Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా ఎముకల్ని గానుగాడి పోత పోసిన
ప్రతి బియ్యపు గింజమీదా ఉంటుంది
ఓ ఎర్ర జీర.
శ్రమఫలం సమాజానికే అంకితం అనే
హామీ పత్రానికి అది మా చేవ్రాలు.
మట్టిని తిని విసర్జించే వానపాముల్లా
ముత్యాలను పండిస్తుంటే
బొజ్జల గాదుల కెత్తుతున్నావ్.
బుల్డోజర్ లా విరుచుకు పడుతున్నావ్.
నాగలి కొనతో టేంక్కు కన్నం పెడతాం.
నిన్ను నిశ్చేష్టితుడ్ని చేస్తాం.
ఆకాశమంత మా ఆత్మాభిమానాన్ని సహించలేక ó
ఇనుపచట్టాల బూట్లతో అంగలు వేసుకుంటూ ఆక్రమిస్తున్నావ్.
మేమిచ్చిన శక్తితో మాపైనే చట్టాల కఫన్ కప్పుతున్నావ్.
పిడికిలి బిగించిన మా నాగళ్ళ కాగడాల మంటలో
చలి కాచుకుంటున్నావ్.
నీ కొంప అంటించడానికి ఒక్క చిదుగు చాలు.
దేశ వెన్నెముకవని మా జాతిని కీర్తిస్తావ్.
వెన్నెముకను తొక్కుకుంటూ ఫర్మానాలు జారీ చేస్తావ్.
మా కళ్ళలోని ఎర్రజీర కార్చిచ్చు కాకముందే,
నీ సింహాసనాన్ని నాగలి అధిరోహించక ముందే
వేసిన మూడడుగులు వెనక్కి తగ్గు.
- గార రంగనాథం
సెల్: 885758123