Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలంటే ఆ హడావిడే వేరు.. ముఖ్యంగా అసెంబ్లీ వార్తలు కవర్ చేసే జర్నలిస్టులకు కత్తిమీద సామే! లీడ్ ఏం తీసుకోవాలి అనే అంశం మొదలెడితే...ఎలా ముగించాలనే దానిపై పడే మానసిక ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఈ సమస్య పెద్దగా ఉండేది కాదు. ఎందుకంటే రోజూ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల తూటాలు పేలేవి. వాకౌట్లు, నిరసనలు, పోడియంలోకి చొచ్చుకెళ్ళడం, సస్పెన్షన్లు, మార్షల్స్ రంగప్రవేశం...ఇలా పత్రికలకూ, పాఠకులకూ కావల్సిన వార్తావనరు అందేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల్లో కూడా ఈ ఒరవడి కొనసాగింది. ఈ ధోరణిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని, చర్యలకు ఉపక్రమించడంతో, అధికారపక్షంపై విమర్శ, ఆరోపణ చేయాలంటే ప్రతిపక్షాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమపై ఎదురు దాడిచేస్తే, సభ నుంచే బయటకు పంపేస్తాం అనే హెచ్చరికల్ని ప్రభుత్వం ఆచరణలో చేసి చూపింది. దీనితో ప్రతిపక్షాలు కర్ర విరక్కుండా, పాము చావకుండా సుతిమెత్తని మాటలతో సభలో మసులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడ నోరుజారితే, ప్రభుత్వం దాన్ని అవకాశంగా తీసుకొని సస్పెన్షన్ వేటు వేస్తుందో అనే భయం ప్రశ్నించే నేతల్లో చోటుచేసుకుంది. ఇదే ధోరణి అసెంబ్లీ బయట డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేసే రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల్లోనూ ప్రభుత్వం సృష్టించింది (అప్రకటిత నిర్భంధం). వారంరోజులు జరిగిన ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో 'వార్ వన్‌సైడ్' అయిపోవడంతో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే బ్యానర్ వార్తలుగా డిసైడ్ అయిపోయాయి. ఇక సభలో అధికారపక్షసభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పడేందుకు పడిన పాట్లు అంతాఇంతా కాదు. 'ఆహా..ఓహౌ...నభూతో న భవిష్యత్' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. గ్యాలరీలో కూర్చున్న పాత్రికేయులు 'అహే...ఇదేం గోల' అని విసుక్కున్న సందర్భాలూ ఉన్నాయి. ఆ అవకాశం రాని అధికారపార్టీ సభ్యులు కడుపులోని ఫ్రెస్టేషన్ను 'జీరో అవర్'లో వెళ్లగక్కారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కవర్ చేసి, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న జర్నలిస్టులు 'అవి మనకు గోల్డెన్ డేస్ బాస్' అంటూ... ఇప్పుడు సర్కారు స్టెనోగ్రాఫర్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులం అంటూ ముక్తాయింపునివ్వడంతో భారమైన నవ్వులు పెదవులపై నుంచి బయటకు వచ్చేశాయి. -ఎస్ఎస్ఆర్ శాస్త్రి.