Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ అమెరికా పర్యటనలో మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అధ్యక్షుడు జో బైడెన్‌తో మొదటిసారిగా ముఖాముఖి సమావేశం కావడం, క్వాడ్ దేశాధినేతల సమావేశం, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగం. భారత్‌లోని మీడియా మోడీ జరుపుతున్న ఈ పర్యటనకు రంగులద్ది చూపుతోంది. అధ్యక్షుడు బైడెన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశం గురించి ఏ మాత్రమూ విమర్శలు లేకుండా అధికారిక వైఖరినే ప్రసారం చేసింది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో జరిగిన సమావేశం గానీ, క్వాడ్ సమావేశాల ఫలితాలపై గానీ ఎలాంటి విమర్శలు లేవు. మోడీ పాత్ర, ఈ పర్యటన వల్ల కలిగిన లాభాలపై సానుకూలమైన రీతిలోనే కార్పొరేట్ మీడియా స్పందించింది.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మోడీ చేసిన ప్రసంగంలో ఎలాంటి చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత లేదు. ఎప్పుడూ చెప్పే రీతిలోనే తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదంటూ గొప్పగా స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప అందులో కీలకమైన అంశాలేవీ లేవు. అయితే, సమావేశాల అనంతరం జారీ అయిన సంయుక్త ప్రకటనలను కీలకమైన రీతిలో సమీక్షించినా, ఈ పర్యటన వల్ల కలిగిన ఫలితాన్ని చూసినా ఒక భిన్నమైన దృశ్యాన్ని మనకు అందిస్తున్నాయి.
బైడెన్-మోడీ సమావేశం అనంతరం జారీ చేసిన సంయుక్త ప్రకటనలో ఎలాంటి కొత్త చొరవలు లేవు. భారత్‌ను ప్రధాన రక్షణ భాగస్వామిగా పేర్కొంటూ ఆ దేశంతో సన్నిహితమైన రక్షణ భాగస్వామ్యం గురించి బైడెన్ పక్షం నొక్కి చెప్పింది. ప్రస్తుతమున్న సదుపాయాలను, సౌకర్యాలను పరస్పరం పంచుకోవడం, ఇరు దేశాల సైన్యాల మధ్య పరస్పర కార్యాచరణల గురించి మాత్రమే ఈ సంయుక్త ప్రకటన ప్రస్తావించింది. అధునాతన మిలటరీ సాంకేతికతల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, రక్షణ వాణిజ్యాన్ని, ఉప ఉత్పత్తిని పెంపొందించడం గురించి కూడా ఈ ప్రకటన పేర్కొంది. అంతకంటే ముఖ్యమైన అంశం ఏమంటే, ప్రాంతీయ భాగస్వాములతో సహా బహుముఖ చట్రపరిధిలో రక్షణ సంబంధాలను విస్తరించుకోవడాన్ని కూడా ఆ ప్రకటనలో ప్రస్తావించారు. అమెరికా, క్వాడ్ వంటి మిత్రపక్షాలతో మరింత విస్తృతమైన స్థాయిలో సైనిక, భద్రతా ఒప్పందాల్లోకి భారత్‌ను ఏ విధంగా లాగుతున్నారో చెప్పడానికి ఇదొక స్పష్టమైన సూచన.
ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో ముందుకు వెళ్లడానికి బైడెన్ ప్రభుత్వం విముఖంగా ఉండటంతో ఆ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో, 2021 ముగిసేలోగా భారత్-అమెరికా వాణిజ్య విధాన ఫోరమ్‌ను తిరిగి సమావేశపరిచేందుకు హామీ మాత్రమే ఆ సంయుక్త ప్రకటనలో ఉంది. అంతర్జాతీయ తీవ్రవాదంపై పోరు, కీలకమైన, కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతలు, సాంకేతిక సహకారం, వాతావరణ మార్పులు వంటి ఇతర అంశాలు ఇప్పటికే ప్రారంభమైన క్రమానికి అనుగుణంగా ఉన్నాయి. బైడెన్ నాయకత్వంలో ప్రతినిధివర్గం చర్చలు జరగలేదనేది ఇక్కడ గుర్తించాల్సిన అంశం. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.
నాలుగు దేశాల మధ్య పొత్తును మరింత సంఘటితపరిచే దిశగా క్వాడ్ నేతల సమావేశం ఒక అడుగు వేసింది. ఈ నాలుగు దేశాల నేతలు మొదటిసారిగా ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. మార్చిలో జరిగిన సమావేశం ఆన్లైన్లో సాగింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో కలిసి త్రైపాక్షిక భద్రతా కూటమి అకస్ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన కొద్ది రోజులకు క్వాడ్ సమావేశం జరిగింది. ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను సమకూర్చాలని కోరుతున్న ఈ కొత్త సైనిక కూటమి చైనాకు వ్యతిరేకంగా ఉద్దేశించినదని స్పష్టమవుతోంది. ఇటువంటి చొరవ చేపట్టిన తర్వాత క్వాడ్ పాత్ర ఎలా వుండబోతోందనే దానిపై చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి. డీజిల్ పవర్ జలాంతర్గాములను సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్రాన్స్‌కు ఈ కొత్త మిలటరీ కూటమి గురించి తెలియకుండా ఉంచడమే కాదు, అటు జపాన్ను గానీ ఇటు భారత్‌ను గానీ పరిగణనలోకి కూడా తీసుకోలేదు. క్వాడ్ కూటమిలో ఈ రెండు భాగస్వామ్య దేశాలే.
అమెరికాతో పొత్తును దీర్ఘకాలంగా సమర్థిస్తూ వచ్చిన భారత్‌లోని వ్యూహాత్మక వ్యవస్థ ఈ పరిణామాన్నీ సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఈ కొత్త భద్రతా కూటమి క్వాడ్‌కు సహాయపడుతుందని వాదిస్తోంది. వ్యాక్సిన్ డ్రైవ్‌లో సహకారం, కీలకమైన సాంకేతికతలను, వాటి సరఫరాలను పెంపొందించడం, ఆర్థిక సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి సైనికేతర అంశాలపై దృష్టి పెట్టడానికి దోహదపడుతుందని పేర్కొంటోంది.
క్వాడ్ సమావేశానంతరం జారీ చేసిన సంయుక్త ప్రకటన ఇలాంటి విషయాలపై ఏ విధమైన వివరణ ఇవ్వలేదు. స్వేచ్ఛా, పారదర్శకమైన ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత వ్యవస్థకు హామీ కల్పించడమే క్వాడ్ ఏర్పాటుకుగల ప్రధాన హేతుబద్ధత అని పేర్కొంటోంది. ఇది, ఈ కూటమి భద్రతా కోణాన్ని ప్రముఖంగా చూపిస్తోంది. వ్యాక్సిన్ సహకారానికి సంబంధించినంత వరకు, క్వాడ్ వ్యాక్సిన్ భాగస్వామ్యం ఘోర వైఫల్యాన్ని ఈ ప్రకటన కప్పిపుచ్చుతోంది. మార్చిలో జరిగిన సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంతానికి వంద కోట్లకు పైగా డోసులను సరఫరా చేయడానికి ఈ భాగస్వామ్యం ఉద్దేశించబడింది. తమ వద్ద పెద్ద మొత్తంలో ఉన్న వ్యాక్సిన్ నిల్వలను వర్థమాన దేశాలకు సరఫరా చేయడానికి అమెరికా తిరస్కరించింది. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే, వాటిని ఎగుమతి చేసే బాధ్యత భారత్‌కు ఇచ్చారు. కానీ దాన్ని అమలు చేయడంలో భారత్ విఫలమైంది. అన్ని వ్యాక్సిన్ల ఎగుమతులను నిలిపివేసింది. ఈ ఏడాది చివరి నాటికి బయోలాజికల్ ఇ-లిమిటెడ్ నుండి ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తామని హామీ అయితే ఇచ్చింది. అయితే, గత కొద్ది మాసాలుగా చైనా లక్షలాది డోసులను ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థారులాండ్ వంటి ఆసియాన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నందున చైనా వ్యాక్సిన్ దౌత్యాన్ని ఎదుర్కొనే లక్ష్యం ఇప్పటికే విఫలమైంది.
కీలకమైన, కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతలపై సహకారం, సరఫరా చెయిన్లను అభివృద్ధిపరచడం వంటి విషయాల గురించి ఇప్పటికే సాధారణ ప్రకటనలు జారీ అవుతున్నాయి. కొత్తగా క్వాడ్ మౌలిక సదుపాయాల భాగస్వామ్యాన్ని ప్రారంభించడంపై పరోక్షంగా మరో ప్రకటన జారీ అయింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌ను ఎదుర్కొనేందుకే ఇదని స్పష్టమవుతోంది. కానీ ఇది ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఇందుకు సంబంధించి నిర్దిష్టంగా ఎలాంటి ప్రణాళికలను వెల్లడించలేదు. ''దౌత్యంలో, చెప్పడానికి చాలా తక్కువ సమాచారం ఉన్నపుడు, సుదీర్ఘమైన ప్రకటనలు అవసరమవుతాయి. క్వాడ్ ప్రకటనలో 2,145 పదాలు ఉన్నాయి. కానీ, మనకు తెలియనిది, అందులో వెల్లడించినది చాలా తక్కువ'' అని విదేశాంగ వ్యవహారాల వ్యాఖ్యాత ఎం.కె.భద్ర కుమార్ వ్యాఖ్యానించారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా భౌగోళిక, రాజకీయ వ్యూహానికి క్వాడ్ కేవలం ఒక సాధనం మాత్రమేనని ఈ మొత్తం వ్యవహారం నుండి ఊహించగలుగుతాం. అది అకస్ అవనీ లేదా క్వాడ్ కానీ దాని దిశా నిర్దేశం ఎలా ఉండాలనేది నిర్ణయించగలిగేది ఒక్క అమెరికా మాత్రమే. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ కేవలం ఒక జూనియర్ భాగస్వామి మాత్రమే. భారత్‌తో కనీసం సంప్రదించకుండా అఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాలను ఉపసంహరించిన తీరు లేదా అకస్తో రహస్యంగా చర్చలు జరిపిన వైనం చూస్తుంటే మోడీ ప్రభుత్వం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని అట్టిపెట్టుకోవాల్సిన అవసరం గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఇందుకుగాను చైనాతో అన్ని రకాలుగా సంబంధాలను కొనసాగిస్తూనే, మరోపక్క అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనాతో నేరుగా వ్యవహారం చేపట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని పరిరక్షించుకునే ఉద్దేశ్యం మోడీ సర్కార్‌కు ఏ మాత్రమూ లేదని అమెరికాలో మోడీ పర్యటన ఫలితం రుజువు చేస్తోంది.
- పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం