Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాముడు ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన దేవుడు. కృష్ణుడు అలా కాదు, సాంస్కృతికంగా ముద్రవేసుకుని, అంతర్జాతీయంగా వ్యాపించిన వాడు. ''కృష్ణా కాన్షియస్'', ''హరే కృష్ణ'' సమూహాలతో ఖండాంతరాలకు వ్యాపించి, భారతీయుల చిత్త భ్రమల్ని విశ్వవ్యాప్తం చేసినవాడు. నిజానికి వీరిద్దరూ హిందూ పురాణాల్లోని కల్పిత పాత్రలే! మూఢ విశ్వాసకుల మనసుల మీద పట్టు సాధించి, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వేళ్ళూనుకుని నిలబడ్డ పాత్రలు. గతకాలంలో గుళ్ళల్లో శిల్పాల్లో స్థానం సంపాదించుకున్న పాత్రలు. కాలానుగుణంగా కవుల్ని, శిల్పకారుల్ని, చిత్రకారుల్ని, సంగీత కారుల్ని, ఇతర కళాకారుల్ని ప్రభావితం చేసిన, చేస్తున్న పాత్రలు. గతంలో రాముడు ఎక్కువగా పూజలందుకుంటే.. కృష్ణుడు ఆధునిక యుగానికి చెందిన రచయితల్ని, తత్వవేత్తల్ని నవీన విశ్వాసాల్లోకి లాక్కుపోయాడు. కృష్ణ ప్రేమను గీతాల్లో వర్ణించిన వారు, చిత్రలేఖనంగా చిత్రించినవారు తమకు తాము ఆధునికులుగా భావించుకుంటున్నారు. పూజ, దీపధూపాలు, నారికేళాలు వదిలి, ఒక అలౌకిక సౌందర్యారాధననే కృష్ణ చైతన్యమన్నారు. కృష్ణప్రేమనే విశ్వ ప్రేమ అన్నారు. ఒక ఆలోచనా ధోరణి గలవారంతా గ్రూపులుగా ఏర్పడ్డారు. చివరికి మాదకద్రవ్యాలకు, మద్యానికి బానిసలై విశృంఖల శృంగారాన్ని కాంక్షిస్తూ.. ఫ్రీ సెక్స్ - ప్రచారకులై ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయారు.
ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేమంటే.. వీరి వల్ల సమాజం సంస్కరించబడిందా? వీరి వల్ల ఏమైనా ప్రగతి సాధ్యమైందా? సగటు మనిషి జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగాయా? అన్నది మాత్రమే! తాళమేళాలతో భజనలు చేస్తూ ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా పోవడం - కృష్ణ స్పృహను ప్రచారం చేయడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. నేను స్వయంగా మెల్బోర్న్లో చాలా సార్లు చూశాను. పౌరులుగా వీరు తమ మీద వేసుకుని నిర్వహిస్తున్న 'బాధ్యత' ఏమిటో ఎవరికీ తెలియదు. ఆ ఊరేగింపుల్లో వాళ్ళ సాహిత్యాన్ని, కరపత్రాల్ని, చిరుపొత్తాల్ని అమ్ముకుంటూ ఉంటారు. విరాళాలు సేకరిస్తూ ఉంటారు. అక్కడ ప్రచారం, వ్యాపారం రూపుమార్చుకున్నదే గానీ, అసలు లేకుండా లేదు. తమది అత్యున్నతమైన, ఉదాత్తమైన తాత్వికచింతన అని భావిస్తూ, అదే స్థాయిలో ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తారు. అయితే అవన్నీ, నేలవిడిచి సాము చేయడం లాంటివే. అసలు 'కృష్ణుడెవరూ? అది తేల్చండిరా బాబూ!' అంటే ఎవరి దగ్గరా సరైన - సూటి సమాధానం ఉండదు. విషయమేమీ లేకపోయినా అందమైన ఇంగ్లీషు భాషలో, మెత్తని గొంతుతో శ్రావ్యంగా మాట్లాడతారు. కాని దానివల్ల ఒనగూరే ప్రయోజనమేమిటీ? జనంలో జ్ఞానం పెరగదు. ఎంత ఉన్నతీకరించి చెప్పే మాటలైనా.. అవన్నీ ఒక కల్పిత పాత్ర గురించే కదా? కృష్ణుడే కల్పిత పాత్ర అయితే, ఇంకా దాన్ని సింబాలిక్‌గా వ్యక్తీకరించడం.. దానికి 'ఆహా.. అద్భుతం' అని అనే వాళ్ళు కొందరుండటం చూస్తున్నాం. మనం మెజిక్ షోకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయి అద్భుతమనే అంటాం. అంతమాత్రం చేత మేజిక్ ట్రిక్కుల్ని - నిజాలని నమ్మంకదా?
వాస్తవంగా మనం చూసి తెలుసుకుంటున్న విషయాలు కొన్నయితే మనకంటే ముందు తరాల వారు రాసిన గ్రంథాల్లోంచి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని - వైదిక రచయితలు అదుపు తప్పిన తమ లైంగిక కోరికలన్నీ కృష్ణుడనే కల్పితపాత్రకు ఆపాదించి ఎట్లా రాసుకున్నారో చూద్దాం.. నీతి, నియమాలు, నైతికతా లేని ఒక పాత్రను సృష్టించి, దానితో గమ్మత్తులు, అద్భుతాలూ చేయించి, వాటికి మహిమలని, లీలలని పేర్లు పెట్టి, జనాన్ని కొన్ని శతాబ్దాలుగా వెర్రివాళ్ళను చేస్తూ వస్తున్న వైనం ఎలాగుందో కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. 'ఎందెందు వెదికిన అందందే గలడు చక్రి'.. అనడం ఎంత అబద్దం? వాస్తవంగా ఉన్న వాడైతే ఒక్కడే ఉంటాడు. రెండుగా కనబడటం, రెండు చోట్లా ఒకేసారి కనబడటం అనేది జరగదు. అలాంటిది వేల మంది గోపికలతో వేలమంది కృష్ణులుగా సరసాలాడటమనేది - కేవలం ఊహలోనే సాధ్యం! వాస్తవ జగత్తులో సాధ్యం కాదు. అలా అని రాసుకున్నారు గనకనే అలాంటివన్నీ చిత్త భ్రమలని అంటున్నాం! అభూత కల్పనలని తేల్చిపారేస్తున్నాం!!
అసలు కృష్ణుడు ఒకడు కాదని, ఉన్నవారిలో అసలైన వాడెవరో తేల్చడం కష్టమని అన్నారు బిపిన్‌చంద్ర పాల్ (1858-1932). ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత, వక్త, దేశంలో విప్లవ ఆలోచనా ధోరణికి పితామహుడు. బెంగాల్ విభజనని వ్యతిరేకించిన వాడు. అరబిందోతో కలిసి స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టిన వాడు. ఈయన చెప్పిన దాని ప్రకారం ఆర్య రుషి కృష్ణుడు ఒకడైతే, ఆర్యేతర కృష్ణుడు మరొకడు. ఆర్యరుషి కృష్ణుడికి విశ్వకుడు అనే కొడుకు విష్ణవుడు అనే మనుమడు ఉన్నారు. ఈ ఆర్య కృష్ణుడికి పనేమీలేదు. కేవలం అశ్వనీ దేవతల్ని పార్థిస్తూ ఉండటమే ఆయన ముఖ్య కార్యక్రమం. ఇక ఆర్యేతర కృష్ణుడిని రుగ్వేదంలో రాక్షసుడిగా చిత్రించారు. ఇవి ఇలా ఉంటే సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యమున్న రచయిత సి. నీరద్ చౌదరి. పురాణాల్లోని విశృంఖల శృంగారాన్ని ఇంకా ఇతర ఘోరమైన విషయాల్ని సంస్కృతం నుండి ఇంగ్లీషులోకి అనువదించి ''హిందూయిజం'' పేరుతో ప్రకటించారు. అది 1979లో న్యూఢిల్లీలో అచ్చయ్యింది. 'బ్రహ్మ వైవర్తం'లోని కొన్ని వ్యాక్యాలు చూడండి... ఏ తక్కువ స్థాయి సెక్స్ రచయిత కూడా అంత బాహాటంగా రాయడు. పవిత్ర గ్రంథాల పేరుతో ఆర్య మనువాదులు ప్రమోట్ చేసుకున్నవి ఇవేనా? మాంస భక్షణ, విశృంఖల శృంగారం వారి నైజమా?
''కృష్ణుడు రాధను వివస్త్రను చేసి, ఆమె స్తనాలను పట్టుకుంటాడు, నాలుగు రీతులుగా చుంబిస్తాడు. సంభోగంలో రాధ గజ్జలు తెగిపోతాయి. ముద్దులతో ఆమె పెదాలు ఎరుపెక్కాయి. స్తనాలపై గంధం చెరిగిపోతుంది. కొప్పు ఊడి, బొట్టు చెదిరిపోతుంది... ఆ తర్వాత రాధ కృష్ణుడిపైకి వచ్చి...'' ఉదాహరణకు నేనిక్కడ నాలుగు వాక్యాలే ఇచ్చాను. నీరద్ చౌదరి అనువాదంలో పేజీలకు పేజీలే కామక్రీడ వర్ణనలున్నాయి. అనువాదంలో ఉన్నాయంటే, సంస్కృతమూలం 'బ్రహ్మవైవర్తం'లో ఉన్నట్టే కదా? ఇందులో కృష్ణప్రేమ, విశ్వప్రేమ ఎక్కడుందో మనలాంటి వారికి అర్థం కాదు. ఆదీ, అంతం లేని ఆ భగవంతుడి లీలలు ఏమున్నాయో- అనంతంలో కలిసిపోయేది ఇందులో ఏముందో అర్థం కావాలంటే కొంచెం పిచ్చి, మరికొంచెం పైత్యం ఉండాల్సిందే! ఇంకా కృష్ణుడు సాగించిన గ్రంథం ఇలా ఉంది.. ''రాధతో జరిపే క్రీడలో పూర్తిగా లీనమైపోయిన కృష్ణుడు తన గోపికలకు అన్యాయం చేస్తున్నానని భావించాడు. ఉద్యానవనంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న పదహారు వేల గోపికలకు ఒక్కొక్క కృష్ణుడిగా మారిపోయాడు. వారితో సంభోగించాడు. సామూహిక సంభోగ ప్రక్రియలో ఉద్యానవనం ప్రతిధ్వనించింది.'' గిచ్చుళ్ళు, కొరుకుళ్ళు, గాజులచప్పుళ్ళు, కాళ్ళపట్టీల ధ్వనులు వగైరా పారవశ్యంపొందే దాకా బ్రహ్మవైవర్తంలో వర్ణనలు విపులంగా కొనసాగాయి... ఆ రచనల ప్రభావంతోనే కృష్ణభక్తులు కృష్ణ ప్రేమను, లైంగిక స్వేచ్ఛను, మాదక ద్రవ్యాల సేవనాన్ని ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి రచనల ప్రభావంతోనే బహుశా ఇటీవలి కాలం దాకా గుళ్ళలో సామూహిక సంభోగ ప్రక్రియ కొనసాగింది. దానినే కదా శిల్పులు శిల్పాలుగా చెక్కారు. ఆ కేళీవిలాసాన్నే కదా గాయకులు మైమరచి పాడుకున్నారూ?
ఇలాంటి కృష్ణుణ్ణి ఊహించుకునే కృష్ణ భక్తులు, వైష్ణవ భక్తులూ అయిన చైతన్యుడు, వల్లభా చార్యుడు, జయదేవుడు, మీరాబాయి గొప్పపారవశ్యంలోకి జారిపోయారు? చండీదాస్.. సూర్ దాస్, మన పోతన లాంటివారు కవితా గానం సాగించారు. యోగులందరికీ గురువైన నారాయణుడు 'కృష్ణుడు దేవుడు గోపికలంతా మానవ మాత్రులు' అని అన్నాడు. అంటే మానవుడు మాధవుడు ఐక్యమయ్యారని అది వర్ణనాతీతమనీ.. భక్తులు భావిస్తారు. దీన్నే 'అనంతం'లో కలిసిపోవడంగా భావించి, కృష్ణ చైతన్య ప్రచారకులు భక్తి - ఆధ్యాత్మికతల మీద వారికే అర్థం కాని విషయాల్ని ఇతరులకు బోధిస్తుంటారు. దానికి 'కృష్ణమాయ' అని ఓ పేరు కూడా పెడతారు. ఆ కల్పిత పాత్రతో అభూత కల్పనల రాసక్రీడలు చేయిస్తూ, కొంతమంది ఆధునిక రచయితలు కూడా గ్రంథాలు ప్రకటించారు. వారిలో ధీరేంద్రనాథ్ పాల్, మోహన్‌లాల్ సేన్, ప్రతాప్ ఆర్. పరేఖ్, మోనికా వర్మ, బాబా పరమానంద్ లాంటివారు కొందరున్నారు.
కృష్ణుణ్ణి ఎవరూ అర్థం చేసుకోలేదని, అతని మార్మికవాదం గొప్పదని కొందరన్నారు. కృష్ణుడు హిందువులకే కాదు, అందరికీ దేవుడేనన్నాడు మోహన్‌లాల్ సేన్. నిజమే సంభోగ క్రీడ హిందువులకే పరిమితం కాదు గదా? ఓషో రజనీష్ కూడా లైంగిక స్వేచ్ఛనే బోధించి విదేశాల్లో ప్రాచుర్యం సంపాదించాడు. ఎఎన్‌పి అయ్యర్, మరో చిత్రమైన అంశం ప్రకటించాడు. కృష్ణుడు పురుషులందరికీ తండ్రి అని, స్త్రీలందరికీ భర్త - అనీ రాశాడు. (అంతరార్థం ఏమిటీ అని ఎవరూ మెదడు పాడు చేసుకోనక్కర లేదు). వీరందరి కంటే డొనాల్డ్ ఆర్ కిన్స్లే, మరో అడుగు ముందుకేసి ''కామంతోనే మోక్షం సాధించగల''మని అన్నాడు. ునజు ూఔఉ=ణ డ ునజు ఖీూఖుజు పేరుతో పుస్తకం రాశాడు. మానవ బలహీనతల్లో ప్రధానమైన లైంగికతను ప్రేరేపించడానికి ఇలా కొన్ని అంతర్జాతీయసంస్థలు అవసరమా? లైంగిక ప్రేరణ జంతువుల్లో కూడా ఉందన్నది వీరికి తెలియదా? స్త్రీ, పురుషుల మధ్య కేవలం లైంగిక సంబంధాలు మాత్రమే చూసిన ఆర్య / వైదిక / మనువాద రచయితలకు మానవ సంబంధాలంటే ఏమిటో తెలియదన్న మాట!
ప్రపంచ మానవులకు ఎవరికీ లేని ఓ చర్మం రంగుతో కల్పించిన ''నీలిరంగు'' మనిషి బొమ్మ కనబడగానే లీలామానుష విగ్రహమని తేలిపోవడానికి ఇది ద్వాపరయుగం కాదు. ఇది అత్యాధునిక వైజ్ఞానిక యుగం. ఇక్కడ అన్నింటికీ లెక్కలు చూస్తారు. పరీక్షలు చేస్తారు. రుజువులు ఆధారాలు వెతుకుతారు. మన పూర్వీకులు అనాగరిక భ్రమల్లో తేలిపోతే తేలిపోయి ఉండొచ్చు. బహుశా ఇంకా దాని ప్రభావమే సమకాలీనంలో కూడా విశృంఖలంగా కనిపిస్తుందేమో? అక్రమ సంబంధాలు, వయసుతో సంబంధం లేని రేప్‌లు, హత్యలు వగైరా అన్నింటికీ ఘనమైన భారతీయ సంస్కృతి అని ఊరుకుందామా? గతంలో ఉన్న ఆ చెత్తనంతా ముందు బయట పారెయ్యాలి! స్త్రీ పురుష సంబంధాల్లో ప్రేమకు ఎంత విలువ ఉందో, దాన్నెంత జాగ్రత్తగా, గౌరవప్రదంగా, సమాన స్థాయిలో అపురూపంగా నిలుపుకోవాలో వివేకవంతులైన నేటి యువతీ యువకులకు తెలుసు. కాలక్రమంలో నాగరికత నేర్పిన ఎన్నో అంశాల్లో అదొక ప్రధానమైన అంశం! అది అర్థం చేసుకుంటూ, మనవీయ విలువల ప్రతిష్టాపన దిశగా మనమంతా ప్రయాణించాల్సి ఉంది.
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు