Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత నయా ఉదారవాద కాలంలో ఉత్పత్తి అవుతున్న సంపదలో కార్మికులకు దక్కే వాటా తగ్గిపోతూ, పెట్టుబడిదారుల వాటా పెరిగిపోతూవున్నది. ఈ ధోరణి ఆయా దేశాలలోనే గాక, మొత్తంగా ప్రపంచం అంతటా ఇదే విధంగా ఉంది. ఈ విధంగా జరగడానికి కారణం ఏమిటి? దేశాల ఆర్ధిక వ్యవస్థల తలుపులను తెరిచి సరుకుల, సేవల స్వేచ్ఛా వ్యాపారానికి అనుమతించారు. దానివలన కొన్ని వ్యవస్థీకృతమైన మార్పులు జరిగాయి. సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి అయింది. ఇవి పెద్ద సంఖ్యలో కార్మికుల తొలగింపుకు దారితీశాయి. దీనివలన మామూలుగా ప్రతీ ఏటా కొత్తగా ఏర్పడే ఉద్యోగావకాశాలు కూడా రాకుండా నిలిచిపోయాయి. ఫలితంగా కార్మికుల సంఖ్యలో రావలసిన పెరుగుదల రాలేదు. కార్మికుల సంఖ్యతో పోల్చుకుంటే నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. అందువలన కార్మికులు తమ వేతనాలను పెంచుకోడానికి కావలసిన వత్తిడిని యజమానులపై తెచ్చే ఉద్యమాలను నడపలేకపోతున్నారు. ఐతే, మరోవైపు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టినందువలన కార్మికుల ఉత్పాదకత మాత్రం బాగా పెరిగిపోతున్నది. తలసరి కార్మికుడు చేసే ఉత్పత్తి విలువ పెరుగుతోంది. అదే సమయంలో ఉత్పత్తి అయిన సంపదలో ఆ కార్మికుడి వాటా తగ్గిపోతోంది. యజమానుల వద్ద పోగుపడే మిగులు అపారంగా పెరుగుతోంది.
ఈ విధంగా కార్మికుల వాటా తగ్గి యజమానుల వాటా పెరిగినందువలన కార్మికులు సరుకులను తమ అవసరాలకు కొని వినియోగించే శక్తి తగ్గిపోతున్నది. దానివలన మొత్తంగానే మార్కెట్లో డిమాండ్ తగ్గుతోంది. అమ్ముడుపోయే సరుకుల కన్నా ఎక్కువ మోతాదులో సరుకులు ఉత్పత్తి అవుతూ ఆదొక సంక్షోభానికి దారి తీస్తున్నది. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే ప్రభుత్వమే ఖర్చును పెంచి తద్వారా మార్కెట్లో డిమాండ్‌ను పెంచాలి.. కాని నయా ఉదారవాద విధానం ఇందుకు అనుమతించదు. అందుచేత సమస్యకు పరిష్కారంగా ఆస్తుల విలువను కృత్రిమంగా పెంచే 'బుడగ' ను సృష్టించింది. ఆస్తుల విలువ పెరిగితే దానివలన కూడా డిమాండ్ పెరుగుతుంది. కాని ఆ విధమైన బుడగ ఎంతోకాలంపాటు కొనసాగలేదు. అది పేలిపోగానే ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ మరింత సంక్షోభంలో కూరుకుపోతుంది.
2008లో అమెరికాలో ''హౌసింగ్ బబుల్'' పేలిపోగానే అమెరికాలో సంక్షోభం తీవ్రంగా ఏర్పడింది. దాని ప్రభావం మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపైన సైతం పడింది. వాస్తవానికి 2009-19 మధ్య దశాబ్దకాలంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ నమోదు చేసిన వృద్ధి రెండవ ప్రపంచ యుధ్ధం అనంతర కాలంలోకెల్లా అతి తక్కువ స్థాయిలో ఉంది. ఇదంతా కరోనా మహమ్మారి విరుచుకుపడకముందు పరిస్థితి.
కరోనా విజృంభణ, దానితోపాటు విధించిన లాక్డౌన్లు ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి పడిపోడానికి దారితీశాయి. ఏదేశాల్లోనైతే ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోడానికి సహాయ చర్యలు చేపట్టాయో, ఆచర్యలద్వారా ప్రజలకు అందిన సహాయం మోతాదును బట్టి ఆర్ధిక వ్యవస్థల పతనం తీవ్రత హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఆర్ధిక సహాయం ఎక్కువగా అందిన దేశాల్లో వృద్ధిరేటు పతనం సాపేక్షంగా తక్కువగా ఉంది. అమెరికాలో అందించిన సహాయ ప్యాకేజి ఆ దేశ జిడిపిలో దాదాపు 10 శాతం. అందుచేత అక్కడ జిడిపి పతనం సాపేక్షంగా తక్కువగా ఉంది. (2020లో అక్కడ జిడిపి 3.5 శాతం తగ్గింది.) అదే భారతదేశంలోనైతే సహాయ ప్యాకేజి మన జిడిపిలో 2 శాతం కన్నా తక్కువే. అందుచేత ఇక్కడ జిడిపి 2020-21లో 7.3 శాతం పడిపోయింది. సంపన్న దేశాలలో ఎక్కువగా ఈ కాలంలో నయా ఉదారవాద విధానాల బాటనుండి వెనక్కు పోయారన్నది స్పష్టంగా కనపడింది. గత నాలుగు దశాబ్దాలలోనూ ఎన్నడూ జరగని విధంగా ఆ దేశాలు తమ ద్రవ్యలోటు పై విధించుకున్న పరిమితులను పక్కనబెట్టి గణనీయంగా ప్రభుత్వ వ్యయాన్ని పెంచాయి.
ఇక మరోసారి కరోనా విజృంభించదు అనుకుంటే గనుక ఈ సంపన్నదేశాలు తిరిగి తమ నయా ఉదారవాద పద్ధతులను అమలుజరపడానికే పూనుకుంటారా అన్నది ఇక్కడ ప్రశ్న. జో బైడెన్ నాయకత్వంలోని అమెరికన్ ప్రభుత్వం వరకు మాత్రం ఆ విధంగా మళ్ళీ పాత పద్ధతిలో నయా ఉదారవాదవిధానాలను అమలు జరపడానికి సుముఖంగా లేదన్నది స్పష్టం. (ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఏ విధంగా వ్యవహరించాలన్న విషయం మీద ఆ దేశం ఇంతవరకూ ఏ విధమైన ప్రకటనా చేయలేదు. కనుక ఇంతవరకూ నయా ఉదారవాద విధానాల పట్ల తమ సూత్రప్రాయమైన వ్యతిరేకతను వెల్లడి చేయలేదు) ఐతే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 2 ట్రిలియన్ల డాలర్ల ప్యాకేజికి తోడు అదనంగా మరో రెండు ట్రిలియన్ల డాలర్ల ప్యాకేజిని బైడెన్ ప్రకటించాడు. అంతేగాక దాదాపు అంతే మోతాదులో ప్రతీ ఏటా మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించనున్నట్టు ప్రకటించాడు.
విశ్వవ్యాప్తంగా నయా ఉదారవాద విధానాలను తిరస్కరించాలన్న వైఖరిని ఒక సూత్రంగా ప్రకటించవలసిన సందర్భం ఇది. ( ఇంకా బైడెన్ అందుకు తన సంపూర్ణ ఆమోదాన్ని తెలుపలేదు) ఐతే ఇంకొక రెండు రకాల వైఖరులు అవలంబించే అవకాశాలు ఉన్నాయి. ఒక వైఖరి పూర్తిగా నయా ఉదారవాదవిధానాన్నే అమలు చేయాలని కోరుతుంది. అంటే ద్రవ్య విధానంలో దాదాపు సున్నా వడ్డీకి కార్పొరేట్లకి అప్పులివ్వడం, తద్వారా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రభుత్వరంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడం, కార్మికుల వేతనాల వాటాను మరింత తగ్గించేలా వారిపై దాడి పెంచడం చేయాలి. అమెరికా ప్రస్తుతానికి ఈ వైఖరిని విడనాడినా, యూరపియన్ యూనియన్ మాత్రం దీనినే బలపరుస్తోంది.
ఈ వైఖరిని సిద్ధాంతపరంగా వ్యతిరేకించకపోయినా, ఐఎంఎఫ్ మాత్రం ఆచరణలో వివిధ దేశాలకు వేరువేరు వైఖరులు చేపట్టాలన్న వ్యూహంతో ఉంది. సంపన్న దేశాల విషయంలో ద్రవ్యవిధానంలో ఉదారంగా వ్యవహరిస్తూ, మూడవ ప్రపంచ దేశాల విషయంలో మాత్రం పట్టు, విడుపులు లేని విధంగా ద్రవ్య క్రమశిక్షణను అమలు చేయాలని కోరుతోంది. ఈ మహమ్మారి కాలంలో ఏ మూడవ ప్రపంచ దేశానికి రుణసహాయం అందించినా, అందుకు ప్రతిగా ఆ దేశంలో ప్రభుత్వ ఖర్చు తగ్గించుకోవాలని షరతు పెడుతోంది.
ఐఎంఎఫ్ తీసుకున్న ఈ వైఖరి సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు పూర్తి అనుగుణంగా ఉంది. మూడవ ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలు తమ ఖర్చు తగ్గించుకోవడం అంటే దాని వలన అక్కడ స్థూల డిమాండ్ తగ్గిపోతుంది. ఆ దేశాలలో ఉత్పత్తి అయే ముడిసరుకులు సంపన్న దేశాలకు తక్కువ ధరలకే, ఎటువంటి ద్రవ్యోల్బణ ప్రభావమూ లేకుండా లభిస్తాయి. ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచితే దానివలన ద్రవ్యలోటు పెరిగి అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందన్నది ఐఎంఎఫ్ ప్రధాన వాదన. మూడవ ప్రపంచ దేశాలలో ద్రవ్యోల్బణం లేకుండా అదుపు చేయగలిగితే అది సంపన్న దేశాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది వలసపాలన కాలాన్ని గుర్తుకు తెస్తోంది.
కరోనా మహమ్మారి అంతరించాక మళ్ళీ ప్రపంచంలో నయా ఉదారవాద విధానాలనే అనుసరిస్తే అప్పుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఏ రూపంలో ఉండబోతుందో తన ''2021 వాణిజ్యం, అభివృద్ధి నివేదిక '' లో 'అంక్టాడ్' తెలియజేసింది. అన్ని దేశాలూ తమ ద్రవ్యలోటులను జిడిపిలో 3 శాతం కన్నా దిగువకే అదుపు చేస్తాయని, కేంద్ర బ్యాంకులు మార్కెట్లలోకి నగదు విడుదలను కొనసాగిస్తాయని, ( అంటే రుణాలను ఎక్కువగా అందిస్తాయని) కార్మికులను యధేచ్ఛగా దోపిడీ చేసేందుకు వీలుగా వారికున్న అన్ని హక్కులూ రద్దు అవుతాయని, పెట్టుబడి మీద అన్ని రకాల ఆంక్షలూ తొలగించబడతాయని ఆ నివేదిక భావించి దానికి అనుగుణంగా తన అంచనాలను రూపొందించింది. నిజానికి కరోనా విజృంభణకు మునుపు ఈ విధానాలే అమలులో
ఉన్నాయి. ఆ విధానాలనే తిరిగి అమలు చేస్తే అప్పుడు 2023-2030 మధ్య ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి 2010-19 మధ్య కాలంలో వచ్చిన వృద్ధి కన్నా కూడా తక్కువగా ఉండబోతోందని అంక్టాడ్ నివేదిక అంచనా వేసింది.
ఆ విధంగా జిడిపి వృద్ధిరేటు తరుగుదల దిశగా ఉన్నా, మరోపక్క కార్మికుల ఉత్పాదకత మాత్రం మరింతగా పెరుగుతూనేవుంటుంది. నయా ఉదారవాద విధానాల కారణంగా అన్ని దేశాలూ సరుకుల, సేవల స్వేచ్ఛా ప్రవాహానికి అనుమతించడం వలన, తక్కువమంది కార్మికులతో ఎక్కువ పని చేయించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని దేశాలూ అంతకంతకూ ఎక్కువగా ఉపయోగిస్తూ పోతాయి. జిడిపి వృద్ధిరేటు కార్మికుల ఉత్పాదకత వృద్ధి రేటు కన్నా ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా అదనపు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాని దానికి పూర్తి భిన్నంగా జిడిపి వృద్ధి రేటు పడిపోతూ, ఉత్పాదకత వృద్ధి రేటు పెరుగుతూవుంటే, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయే ప్రమాదం వస్తుంది.
ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికన్నా ముందు కాలంలో నయా ఉదారవాద విధానాల పర్యవసానాలను భరించడానికి ''డాట్ కామ్ బబుల్'', ''హౌసింగ్ బబుల్'' తోడ్పడ్డాయి. అవి ఒకదానివెంట మరొకటి పేలిపోయాయి. ఐతే అంతకన్నా ముందే భారతదేశంలో ఉపాధి అవకాశాల వృద్ధి కార్మిక జనాభా వృద్ధిరేటు కన్నా తక్కువ స్థాయికి పడిపోయింది.దాని ఫలితంగా కార్మికవర్గం పేదరికంలోకి నెట్టబడింది. కనీసస్థాయి శక్తిని ఇచ్చే ఆహారాన్ని సైతం పొందలేకపోతున్న వారి శాతం పెరిగిపోతున్నది. ఆ పరిస్థితికి తోడు కరోనా మహమ్మారి తోడైంది. దాంతో వారి పరిస్థితి మరింత దారుణంగా దిగజారిపోయింది. సంపన్నదేశాలు కనీసం ఈ కరోనా కాలంలోనైనా ఆ విధానాలను పక్కనపెట్టాయి కాని ఇంత గడ్డుకాలంలో కూడా మన ప్రభుత్వం తన నయా ఉదారవాద విధానాలను విడిచిపెట్టనేలేదు. అందువలన కనీసం కరోనాకి ముందుఉన్న స్థాయికైనా తిరిగి మన ప్రజలు చేరుతారన్న ఆశకూడా లేకుండాపోయింది.
ఇప్పటికీ మోడీ ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలనే ఎలాగైనా అమలుజరిపి తీరాలనే పంతంతోటే ఉన్నది. ఆ ప్రభుత్వానికి ఆర్ధిక శాస్త్రమూ తెలియదు, కార్మికుల బాధలూ పట్టవు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఏమి ఆదేశిస్తే దానినల్లా ఆచరించడమే తన పనిగా పెట్టుకుంది. ప్రభుత్వరంగాన్ని ప్రైవేటీకరించడం, పొదుపు చర్యల పేరుతో ప్రజాసంక్షేమానికి కోతలు పెట్టడం, కార్మిక హక్కులను కాలరాసి, వారి వేతనాల స్థాయిని ఇంకా ఇంకా తక్కువకు నెట్టడం, గుత్త పెట్టుబడిదారులకు అనుగుణంగా ద్రవ్య విధానాన్ని అమలుచేసి సంపదను వారి పరం చేయడం -ఇదే మోడీ ప్రభుత్వం చేస్తున్నది. దీని పర్యవసానంగా రానున్న రోజుల్లో కార్మికుల కష్టాలు మరింత పెరుగుతాయి.
ప్రభుత్వ పెట్టుబడిని పెంచి, ప్రజల అత్యవసర సేవల నిమిత్తం ప్రభుత్వం చేసే వ్యయాన్ని పెంచి (ముఖ్యంగా విద్య వైద్యం కోసం) తద్వారా వృద్ధి సాధించే వ్యూహం దేశానికి ఇప్పుడు చాలా అవసరం. అందుకోసం సంపదపన్ను, కార్పొరేట్ పన్ను పెంచాలి. ఈ లోపు ద్రవ్యలోటును పెంచడంద్వారా ఈ అదనపు వ్యయాన్ని చేయడానికి ద్రవ్యాన్ని సమకూర్చుకోవాలి. ఇప్పుడు కావలసినది ప్రభుత్వ ఖర్చును తగ్గించి పొదుపు చేయడం కాదు. అప్పు చేసైనా సరే, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయిక్