Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇక రాష్ట్రంలో సీఐటీయూకు పని ఉండదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బహిరంగ సభలోనో, మీడియా సమావేశంలోనో కాదు సుమా! సాక్షాత్తూ చట్టసభలో అన్నారు. శాసనమండలి సాక్షిగా చెప్పారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేవనెత్తిన విషయాలకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో కార్మికులకు సమస్యలే లేవన్నారు కేటీఆర్. రాష్ట్రంలో శ్రమ గౌరవాన్ని (డిగ్నిటీ ఆఫ్ లేబర్) తమ ప్రభుత్వం కాపాడుతున్నదట! మంచిదే! అలాంటి రోజులు రావాలని అందరూ కోరుకోవాలి. కానీ మంత్రి చెప్పిన మాటలు నిజం కాదని, ఈ నెల 8న రాష్ట్రంలో కార్మికులు సమ్మె ద్వారా సమాధానం చెప్పారు. స్వయానా తన సొంత నియోజకవర్గంలోనే పవర్లూమ్ కార్మికులు ప్రదర్శించిన పోరాటస్ఫూర్తి మంత్రికి తెలియదనుకోలేము. సీఐటీయూ రాష్ట్ర నాయకత్వ బృందం చేసిన 22రోజుల పాదయాత్రకే అసహనం ప్రదర్శించిన పరిశ్రమలశాఖ మంత్రి సమ్మె తర్వాత ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఇంత జరుగుతున్నా నోరు మెదపని కార్మికశాఖ మంత్రి ఏ మర్రిచెట్టు తొర్రలో దాగున్నారో తెలియదు. ప్రతిపక్ష నాయకులు చేసిన అవినీతి ఆరోపణలకు తొడలుగొట్టి సవాలు విసిరి అలిసిపోయినట్టున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం గురించి నోరు మెదపటం లేదు.
రాష్ట్రంలో 52 పారిశ్రామిక ప్రాంతాలలో సమ్మె జయప్రదమైంది. కనీస వేతనాల సవరణ కోసం, కార్మిక హక్కుల పునరుద్ధరణ కోసం సీఐటీయూ ఒంటరిగానే సమ్మెకు పిలుపు ఇచ్చినప్పటికీ కార్మికవర్గం ఐక్యంగా స్పందించింది. యూనియన్ల అనుబంధాలకు అతీతంగా అనేక చోట్ల సమ్మెలో పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ కేవీల నాయకులు అనేక చోట్ల సంఘీభావం ప్రకటించారు. సమ్మె సందర్భంగా కూడా ఆ సంఘీభావ స్ఫూర్తి పనిచేసింది. కనీస వేతనాలు పెరగాలనీ, కార్మిక హక్కులు రక్షించాలనీ కార్మికులు బలంగా కోరుకుంటున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇది స్పష్టంగా కనిపించింది. ఈ తీవ్రతను గమనించిన ఇతర ట్రేడ్ యూనియన్ల నాయకులు కూడా మద్దతు తెలిపారు. సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెసు పార్టీలే కాదు, స్థానికంగా కొన్ని చోట్ల టీఆర్ఎస్ నాయకులు కూడా సంఘీభావం ప్రదర్శించారు. ఇది సమస్యల తీవ్రతను సూచిస్తున్నది. క్షేత్రస్థాయిలో కార్మికుల గుండెచప్పుడుకు ప్రతిబింబం ఇది. ఈ వాతావరణం ఫలితంగానే ఈనెల 8న సమ్మె జయప్రదమైంది.
పాదయాత్ర ప్రభావం గానీ, సమ్మె పిలుపునకు కార్మికులలో వస్తున్న స్పందన మోతాదు గానీ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టే.. 8వ తేదీన మేడ్చెల్ ప్రాంతంలో ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాన్ని పరిశ్రమలశాఖ మంత్రి వాయిదావేసుకున్నట్లు తెలుస్తున్నది. కార్మికుల నుంచి నిరసన వ్యక్తమవుతుందన్న అంచనాతోనే వాయిదా వేసుకుని ఉండవచ్చు. కానీ ప్రభుత్వ స్పందన ఉండవల్సిన తీరు ఇది కాదు. పరిశ్రమల శాఖ మంత్రి శాసనమండలిలో గొప్పలు చెప్పుకున్నప్పుడే సీఐటీయూ నాయకత్వం సవాలు చేసింది. మంత్రిగానీ, లేదా ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులుగానీ వస్తే, మీడియా సమక్షంలో కార్మికుల దుర్భర పరిస్థితులు చూపిస్తామని ప్రకటించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సవాలు స్వీకరించాలి. లేదా వాస్తవ పరిస్థితులను అంగీకరించి పరిష్కరించాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచే, పదేండ్లకు పైగా 73 షెడ్యూల్డు పరిశ్రమలలో కనీస వేతనాలు సవరించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించలేదు. మరోవైపు కేంద్రం కార్మిక చట్టాలు రద్దుచేసింది. కార్మికుల శ్రమ గౌరవాన్ని కాపాడుతున్నామని మంత్రి ఎట్లా చెప్పగల్గారు. ఇలాంటి వ్యాఖ్యలు బాధిత కార్మికులకు పుండుమీద కారం చల్లినట్టు ఉంటాయి కదా!
సమస్యలు పరిష్కరించే బదులు యాజమాన్యాలు పోలీసులను ఆశ్రయించారు. సమ్మె విఫలం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కొన్ని చోట్ల సీఐటీయూ కార్యాలయాల దగ్గర కూడా పోలీసులను దింపారు. రెండు మూడు చోట్ల పోలీసులు అరెస్టులు కూడా చేసారు. షిఫ్టు టైమింగ్స్ మార్చటం, పొద్దున్నే 5.30గంటలకే రావాలని కార్మికులను వత్తిడి చేయటం, ఎంఎస్ఎన్, అరబిందో, హెటిరో డ్రగ్స్ లాంటి కంపెనీల బస్సులకు పోలీసు బందోబస్తు పెట్టటం లాంటి అనేక ప్రయత్నాలు చేశారు. ఇలాంటి బడా కంపెనీల యాజమాన్యాలకున్న అతి విశ్వాసాన్ని కార్మికులు తలకిందులు చేసారు. తమకు పోలీసుల అండ ఉన్నదన్న గర్వానికి తమ సమాధానం చెప్పారు. ఇన్ని ఎత్తుగడలు వేసినా వీరి బస్సులు కూడా ఆగిపోవటం గమనార్హం. పెద్దపల్లి ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికులు సమ్మెలో పాల్గొనవద్దని తీవ్రంగా వత్తిడి చేసింది. అంతే తీవ్రంగా కార్మికులు ఐక్యంగా స్పందించారు. అన్ని పారిశ్రామిక ప్రాంతాలలోనూ అత్యధిక కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. అందుకే యాజమాన్యాల ఎత్తుగడలు పారలేదు. పోలీసు బలగాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. పెద్ద ఎత్తున చేరిన పోలీసులు బలగాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. కార్మికులు సమ్మె చేయటమే కాదు, పెద్ద ఎత్తున రోడ్లమీద ప్రదర్శనలు చేసారు. ఉప్పల్, పాశమైలారం, పటంచెరు లాంటి కొన్ని పారిశ్రామిక ప్రాంతాలలో యాజమాన్యాలు హాలీడే బోర్డులు పెట్టుకోవాల్సి వచ్చింది. పెద్ద యెత్తున మహిళలు కూడా స్పందించారు. వలస కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనటం ప్రత్యేకత. గడ్డపోతారం, పటం చెరు, బీబీనగర్, మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాలలో ఉన్న అసంతృప్తికీ, వారి గుండెల్లో మంటలు రగులుతున్న మోతాదుకూ ఇది దర్పణం పడుతున్నది. అన్ని పారిశ్రామిక ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రదర్శనల్లో కార్మికులు పాల్గొన్నారు. గడ్డపోతారం, సంగారెడ్డి లాంటి ప్రాంతాలలో వెయ్యిమందికి పైగా సభల్లో పాల్గొనటం విశేషం. హిందీ కరపత్రం వలస కార్మికుల గుండెలు తట్టింది. బీబీనగర్‌లో వీరు ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. సమ్మె చేసి ఇంటికి పోలేదు. అభద్రతా భావంతో తల్లడిల్లుతున్న ఈ కార్మికులు, స్థానికంగా అండ దొరికిందని ఊరట చెందారు. వారికి విశ్వాసం కలిగింది. గడ్డపోతారంలో బీహార్ కార్మికులు ఎర్రజెండాలు చేతబూని కదం తొక్కారు.
పారిశ్రామిక కార్మికులే కాదు, రాష్ట్ర వ్యాపితంగా మునిసిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు కూడా సమ్మె చేసారు. బీడీ కంపెనీలు మూతపడ్డాయి. ఈ సమ్మె రాష్ట్రంలో కార్మికుల ఆగ్రహాన్ని సూచిస్తున్నది. అన్ని కార్మిక సంఘాల నాయకులను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి ఆందోళనకు గురి చేస్తున్నది. కార్మికులలో తమ సమస్యల పరిష్కారం కోసం యూనియన్లు కావాలన్న బలమైన కోరిక వ్యక్తమవుతున్నది. పాలకుల వత్తిడులను తట్టుకుని నిలబడే నాయకత్వం కావాలనీ, తమకు అండగా నిలవాలన్న ఆకాంక్ష వ్యక్తమవుతున్నది. చట్టాలను రద్దు చేసి, కార్మికోద్యమాన్ని నిలిపివేయాలని కలలు కంటున్న కేంద్ర ప్రభుత్వ ధోరణికి కార్మికవర్గం నుంచి వస్తున్న సమాధానం ఇది. కనీస వేతనాలు సవరించకుండా యజమాన్యాలకు వత్తాసు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కార్మికవర్గ హెచ్చరిక. ఇప్పుడు కార్మికుల ఆశలు నెరవేరాలంటే స్థానిక, తెలుగు కార్మికుల మీద మరింత బాధ్యత ఉన్నది. వలస కార్మికులకు వీరు అండగా నిలవటం తెలుగు కార్మికుల అవసరం కూడా. వారిని కలుపుకోకుండా వీరి సమిష్టి బేరసారాల శక్తి కూడా బలహీనంగా ఉంటుంది. వీరికి కూడా న్యాయం జరగదు. వలస కార్మికులను కలుపుకోకుండా కార్మికవర్గ ఐక్యతకు అర్థం లేదు. ఈ దిశలో కార్మికోద్యమం నిర్మించవల్సిన బాధ్యత కార్మిక సంఘాలమీద ఉన్నది. ఇప్పుడు ఐక్య కార్మికోద్యమం ప్రాధాన్యత మరింత పెరిగింది. యూనియన్ల అనుబంధాలకు అతీతంగా కార్మికవర్గం స్పందిస్తున్న సమయమిది. అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడటం అవసరం. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎప్టీయూ, టీఆర్ఎస్ కేవీ లాంటి సంఘాలన్నీ భుజం కలిపి నడవవల్సినసమయమిది. కార్మికులు కూడా ఇదే కోరుకుంటున్నారు. అదే జరిగితే కార్మికవర్గానికి మరింత విశ్వాసం కలుగుతుంది. కార్మికవర్గం మరింత పట్టుదలతో గర్జిస్తుంది. సమరశీల పోరాటాలకు సిద్ధపడుతుంది. యాజమాన్యాల వత్తిడితో ప్రభుత్వం పక్కన బెట్టిన ఐదురంగాల కనీసవేతనాల సవరణ ఆదేశాలను తక్షణం గెజిట్‌లో ప్రచురించాలి. మిగిలిన 68 రంగాలకు కూడా కనీస వేతనాలు సవరించాలి. ప్రభుత్వం కార్మికుల ఆగ్రహాన్ని గమనించి తర్వాత కూడా విజ్ఞత ప్రదర్శించకపోతే ఐక్య ఉద్యమాన్ని చవిచూడక తప్పదు. పోలీసుల సహాయంతో కంపెనీలు నడుపవచ్చునన్న భ్రమలు వీడాలి. పనిచేసేది కార్మికులన్న స్పృహలోకి రావాలి.
- ఎస్. వీరయ్య