Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలై ప్రధాని పీఠం చేరిన నరేంద్రమోడీ పాలనాధికారానికి ఇప్పటికి ఇరవయేండ్లు అయిందని బీజేపీ వేడుకలు చేస్తుంటే, మీడియా కూడా ముందస్తు కథనాలు ప్రచురిస్తున్నది. మొన్న అక్టోబర్ ఏడు నాటికి 13ఏండ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగానూ, ఏడేండ్లు ప్రధానిగానూ ఈ రెండు పదవుల్లో కలసి ఈ విధంగా ఇంత సుదీర్ఘకాలం మరెవరూ ఉండలేదని కూడా కథనాలు వస్తున్నాయి. మోడీ ఏది చేసినా అందులో మిస్టరీ ట్విస్టరీ ఉంటుందని అంటుంటారు. ఇందులో కూడా అలాంటి చమత్కారమే ఉంది. ముఖ్యమంత్రిగా మాత్రమే చూస్తే జ్యోతిబాసు, నవీన్ పట్నాయక్ వంటివారు ఆయన కంటేచాలా ఎక్కువ కాలం ఉన్నారు. ప్రధానిగా తీసుకుంటే జవహర్లాల్ నెహ్రూ(6,175రోజులు), ఇందిరాగాంధీ(5,829రోజులు, మన్మోహన్సింగ్(ఇప్పటికి) పదవీ కాలం ఎక్కువ. అయితే రెంటినీ కలిపితే మాత్రం మోడీనే ఎక్కువ. అందులోనూ ముఖ్యమంత్రులుగా ఉండి ప్రధానులైన వారు చాలామంది ఉన్నారు. నేరుగా అక్కడ రాజీనామా చేసి ఇక్కడకు వచ్చిన వారూ ఉన్నారు. కాని వారి పదవీ కాలం చాలా తక్కువ. ఒక్క పివి నరసింహరావును మినహాయిస్తే వారెవరూ మూడో ఏట ప్రవేశించింది లేదు. మోడీ ముఖ్యమంత్రిగా 12ఏండ్ల 227 రోజులున్నారు. ప్రధానిగా ఇప్పటికి 2,671 రోజులు పూర్తి చేసుకున్నారు. ఆ విధంగా ఇది అరుదైన రికార్డు అనడంలో సందేహం లేదు. ఈ మొత్తం కాలంలో మోడీ పాలనా రికార్డు, రాజకీయ రికార్డు కూడా మరెవరికీ లేనంత ఊకపక్షంగానూ వివాదాస్పదంగానూ ఉండటం మరో వాస్తవం. ఇరవయ్యేండ్ల అధికార వేడుక జరిపే వేళ వెనక్కు తిరిగిచూస్తే మరెవరికీ జరగని రీతిలో మోడీనే దేశాధినేత కావడం ఎలా జరిగిందో అర్థమవుతుంది.
గుజరాత్ కథ ఏమిటి?
గుజరాత్‌లోని ఒక ప్రాంతంలో ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఉన్న మోడీ ఎమర్జన్సీ తర్వాత సంఫ్‌ు చరిత్ర, పరిశోధన రచన విభాగంలో ప్రవేశించారు. ఎమర్జన్సీలో తమ పాత్ర రాసే బాధ్యత అప్పగించారు. (అందుకే మోడీ పదే పదే ఆ ఘట్టం గురించి చెబుతుంటారు.) తర్వాత తనను నెమ్మదిగా బీజేపీ రాజకీయ బాధ్యతలు చూసేందుకు పంపించారు. ఆ క్రమంలో మొదట గుజరాత్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పట్టు పెంచుకున్నారు. ఎల్‌కె అద్వానీ రథయాత్ర గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి ప్రారంభమై అయోధ్య చేరేవరకూ బాధ్యతలు చూసింది మోడీనే. తర్వాత అధ్యక్షుడైన మురళీమనోహర్ జోషి కాశ్మీర్‌కు జరిపిన ఏకతాయాత్రలోనూ పని చేశారు. అద్వానీ హయాంలోనే జాతీయ కార్యదర్శులలో ఒకరుగా నియమితులైనారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ముఖ్యమంత్రి కేశూభారు పటేల్, ఎంపి శంకర్ సింగ్ వఘేలా మధ్య వివాదంలో చిక్కిన గుజరాత్లో సయోధ్య కోసం మోడీని పంపించారు. వఘేలా కాంగ్రెస్‌లో చేరాక కేశూభారు అనారోగ్యం, అసమర్థత కారణాలుగా చూపి మోడీకి పగ్గాలు అప్పగించారు. బీజేపీని వరుసగా ఎన్నుకున్న ఏకైక రాష్ట్రమైన గుజరాత్‌ను నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనే అధిష్టానం ఆయనను ఎంపిక చేసింది. పాలనారంగంలో ఏ బాధ్యతలు అనుభవం లేకుండానే మోడీ ఎకాఎకిన ముఖ్యమంత్రి అయ్యారు.
మారణహోమం.. మెచ్చిన పరివారం
2001 ఫిబ్రవరి 21న గోద్రాలో రైలు పెట్టె దహనంతో దవానలంలా మతచిచ్చు రగిలింది. తర్వాత కొద్ది రోజులకు జరిగిన మతమారణకాండలో కనీసం రెండువేలమంది ముస్లిములు ప్రధానంగా ప్రాణాలు కోల్పోయారు. దేశవిభజన, సిక్కులపై ఊచకోత తర్వాత ఎన్నడూఎరగని రీతిలో ఈ జాతి హత్యాకాండ జరుగుతుంటే ముఖ్యమంత్రి మోడీ ఉపేక్ష వహించారని, వాస్తవానికి ప్రేరేపించారని కూడా అనేక కథనాలు వచ్చాయి. ప్రపంచ వ్యాపితంగా నిరసన వ్యక్తమైంది. ఈ విమర్శల ధాటికి అప్పటి ప్రధాని వాజ్‌పేయి మోడీని ఆ పదవి నుంచి తప్పించాలని గోవాలో జరిగిన తమ జాతీయ కార్యవర్గంలో ప్రతిపాదించారు. అయితే అప్పటికే సంఘపరివార్ వ్యవస్థలోనే గాక రాజకీయ ఆర్థిక వర్గాలలో మోడీ ఎంతగా పాతుకుపోయారంటే వాజ్‌పేయి వెనక్కు తగ్గాల్సివచ్చింది. అద్వానీ శిబిరం పూర్తిగా మోడీని మోసింది (ఆ అద్వానీ పరిస్థితి తర్వాత ఏమైందనేది అందరికీ తెలుసు). ఇరవయేండ్లు పూర్తి చేసుకోవడంలో విస్మరించరాని ఘట్టాలివి. ఆ జాతిహత్యాకాండ సృష్టించిన కల్లోలం మధ్యనే అందరూ వ్యతిరేకిస్తున్నా పెడచెవిని పెట్టి మోడీ ముందస్తుగా 2002లో ఎన్నికలు జరిపి మరోసారి విజయం సాధించారు. ఇదే సంఫ్‌ుపరివార్ దృష్టిలో మోడీ సమర్థత అయింది. మీడియాలో ప్రశ్నలు ఎదుర్కోలేని మోడీ టీవీ చర్చల నుంచి లేచిపోతుంటే గుజరాత్ ప్రభుత్వం ఆయన విజయాలను టముకు వేస్తూ వచ్చింది. 2004లో దేశం వెలిగిపోతోంది ప్రచారంతో హడావుడి చేసినా వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోయి యూపీఏ-1 అధికారం చేపట్టింది. ఆ సమయంలో మోడీ వారికి మరింత కీలకంగా మారారు. వారిని మెప్పించే విధంగా మతతత్వ రాజకీయం సాగిస్తూనే మోడీ 2007లో గెలిచిన తర్వాత కార్పొరేట్లను మెప్పించడంపై దృష్టి పెట్టారు. మామూలుగానే భారతదేశంలో పారిశ్రామిక రాజధానులుగా పేరొందిన మహారాష్ట్ర గుజరాత్‌లలో వారికి ప్రత్యేక ఆసక్తి. మోడీ కార్పొరేట్లకు పూర్తిగా తాళాలు అప్పగించడంతో వారూ ఆయనను ఆకాశానికెత్తడం మొదలుపెట్టారు. ఇది చాలాక ఎన్ఆర్ఐ సదస్సులతో విదేశీ కంపెనీల ఆశీస్సులూ పొందగలిగారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సులు అట్టహాసంగా తయారైనాయి. 2012 ఎన్నికలలో మోడీ అత్తెసరు మెజార్టితోనే గెలిచినా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బీజేపీకి జాతీయప్రతీక అయ్యారు. ఈకాలంలో నిజంగా గుజరాత్ మానవాభివృద్ది సూచికలన్నిటా వెనకబడి ఉన్నా, ఏదో సాధించారనే హడావుడి దాన్ని మరుగుపర్చింది.
జాతీయ యవనికపైకి అంబానీల ఆశీస్సులతో
2009లోనూ రెండవసారి ఓడిపోయాక, అద్వానీకి దేశాన్ని ఆకట్టుకునేంత ఆకర్షణలేదని తేలడంతో మూడుసార్లు ముఖ్యమంత్రిగా, గుజరాత్ వైభవ ప్రధాతగా మోడీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెస్తే కార్పొరేట్ మద్దతు ఉంటుందని పరివార్ భావించింది. 2013 వైబ్రంట్ గుజరాత్ సదస్సులో అంబానీ సోదరులు అందుకు ఆధ్వర్యం వహించారు. మోడీ దార్శనికతను ముఖేశ్ అంబానీ ప్రస్తుతించారు. ఆయన తమ్ముడు అనిల్ అంబానీ మరో అడుగుముందుకేసి మోడీని గాంధీతో పోల్చారు. అప్పటికే కామన్వెల్త్, 2జి తదితర కుంభకోణాలతో రోసిపోయిన యూపీఏ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా ప్రజలను ఆకర్షించేందుకు మోడీని ముందుపెట్టుకోవాలన్న కార్పొరేట్ ఇండియా (ఇండియా ఇంక్ అంటుంటారు) ఉద్దేశానికి వారి మాటలు అద్దం పట్టాయి. ఆరెస్సెస్ బీజేపీలకు కూడా అంతకన్నా కావలసింది లేదు గనక ప్రధానిగా మోడీ ప్రచార ప్రక్రియ మొదలైంది. తన ప్రతికదలిక ప్రతి ప్రవచనమూ ప్రచారాస్త్రాలైనాయి. ప్రశాంత్ కిశోర్ మార్కెటింగ్‌లో చారువాలా సంఫ్ువాలా కార్పొరేట్వాలా త్రిమూర్తిగా మోడీనే త్రీడీలో కనిపించాడు. మోడీతో పాటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల తతంగం భారీ కార్పొరేట్ రంగు పులుముకుంది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవి వదలిపెట్టి దేశసారథ్యం చేపట్టారు.
కపట నాటకాలు.. కఠోర సత్యాలు
పార్లమెంటు మట్టిని ముద్దాడటంతో మొదలుపెట్టారు. తొలిదశలో స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా వంటి నినాదాలతో జాతిని ఉత్తేజపర్చేనేతగా చూపించబడిన చారువాలా గారువాలా అయ్యారు. స్వచ్ఛభారత్ కక్ష భారత్‌గా మారింది. అసహన దాడులు నిత్యకృత్యమైనాయి. అధ్యక్షతరహాను మించేలా ఏకపక్ష పాలనకు పీఎంవో కేంద్రమైంది. న్యాయవ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక సంస్థలు ఇవేవీ స్వతంత్రత నిలుపుకోలేని దురవస్థ. విశ్వవిద్యాలయాలపై విజ్ఞాన కేంద్రాలపై పత్యక్ష దాడి. ఒకే దేశం ఒకే రేషన్, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు, ఒకే మతం అన్నట్టు భిన్నత్వంలో ఏకత్వం తలకిందులైంది. ఇదంతా మోడీ వ్యక్తిగత ప్రచారం చాటునే జరిగిందని మర్చిపోకూడదు. ఆరెస్సెస్ చెప్పే హిందూ రాష్ట్ర ఏకీకృత నిరంకుశ స్వభావానికి ఇది అచ్చంగా సరిపోయింది. సమాఖ్య విధానం కాస్త టీం ఇండియా అంటూ మోడీని కెప్టెన్‌ను చేసింది. పేద భారత ప్రతినిధినంటూనే అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా వ్యాఖ్యానించేంత జిలుగువెలుగు దుస్తులు ధరించి బూట్సూట్వాలా అనిపించుకున్నారు. మారణహోమాలపై స్పందించలేదు గాని మయూరాలతో గడిపే మహర్షి చిత్రాలు విడుదల చేశారు. కేదారనాథ్ గుహలో తపోభంగిమలో దర్శనమిచ్చారు. మాడిసన్ స్కేర్లోనూ వెలిగిపోయారు. ఇవన్నీ వ్యక్తిగత పోకడలుగానే గాక భిన్న తరగతులను ఆకర్షించే వ్యూహాలుగా చూడవలసి ఉంటుంది. ఇన్ని విన్యాసాల మధ్యనా రెండు విషయాలు నిరంతరాయంగా సాగిస్తూ వస్తున్నారు. ఇరవయ్యవ వార్సికోత్సవంలో సేవ సమర్పణ అంటే ఆరెస్సెస్ సేవ, కార్పొరేట్‌కు సమర్పణ మాత్రమే! కరోనా తాకిడితో తల్లడిల్లిపోయిన వేళ కూడా మోడీ సర్కారు కార్మికులపట్ల ఉపేక్ష, కార్పొరేట్లకు చేయూత, తబ్లిగీజమాయిత్ వంటి ప్రచారాలు సాగించిందని మర్పిపోరాదు. ఇదే సమయంలో దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పూర్తిగా ట్రంప్‌కు తాకట్టుపెట్టి అమెరికా కూటమికి తోకగా మార్చారు. దేశంలో రాజకీయ అవసరాలకు గాను కుహనా దేశభక్తిని సరిహద్దులలో కృత్రిమ ప్రజ్వలనలను సాకుగా ముందుకుతెచ్చారు. మరోవంక అన్నీ ఆయన వచ్చాకే జరిగాయనే అతిశయోక్తులు అసత్య ప్రచారాల కోసం అన్ని సాధనాలనూ వాడుకున్నారు. తన విజయానికి మీడియా, సోషల్ మీడియాలనే సోపానం చేసుకున్న మోడీ... గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో మీడియాతో మాట్లాడనే లేదు. ఇవన్నీ కపటత్వానికి మచ్చుతునకలు.
డెమోక్రసీ.. ఎత్నోక్రసీ
స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ వాషింగ్టన్‌లోని కాటో సంస్థ నివేదిక ప్రకారం ఈ దేశంలో స్చేచ్ఛాసూచిక 2013 కన్నా చాలా దిగజారింది. 2013లో 75వ స్థానంలో ఉంటే, 2018 నాటికి అది 111కు చేరింది. మానవాభివృద్ది (యుఎన్‌డిపి) నివేదికలో 129 నుంచి 131కి పడిపోయాము. ఆకలిసూచికలో 94వ స్థానంలో ఉన్నాము. పత్రికా స్వాతంత్రంలో రెండు స్థానాలుతగ్గి 142గా వున్నాము. కేంద్రమే నిర్వహించిన కుటుంబ ఆరోగ్య సర్వే1 ప్రకారం భారతీయుల పౌష్టికాహారం ఈ కాలంలో ఘోరంగా దిగజారింది. తాజా వెనకబాటు సంక్షోభాలు చెప్పకపోయినా దేశం అప్పు కోటికోట్ల రూపాయలు దాటింది.. ఎయిర్ ఇండియా టాటాలకు కట్టబెడితే వారిది వారికే చేరినట్టు చిత్రిస్తున్న ఈ వ్యవస్థకు కావలసింది అదే. దేశంలో డెమోక్రసీ (ప్రజాస్వామ్యం) కాస్తా ఎత్నోక్రసీ (జాతిస్వామ్యం)గా మారిపోయిందని విమర్శకులు ఆక్షేపిస్తున్న పరిస్థితి. ఇన్ని కఠోర సత్యాల మధ్యనా మోడీని మించిన మొనగాడు లేడని చెప్పడానికి మొన్నటి పుట్టిన రోజు చాలక ఈ ఇరవయేండ్ల సంబరం! బహుపరాక్ భారతీయులారా!!
- తెలకపల్లి రవి