Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నెల 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం ''ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించే నిమిత్తం'' ఒక పత్రాన్ని విడుదల చేసింది. 1980 అటవీ సంరక్షణ చట్టంలో కొన్ని సవరణలను కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ మంత్రిత్వశాఖ ఆ పత్రంలో ప్రతిపాదించారు. ''పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అవసరాలు-వీటికి సంబంధించి వేగంగా మారుతున్న దేశ అవసరాలు నెరవేర్చే'' ఉద్దేశ్యంతో అటవీ సంరక్షణ చట్టాన్ని సంస్కరించాలని భావిస్తున్నట్టు కేంద్రం ఆ పత్రంలో పేర్కొంది. చాలా అస్పష్టంగా చేసిన ప్రతిపాదనలు ఆ పత్రంలో ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే జాతీయ మానిటైజేషన్ ప్రణాళిక, 2022-25కు అనుగుణంగా ఉండేలా అటవీ అనుమతుల నిబంధనలను, పర్యావరణ సంరక్షణ నిబంధనలను సడలించడమే ఈ ప్రతిపాదనల వెనుక అసలు ఉద్దేశ్యం అని మనకు అర్థమవుతుంది. అనేక ప్రభుత్వ ఆస్తులు అటవీ ప్రాంతాల్లో న్నాయి. అవన్నీ ప్రస్తుత అటవీ సంరక్షణ చట్టం విధించిన నిబంధనలకు లోబడి ఉన్నాయి. జాతీయ మానిటైజేషన్ పథకం వివిధ ప్రభుత్వ ఆస్తులను లీజుకివ్వాలని ప్రతిపాదించింది. ఆ విధంగా లీజుకివ్వడానికి ఈ అటవీ సంరక్షణ చట్ట నిబంధనలు అడ్డం వస్తున్నాయి. అందుకే ఆ చట్టాన్నే ఏకంగా సవరించాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ వర్గాల ప్రజలు ఈ ప్రతిపాదిత సవరణలను వ్యతిరేకిస్తున్నారు. ఆ సవరణలను అడ్డుకోడానికి పెద్ద ఎత్తున ప్రతిఘటనను నిర్మించే యోచనలో కూడా వారున్నారు. అయితే ఈ సవరణల వెనుక అసలు ఉద్దేశ్యం మానిటైజేషన్ చేయడానికి ఉన్న ఆటంకాలను తొలగించడమేనన్న సంగతిని వారిలో చాలామంది గుర్తించలేకపోతున్నారు.
నిబంధనల సడలింపు
పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను, రైల్వే, జాతీయ రహదారులు వంటి నిర్మాణాలను, అంతర్జాతీయ సరిహద్దులలో ప్రాజెక్టులను, ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ప్రాజెక్టులను చేపట్టే డెవలపర్స్‌కు రవాణా నిమిత్తం దారి ఏర్పరుచుకునే వీలుకల్పించేలా (రైట్ ఆఫ్ వే) కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక సవరణలను ప్రతిపాదించింది. ఇటువంటి ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం ''రక్షిత అడవులు''గా ఉన్న చోట్ల ఏర్పాటు అవుతున్నాయని తెలిపింది. అక్కడ ముందస్తు అనుమతులు ఉండాలని, వినియోగించే అటవీ భూమికి నష్ట పరిహారం చెల్లించాలని, ప్రత్యామ్నాయ భూములలో అడవుల పెంపకం చేపట్టాలని ఇప్పటి నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ నిబంధనల నుండి ఆ భారీ ప్రాజెక్టుల డెవలపర్స్‌కు మినహాయింపు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. ఈ నిబంధనల కారణంగా డెవలపర్స్ తమకు కేటాయించిన భూములను పూర్తిగా వినియోగించలేక పోతున్నారని, మౌలిక వసతులను కల్పించలేకపోతున్నారని, తాము ప్రతిపాదించే సవరణలను గనుక ఆమోదిస్తే అప్పుడు పూర్తి స్థాయిలో భూములను వారు వినియోగించుకోడానికి వీలవుతుందని చెప్తోంది. సవరణలు ఆమోదం పొంది అమలులోకి వస్తే అప్పుడు ప్రయివేటు డెవలపర్స్ ఎటువంటి పర్యావరణ నిబంధనలనూ పాటించనవసరం ఉండదు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలన్నీ పక్కకు పోతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అమలైతే ఆ ప్రాంతాలన్నీ ఇక అటవీ ప్రాంతాలుగా పరిగణించబడవు. ఇప్పటికే 2020లో చేసిన ''పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల'' నుండి ఈ ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చేశారు. అంటే ఈ ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టే ముందు వాటివలన సామాజికంగా గాని, పర్యావరణ పరంగా గాని ఎటువంటి ప్రభావం పడబోతున్నది అన్న అంశాన్ని ముందస్తు అంచనా వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మినహాయింపులను పొందే భూభాగాలు ఏవో చిన్న, చిన్న సైజుల్లోవి కాదు. జాతీయ మానిటైజేషన్ పథకంలో ప్రధానమైన లక్ష్యాలుగా పెట్టుకున్నవి. 8 మంత్రిత్వశాఖల పరిధిలో రూ.2.5 లక్షల కోట్లు ఆర్జించే లక్ష్యంతో కొన్ని ఆస్తులను మానిటైజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలో వీటిలో 20శాతం ఉన్నాయి. రైట్వే మంత్రిత్వశాఖ పరిధిలో 36శాతం ఉన్నాయి. 2019లోనే రైల్వే శాఖకు అనేక అభయారణ్యాల ప్రాంతాల్లో, నేషనల్ పార్కులలో పలు నిబంధనల నుండి మినహాయింపులు ఇచ్చేశారు. రైల్వే శాఖ పరిధిలో ఇంకా 40,000 హెక్టార్ల (లక్ష ఎకరాలు) భూమిని, రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలో 7లక్షల హెక్టార్ల (17.5 లక్షల ఎకరాలు) భూములను మానిటైౖజ్ చేయదగ్గవిగా గుర్తించారు. దానికి వీలుగా అన్ని రకాల నిబంధనల నుండి గుండుగుత్తగా మినహాయింపుల ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
ప్రభుత్వేతర సంస్థలకు లీజుకిచ్చిన భూముల్లో అడవులు ఉన్న భూభాగాలు కూడా కలిసివున్నాయి. అటువంటి సందర్భాల్లో ఆ అడవులను పూర్తిగా నరికివేయడానికి ఆటంకంగా ఉన్న నిబంధనలను తొలగించాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ భూములకు ఇచ్చే మినహాయింపు లన్నింటినీ ప్రభుత్వేతర సంస్థలకు కూడా వర్తింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. పలు చిన్న చిన్న మైనింగు లీజులు తీసుకున్న ప్రయివేటు సంస్థలన్నీ ఈ విధమైన మినహాయంపులను పొందే అవకాశం ఉంది. పర్యావరణ ప్రభావాన్ని ముందస్తుగా అంచనా వేయవలసిన అవసరం ఉండదు. ఈ విషయంలో ఇప్పటికే 2020లో రూపొందించిన నిబంధనలు చాలా సడలింపులను ఇచ్చేశాయి. మైనింగు యథేచ్ఛగా జరుపుకోడానికి మాత్రమేగాక తమ మైనింగు ప్రాంతాన్ని కూడా విస్తరించుకునే అవకాశాలను కల్పించారు. కేంద్రం తమ అధీనంలోని అనేక గనులను మానిటైజేషన్ ద్వారా అప్పజెప్పి సుమారు రూ.28,747 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ రంగంలో ఇంతవరకూ ఉన్న గనులను ప్రయివేటుపరం చేసే కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలూ లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతోంది. ''ప్రజా ప్రయోజనాల'' పేరుతో కారుచౌకగా ప్రభుత్వ రంగ కంపెనీల మైన్లను, భూములను ప్రయివేటు కార్పొరేట్లకు కట్టబెట్టడమే ప్రభుత్వ ధ్యేయం. బడా బడా బహుళజాతి మైనింగు కంపెనీల నుండి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గినట్టు కనపడుతోంది. దీనివలన ఖనిజ సంపద విస్తారంగా ఉన్న మన అటవీ ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలు బాగా పెరిగే ప్రమాదం ఉంది.
అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చే దిశగా ..
ఈ విధమైన ప్రభుత్వ ప్రతిపాదనలు అటవీ హక్కుల చట్టం అమలును ఏవిధంగా ప్రభావితం చేయనున్నాయన్నది చూడాలి. ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఈ అటవీ హక్కుల చట్టాన్ని ఏదోవిధంగా నీరుగార్చాలని చాలా కాలంనుంచీ ప్రయత్నిస్తూనే ఉంది. ఆ విషయంలో కొంతమేరకు నీరుగార్చింది కూడా. గిరిజనులను అడవుల నుండి వెళ్ళగొట్టే విధంగా నోటీసులు జారీ చేస్తూ అటవీశాఖ ఆ భూములను ప్రయివేటు సంస్థలకు ప్రాజెక్టుల నిమిత్తం కట్టబెట్టేందుకు వీలు కల్పిస్తోంది. ఇప్పుడు తాజాగా ప్రతిపాదించిన సవరణలను ఉపయోగించుకుని అన్నిరకాల మినహాయింపులనూ పొంది మానిటైజేషన్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పుడు ప్రతిపావించిన సవరణలు ప్రయివేటీకరణకు అటవీ హక్కుల చట్టం నిబంధనలు ఆటంకం కాకుండా ఉండేలా తోడ్పడతాయి. తోటల విషయంలో ప్రతిపాదించిన సవరణలు అటవీ హక్కుల చట్టం అమలును బాగా నీరుగార్చే ప్రమాదం ఉంది.
అంతర్జాతీయ సంస్థల నుండి, బహుళజాతి కంపెనీల నుండి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రస్తుత చట్టాలు పెద్ద ఆటంకంగా ఉన్నాయని మన విధాన రూపకర్తలు తరచూ వాదిస్తూంటారు. మౌలిక వసతుల రంగంలో కార్పొరేట్ పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా మానిటైజేషన్ ప్రాజెక్టు రూపొందింది. భూవినియోగం మీద కాని, రైతాంగం, గిరిజనులు, వ్యవసాయ కూలీల హక్కుల ఉల్లంఘన మీద కాని ఏవిధమైన ఆంక్షలు పెట్టినా మానిటైజేషన్ ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరవు. ఈ నేపథ్యంలో అటవీ సంరక్షణ చట్టానికి సవరణలను ప్రతిపాదించడం యాధృచ్ఛికం ఎంతమాత్రమూ కాదు. వాస్తవానికి మానిటైజేషన్ ప్రాజెక్టు అమలు జరగాలంటే ఈ సవరణలను తీసుకురావడం తప్పనిసరి అవుతుంది.
ఈ సవరణలు ఆదివాసీల భద్రతకు పెనుముప్పు కానున్నాయి. పర్యావరణానికి, అడవులపై ఆధారపడిన కార్మికులకు, రైతులకు మనుగడ ప్రశ్నార్థకం కానున్నది. అందుచేత ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి జరుగుతున్న పోరాటం యొక్క సామాజిక పునాదిని మరింత విస్తృతం చేయవలసిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణతోబాటు భూములను ప్రాజెక్టులకు కేటాయించే విషయం, భూవినియోగానికి సంబంధించిన నిబంధనల విషయం కూడా జోడించి ఉద్యమాలను విస్తృతం చేయాలి. మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు ఈ కర్తవ్యాన్ని వెంటనే చేపట్టవలసిన అగత్యాన్ని సూచిస్తున్నాయి.
(వ్యాసకర్త: జేఎన్‌యూ ప్రొఫెసర్)
(స్వేచ్ఛానుసవరణ)
- అర్చనా ప్రసాద్