Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు నటీనటుల వేదిక మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా) ఎన్నికలలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓడిపోయి, మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. గెలిచిన విష్ణును అభినందించడంతో ఆగక ఓడినవారిని జాతి వ్యతిరేక శక్తులుగా, తుక్డే తుక్డే గ్యాంగ్‌గా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు తన ట్వీట్లో తిట్టిపోశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ తీర్పు కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారని, వారిని ఓడించడం గొప్ప విషయమని ఆనంద పడిపోయారు. విజయం సాధించిన విష్ణు, ఆయన తండ్రి, ప్రముఖ నటుడు నిర్మాత మోహన్‌బాబు తమ కుటుంబానికి ప్రధాని నరేంద్రమోడీతో ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని గురించి ప్రచార సమయంలోనే చెప్పారు. ప్రకాశ్‌రాజ్ వివిధ సందర్భాలలో బీజేపీ మత రాజకీయాలను మరీ ముఖ్యంగా మోడీ హయాంలో ఏకపక్ష ధోరణులను బావప్రకటనా స్వేచ్చపై దాడులను ఖండించిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యను నిరసించడంలో ఆయన ముందునిలిచారు. ఈ కారణంగా సంఘపరివార్ ఆయనపై చాలా సార్లు విమర్శలతో దాడి చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగానూ పోటీ చేశారు. మా అధ్యక్షుడుగా ప్రకాశ్‌రాజ్ పోటీచేస్తారని, మిగిలిన వారికన్నా ముందే ప్రకటించారు. ఆయనకు మాజీ అధ్యక్షుడు, చిరంజీవి సోదరుడు నాగబాబు మద్దతు ప్రకటించారు. ఆయన రంగంలోకి వస్తారనగానే లోకల్ నాన్‌లోకల్ వివాదం ప్రధానంగా వినిపించింది. మీడియాలో చాలా మంది నాన్‌లోకల్‌కు నాయకత్వం ఇవ్వడమేమిటని వాదించారు. చిరంజీవి మరో సోదరుడు, జనసేన అధినేత (ఆ విధంగా బీజేపీ స్నేహితుడు) కూడా అయిన పవన్‌కళ్యాణ్ నాన్‌లోకల్ నినాదాన్ని తోసిపుచ్చారు. ఆ మాటన్నది మేము కాదని పైకి చెబుతున్నా ప్రకాశ్‌రాజ్‌పై లోపాయికారిగా గట్టిగా నడిచింది. ఈ దశలో మంచు విష్ణు మరో ప్యానల్‌తో పోటీ చేస్తానని ముందుకొచ్చారు. మొదట్లో వేరుగా పోటీ ప్రకటించిన పలువురు ప్రకాశ్రాజ్ప్యానల్లో చేరిపోవడంతో ఈ రెండు శిబిరాల మధ్యనే పోటీ హోరాహోరీగా సాగింది. గతమూడు పర్యాయాలుగా మా ఎన్నికలు పోటాపోటీగా అవుతున్న మాట నిజమే అయినా ఈ సారి మరీ ఆరోపణలు, ఆవేశాలు శ్రుతిమించాయి. దూషణలు కూడా చెలరేగాయి. గత ఎన్నికల్లో నరేష్ విజయం సాధించిన తర్వాత ''మా'' సరిగా పనిచేయలేదనే భావం బలంగా ఉండింది. పని చేయించడానికి, పద్ధతులు పాటించడానికి ఒక క్రమశిక్షణా కమిటీని కూడా నియమించారు. ఈ పూర్వరంగంలో నరేష్ మంచు విష్ణు శిబిరంలో ప్రధాన సంధానకర్తగా ప్రచారం సాగించడం వాదవివాదాలు పెంచింది. ఆన్లైన్ టికెట్ల సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వేడిని ఇంకా పెంచాయి. టీడీపీ ఎంఎల్ఎ ప్రముఖ నటుడు బాలకృష్ణ విష్ణును బలపర్చగా, వైసీపీ అనుకూలురు కూడా అటే ఉన్నారన్న వాతావరణం కనిపించింది. జగన్‌కు ఆ కుటుంబంతో ఉన్న బంధుత్వం రీత్యా కూడా పలువురు ఆ అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ దశలో ఏపీ మంత్రి పేర్నినాని మా ఎన్నికలతో తమకు ఏ సంబంధం లేదని ప్రత్యేకంగా ప్రకటించినా ఈ అభిప్రాయం పెద్దగా తొలగలేదు.
మామూలుగా చిత్ర పరిశ్రమలో విభిన్న రాజకీయ పార్టీలను అభిమానించేవారు ఉన్నా కళామతల్లి బిడ్డలుగా తామంతా ఒకటేనని చెప్పడం జరుగుతుంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయ జాతీయ పార్టీల ప్రభావం కూడా మారింది. రాజకీయంగా మోహన్‌బాబు మొదట టీడీపీ ఎంపిగా ఉండి తర్వాత చంద్రబాబు నాయుడుతో విభేదించి జగన్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష వెలిబుచ్చుతూ వచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టుకుని తర్వాత కాంగ్రెస్‌లో విలీనమై ప్రస్తుతం నటనపై కేంద్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాగబాబు జనసేనలో ఉన్నారు. నరేష్ బీజేపీలో చేరగా, కృష్ణంరాజు గతంలో వాజ్‌పేయి హయాంలో మంత్రిగా పనిచేశారు. చిత్ర పరిశ్రమలో రాజకీయ సామాజిక ఆర్థిక ప్రయోజనాలతో పాటు వ్యక్తిగతంగానూ కొన్ని ప్రముఖ కుటుంబాల పరంగానూ వైరుధ్యాలు ఉండనే ఉంటాయి. వేర్వేరు శిబిరాలూ నడుస్తుంటాయి. 2007 జనవరి 28న తెలుగు సినిమా వజ్రోత్సవ సంబరంలో మోహన్‌బాబుకు సెలబ్రిటీ పురస్కారం, చిరంజీవికి లెజెండ్ సత్కారం చేసిన తర్వాత ఈ తేడాలేమిటన్నదానిపై బహిరంగంగానే వైరుధ్యాలు ప్రజ్వరిల్లాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి మోహన్‌బాబు స్నేహంగా మాట్లాడుతున్నారు. ఏకగ్రీవం కోసం తనకు కనీసం ఫోన్ అయినా వస్తుందనుకుంటే రాలేదు గనక విష్ణు పోటీలో ఉన్నారని మోహన్‌బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అనేక ఆరోపణలు, అందులో పోస్టల్బ్యాలెట్లు తెప్పించడం వంటివాటిపై దుమారాలు, పరస్పర విమర్శల నేపథ్యంలో ఎన్నికలు జరిగి విష్ణు ప్యానల్ విజయం సాధించింది. ఆ తర్వాత బండిసంజరు వ్యాఖ్యలను ఉటంకిస్తూ, నాన్‌లోకల్ వాదనలకు స్పందిస్తూ ప్రకాశ్‌రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నాన్‌లోకల్స్ పోటీ చేయడానికి వీలు లేకుండా నిబంధనలు సవరిస్తామని మంచు విష్ణు అన్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వాదం సంకుచితత్వంలో కొట్టుమిట్లాడుతున్న మాలో తాను ఉండదలచుకోలేదని మాజీ అధ్యక్షుడు చిరంజీవి సోదరుడు నాగబాబు అంతకు ముందే ప్రకటించారు. వీరి రాజీనామాలు ఉపసంహరించుకోవాలని గెలిచిన విష్ణు కోరారు గాని నాన్‌లోకల్ అంశంపై హామీకి సిద్దం కాలేదు. జనరల్ బాడీలో చర్చించవలసిందేగాని ముందే తాను ఎలా చెప్పగలనని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11మంది కూడా తర్వాత రాజీనామాలు ప్రకటించారు. వేర్వేరు ప్యానల్స్ నుంచి గెలవడం వల్లనే తాను పనిచేయలేకపోయానని గతంలో నరేష్ అన్నారని, ఫలితాల తర్వాత విష్ణు కూడా ఆ తరహాలో మాట్లాడారు గనక ఆయనకు స్వేచ్ఛనివ్వడానికే తాము తప్పుకుంటున్నామని, ఆయన వాగ్దానాల అమలుకు పదవీ కాలంలో జరిగే కృషిని చూస్తుంటామనీ అంటున్నారు. నాన్‌లోకల్ సభ్యులకు కూడా పోటీ చేసే హక్కు ఉంటుందని మాట ఇస్తే తన రాజీనామా వెనక్కు తీసుకుంటానని ప్రకాశ్‌రాజ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతోపాటే ఓట్ల లెక్కింపు అవకతవకలూ, పోలింగ్ నాడు తమపై దౌర్జన్యం చేశారనే ఆరోపణలు కూడా చేశారు. ఇదంతా ఓటమి తట్టుకోలేక చేస్తున్నారని ఇవతలివారు కొట్టిపారేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కృష్ణమోహన్ కూడా ఓటమికారణంగానే ఈఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. మా రెండుగా చీలిపోతుందని కూడా కథనాలు వచ్చినా ఆ ఆలోచన లేదని ప్రకాశ్‌రాజ్ వర్గం ప్రకటించడంతో ప్రస్తుతానికి అలాంటిది జరగలేదు. విష్ణు ప్రమాణస్వీకారం చేయగా నరేష్ సవాళ్లు విసిరారు. రాజకీయంగా చూస్తే ఈ ఫలితాల తర్వాత బీజేపీ నాయకులు వైసీపీ అనుకూల సోషల్ మీడియా చాలా సంతోషం వ్యక్తం చేస్తుండగా టీడీపీ, టీఆర్ఎస్ అనుకూలురు తక్కువగానే స్పందిస్తున్నారు. రెండేండ్లు మూడేండ్లు ఉండే పదవుల కోసం ఇంతగా తగాదాలు పడటం వల్ల పలచన అవుతామని, ఈ వాతావరనం ఏర్పడటానికి మూలాలు ఏమిటో వెతకాలని చిరంజీవి ఫలితాలు వస్తుండగానే అన్నారు. దాసరి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద అంటూ లేరని మోహన్‌బాబు అనగా చిరంజీవి ఆ పాత్ర నిర్వహిస్తున్నారని ఆయన సమకాలీకుడైన మరో నటుడు అన్నారు. మోహన్‌బాబు పరిశ్రమ పెద్దగా ఉండాలని ఈ ఫలితాల తర్వాత నరేష్ అంటుంటే, చిరంజీవికి ఆ భావమే లేదని అందరితో కలసి పనిచేయడం మేలుచేయడం ఆయన విధానమని నాగబాబు వ్యాఖ్య. అయితే చిరంజీవి తనను తప్పుకోమన్నారని విష్ణు వెల్లడించారు. బీజేపీ మిత్రులైన మెగా సోదరులు ఇద్దరు ప్రకాశ్‌రాజ్‌ను సమర్థించడమేమిటని ఆ పార్టీ ప్రతినిధి ఒకరు అంటే నేను రాజకీయంగా ప్రకాశ్‌రాజ్‌కు సరిపడను కదా అని పవన్ కళ్యాణ్ పోలింగ్ సందర్బంలోనే అన్నారు. మొత్తంపైన బీజేపీ వారు చాలామంది మంచు విష్ణు శిబిరంలో ప్రముఖంగా కనిపించారు. బండి సంజరు వివాదాస్పద వ్యాఖ్యలు సూటిగానే జరిగిన పరిణామక్రమానికి అద్దం పట్టాయి.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారి సామూహిక రాజీనామాలు ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా నిలిచాయి. పరిశ్రమ ఐక్యత, కళాకారుల సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని పోవడానికి కొత్త అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ప్రధానంగా ముందున్న సమస్య. నాన్‌లోకల్, తుక్డే తుక్డే గ్యాంగ్ వంటి ముద్రలు అందుకు ఆటంకం కాకుండా చూడటం, చాలామంది భావిస్తున్నట్టు సామాజిక రాజకీయ వైరుధ్యాలు ఆధిపత్య పోరాటాలు అందుకు ఆటంకం కాకుండా ప్రజాస్వామికంగా వ్యవహరించడం అవసరం. రాజీనామా చేసిన వారితో మాట్లాడి ఆరోగ్యకరమైన పరిష్కారాలు కనుగొనేందుకు ఒక బృందాన్ని నియమించి చర్చలు జరపవచ్చు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమ కోలుకుంటున్న తరుణంలో కళాకారులను సినీ కార్మికులను తీవ్ర సమస్యలు వెన్నాడుతున్న తరుణంలో ఎంత వేగంగా ఈ పనిజరిగితే అంతమంచిది. కుల మత ప్రాంతీయ ధోరణులు, అసహన రాజకీయాలు తెలుగుచిత్ర పరిశ్రమ విశాల వారసత్వాన్ని దెబ్బతీయకుండా కాపాడుకోవాల్సి ఉంది. అందుకు హాని చేసే అవకాశవాదాలను విద్వేషాలు పెంచే వివాదాస్పద పోకడలను కూడా దూరం చేయాల్సి ఉంటుంది.
- తెలకపల్లి రవి