Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహజీవనం... ప్రస్తుత ఆధునిక, హడావుడి జీవితంలో మనం అలవోకగా, అలవాటుగా తరచూ వింటున్న పదం. సినిమా స్టార్లు, సెలబ్రిటీలు, ధనవంతులు, ఆ పైన సంపన్నుల కుటుంబాల్లో ఇది ఆనవాయితీగా మారిపోతున్నది. ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఆ తర్వాత పెండ్లి చేసుకోవటం, తద్వారా ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా చూసుకోవటం కోసమే తమ జీవనంలో సహజీవనాన్ని భాగంగా చేసుకుంటున్నామంటూ చాలా మంది సమర్థించుకుంటూ ఉంటారు. అలా చెప్పిన వారిలో కొంతమంది జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా ఉంటుంటే.. మరికొంత మంది అర్థాంతరంగా విడిపోతున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి సహజీవనాల గురించే విన్న మనకు గత రెండేండ్ల నుంచి మరో కొత్త సహజీవనం పరిచయమైంది. అదే కరోనాతో సహజీవనం. 'కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే అంతమయ్యేలా లేదు. అందువల్ల దానితో మనం సహ జీవనం చేయక తప్పని పరిస్థితి. విధిగా కరోనా నిబంధనలను పాటించండి...' అంటూ టీవీల్లో, రేడియోల్లో అధికారుల ప్రకటనలు మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. సరే.. కోవిడ్‌తో సహజీవనానికి మనం మానసికంగా సిద్ధమైన తరుణంలో.. ఇప్పుడు ఇంకొకరితో కూడా మనం సహజీవనానికి అనివార్యంగా సిద్ధం కావాల్సిన పరిస్థితి. అతడెవరనేగా మీ డౌటు... పల్లె, పట్నం, పండుగ, పబ్బం, ఉదయం, సాయంత్రమనే తేడాల్లేకుండా కుండపోతగా కురుస్తూ కుంభవృష్టిని సృష్టిస్తూ మన రోజువారీ జీవితాల్ని అనునిత్యం ఇబ్బంది పెడుతున్న వాన దేవుడే.. ఆ మహానుభావుడు. అందుకే ఇప్పుడు ఆయన గారితో మనమందరం సహజీవనం చేయాల్సిందే కదా..? అతగాడి మనసెరిగి మనం ప్రవర్తించకపోతే ఏ మ్యాన్‌హోల్‌లో కొట్టుకుపోతామో, ఎక్కడ తేలతామో తెలియని పరిస్థితి. అందుకే... 'ఎప్పుడో చిన్నప్పుడు వానలు కురవాలంటూ కప్పలకు పెండ్లిండ్లు చేశాం. ఇప్పుడు ఆ కప్పలు ఎక్కడున్నాయో చూసి, వాటికి వెంటనే విడాకులిప్పించాలి.. లేదంటే రోజూ ఇలాగే వర్షాలు, వరదల్లో నానటం ఖాయం... ముందు ఆ కప్పలెక్కడున్నాయో... వెతకండ్రా బాబూ...' అనుకుంటూ జనాలు వాటిని వెతికే పనిలో పడ్డారు.
-బి.వి.యన్.పద్మరాజు