Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నిన్న ఇక్కడికొక దయ్యం వచ్చింది. ఇంకా ఆ కంపు ఉంది. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రపంచం తన సొంతమైనట్టు, పనిచేయని ఔషధాలైన ప్రపంచ ప్రజలపై తన ఆధిపత్యం, దోపిడీ దౌర్జన్యాల కొనసాగింపు గురించి ప్రస్తావించాడు.'' ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభలో 2006, సెప్టెంబర్ 20న నాటి వెనెజుల అధ్యక్షుడు హుగో చావేజ్ ఉపన్యాస ప్రారంభ వాక్యాలివి.
తన సామ్రాజ్యవాదాన్ని మన్నించని దేశాలపై అమెరికా తొలుత యుద్ధాలు చేసింది. తర్వాత అక్కడి అసమ్మతి వర్గాన్ని ఎగదోసి, గద్దెనెక్కించి, పాలనా చక్రాలు తిప్పింది. ఇప్పుడు ఆర్థిక యుద్ధాలు చేస్తోంది. కొత్త సరళీకరణ విధానాలు, ఆర్థిక ఆంక్షలు వాటిలో కొన్ని. వీటి లక్ష్యం ఆ దేశాల సహజ, మానవ వనరుల దోపిడీయే. అమెరికా యుద్ధ నీతి విచిత్రం. తన ఓడలను జర్మని ముంచినప్పుడు ఏప్రిల్ 2, 1917 తర్వాత అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మని సోవియట్ యూనియన్‌పై దండెత్తింది. సోవియట్ నాశనాన్ని కోరుకున్న అమెరికా పాశ్చాత్య దేశాలు తమాషా చూశాయి. డిసెంబర్ 7, 1941న తన సైనిక స్థావరం పీర్ల్ హార్బర్‌పై జపాన్ మెరుపుదాడి తర్వాతే అమెరికా యుద్ధంలో పాల్గొంది. తన ఆయుధ వ్యాపారం కోసం మన కాశ్మీర్ పరిష్కారాన్ని మూడు సార్లు అడ్డుకుంది.
అమెరికా ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు చేసిన కొన్ని దేశాలు: మెక్సికో, క్యూబా, వెనెజుల, నికరాగువ, డొమినికన్ రిపబ్లిక్, మంగోలియా, రష్యా, ఇరాన్, కొరియా, వియత్నాం, కాంబోడియా, లావోస్, లెబనాన్, గ్రెనడ, లిబియా, పర్షియన్ గల్ఫ్, పనామా, ఇరాక్, కువైట్, సౌది అరేబియా, ఇజ్రాయిల్, సొమాలియా, బోస్నియా, సెర్బియా, అఫ్ఘానిస్తాన్, కెన్యా, ఉగాండా, సిరియా, గ్రీక్, ఫిలిప్పైన్స్, ఫ్లోరిడా, హైతి, థాయిలాండ్. మొత్తం 96యుద్ధాలు చేసింది. చైనాతో గతంలో నల్లమందు యుద్ధం చేసింది. నేడు ఆర్థిక యుద్ధం చేస్తోంది. అమెరికా చేసిన సామ్రాజ్యవాద యుద్ధాలు ఆయా దేశాలకు ఊహించని విపత్తులను, నష్టాలను కలిగించాయి. కెనడాలోని స్వతంత్ర పరిశోధనా మాధ్యమ సంస్థ, ప్రపంచీకరణపై పరిశోధన కేంద్రం, ''రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా 37దేశాల్లో 2కోట్లకు పైగా ప్రజలను చంపింది'' అన్న శీర్షికతో 2017లో ఒక వ్యాసం ప్రచురించింది. యుగొస్లేవియా, ఇరాక్ యుద్ధాలలో అమెరికా యురేనియం బాంబులను ఎక్కువ సంఖ్యలో ఉపయోగించింది. ఇది స్థానిక ప్రజల ఆరోగ్యానికి చాలా హాని కలిగించింది.
ఆధునిక కాలంలో, ఆర్థిక ప్రపంచీకరణ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన ప్రపంచీకరణగా మారింది. మూలధనం పొగుపడటం అటువంటి ఉత్పత్తి అభివృద్ధికి పెద్ద చోదక శక్తి. లాభాలు తగ్గుతున్న దశలో, మూలధన సంచితానికి యుద్ధం అంతిమ సాధనంగా మారుతుంది. యుద్ధానికి అదే ప్రధాన కారణం. యుద్ధాలు ఆర్థిక వ్యవస్థ విస్తరణకు మార్గం సుగమం చేస్తాయి. మార్కెట్ యుద్ధాన్ని నిర్ణయిస్తుంది. యుద్ధరంగాలు మార్కెట్లను సృష్టిస్తాయి. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో యుద్ధం, ఆర్థికశాస్త్రాల మధ్య తార్కిక సంబంధమిది. యుద్ధం దేశీయంగా గిరాకీని ప్రేరేపిస్తుంది. తద్వారా ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుంది. బాహ్యంగా, యుద్ధాలు పెట్టుబడిదారీ విస్తరణ పరిమితిని తొలగిస్తాయి. మూలధన ప్రపంచవ్యాప్త విస్తరణకు, పెట్టుబడి పోగుపడడానికి సహాయపడతాయి. పెట్టుబడిదారీ కంపెనీలు కొత్త మార్కెట్లలో ప్రవేశించటానికి, విస్తరించడానికి గట్టిగా ప్రయత్నిస్తాయి. పాశ్చాత్య శక్తులు లాభాలను కోరుకునే మూలధన సహజ స్వభావంతో స్ఫూర్తి పొందుతాయి. యుద్ధాలను ప్రేరేపిస్తాయి.
అమెరికా ఎందుకు అంతగా యుద్ధాలకు అలవాటు పడింది? అది ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారీ దేశం. దాని విదేశీ విధానాలకు మూలధన సంచితం పెద్ద చోదకశక్తి. హింసావాదంతో వాణిజ్య అవకాశాలను విస్తరించడం దాని అవ్యక్త విధానంగా మారింది. అమెరికా పాశ్చాత్యేతర నాగరికతల కంటే తనను ఉన్నతమైనదిగా భావిస్తుంది. అందువల్ల శ్వేతజాతేతరులు అధిక సంఖ్యలోగల దేశాలపై యుద్ధాలు చేసినప్పుడు అపరాధ భావనకు లోనుకాదు. అమెరికాలో వివిధ వర్గాల మధ్య వైరుధ్యాలు తీవ్రంగా మారుతున్నాయి. ప్రాథమికంగా ఉత్పాదక సంబంధాలను మార్చడం ద్వారా వీటిని తగ్గించలేం. దేశీయ సమస్యలను విదేశాలకు బదిలీచేయడానికి విదేశాలపై యుద్ధాలు ముఖ్య మార్గంగా పరిణమిస్తాయి. అమెరికా చరిత్ర, దాని యుద్ధచరిత్ర ఒకటే. 1776లో స్థాపించబడినప్పటి నుంచి అది 220ఏండ్లకు పైగా యుద్ధాల్లో మునిగిందని అనేక నివేదికలు తెలుపుతున్నాయి. ''అమెరికా 1948-91 మధ్య 43ఏండ్లలో 46 సైనిక జోక్యాలు చేసుకుంది. 1992-2017 మధ్య 25ఏండ్లలోనే ఆ సంఖ్య నాలుగురెట్లు 188కి పెరిగింది'' అని 2017లో నేషనల్ ఇంటరెస్ట్ సంస్థ నివేదించింది. ''అమెరికన్లు యుద్ధంతో విసిగిపోయారు. అంటే వారు శాంతివాదులని కాదు'' అని 2014లో అమెరికా దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అమెరికాలో అధ్యక్షుడు నామమాత్రమే. నిర్ణయాలు కార్పొరేట్లవే.
పెట్టుబడి విస్తరణ, వారసత్వ అంతర్జాతీయ వ్యవస్థ కొనసాగింపు అమెరికా యుద్ధాలకు అసలు కారణం. అయితే అవి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ హక్కుల రక్షణ పేరిట జరిగాయి. 20వ శతాబ్దమంతా, 21వ శతాబ్దంలో నేటి వరకు తన ప్రయోజనాలను నిరాకరించిన ప్రభుత్వాలను పడగొట్టడానికి అమెరికా తన సైనిక శక్తిని, నిఘా విభాగాలను ఉపయోగించింది. అమెరికా యుద్ధభూములు ఇతర శ్వేతేతర దేశాలలోనే ఉంటాయి. అందువలన అమెరికన్లకు తమ యుద్ధ క్రూరత్వం గురించిన అపరాధ భావన ఉండదు. కానీ యుద్ధాలు తెచ్చిన లాభాలను మాత్రం ఆనందంగా అనుభవించారు.
2001 సెప్టెంబర్ 11న అమెరికా ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడుల తరువాత, అమెరికా తీవ్రవాదంపై యుద్ధం పేరుతో మధ్యప్రాచ్యంలో అఫ్ఘానిస్తాన్, ఇరాక్లలో యుద్ధాలు చేసింది. అవి ఉగ్రవాదాన్ని ఎదుర్కోడమే లక్ష్యంగా కనిపించాయి. వాటి నిజమైన ఉద్దేశం ఈ ప్రాంతంలో అమెరికా వ్యతిరేక పాలకులను తుడిచిపెట్టడమే. దురాశల పాశ్చాత్య బహుళజాతి సంస్థలను పోషించే ఈ ''స్వేచ్ఛ'' 1970లో చిలీకి, 1990లో రష్యాకు పరిచయం చేయబడింది. మరీ ముఖ్యంగా ఉగ్రవాదంపై జరిగిన యుద్ధాలు వనరులను కొల్లగొట్టడానికి చేసిన ఆర్థిక యుద్ధాలే. ఉదాహరణకు, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దాదాపు 75లక్షల కోట్ల రూపాయల ఖనిజ నిక్షేపాలను కనుగొన్నట్లు నివేదికలు చెపుతున్నాయి. ఇరాక్ మీద అమెరికా దాడి కూడా చమురు నిల్వల దోపిడీ కోసమే. పూర్వ రక్షణ కార్యదర్శి చక్ హగెల్తో సహా అనేక మంది అమెరికా అధికారులు దీనిని అంగీకరించారు. ''మేము చమురు కోసం పోరాటం చేయడంలేదని ప్రజలు అంటున్నారు. వాస్తవానికి మేము యుద్ధాలు చేసిందే చమురు కోసం'' అని 2007లో చక్ హగెల్ వ్యాఖ్యానించారు. యుద్ధాలతో అమెరికాకు పెద్దగా ప్రయోజనం లేదు. యుద్ధం ద్వారా మూలధన విస్తరణ ప్రమాదకరమైంది, ఖరీదైంది. వాణిజ్య యుద్ధాలను చౌకగా గెలవాలి. యుద్ధం తీవ్రంగా మారితే, దాని ద్వారా ఆశించిన ఆర్థిక లాభాలు భారీ ఖర్చుతో కూడినవిగా తయారవుతాయి.
తీవ్రవాదంపై అమెరికా యుద్ధాలు చాలా చెడ్డ ప్రమాణాలు. యుద్ధాల ద్వారా అమెరికా మొదట భౌగోళిక, రాజకీయ, ఆర్థిక లాభాలను పొందాలనుకుంది. కాని చివరకు యుద్ధాల చిక్కుముళ్ళలో ఇరుక్కుంది. ఇది అమెరికా జాతీయ శక్తిని అతిగా వాడిన దుష్టపన్నాగం. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా చొరబాటు, మధ్యంతర నిష్క్రమణలు ఎగతాళిగా మారాయి. అమెరికా ఆధిపత్యంపై ఆసక్తితో దాన్ని గుడ్డిగా ఆదర్శంగా అనుసరించే యుద్ధోన్మాదులందరికి ఈ సంఘటనలు గట్టి హెచ్చరిక.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్:9490204545