Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజ జీవితానికి సిద్ధాంతాన్ని ఆశ్చర్యపరచే తనదైన పద్ధతి ఒకటుంటుంది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉమ్మడి పోరాటంలో ధనిక రైతులతో పాటు సామాన్య రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను ఎలా ఐక్యం చేయాలనే అంశాన్ని వామపక్షాలు తీవ్రంగా చర్చిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్క్సిస్టు సమావేశాలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు మధ్య ఉన్న వైరుధ్యాలను (భూస్వాములకు, గ్రామంలోని మిగిలిన ప్రజానీకానికి మధ్య ఉన్న వైరుధ్యానికి సంబంధించిన నిర్ణయాత్మక తీర్మానాన్ని సమర్థిస్తూ) చర్చించాయి. వామపక్ష రైతు సంఘాలు, ఇతర వామపక్షేతర రైతు సంఘాలతో ఎప్పుడు ఉమ్మడి పోరాటాలలో కలిసి పాల్గొన్నా, వారు తమతో కలుపుకొని పోయే ఉద్దేశంతో వ్యవసాయ కార్మికులకు సంబంధించిన కొన్ని డిమాండ్లను కూడా రైతుల డిమాండ్లతో పాటు చేర్చాలని ఒత్తిడి చేస్తున్నారు, కానీ అది జరగడంలేదు.
రైతులకు, వ్యవసాయ కార్మికులకు మధ్య ఉన్న వైరుధ్యాలు కేవలం, రైతాంగంపై తీవ్రమైన ప్రభావం చూపే విధంగా కార్మికులు తమ కూలీని పెంచాలనే ఆర్థిక డిమాండ్‌కు సంబంధించింది మాత్రమే కాదు, ఆ వైరుధ్యాలలో కుల కొలమానం కూడా ఉంటుంది. వ్యవసాయ కార్మికులు ప్రధానంగా దళిత కులాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటుండగా, రైతులు సాధారణంగా దళితేతర కులాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర భారతంలో దళితులకు స్వంత భూమిని కలిగివుండే యాజమాన్య అనుమతిని నిరాకరించారు.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ వైరుధ్యం, తీవ్రమైన జాట్-దళిత వైరుధ్య రూపాన్ని సంతరించుకుంది. వాస్తవానికి, ఢిల్లీకి సమీపంలో ఉన్న కంఝావాలా అనే ఒక గ్రామంలో, 1970లో కమ్యూనిస్ట్ పార్టీ కూలీని పెంచాలనే డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించిన సందర్భంలో జాట్ రైతాంగం, దళిత వ్యవసాయ కార్మికులు సుదీర్ఘకాలం పాటు తీవ్ర ఘర్షణలకు తలపడ్డారు. భారత విప్లవం ఎదుర్కొంటున్న సమస్యలకు ఇలాంటి ఘర్షణలను కూడా ఉదాహరణలుగా చెప్పవచ్చు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రస్తుత రైతాంగ పోరాటం అసాధ్యమైనదిగా కనిపిస్తుంది. ఈ పోరాటం రైతులను, వ్యవసాయ కార్మికులను కలిపి ఒక ఉమ్మడి వేదిక పైకి తీసుకొని వచ్చింది. వాస్తవానికి, ముజఫర్‌నగర్‌లో సెప్టెంబర్ 5న జరిగిన 'కిసాన్ మహా పంచాయత్' నిర్వాహకులు, ఆ వేదిక వద్దకు హాజరైన సభికుల సంఖ్య ఈ ఆందోళనకు 'అన్ని వర్గాల', 'అన్ని కులాల', 'అన్ని మతాల' మద్దతు ఉందని రుజువు చేస్తుందని గర్వంగా చెప్పారు. సెప్టెంబర్ 27న జరిగిన భారత్ బంద్‌కు వచ్చిన భారీ మద్దతు క్షేత్ర స్థాయి ప్రజానీకంలో ఒక కదలికను సూచించింది.
ఈ కదలిక కేవలం రైతులకు, వ్యవసాయ కార్మికులకు లేక జాట్లు, దళితుల మధ్య ఉన్న సంబంధానికే పరిమితం కాలేదు. ఇది కనీసం రెండు మార్గాలలో మనకు కనిపిస్తున్నది. ఒకటి, మహిళలంతా మూకుమ్మడిగా పోరాటంలో భాగస్వాము లయ్యారు. సాంప్రదాయకంగా పితృస్వామిక ధోరణికి బాధితులైన జాట్ రైతు మహిళలు ఎంతో ఉద్రేకంతో భారీ సంఖ్యలో అన్ని సమావేశాలలో, భారీ బహిరంగ సభలలో పాల్గొనడం గతంలో ఎన్నడూ లేని అరుదైన అద్భుత ఘటన.
మరొకటి, ఆ ప్రాంతానికి చెందిన జాట్లు, ముస్లింల మధ్య ఉన్న సంబంధం. ఇది గతంలో సాపేక్షంగా సుహృద్భావ స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండేది, కానీ 2014 పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో ప్రస్తుత పాలక పార్టీ ఆదేశాలతో ఆ వాతావరణం బాగా దెబ్బతిన్నది. భారీ అల్లర్ల రూపంలో దురదృష్టకరమైన దుష్ఫలితాలు గల ఒక మతపరమైన సంఘటనపై ఆగస్ట్ 2013లో ముజఫర్ నగర్లో ఒక 'మహా పంచాయత్'ను నిర్వహించారు. ఇది మత ప్రాతిపదికన ప్రజలలో చీలికను తెచ్చి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించడానికి దోహదం చేయడమే కాక సంపూర్ణమైన మెజార్టీని తెచ్చి పెట్టింది. ఏడు సంవత్సరాల నుండి జరిగిన పొరపాట్లను పునరావృతం చేయకూడదని వాగ్దానాలు చేసుకున్న రెండు కులాలను ఈ రైతాంగ పోరాటం ఐక్యం చేసింది.
కులం, మతం, లింగ సంబంధాలపై తన ప్రభావాన్ని చూపడంతో పాటు, రైతుల స్వంత డిమాండ్లతో ప్రత్యక్షంగా సంబంధాలులేని ప్రజాస్వామిక సమస్యలకు రైతాంగ పోరాటం మద్దతివ్వడం చెప్పుకోదగిన విషయం. అందువల్ల ప్రభుత్వం చేపట్టిన 'నగదీకరణ' ప్రతిపాదనను, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల ప్రయివేటీకరణను, పౌరహక్కులపై దాడులను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ప్రభుత్వ సంస్థలనుపయోగించి ప్రభుత్వ వ్యతిరేకులు, విమర్శకులపై దాడులను, భీమాకోరేగావ్ కేసుతో పాటు ఇతర కేసుల్లో ఎటువంటి విచారణ లేకుండా అనేక మందిని నిర్బంధంలో కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ, కిసాన్ ఉద్యమం ఒక నూతన ఒరవడిని సృష్టించింది. గతంలో ఏ రైతు ఉద్యమం కూడా ప్రస్తుత ఉద్యమం దేశం కోసం చేపట్టిన ప్రజాస్వామిక సమస్యలను చేపట్టలేదు. ఏ ఉద్యమం ఈ ఉద్యమానికి ఉన్నంత సమగ్రతను సంతరించుకోలేదు.
మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం ఇలాంటి విన్నూత్నమైన పాత్రను రైతుల మితృత్వంతో కార్మికవర్గం పోషించాలి. కానీ రైతాంగం తన స్వంతంగా ఆ పాత్రను పోషించకూడదు. రైతాంగం వలసవాద వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించే సమయంలో వలస పాలన అంతం అయిన తరువాత ఏర్పడే సమాజం ఎలా ఉండాలనే స్పష్టమైన ఆలోచన లోపిస్తుంది. కానీ ఇక్కడ లౌకికతత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షిస్తూ, వాటిని ధ్వంసం చేసే ప్రయత్నాలను వ్యతిరేకించే రైతాంగం ఉంది. ఈ ప్రయత్నాలలో జాన్ మేనార్డ్ కీన్స్ ''విద్యావంతులైన బూర్జువా వర్గం'' అని పిలిచే అర్బన్ మధ్యతరగతి వర్గం ఒకటి ఉంది. వీరు హేతుబద్ధతకు ఉదాహరణగా నిలిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తులుగా ఉంటారని ఆయన ఆశిస్తే, దీనికి విరుద్ధంగా వారు నేరపూరిత చర్యలలో భాగస్వాములవుతున్నారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను రక్షించడంలో ''గ్రామీణ జీవితం యొక్క తెలివి తక్కువ తనానికి'' ప్రతినిధులుగా బావించిన ఒకవర్గం అకస్మాత్తుగా ''ప్రగతిశీల'' సామాజిక వర్గాల కంటే ముందే ఎలా ఉంటుంది? దీని సమాధానంలో ఒక భాగం, మారిన పరిస్థితులకు అనుకూలంగా ఈ వర్గం తనను తాను మార్చుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గుత్త పెట్టుబడిదారీ యుగంలో, రైతుల వ్యవసాయంతో పాటు ఇతర చిన్న ఉత్పత్తులపై గుత్త పెట్టుబడిదాడి చేస్తుంది కాబట్టి రైతులు ఇంతకుముందు వలె భూస్వామ్య విధానం పైన మాత్రమే పోరాటం చేయడం కాకుండా సమాజంలో బాగా 'పురోగమించిన' గుత్త పెట్టుబడుదారులపై కూడా పోరాటం చేయాలి.
భారతదేశంలో, నయాఉదారవాద విధానాల ప్రవేశంతో రైతు వ్యవసాయాన్ని గుత్త పెట్టుబడి ఆక్రమించుకోవడం మరింతగా ఊపందుకుంది. ఇంతకుముందు 'ఆర్థిక వ్యవస్థను అదుపుచేసే ప్రభుత్వ పాలన' (డిరిజిస్ట్ రెజీమ్)లో ప్రభుత్వం గుత్త పెట్టుబడి రైతు వ్యవసాయాన్ని ఆక్రమించుకోకుండా రక్షించేది. కానీ ఈ రక్షణ నయా ఉదారవాదంతో అంతమైంది. వ్యవసాయ పెట్టుబడుల రాయితీలను కత్తిరించారు, వాణిజ్య పంటలపై మద్దతు ధరను ఉపసంహరించారు, సంస్థాగత రుణాలను నిరాకరించారు. దీని పర్యవసానంగా రైతుల లాభాలు క్షీణించి, రుణ భారాలు పెరగడంతో లక్షల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఆహారధాన్యాలకు మద్దతు ధరను కల్పించడం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న మిగిలిన రక్షణను కూడా ఇప్పుడు మూడు వ్యవసాయ చట్టాల ద్వారా నిరాకరిస్తున్నారు. రైతులంతా తమ అడ్డంకులను అధిగమించి వారి నూతన 'ఆధునాతన' శత్రువు (దేశీయ గుత్త పెట్టుబడిదారులు, అంతర్జాతీయ వ్యవసాయిక వ్యాపారం) పై పోరాటం చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
దీని సమాధానంలోని రెండవ భాగం, పాత కులతత్వం, మతతత్వం, పితృస్వామిక దురభిమానాలను వదిలించే విధంగా రైతుల వైఖరులలో మార్పు తీసుకొని వచ్చే పోరాటంలోనే దాగి ఉంది. నిజంగా ఎంత గొప్ప పోరాటం!
'టెలిగ్రాఫ్' సౌజన్యంతో
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
- ప్రభాత్ పట్నాయక్