Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి వ్యవసాయం - రక్షిత ఫలసాయం అంటూ ఈ ఏడు మేము బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ప్రజల్లో, రైతాంగంలో, వ్యవసాయంపై ఆసక్తిగల మేథావుల్లో మంచి ప్రతిస్పందన లభిస్తున్నది. ఈ కార్యక్రమం గురించి తెల్సుకుని, వినీ అనేక మంది వ్యాసాలు, పాటలు పంపించారు. పుస్తకం ప్రింటయిన తర్వాత కూడా ఇంకా పలు రచనలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రకృతి వ్యవసాయం లేదా తరతరాలుగా మనం అనుసరిస్తున్న సాంప్రదాయిక సహజ వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తే 5 రకాల ప్రోత్సాహకాలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 లోనే '' పరంపరాగత్ కృషి వికాస్ యోజనా'' (PKVY) అనే పథకం కింద సహజ ఎరువులు, అవసరమైన పెట్టుబడులు, దాన్యం నిలువ చేసే గిడ్డంగులు Agro waste production units మొదలగు అనేక పథకాలు ప్రోత్సాహలు పెట్టుబడి సహాయాలు సబ్సిడీలు అంటూ ప్రకటించింది. అయితే రసాయన ఎరువులు పురుగుమందులు పూర్తిగా నిషేధించి నేలతల్లిని కాపాడే చర్యలు ప్రజారోగ్యాన్ని రక్షించే దిశగా నిర్ణయాలు చేపట్టాలని కోరుతున్నాం. శ్రీలంక ప్రభుత్వం, సిక్కిం రాష్ట్రం ప్రమాదకర రసాయన వ్యవసాయాన్ని పూర్తిగా నిషేధించాయని విన్నాం.'' భారతీయ ప్రకృతి కషి పద్దతి (BPKP) కింద ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో 0.8లక్షల హెక్టార్లు(2లక్షల ఎకరాలు) సాగు చేస్తున్నారని కొన్ని గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడానికి దీన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలని బహుజన బతుకమ్మ కార్యక్రమం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
''ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ మూవ్ మెంట్'' (IFOAM) గణాంకాల ప్రకారం (2018బి19) భారతదేశంలో 1.94 మిలియన్ హెక్టార్లలో (సుమారు 50లక్షల ఎకరాల్లో) సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం సాగుతున్నది. అదే నివేదిక ప్రకారం 3.14 మిలియన్ హెక్టార్ల సాగుతో చైనా ప్రపంచంలో మూడవ స్థానం, 2.02 మిలియన్ హెక్టార్ల సాగుతో అమెరికా ఏడవ స్థానం అక్రమించగా మనం 9వ స్థానంలో నిలిచాం. ''పరంపరాగత్ కృషి వికాస్ యోజన'' తర్వాత ఈ దిశగా మన దేశం సాగించిన ప్రగతి ఏమిటో తెలుపుతూ ఎంతమంది రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం సహయం అందిందో ప్రకటించాల్సిన అవసరం ఉంది. అయితే పరంపరాగత వ్యవసాయానికి, పరంపరగా వస్తున్న దేశీయ విత్తనాలు (నాటు విత్తనాలు) బహుళ పంటలు ముఖ్యమైన వనరు. అలాంటి దేశీయ విత్తనాలు కాపాడి పంటలు పండించే చిన్న సన్నకారు రైతాంగానికి అందించాలి. కౌలు రైతులకు స్వయంగా సాగు చేసుకునే భూములు అందించడం ముఖ్యమైనది. అందువల్ల సాగు భూముల పంపిణి, సహజ అడవుల రక్షణ పర్యావరణ పరిరక్షణ అత్యవసరమైనది. వేలాది ఎకరాలు హస్తగతం చేసుకున్న జమీందారీ, జాగిర్దారి వ్యవస్థల్లాగా బహుళజాతి కంపెనీలకు రకరకాల పేర్లపైన వేలాది ఎకరాలు అప్పగించరాదు. పారిశ్రామిక ఉద్యోగాల కల్పన పేరిట అప్పనంగా భూముల పందేరం కొనసాగుతున్నది. ప్రభుత్వ భూముల అమ్మకానికి చేసిన జీఓలు రద్దు చేసి రైతులకు భూమి పంపిణి జరగాలి. అందువల్ల చారిత్రిక కడివెండి గ్రామంలో ''దున్నే వారికి దుక్కులు - దుక్కుల్లో ప్రకృతి మొక్కలు'' అంటూ బహుజన బతుకమ్మ పిలుపు నిచ్చింది. అంతకుముందే ఆలగడపలో సెజ్లకోసం ప్రజల సాగు భూములను సేకరించవద్దని వేలాది ప్రజల సమక్షంలో బహుజన బతుకమ్మ ఆడి పాడి చాటి చెప్పింది. బహుజన బతుకమ్మ అంటే ప్రజల బతుకుదెరువు పోరాటమని మరొకసారి చాటి చెప్పింది.
డాక్టర్ బాబా సాహెబ్ ప్రవచించినట్టు ''ఆర్థిక ప్రజాస్వామ్యం రాజకీయ ప్రజాస్వామ్యం'' అమలు జరగాలంటే సామ్రాజ్యవాదుల జోక్యం లేకుండా వనరుల వికేంద్రీకరణ జరగాలి. గ్రామీణ అభివృద్ధి, స్వయం పోషకం ఆధారంగా మానవ వనరుల అభివృద్ధికి వ్యవసాయం - చేతి వృత్తులు జంటగా అభివృద్ధి కావాలి. స్థానికమైన ప్రతిదీ దేశీయమైనదే నూటికి అరవై శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగంలో గ్రామ సీమల్లో దేశ విదేశీ బహుళ జాతి కంపెనీల నివారించగలిగే ప్రకతి వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయాధారిత పరిశ్రమల లక్ష్యంగా మన ప్రయాణం సాగినప్పుడే దేశానికి నిజమైన సార్వ భౌమాధికారం సిద్ధంచినట్లు. అందుకే భూసారాన్ని (soil health) కాపాడుకోవడానికి (CISS (capital investment subsidy scheme) స్థానంలో మొత్తంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను అరికట్టే నిర్ణయం తీసుకోలేరా? అని ప్రభుత్వాలను బహుజన బతుకమ్మ ప్రశ్నిస్తుంది. పాడి - పంట - పెంట అనే విధానాల ద్వారా ఇంటింటికో ఎరువుల కర్మాగారం పాడి ఉత్పత్తుల అభివృద్ధి చేసే అవకాశాలను, సాంప్రదాయక ఇంధన వనరుల అభివృద్ధికి పథక రచనలు జరగాలి. దేశీయ సహజ వనరులపై పిడికెడు మంది గుత్తాధిపత్యాన్ని నివారించగలిగినప్పుడే ఈ దిశగా నిజమైన ప్రయాణం మొదలవుతుంది. అందుకే ప్రకృతి వ్యవసాయంవైపు గుణాత్మక మార్పు ప్రభుత్వాలిచ్చే పథకాల కంటే, ప్రజలు కొనసాగించే ఉద్యమాలతోనే సాధ్యమని స్పష్టమవుతుంది. ఒకవైపు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పడమే నిజమైతే పురుగు మందుల కంపెనీలు చేసే ప్రచారాన్ని అయినా అరికట్టలేక పోతున్నారని ప్రశ్నిస్తూ ప్రకృతి వ్యవసాయం బహుజన బతుకమ్మ అనే ఉద్యమం నిరంతర ప్రక్రియ అని మరొక సారి స్పష్టం చేస్తున్నం. భావసారుప్యత కలిగిన శక్తులు చేష్టలుడిగి చూడకుండా ఐక్యంగా సాగాల్సిన తరుణమిదేనని ప్రకటిస్తున్నాం .
- విమలక్క