుంది. దీన్నే వదిలేయకుండా జాగ్రత్తగా స్వీకరించి, స్వయాన ఆ భగవంతుడే ఆ రచనలు మానవులకు అందించాడనీ - లేదా ఆయన అంశతో జన్మించిన దైవాంశ సంభూతులు వాటిని రాశారనీ - ఒక అబద్ధపుఢంకా బజాయించుకున్నారు.
భూమి బల్లపరుపుగా ఉందని, దాని మీద ఆకాశం ఒక గిన్నెలా బోర్లించి ఉందని ఈజిప్షియనుల విశ్వాసం. భూమికి సమాంతరంగా భూమి కింద మరో లోకం ఉందని, దాన్ని కూడా ఒక ఆకాశం కప్పేసిందని, ఇంకా దానికి అవతల ఒక విధ్వంస దేవత 'ను' ఉంటుందనీ.. ఈ సృష్టి జరగక ముందే నుండే 'ను' అక్కడ ఉంటున్నట్లు భావిస్తారు. ఆ కింది లోకంలోనే డూయెట్ (DUAT) అనే ఒక మార్మిక ప్రదేశం ఉందని, చావు, పునర్జన్మ లాంటివన్నీ అక్కడే నిర్ణయించబడతాయని వారి భావన. ప్రతి రోజూ 'రా' దినమంతా ప్రయాణించి, రాత్రిపూట కిందిలోకం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ డూయెట్ అనే ప్రదేశం నుండి కూడా ప్రయాణిస్తాడని, మృత్యుదేవతను ఎదుర్కొని, మరునాడు మళ్ళీ జన్మిస్తాడని భావిస్తారు. సూర్యోదయం - ఒక వీరోచిత కార్యమనుకుంటారు. కనిపించే ఆ ఆకాశం వెనక, ఒక స్వర్గ సముద్రం ఉందని, దాని వెనక స్వర్గాల స్వర్గం ఉందనీ ఈజిప్టు వారి భావన. ఈ స్వర్గాల స్వర్గాన్నే గ్రీకులు అగ్ని స్వర్గంగా పిలుచుకుంటారు.
ఈజిప్టులో ఉన్నది ఉన్నట్టుగా ఈ దేశంలోని మనువాదులు స్వీకరించారా లేదా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఎక్కువ మంది దేవీ దేవతలను పూజించే సంప్రదాయం ఈజిప్టుదే. మరణానంతర జీవితం, పరలోకం, పునర్జన్మల భావన అక్కడిదే. వారు దేవతల్ని నాలుగు అంచెలుగా విభజించుకుంటే, ఇక్కడి మనువాదులు - జనాన్ని నాలుగు అంచెలుగా విభజించారు. సర్వ జీవరాసులకు సూర్యుడే ఆధారమన్న భావన ఇక్కడ కూడా ఉంది. కానీ, వారి లాగా సూర్యుడికి (రా కు) అత్యున్నత స్థానం ఇవ్వలేదు. గాలి దేవుడు, వర్ష దేవత, చదువుల దేవత, మృత్యు దేవత లాంటి వారిని అక్కడ ఉన్నట్టుగానే రూపొందించుకున్నారు. పైలోకం, కిందిలోకం ఉంటాయన్న నమ్మకం అక్కడిదే. మరణానంతరం మంచీ చెడుల్ని బేరీజు వేసి, శిక్షలు విధించడమన్నది అక్కడా ఇక్కడా ఒక్కటే. అక్కడ 'డూయెట్'లో చనిపోయిన వ్యక్తి 'హృదయ భారాన్ని' బేరీజు వేస్తే - ఇక్కడ యమధర్మరాజు సన్నిధిలో పాపాలు, పుణ్యాల్ని చిత్రగుప్తుడి చిట్టాలో చూస్తారు. భూమి బల్ల పరుపుగా ఉందని ప్రాచీన ఈజిప్టు ప్రజలు విశ్వసిస్తే, భారతదేశంలోని వైదిక ప్రభోదకులు అందుకు విరుద్ధంగా కొత్తగా ఏమీ ఆలోచించలేక పోయారు. వారి ఆలోచనను స్వీకరించి, ఏకంగా వరాహావతారాన్ని సృష్టించుకున్నారు. భూమిని చాపలా చుట్టుకుని పోయి ఓ రాక్షసుడు సముద్రంలో దాక్కుంటే - విష్ణుమూర్తి వరాహావతారంలో ఆ రాక్షసుణ్ణి చంపి భూమిని పైకి తెచ్చి రక్షించాడు కదా? సముద్రం భూమి మీద ఉంటే మరి ఆ రాక్షసుడు భూమిని చుట్టుకు పోయి ఏ సముద్రంలో దాక్కున్నాడూ? అమాయకత్వమైనా, అజ్ఞానమైనా ప్రపంచమంతా ఒకే విధంగా ఉంటుందన్న మాట! విశ్వాసాలైనా, మూఢ విశ్వాసాలైనా, ఊహలైనా, భ్రమలైనా ప్రపంచమంతా ఒక్కటే -
తాతగారి లక్షణాలు మనవడికి వచ్చాయని అంటామే గాని, మనవడి లక్షణాలు తాతగారికొచ్చాయని అనం. అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే ముందు విలసిల్లిన సంస్కృతుల ప్రభావం తరువాత వర్థిల్లిన సంస్కృతుల మీద పడుతుంది. అంతే కాని, అందుకు విరుద్ధంగా జరుగదు కదా? ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలలో ఇది - ప్రపంచానికి వెలుగు చూపిన దేశమని ఊరికే చెప్పుకోవడం కాదు, ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
వ్యాసకర్త: సుప్రసిద్ద సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు