Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల పన్నుల ద్వారా ప్రభుత్వానికి జమ అయ్యే ప్రజాధనంపై లెక్కలు అడిగే హక్కు ప్రజలందరికి ఉంది. అదే విధంగా ఈ ప్రజాధనంతో జీతాలు పొందుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి, సేవపేరుతో పాలకులైన నేతలకు బాధ్యతతో కూడిన జవాబుదారీతనం, చిత్తశుద్ధి అవసరం. రెండున్నర దశాద్ధా క్రితం భారతదేశవ్యాప్తంగా వచ్చిన చైతన్యం ఫలితంగా ''డబ్బు మాది - లెక్కలు మాకు తెలియాలి'' అని ఎగిసిన ఉద్యమ స్ఫూర్తితో ''సమాచార హక్కు 2005 అక్టోబర్ 12న, చట్టంగా'' అమలులోకి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే ''సమాచార హక్కు''. దీని అమలుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను ప్రజలకు కనిపించేలా బోర్డులను ఏర్పరచాలి.
ఈ చట్టం ప్రకారం గ్రామ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా దరఖాస్తు చేసి కావలసిన సమాచారం పొందవచ్చు. ఇందుకోసం అన్ని స్థాయిల్లోని, అన్ని కార్యాలయాల్లో సంబంధిత విభాగ అధికారులు విధిగా ప్రజలు కోరిన సమాచారమివ్వాలి. సంబంధిత కార్యాలయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి నుంచి సమాచారం పొందడానికి దరఖాస్తు చేసి, నిర్ణీత రుసుము చెల్లించాలి. దరఖాస్తు స్వీకరించిన కార్యాలయ పీఐఓ నిర్ణయిత గడువులో సమాచారం ఇవ్వాలి. సమాచార హక్కు ద్వారా సమాచారం కోరే వ్యక్తి ఎలాంటి కారణాలు చెప్పనవసరం లేదు. కోర్టు పరిశీలనలో ఉన్న సమాచారం, కేబినెట్ మీటింగ్‌లు, రికార్డులు, మంత్రుల, కార్యాదర్శుల నిర్ణయాలు, వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే సమాచారం లాంటివి మాత్రం ఇవ్వడానికి నిరాకరించవచ్చు. అయితే కూడా ప్రజా ప్రయోజనాలకు సంబందించినవి అయితే తప్పక ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర కేంద్రంలో లేదా జిల్లాలలోగల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారం పొందడానికి రుసుముగా (గ్రామ స్థాయిలో రుసులేదు) మండల స్థాయిలలో రూ|| 5/-లు, జిల్లా స్థాయిలో రూ|| 10/-లు చెల్లించాలి. రాష్ట్ర, కేంద్ర అప్పిలేట్ అధికారులుగా ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమీషనర్, హైదరాబాద్, కేంద్ర సమాచార కమీషనర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషన్ న్యూఢిల్లీ కార్యాలయాకు సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదుచేసి సమాచారాన్ని పొందవచ్చు.
సమాచార హక్కు చట్టం - 2005, సామాన్యుని చేతికిచ్చిన బ్రహ్మాస్త్రమని ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రతీకని చెప్పుకొచ్చారు. ఇది పాలకులను, అధికార యంత్రాంగాన్ని అవినీతికి పాల్పడకుండా చేసే అద్భుతమైన వజ్రాయుధమన్నారు.కాని అవినీతి పీఠాలు కదిలి పోతాయన్న భయంతో ఒక వైపు అధికారం గణం మరోవైపు నేతగణం మూకుమ్మడిగ ఈ చట్టం ప్రతిష్టను మసకబార్చుతున్నారు.
మనదేశ వ్యాప్తంగా ఏడాదికి సుమారు 40 నుంచి 60 లక్షల వరకు సమాచార హక్కు దరఖాస్తులు పెడుతున్నారు. వారిలో 45 శాతానికన్నా తక్కువ మందికే తాము కోరిన పూర్తి సమాచారం అందుతున్నట్టు ఓ అంచనాలో తేలింది ! ఈ చట్టాన్ని తుంగలో తొక్కే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ''సమాచార కమిషన్లు'' నామ మాత్రం విచారణలతో సరిపెడుతున్నారు. కొన్నేండ్లుగా సమాచార కమిషనర్ల పోస్టులు సుమారు 50 శాతం ఖాళీగా ఉన్నాయంటూ సుప్రీం కోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తూ ఈ నియామకాల వివరాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని ఆదేశించినా.. ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేమితో జాప్యం కొనసాగుతుంది. దీనితో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. పాలకుల, పాలన యంత్రాంగం అవినీతి సమాచారం భయటపడుతుండటంతో సమాచార హక్కు చట్టాన్ని నీరు గార్చుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాధనాన్ని అవినీతితో స్వాహా చేయడమే హక్కుగా భావించే అక్రమార్కులు దేశవ్యాప్తంగా సుమారు ఐదు వందల మంది సమాచార హక్కు చట్టం ఉద్యమకారులపై దాడులు జరిపినట్టు తెలుస్తున్నది. అందులో 95 మంది హతులైనట్లు, వేదింపులకు తాళలేక మరో ఏడుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కామన్వెల్త్ హ్యూమన్‌రైట్స్ ఇనీషియేటివ్ గణాంకాలు తెల్పుతున్నాయి. అవినీతి బందుప్రీతి పెరిగిపోయి ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధ పాలన పాలితులకు అందని ద్రాక్షగా మారుతుందని సామాన్యులు భావిస్తున్నారు. స.హ. చట్టం ఉద్యమ కారులకు రక్షణ కల్పించాలని, జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదు. చట్టాలు చేసేవారు, ఆ చట్టాలను అమలు చేసే అధికార యంత్రాంగం పాలనలో పారదర్శకత పాటించక పోవడం పాలితులను విస్మయానికి గురిచేస్తున్నది. ప్రజల నుంచి పన్నులు, సెస్‌ల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికార గణం సామాన్యులకు సమాచారం ఇవ్వడానికి చట్టం ఉన్నప్పటికీ, అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం భావ్యమా ! ప్రశ్నించే వారిపై సమాచారాన్ని కోరేవారిపై నిర్భందాలు, బెదిరింపులు, హత్యలతో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించటం వలన చట్టాలపై, ప్రజాస్వామ్య పాలనపై క్రమేనా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నది. స్వతంత్య్ర భారతంలో ప్రజాస్వామ్య దేశంలో పౌర సమాజానికి ప్రశ్నించే స్వేచ్ఛ, సమాచారాన్ని పొందే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ పరిడవిల్లేలా పాలన జరగాలి. పాలన యంత్రాంగం జవాబుదారీ తనాన్ని విస్మరించరాదు. ప్రజాస్వామ్యానికి మనుగడ లేని చోటు నియంతృత్వంగానే పిలువబడుతుంది.
''12 అక్టోబర్ సమాచార హక్కు చట్టం''
అమలు రోజు సందర్భంగా..
- మేకిరి దామోదర్
9573666650